పారిశ్రామిక అభివృద్ధికి విధాన తీర్మానాలు
1956 రెండో పారిశ్రామిక విధాన తీర్మానం
1. సత్వర పారిశ్రామికీకరణ ద్వారా ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేయడం
2. ప్రభుత్వరంగాన్ని విస్తృతపర్చడం
3. భారీ పరిశ్రమలను, యంత్ర పరిశ్రమలను అభివృద్ధిపర్చడం
4. ప్రైవేటు ఏకస్వామ్యాలను, ఆర్థికస్తోమత కేంద్రీకరణను నిరోధించడం
5. ఆదాయ, సంపదల్లో వ్యత్యాసాలను తొలగించడం
6. విశాలమైన, అభివృద్ధికరమైన సహకార రంగాన్ని నిర్మించడం
7. సహకారరంగాన్ని పటిష్టం చేయడం
పై లక్ష్యాల సాధనవల్ల ఉద్యోగావకాశాలు అధికమవుతాయి, ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయని విశ్వసించింది. క్రమేణా ఆర్థికరంగంలో ఉన్నతస్థితికి ప్రభుత్వరంగం చేరుకోవాలని ఆశించింది.
ముఖ్యాంశాలు
పరిశ్రమల విభజన: ఈ పారిశ్రామిక విధాన తీర్మానం ద్వారా పరిశ్రమలను మూడు రకాలుగా విభజించారు.
జాబితా ఎ- ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న పరిశ్రమలు: ఆయుధసామగ్రి, అణుశక్తి, రైల్వేలు, విమాన నిర్మాణం, ఇనుముఉక్కు, భారీ రసాయనాలు, భారీ యంత్రాలు, బొగ్గు, నౌకా నిర్మాణం, టెలిఫోన్, టెలిగ్రాఫ్, వైర్లెస్, పరికరాల ఉత్పత్తి, ఖనిజ నూనెలు మొదలైన 17 పరిశ్రమలు మాత్రమే ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంటాయి. ఈ జాబితాలో నాలుగు అంటే 1. ఆయుధాలు 2. అణుశక్తి 3. రైల్వేలు 4. విమాన రవాణా పరిశ్రమలు మాత్రం ప్రభుత్వ ఏకస్వామ్యంలో పనిచేస్తాయి. మిగిలిన 13 పరిశ్రమల్లో కొత్త సంస్థలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఇప్పటికే పనిచేస్తున్న ప్రైవేటు సంస్థలు కొనసాగవచ్చు. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా కొత్త పరిశ్రమలను నెలకొల్పడానికి ప్రైవేటురంగం సహకారం తీసుకోవచ్చు.
జాబితా బి- కాలక్రమేణ ప్రభుత్వ
యాజమాన్యంలోకి తీసుకొనే పరిశ్రమలు: ఈ జాబితాలో 12 పరిశ్రమలున్నాయి. యంత్ర పరికరాలు, అల్యూమినియం, ఎరువులు, సింథటిక్ రబ్బరు, రోడ్డు రవాణా, సముద్ర రవాణా, ఖనిజాలు, క్రిమి సంహారక మందులు, మొదలైన 12 పరిశ్రమలు కాలక్రమేణా ప్రభుత్వ యాజమాన్యంలోకి తీసుకొనే పరిశ్రమలు. ప్రైవేటురంగం కూడా వీటిని సొంతంగాగానీ, ప్రభుత్వ సాయంతోగానీ నెలకొల్పవచ్చు.
జాబితా సి- జాబితా ఎ, బిలలో లేని పరిశ్రమలన్నీ జాబితా సి కిందకు వస్తాయి: వీటిని ప్రైవేటురంగానికి వదిలేశారు. ప్రభత్వరంగం కూడా ఈ జాబితాలోని పరిశ్రమలను స్థాపించవచ్చు. అయితే ప్రైవేటురంగానికి సాయం చేయడానికి ప్రభుత్వం తన పాత్రను పరిమితం చేసుకుంటుంది. ప్రభుత్వ, ప్రైవేటురంగాలు పరస్పర ఆధారిత రంగాలుగా 1956 పారిశ్రామిక విధాన తీర్మానం పేర్కొన్నది. ప్రైవేటురంగానికి సంబంధించి అన్ని మౌలిక సౌకర్యాలు కల్పించడంతోపాటు, మూలధన వాటాలోను ప్రభుత్వరంగం భాగస్వామ్యం కలిగి ఉంటుంది. తద్వారా ప్రైవేటురంగ విస్తరణకు అవకాశాలు కల్పించాలని ఈ తీర్మానం పేర్కొన్నది. కుటీర, చిన్న పరిశ్రమల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవడం, ప్రాంతీయ అసమానతలను తగ్గించడం, సాంకేతిక శిక్షణ వసతులను ఏర్పర్చడం, ప్రైవేటురంగంలోని పరిశ్రమల అభివృద్ధికి మూలధనాన్ని సమకూర్చడానికి ప్రత్యేక ద్రవ్య సంస్థలను నెలకొల్పడం, ఆర్థికశక్తి కేంద్రీకరణను నివారించడం మొదలైనవి ఈ తీర్మానంలోని ముఖ్యాంశాలు.
1977 పారిశ్రామిక విధాన తీర్మానం
దేశంలో తొలిసారిగా మొరార్జీదేశాయ్ నాయకత్వంలో ఏర్పడిన కాంగ్రెసేతర ప్రభుత్వం 1977 డిసెంబర్ 23న నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రకటించింది. ఈ తీర్మానం గాంధేయ విధానానికి అనుగుణంగా రూపకల్పన చేసింది. ఈ పారిశ్రామిక విధాన తీర్మానంలో చిన్నతరహా పరిశ్రమలకు ప్రాధాన్యం ఇచ్చింది. చిన్నతరహా పరిశ్రమలను మూడు రకాలుగా విభజించారు.
1. కుటీర, గృహ పరిశ్రమలు
2. సూక్ష్మ పరిశ్రమలరంగం: లక్ష రూపాయలకంటే తక్కువ పెట్టుబడితో స్థాపించే పరిశ్రమలను సూక్ష్మపరిశ్రమలు అంటారు. ఇవి యంత్ర సాయంతో పనిచేస్తాయి. 1971 జనాభా లెక్కల ప్రకారం 50 వేలకు మించని జనాభా ఉన్న పట్టణాల్లో స్థాపించవచ్చు.
3. చిన్నతరహా పరిశ్రమలు: రూ. 10 లక్షలలోపు పెట్టుబడి ఉండే పరిశ్రమలను చిన్నతరహా పరిశ్రమలు అంటారు. చిన్నతరహా పరిశ్రమల అభివృద్ధి కోసం 1979లో జనతాప్రభుత్వం జిల్లా పారిశ్రామిక కేంద్రాల (డీఐసీ)ను ఏర్పాటు చేసింది. అనుషంగిక పరిశ్రమల విషయంలో పెట్టుబడి పరిమితి రూ. 15 లక్షలు. చిన్న పరిశ్రమల రంగానికి రిజర్వు చేసిన వస్తువుల సంఖ్య 180 నుంచి 807కు పెంచడం, ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్‌ను పునర్వ్యవస్థ్థీకరించారు.
1980 పారిశ్రామిక విధాన తీర్మానం
1980లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకిరాగానే 1956 పారిశ్రామిక విధాన తీర్మానం ఆధారంగా 1980, జూలై 25న నూతన పారిశ్రామిక విధాన తీర్మానం ప్రకటించింది. ఈ తీర్మానం ప్రభుత్వరంగానికి విస్తృత ప్రాధాన్యం ఇచ్చింది.
ముఖ్యాంశాలు
ప్రభుత్వరంగ సంస్థల సామర్థ్యం పెంచాలని నిర్ణయించారు. దీనికోసం విత్తం, మార్కెటింగ్ మొదలైన రంగాల్లో నిర్వాహకులను బలోపేతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
పారిశ్రామికంగా వెనుకబడిన పాంత్రాలను గుర్తించి ప్రతి జిల్లాకు కొన్ని చిన్న సంస్థలను స్థాపించడం, తగినన్ని అనుబంధ, చిన్నతరహా, కుటీర పరిశ్రమలను స్థాపించడం ద్వారా ఆ ప్రాంత అభివృద్ధికి దోహదం చేయాలనే ఉద్దేశంతో ఆర్థిక ఫెడరలిజం భావనను ప్రవేశ పెట్టారు.
చిన్న సంస్థల అభివృద్ధిని ప్రోత్సహించడానికి ప్రభుత్వం చిన్న సంస్థలను పునర్నిర్వచించింది.
1. అతిచిన్న యూనిట్లు లేదా సంస్థల్లో పెట్టుబడి పరిమతిని రూ. లక్ష నుంచి 2 లక్షలకు పెంచారు.
2. చిన్న పరిశ్రమల్లో పెట్టుబడి పరిమితిని రూ. 10 లక్షలకు పెంచారు.
3. అనుబంధ పరిశ్రమల్లో పెట్టుబడి పరిమితిని రూ. 15 లక్షల నుంచి రూ. 25 లక్షలకు పెంచారు.
గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధిని వేగవంతం చేయడానికి, ఎక్కువ ఉద్యోగావకాశాలను సృష్టించడానికి, అధిక తలసరి ఆదాయం పెంచడానికి చేనేత పరిశ్రమలు, చేతి వృత్తులు, ఖాదీ ఉత్పత్తులకు ఎక్కువ ప్రోత్సాహం ఇచ్చింది.
ప్రభుత్వం వెనుకబడిన ప్రాంతాల్లో పారిశ్రామిక సంస్థలను ప్రోత్సహించడం.
ఖాయిలా పరిశ్రమల విలీనాన్ని ప్రోత్సహించడం
ఈ పారిశ్రామిక విధాన తీర్మానంలో 28 రకాల పరిశ్రమలను, 82 రకాల మందులను లైసెన్స్ నుంచి మినహాయించారు. MRTP, FERA చట్ట పరిధిలోని సంస్థల విషయంలో అనేక నిబంధనలను సడలించారు. MRTP చట్టం కిందకు వచ్చే సంస్థల ఆస్తుల పరిమితిని రూ. 20 కోట్ల నుంచి రూ. 100 కోట్లకు పెంచారు. దీనివల్ల 112 సంస్థలు ఈ చట్ట పరిధి నుంచి బయటపడ్డాయి. ప్రభుత్వం వెనుకబడిన ప్రాంతాలుగా ప్రకటించిన ప్రాంతాల్లో స్థాపించే కొత్త సంస్థలు పదేండ్ల వరకు తమ లాభాల్లో 20 శాతాన్ని ఆదాయపన్ను చట్టం నిబంధన 80hh నుంచి మినహాయించుకోవచ్చు.
1991 పారిశ్రామిక విధాన తీర్మానం
పీవీ నరసింహారావు నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడగానే అప్పటి ఆర్థికశాఖ మంత్రి మన్మోహన్సింగ్ 1991 జూన్ 24న నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రకటించారు. ఇది పారిశ్రామిక ఆర్థిక వ్యవస్థను సులభతరం చేసింది. దీని ముఖ్య ఉద్దేశం పారిశ్రామిక లైసెన్సింగ్ విధానాన్ని రద్దు చేయడం, భారత ఆర్థిక వ్యవస్థను ప్రపంచ మార్కెట్‌తో అనుసంధానంచేసి, విదేశీ పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానం, యంత్ర సామగ్రి దిగుమతులను పెంచి వేగవంతమైన అభివృద్ధిని సాధించడం. దీని ద్వారా సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ లక్ష్యాలకు అనుగుణంగా ఆర్థిక వ్యవస్థలో పెను మార్పులకు శ్రీకారం చుట్టారు. ఈ పారిశ్రామిక విధానాన్ని రెండు దఫాలుగా ప్రకటించారు. 1991 జూలై 24 తీర్మానం భారీ, మధ్యతరహా పరిశ్రమలకు సంబంధించింది. 1991 ఆగస్ట్ తీర్మానం 6 చిన్నతరహా పరిశ్రమలకు సంబంధించింది. ఈ పారిశ్రామిక విధాన తీర్మానం నాటికి దేశ పరిస్థితి…
1. పారిశ్రామిక వృద్ధిరేటు- 1 శాతం
2. ద్రవ్యోల్బణం రేటు- 13 శాతం
3. జీడీపీలో కోశలోటు- 8 శాతం
4. జీడీపీలో విదేశీ అప్పుల వాటా- 23 శాతం
5. వడ్డీ చెల్లింపులకు- 22 శాతం
6. విదేశీమారక నిల్వలు 1.2 బిలియన్ డాలర్లకు పడిపోయాయి
రాఘవన్ కమిటీ సూచనలమేరకు ఎంఆర్టీపీ చట్టం స్థానంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల మధ్య పోటీని నెలకొల్పేలా పోటీ విధాన చట్టం-2002ని తీసుకువచ్చారు.జంషెడ్జీ టాటాను భారతదేశ పారిశ్రామిక పితామహుడిగా పిలుస్తారు.
తీర్మానాలు-విశేషాలు
1956 పారిశ్రామిక తీర్మానాన్ని (ఐపీ) ఆర్థిక రాజ్యాంగం (Economic Constitution) అని పేర్కొంటారు.
చిన్నతరహా కుటీర పరిశ్రమలను అభివృద్ధి చేయడం 1977 తీర్మానం ప్రధాన ఉద్దేశం.
ఈ తీర్మానం TINY (సూక్ష్మ) అనే పదాన్ని ప్రవేశపెట్టింది.
చిన్న పరిశ్రమల అవసరాలను తీర్చడానికి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఐడీబీఐ)లో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని ఈ తీర్మానం పేర్కొంది.
1980 పారిశ్రామిక విధాన తీర్మానంలో భాగంగా ఎంఆర్టీపీ, ఎఫ్ఈఆర్ఏ చట్టాల పరిధిలో ఉన్న సంస్థల విషయంలో నిబంధనలు సడలించారు.
దేశంలో ప్రైవేటురంగాన్ని నియంత్రించడం కోసం 1969లో ఎస్ దత్ నేతృత్వం లో పారిశ్రామిక లైసెన్సుల ఎం క్వైరీ కమిటీని ఏర్పాటు చేశారు.
కమిటీ సిఫారసులతో ఏకస్వామ్యాల నియంత్రణ, అనుచిత వ్యాపార పద్ధతుల నిర్బంధ చట్టం (ఎంఆర్టీపీ)- 1969 అమల్లోకి వచ్చింది.
దీనిప్రకారం రూ. 20 కోట్ల పారిశ్రామిక ఆస్తికలిగిన వారిని ఏకస్వాములు.
1985లో సచార్ కమిటీ సూచనతో ఏకస్వాముల ఆస్తిని రూ. 100 కోట్లకు పెంచారు.
2000లో ఎంఆర్టీపీ చట్టాన్ని సవరించడానికి రాఘవన్ నేతృత్వంలో ప్రభుత్వం కమిటీని ఏర్పాటుచేసింది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు