Economy | ఆదాయం పెరిగితే డిమాండ్ పెరిగే వస్తువులు?
పోటీ పరీక్షలో ఎకానమీ కీలకంగానే ఉంటుంది. దేశ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు వివిధ రంగాల్లో పెట్టుబడులు, బడ్జెట్, ఆర్థిక సర్వే సంబంధించిన అనేక ప్రశ్నలు వస్తాయి. అయితే ఎకానమీలో డిమాండ్, వినియోగం, నశ్వర వస్తువులు ఉత్పాదక వస్తువులు వంటి పదజాలం గురించి తెలుసి ఉండాలి. అప్పడే సూక్ష్మ ఆర్థ శాస్త్రంపై సులభంగా పట్టు సాధించవచ్చు.
- అర్థశాస్త్రం : మానవుని ఆర్థిక కార్యకలాపాలను అధ్యయనం చేసే శాస్త్రం.
- నిశ్చల ఆర్థిక విశ్లేషణ: ఆర్థిక కార్యకలాపాలను కాలంతో సంబంధం లేకుండా పరిశీలించే శాస్త్రం.
- చలన ఆర్థిక విశ్లేషణ: ఆర్థిక కార్యకలాపాలను కాలానుగుణంగా మార్పులను స్వీకరించే శాస్త్రం
- నిగమన పద్ధతి: ఒక ప్రమేయంతో ప్రారంభించి కార్యాచరణ భావాన్ని తర్కించి సూత్రాన్ని ప్రతిపాదించే పద్ధతి
- ఆగమన పద్ధతి: ఒక సమస్యకు సంబంధించిన విషయాలను సేకరించి, క్రోడీకరించి సమగ్రంగా పరిశీలించే సూత్రాన్ని ప్రతిపాదించే పద్ధతి.
- నిగమన పద్ధతి: నిగమన పద్ధతిని నిగూఢ పద్ధతి అని, గణిత పద్ధతి అని, విశ్లేషణాత్మక పద్ధతి అని కూడా అంటారు.
- ఆగమన పద్ధతి: ఆగమన పద్ధతిని అనుభవ ప్రధాన పద్ధతి అని, చారిత్రక పద్ధతి అని కూడా అంటారు.
- ఉచిత వస్తువులు: ప్రకృతి సిద్ధంగా లభించే వస్తువులు, డిమాంండ్ కంటే సప్లయ్ శాశ్వతంగా ఎక్కువగా ఉండే వస్తువులు, ధరలేని వస్తువులు, ఉపయోగిత విలువ ఉండి వినిమయ విలువ లేని వస్తువులు.
ఉదా: గాలి, సూర్యరశ్మి
ఆర్థిక వస్తువులు: కృత్రిమంగా తయారయ్యే వస్తువులు, డిమాండ్ కంటే సప్లయ్ తక్కువగా ఉండే వస్తువులు, కొరత గల వస్తువులు, ఉపయోగితా విలువ, వినిమయ విలువ రెండూ గల వస్తువులు, ధర కలిగిన వస్తువులు.
ఉదా: పెన్ను, బుక్ - నశ్వర వస్తువులు: ఒకసారి వినియోగం / ఉపయోగంతో నశించే వస్తువులు.
ఉదా: పాలు, పండ్లు - అనశ్వర వస్తువులు: అనేక సార్లు ఉపయోగించే వస్తువులు.
ఉదా: పెన్ను, పెన్సిల్, వస్ర్తాలు - మాధ్యమిక వస్తువులు: పూర్తిగా తయారు కాకుండా ఇంకా తయారీలో ఉన్న వస్తువులు, ముడి పదార్థాలకు అంతిమ వస్తువులకు మధ్య దశలో గల వస్తువులు, ఉత్పత్తి ప్రక్రియలోని వివిధ దశల్లో గల వస్తువులు. ఉదా: బొగ్గు, ఉక్కు, నూలు
- ధర: వస్తువు విలువను ద్రవ్యరూపంలో చెప్పడం.
- ఆర్థిక ఏజెంట్లు: మానవులు తమ కోరికలను తీర్చుకోవడానికి వివిధ కార్యకలాపాల్లో పాల్గొని తమకు అవసరమైన ఆదాయాన్ని ఆర్జించడానికి ప్రయత్నించడం లేదా వినియోగదారులు, ఉత్పత్తి దారులు, ప్రభుత్వం కలిసి ఆర్థిక ఏజెంట్లు అంటారు.
- సూక్ష్మ అర్థశాస్త్రం: వైయక్తిక యూనిట్లను అధ్యయనం చేసేది చిన్న చిన్న యూనిట్లను అధ్యయనం చేసేది.
ఉదా : ఒక వినియోగదారుడు, ఒక సంస్థ, ఒక పరిశ్రమ - స్థూల సమష్టి యూనిట్లను అధ్యయనం చేసేది/ మొత్తం యూనిట్లను అధ్యయనం చేసేది.
ఉదా: సమిష్టి డిమాండ్, సప్లయ్, మొత్తం ఆదాయం, ఉత్పత్తి, పొదుపు మొదలైనవి. - ప్రయోజనం: మానవుని కోర్కెలను తీర్చగలిగే శక్తి
- పాక్షిక సమతుల్యం: ఆర్థిక వ్యవస్థలో సమతుల్యం అనేది ఒక ఆర్థిక చలాంకానికి సంబంధించినది. ఉదా: సంస్థ / పరిశ్రమ సమతుల్యం.
- సమగ్ర సమతుల్యం: ఆర్థిక వ్యవస్థలో సమతుల్యం అనేది అనేక ఆర్థిక చలాంకాలకు సంబంధించినది. ఉదా: మొత్తం ఉత్పతి,్త ఉద్యోగిత, ఆదాయం.
- సమతుల్యం: కదలలేని స్థితి, నిశ్చిలస్థితి, విరామస్థితి, మార్పులేని స్థితి, మార్పు అవసరంలేని స్థితి, మార్పు కోరుకోని స్థితి, ఆర్థిక శక్తుల కదలిక లేని స్థితి.
- వస్తువులు/సేవలు : మానవుని కోరికలను తీర్చే సాధనాలు
- విలువ : ఒక వస్తువు వినిమయ విలువ
- ఉత్పత్తి: ఉత్పాదకాలను ఉత్పత్తిగా మార్చే ప్రకియ
- వినియోగం: మానవులు తమ కోరికలను సంతృప్తి పరచుకోవడానికి వస్తుసేవలను ఉపయోగించడం.
- ఆదాయం: ఆర్థిక వ్యవస్థలో వివిధ వస్తుసేవల ఉత్పత్తి కార్యకలాపాల్లో పాల్గొనడం ద్వారా లభించే మొత్తం.
- సంపద : ద్రవ్యంతోపాటు ప్రయోజనం, విలువ, కొరత గల వస్తువు
- ప్రమేయాలు: ఒక విషయాన్ని విశ్లేషించినపుడు ఇతర అంశాలు, విషయాల్లో మార్పు లేదని ఊహించిన కారకాలు.
- కార్డినల్ ప్రయోజనం: ప్రయోజనాన్ని సంఖ్యారూపంలో కొలవడం.
- ఆర్డినల్ ప్రయోజనం: వస్తువు ప్రయోజనాన్ని పోల్చి చెప్పడం.
- డిమాండ్: ఒక వస్తువును పొందాలనే ఆసక్తితోపాటు కొనగల శక్తి.
- నాసిరకం వస్తువులు: ఆదాయం పెరిగితే డిమాండ్ తగ్గే వస్తువులు
- మేలురకం వస్తువులు: ఆదాయం పెరిగితే డిమాండ్ కూడా పెరిగే వస్తువులు
- ప్రత్యామ్నాయ వస్తువులు: ఒక కోరికను సంతృప్తి పరచగలశక్తి రెండు లేదా అంతకంటే ఎక్కువ వస్తువులకు ఉండటం
ఉదా: కాఫీ, టీ - పూరక వస్తువులు: ఒక కోరికను సంతృప్తి పరచడానికి రెండు లేదా అంతకంటే ఎక్కువ వస్తువులు అవసరం గల వస్తువులు ఉదా: కారు, పెట్రోల్
- వస్తువులు: మానవుని కోరికలను ప్రత్యక్షంగా తీర్చే వస్తువులు ఉదా: పండ్లు, పాలు
- ఉత్పాదక వస్తువులు: మానవుని కోరికలను పరోక్షంగా తీర్చే వస్తువులు.
ఉదా: భూములు, భవనాలు, యంత్రాలు - మొత్తం ప్రయోజనం: ఒక వస్తువును ఉపయోగించినపుడు లభించే ప్రయోజనం.
- ఉపాంత ప్రయోజనం: ఒక వస్తువును అదనంగా తీసుకోవడం వల్ల లభించే అదనపు ప్రయోజనం.
- ధర డిమాండ్ : ఒక వస్తువు ధరకు, దాని డిమాండ్‌కు మధ్య గల సంబంధం.
- ఆదాయ డిమాండ్: వినియోగదారుని ఆదాయానికి-డిమాండ్‌కు మధ్య సంబంధం
- జాత్యంతర డిమాండ్: ప్రత్యామ్నాయ, పూరక వస్తువుల ధరలకు ఒక వస్తువు డిమాండ్‌కు మధ్య గల సంబంధం.
- సూక్ష్మ శ్రమ విభజన: ఒక పనిని అనేక దశలుగా విభజించి ఒక్కొక్క దశను వేర్వేరు వ్యక్తులుగాని, సంస్థలు గాని చేయడం.
- స్థిరమూలధనం: కొంతకాలం పాటు ఉపయోగపడే ఉత్పాదక వస్తువులు. ఉదా: యంత్రాలు
- చర మూలధనం: ఒకసారి మాత్రమే ఉపయోగపడే ఉత్పాదక వస్తువులు ఉదా: ముడి పదార్థాలు
- అంతర్గత ఆదాలు: సంస్థ తన ఉత్పత్తి పరిమాణాన్ని పెంచడం వల్ల పొందే లాభాలు
- బహిర్గత ఆదాలు: పరిశ్రమలోని సంస్థల సంఖ్య పెరిగే కొద్దీ పరిశ్రమ అంతటికి లభించే ఆదాలు
- సహజధర: దీర్ఘకాలంలో ఉండే ధర/ ఉహాజనితంగా ఉండే ధర.
- మార్కెట్ ధర: అతి స్వల్పకాలంలో ఉండేధర / వాస్తవంగా ఉండే ధర.
- ప్రకటిత వ్యయం: ఒక సంస్థ కొనుగోలు చేసిన లేదా అద్దెకు వినియోగించిన వస్తుసేవలకు చెల్లించే మొత్తం.
- అప్రకటిత వ్యయం: ఉత్పత్తి ప్రక్రియలో ఉపయోగించే సొంత ఉత్పత్తి సాధనాలకు చెల్లించే వ్యయం
- సమతుల్య ధర: డిమాండ్ సప్లయ్‌లను సమానం చేసే ధర
- ధర విచక్షణ: ఒకే వస్తువును వివిధ ధరల వద్ద, వివిధ వినియోగదారులకు అమ్మడం.
- అమ్మకం వ్యయాలు: ప్రకటనలపైన, ప్రచారాలపైన చేసే వ్యయాలు.
- ఏకస్వామ్యం: ఒకే ఉత్పత్తిదారుడు/ఒకే అమ్మకం దారుడు ఉంటాడు.
- ద్విస్వామ్యం: ఇద్దరు ఉత్పత్తి దారులు / ఇద్దరు అమ్మకం దారులు ఉంటారు.
- పరిమిత స్వామ్యం: ఇద్దరికంటే ఎక్కువ, బహుకొద్ది మంది ఉత్పత్తిదారులు ఉండటం
- ఏకస్వామ్య పోటీ: అనేకమంది ఉత్పత్తి దారులు/ అనేకమంది అమ్మకందారులు ఉంటారు.
- డంపింగ్ : ఒకే రకమైన వస్తువు స్వదేశీ మార్కెట్లో ఎక్కువ ధరకు విదేశీ మార్కెట్లో తక్కువ ధరకు అమ్మడం.
- కృత్రిమ బాటకం: స్వల్పకాలంలో మానవ నిర్మితమైన యంత్రాలు, పరికరాలు సంపాదించేది.
- బదిలీ సంపాదన: ఒక ఉత్పత్తి కారకాన్ని ఒక పరిశ్రమలో ఉండేటట్లు చేయడానికి ఇవ్వవలసిన కనీస ధర.
- వేతనం : శ్రామికునికి ఇచ్చే ప్రతి ఫలం.
- బాటకం: భూమికి ప్రతిఫలం.
- వడ్డీ : మూలధనానికి ప్రతిఫలం.
- ద్రవ్యత్వాభిరుచి: పొదుపు మొత్తాన్ని నగదు రూపంలో ఉంచాలనే కోరిక.
- నవకల్పన: నూతన ఉత్పత్తి విధానం/ కొత్త ముడిపదార్థాలు కొనడం/ నూతన ఉత్పత్తులు
- వ్యాపార చక్రాలు: వ్యాపారంలో సంభవించే వృద్ధి, క్షయాలు
- చలాంకం: మార్పు చెందే లక్షణం గల కారకం / నిరవధికంగా మార్పు చెందే కారకం
- స్వతంత్ర చలాంకం: తనంతటాతానుగా మార్పు చెందేది. ఉదా: ద్రవ్యరాశి
- ఆధార చలాంకం: ఇతర శక్తుల ప్రేరణ వల్ల మారేది. ఉదా: ధర
- తలసరి ఆదాయం: జాతీయాదాయాన్ని దేశ జనాభాతో భాగిస్తే వచ్చేది.
- ఇన్వెంటరీలు: ఉత్పాదక సంస్థల వద్ద ఉన్న ముడి పదార్థాలు తయారీలో ఉన్న పూర్తికాని వస్తువులు, తయారైన వస్తువులు
- వినియోగపు అకౌంట్: కుటుంబ రంగ ఆదాయ, వ్యయాలను చూపేది.
- ప్రభుత్వ అకౌంట్: ప్రభుత్వ రంగానికి వచ్చే రాబడులు, చేసే చెల్లింపులు చూపేది
- మూలధన అకౌంట్: ఆర్థిక వ్యవస్థలోని మొత్తం పొదుపు, దేశీయ, విదేశీ పెట్టుబడుల గురించి చూపేది.
- సే మార్కెట్ సూత్రం: సప్లయ్ తన డిమాండ్‌ను తానే సృష్టించుకుంటుంది.
- స్వేచ్ఛావ్యాపారం: వ్యక్తుల ఆర్థిక కార్యకలాపాలలో ప్రభుత్వ అదుపు నియంత్రణలు నిబంధనలు లేకుండా ఉండే పరిస్థితి.
- ఆర్థిక మాంద్యం: సమష్ఠి డిమాండ్ క్షీణించి, ఉత్పత్తి ఆదాయాలు, ఉద్యోగిత క్రమంగా పడిపోయే పరిస్థితి.
- నియమిత ఆర్థిక వ్యవస్థ: విదేశీ వ్యాపారమంటూ లేని ఆర్థిక వ్యవస్థ.
- వినియోగ ఫలభావం లేదా వినియోగ ప్రవృత్తి: ఆదాయానికి, వినియోగ వ్యయానికి గల సంబంధం.
- సగటు వినియోగ ప్రవృత్తి: మొత్తం ఆదాయానికి మొత్తం వినియోగ వ్యయానికి గల సంబంధం.
- ఉపాంత వినియోగ ప్రవత్తి: ఆదాయంలోని మార్పునకు – వినియోగ వ్యయంలోని మార్పునకు మధ్యగల నిష్పత్తి
- వేగ త్వరణం: వేగ త్వరణం అంటే వినియోగ వస్తువుల డిమాండ్ మారినప్పుడు ఉత్పాదక వస్తువులకు ఉండే ఉత్పత్తి డిమాండ్ ఏ విధంగా మారుతుందో తెలియజేస్తుంది.
- వస్తుమార్పిడి పద్ధతి/ బార్టర్ పద్ధతి: వస్తుసేవలను మార్పిడి చేసుకోవడం లేదా వస్తు వినిమయం చేసుకోవడం.
- ద్రవ్యం : సర్వంగీకారం పొందిన వస్తువు
- వాస్తవిక ద్రవ్యం : ప్రజల దగ్గర చలామణిలో ఉన్న ద్రవ్యం.
- శాసనపు ద్రవ్యం: అత్యవసర పరిస్థితుల్లో జారీ చేసే ద్రవ్యం.
- ద్రవ్యం విలువ : ఒక యూనిట్ ద్రవ్యం కొనుగోలు శక్తి
- ద్రవ్యోల్బణం : ధరలు నిరంతరం పెరగుతూ ఉండే ప్రక్రియ.
- రన్ ఆన్ ది బ్యాంక్: అందరు ఖాతాదారులు ఒకేసారి తమ డిపాజిట్లను విత్‌డ్రా చేయడం
- గ్రేషమ్ లా: చెడు ద్రవ్యం, మంచి ద్రవ్యాన్ని చలామణి నుంచి తరిమేస్తుంది.
- దృశ్యాంశాలు : వ్యాపారంలో భౌతిక వస్తువుల ఎగుమతులు, దిగుమతులు.
- అదృశ్యాంశాలు: వ్యాపారంలో సేవల ఎగుమతి, దిగుమతులు
- మూల్యన్యూనీకరణ: ఒక దేశ కరెన్సీ బాహ్య విలువను బంగారంతోగాని, లేదా విదేశీ కరెన్సీతోగానీ తగ్గించడం.
- బౌంటీలు: విదేశాల్లో పోటీ ధరకు అమ్మగలిగే నిమిత్తం కొందరు ఎగుమతి దారులకు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు
- పెగ్గింగ్: ప్రభుత్వ జోక్యంతో మారకపు రేటును మార్చడం.
- పత్రబంగారం/ స్పెషల్ డాయింగ్ రైట్స్ /
- ఎస్డీఆర్: అంతర్జాతీయ చెల్లింపులను పరిష్కరించుకోవడానికి అంతర్జాతీయ ద్రవ్యనిధి సభ్యదేశాలు ఈ అకౌంట్‌ను ఉపయోగించుకోవచ్చు.
- బ్రెట్టన్ ఉడ్ కవలలు: అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్), అంతర్జాతీయ పునర్నిర్మాణ అభివృద్ధి బ్యాంకు (ఐబీఆర్డీ)లను కలిపి బ్రిట్టన్ ఉడ్ కవలలు అంటారు.
- పబ్లిక్ గూడ్స్: యూనిట్లుగా విభజించి, వివిధ వ్యక్తులకు పంచడానికి, అమ్మడానికి వీలులేని వస్తు సేవలు.
- ప్రైవేట్ గూడ్స్: వ్యక్తులకు విడివిడిగా ప్రయోజనం కలుగజేసేవి.
- సబ్సిడీలు: ఉత్పత్తిలోగాని, ఎగుమతుల్లోగాని ప్రోత్సహించడానికి ఉత్పత్తి వ్యాపార సంస్థలకు ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే ద్రవ్య సహాయం
- ప్రత్యక్ష పన్ను: పన్ను తొలి, అంతిమభారం ఒకరిపైనే ఉండటం ఉదా: ఆదాయపు పన్ను
- పరోక్షపన్ను: పన్ను తొలిభారం ఒకరిమీద, అంతిమ భారం మరొకరి మీద ఉండటం ఉదా: అమ్మకం పన్ను
- రెవెన్యూ వ్యయం: ప్రభుత్వ పరిపాలనా నిర్వహణ వ్యయం
- మూలధన వ్యయం: రైల్వేలు, ప్రాజెక్టుల ఆస్తులపై ప్రభుత్వం చేసే వ్యయం.
- రుణ పరివర్తన: ప్రభుత్వం పాత రుణాలను తీర్చడానికి చేసే కొత్త రుణాలు.
- బడ్జెట్: ఒక సంవత్సరకాలంలో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం, చేసే వ్యయాన్ని తెలియజేసేది.
పానుగంటి కేశవ రెడ్డి
రచయిత
వైష్ణవి పబ్లికేషన్స్
గోదావరిఖని
9949562008
Previous article
AIC Recruitment | న్యూఢిల్లీ ఏఐసీలో 30 మేనేజ్మెంట్ ట్రెయినీలు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు