ECONOMY | దేశంలో సూచనాత్మకం .. అమలు వికేంద్రీకృతం

- ఆర్థిక వ్యవస్థలోప్రణాళికలకు అధిక ప్రాధాన్యం ఉంది. త్వరిత గతిన అభివృద్ధిని సాధించాలంటే నిర్ధ్దిష్ట ప్రణాళిక అవసరం.
- ప్రపంచంలో ప్రతి దేశం తనదైన శైలిలో ప్రణాళికలను అమలు చేస్తుంది. అంటే ప్రపంచంలోని వివిధ దేశాలు తమ దేశంలోని వనరులను బట్టి అంటే సహజ వనరులు, మానవ వనరులు, ఆర్థిక పరిస్థితులను బట్టి, వాటి ప్రాధాన్యం బట్టి తమకు అనువైన ప్రణాళికలను రూపొందించుకొని అమలు చేస్తూ అభివృద్ధి చేసుకుంటున్నాయి.
- అంటే ప్రపంచంలోని వివిధ దేశాలు, వివిధ రకాల ప్రణాళికలను అమలు చేస్తున్నాయి.
l ప్రణాళికలను వివిధ అంశాలను బట్టి వివిధ రకాలుగా విభజిస్తారు.
ప్రణాళిక రకాలు
- ప్రజల భాగస్వామ్యాన్ని బట్టి ప్రణాళికలను రెండు రకాలుగా అంటే కేంద్రీకృత ప్రణాళిక, వికేంద్రీకృత ప్రణాళికగా విభజిస్తారు.
కేంద్రీకృత ప్రణాళిక (Centralized planning)
- ప్రణాళిక రచన పైస్థాయి నుంచి కింది స్థాయికి కదలడాన్ని కేంద్రీకృత ప్రణాళిక అంటారు.
- దేశం మొత్తానికి ఒకే ప్రణాళికను రూపొందించి దాని ఆధారంగా కింది స్థాయి ప్రణాళికలను రూపొందించి అమలు చేసే ప్రణాళికలను కేంద్రీకృత ప్రణాళిక అంటారు.
ఉదా: దేశం-రాష్ట్రం-జిల్లా – మండలం- గ్రామం - రష్యా వంటి సామ్యవాద దేశాల్లో ఈ రకమైన ప్రణాళికలను అమలు చేస్తున్నారు.
వికేంద్రీకృత ప్రణాళిక
- ప్రణాళిక రచన కింది స్థాయి నుంచి పై స్థాయికి కదిలే ప్రణాళికలను వికేంద్రీకృత ప్రణాళిక అంటారు.
- మొదట కింది స్థాయి ప్రణాళికలను రూపొందించి, వాటి ఆధారంగా కేంద్ర ప్రణాళికను తయారు చేయడాన్ని వికేంద్రీకృత ప్రణాళిక అంటారు.
- గ్రామం-మండలం- జిల్లా- రాష్ట్రం-దేశం
ఉదా: ప్రస్తుతం భారతదేశం ఈ రకమైన విధానాన్ని అవలంబిస్తుంది. - ప్రపంచంలో మొదటిసారిగా 1916లో అమెరికాలోని టెన్నీస్ వ్యాలీ అథారిటీ ఆధ్వర్యంలో ఏడు రాష్ర్టాల్లో అమలు చేశారు.
- ప్రభుత్వ పాత్రను బట్టి ప్రణాళికలను నిర్దేశాత్మక ప్రణాళిక, సూచనాత్మక ప్రణాళిక అని రెండు రకాలుగా విభజిస్తారు.
నిర్దేశాత్మక ప్రణాళిక (Imperative Planning)
- పూర్తిగా ప్రభుత్వ నియంత్రణలో ప్రణాళికలు అమలు పరిస్తే వాటిని నిర్దేశాత్మక ప్రణాళిక లేదా ఆదేశాత్మక ప్రణాళిక అంటారు.
- ప్రణాళిక రచన, అమలు అన్ని అధికారాలు కేంద్రమే చూస్తుంది.
- ఆర్థిక కార్యకలాపాలన్ని ప్రభుత్వం యొక్క దిశా, నిర్దేశం ప్రకారమే జరుగుతాయి.
ఉదా: రష్యా వంటి సామ్యవాద దేశాల్లో వీటిని అమలు చేస్తారు. ప్రైవేటు రంగానికి, వినియోగదారునికి అంతగా ప్రాధాన్యం ఉండదు. - 1951 నుంచి 1992 వరకు భారతదేశంలో అమలు పరిచారు.
సూచనాత్మక ప్రణాళిక (Indicative Planning)
- తన ఆధీనంలో లేని రంగాలకు, లక్ష్యాలను నిర్దేశించి, వాటి లక్ష్యసాధనకు ప్రోత్సాహాన్ని ఇచ్చే ప్రణాళికలను సూచనాత్మక ప్రణాళిక అంటారు.
- ప్రభుత్వ రంగానికి ప్రాధాన్యతను తగ్గిస్తూ, ప్రైవేటు రంగానికి ప్రాధాన్యతను పెంచి ఎటువంటి నిబంధనలు, నిర్బంధాలు లేని ప్రణాళికలను సూచనాత్మక ప్రణాళికలు అంటారు.
- మిశ్రమ ఆర్థిక వ్యవస్థ గల దేశాలకు ఇది సరైనది.
- ఈ ప్రణాళికలను మొదట 1948లో ఫ్రాన్స్ దేశం అమలు చేసింది.
- భారతదేశం 8వ ప్రణాళిక నుంచి ఈ ప్రణాళికలను అమలు చేసింది.
- సూచనాత్మక ప్రణాళికను మార్కెట్ ప్రణాళిక అని కూడా అంటారు.
- కాలవ్యవధిని బట్టి ప్రణాళికలను దీర్ఘకాలిక, మధ్యకాలిక, స్వల్పకాలిక ప్రణాళికలు అని మూడు రకాలుగా వర్గీకరించవచ్చు.
దీర్ఘకాలిక ప్రణాళిక (Long term Planning)
- దీనిని దీర్ఘదర్శి ప్రణాళిక లేదా సమగ్ర ప్రణాళిక అని కూడా అంటారు.
- దీర్ఘకాలిక లక్ష్యాలను, భవిష్యత్లో అమలు చేయవలసిన అంశాలను (జనాభాను తగ్గించడం, ఆహారోత్పత్తిని పెంచడం, జాతీయాదాయం, తలసరి ఆదాయం, జీవన ప్రమాణాన్ని పెంచడం మొదలైనవి) దృష్టిలో ఉంచుకొని రూపొందించే ప్రణాళికను దీర్ఘదర్శి ప్రణాళిక అంటారు.
- 10, 15, 20, 25 సంవత్సరాల కాల వ్యవదిని దృష్టిలో ఉంచుకొని రూపొందించే ప్రణాళికను దీర్ఘకాలిక / దీర్ఘదర్శి ప్రణాళిక అంటారు.
- సామ్యవాద, కమ్యూనిస్ట్ దేశాల్లో ఈ రకమైన ప్రణాళికలు అమలు చేయబడతాయి.
- దీర్ఘదర్శి ప్రణాళికలను మొదట రష్యాలో (విద్యుత్శాఖలో) అమలు చేశారు.
- భారతదేశంలో 3, 7 ప్రణాళికలను దీర్ఘదర్శి ప్రణాళికలు అంటారు.
మధ్యకాలిక ప్రణాళిక (Medium Term Plan)
- 3, 4, 5, 6 సంవత్సరాల కాలాన్ని దృష్టిలో పెట్టుకొని రూపొందించే ప్రణాళికను మధ్యకాలిక ప్రణాళిక అంటారు.
- భారత ప్రణాళికలు మధ్య కాలిక ప్రణాళికలు
స్వల్పకాలిక ప్రణాళిక (Short Term Plan)
- ఒక సంవత్సరం కాల వ్యవదితో రూపొందించిన ప్రణాళికను స్వల్పకాలిక ప్రణాళిక అంటారు.
- ఒక సంవత్సర కాల వ్యవధి కోసం రూపొందించేవి.
- స్వల్పకాలిక ప్రణాళికను వార్షిక ప్రణాళిక అని, పిగ్మి ప్రణాళిక అని అంటారు.
- జాతీయ స్థాయి ప్రణాళికల్లో అతి చిన్నవి.
- అత్యవసర సమయాల్లో వార్షిక ప్రణాళికలను అమలు చేస్తారు.
- భారతదేశంలో 1966-69, 1978-80, 1990-92 సంవత్సరాల్లో వార్షిక ప్రణాళికలను అమలు చేశారు.
పంచవర్ష ప్రణాళిక (Five Years Plan)
- ఐదు సంవత్సరాల కాల వ్యవధిని దృష్టిలో ఉంచుకొని రూపొందించిన ప్రణాళికలను పంచవర్ష ప్రణాళిక అంటారు. భారతదేశంలో 12 పంచవర్ష ప్రణాళికలు అమలు చేశారు.
- వ్యవస్థ స్వరూపాన్ని బట్టి ప్రణాళికలను నిర్మాణాత్మక ప్రణాళిక, కార్యాత్మక ప్రణాళిక అని రెండు రకాలుగా వర్గీకరించవచ్చు.
నిర్మాణాత్మక ప్రణాళిక (Structural Planning)
- ప్రస్తుతం అమలులో ఉన్న ఆర్థిక వ్యవస్థను మార్చివేసి నూతన విధానాలు ప్రణాళికలు అమలు చేసే ప్రణాళికలను నిర్మాణాత్మక ప్రణాళికలు అంటారు.
- ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ నిర్మాణంలో మార్పులు ప్రవేశ పెట్టడానికి అమలు చేయబడుతుంది.
ఉదా: జీడీపీలో సేవా రంగం వాటా ఎక్కువగా ఉంటే, వ్యవసాయ రంగం వాటా కూడా ఎక్కువ చేయడానికి అమలు చేసే ప్రణాళిక. - నిర్మాణాత్మక ప్రణాళికలు సోషలిస్టు దేశాల్లో సాద్యమవుతుంది.
కార్యాత్మక ప్రణాళిక (Functional Planning)
- ప్రస్తుతం అమల్లో ఉన్న ఆర్థిక వ్యవస్థను మార్చకుండా ఉన్న ఆర్థిక వ్యవస్థలోనే నూతన విధానాలు అమలు చేసే ప్రణాళికను ‘కార్యాత్మక ప్రణాళిక’ అంటారు.
- ప్రస్తుత ఆర్థిక వ్యవస్థలో మార్పు చేయకుండా అమలు చేయబడుతుంది.
మాదిరి ప్రశ్నలు
1. కేంద్రీకృత ప్రణాళిక, వికేంద్రీకృత ప్రణాళికను దేని ఆధారంగా వర్గీకరించారు?
ఎ) ప్రజల భాగాస్వామ్యం
బి) ప్రభుత్వ పాత్ర
సి) వ్యవస్థ స్వరూపం డి) పైవన్నీ
2. ప్రణాళిక రచన పై స్థాయి నుంచి కింది స్థాయికి కదలడాన్ని ఏ ప్రణాళిక అంటారు?
ఎ) పంచవర్ష ప్రణాళిక
బి) కేంద్రీకృత ప్రణాళిక
సి) వికేంద్రీకృత ప్రణాళిక
డి) నిర్దేశాత్మక ప్రణాళిక
3. గ్రామం నుంచి మండలం, జిల్లా, రాష్ట్రం, దేశందిశగా ప్రణాళిక రచన జరపడాన్ని ఏ ప్రణాళిక అంటారు?
ఎ) సూచనాత్మక ప్రణాళిక
బి) కేంద్రీకృత ప్రణాళిక
సి) వికేంద్రీకృత ప్రణాళిక
డి) ఆదేశాత్మక ప్రణాళిక
4. నిర్దేశాత్మక ప్రణాళికకు మరొక పేరు?
ఎ) సూచనాత్మక ప్రణాళిక
బి) ఆదేశాత్మక ప్రణాళిక
సి) కేంద్రీకృత ప్రణాళిక
డి) ఏదీకాదు
5. ప్రభుత్వ రంగానికి ప్రాధాన్యాన్ని తగ్గిస్తూ ప్రైవేటు రంగానికి ప్రాధాన్యం పెంచే ప్రణాళిక ఏది?
ఎ) నిర్దేశాత్మక ప్రణాళిక
బి) సూచనాత్మక ప్రణాళిక
సి) మార్కెట్ సూచిక
డి) వికేంద్రీకృత ప్రణాళిక
6. సూచనాత్మక ప్రణాళికకు మరొక పేరు?
ఎ) ఆదేశాత్మక ప్రణాళిక
బి) నిర్దేశాత్మక ప్రణాలిక
సి) మార్కెట్ ప్రణాళిక డి) పైవన్నీ
7. దీర్ఘదర్శి ప్రణాళికకు మరొక పేరు?
ఎ) సూక్ష్మ ప్రణాళిక బి) సమగ్ర ప్రణాళిక
సి) విస్తృత ప్రణాళిక డి) పైవన్నీ
8. భారతదేశంలో అమలు పరిచిన ప్రణాళికలు ఏవి?
ఎ) దీర్ఘదర్శి ప్రణాళికలు
బి) మధ్యకాలిక ప్రణాళికలు
సి) స్వల్పకాలిక ప్రణాళికలు
డి) స్థూల ప్రణాళికలు
9. స్వల్పకాలిక ప్రణాళికలకు మరొక పేరు?
ఎ) వార్షిక ప్రణాళిక బి) పిగ్మి ప్రణాళిక
సి) స్థూల ప్రణాళిక డి) ఎ, బి
10. వ్యవస్థ స్వరూపాన్ని బట్టి వర్గీకరించిన ప్రణాళికలు ఏవి?
ఎ) నిర్దేశాత్మక ఆదేశాత్మక ప్రణాళిక
బి) ఆదేశాత్మక సూచనాత్మక ప్రణాళిక
సి) నిర్మాణాత్మక- కార్యాత్మక ప్రణాళిక
డి) నిర్దేశాత్మక-సూచనాత్మక ప్రణాళిక
11. ప్రస్తుత ఆర్థిక వ్యవస్థలో మార్పు చేయకుండా అమలు పరిచే ప్రణాళిక ఏది?
ఎ) నిర్మాణాత్మక ప్రణాళిక
బి) కార్యాత్మక ప్రణాళిక
సి) ఆదేశాత్మక ప్రణాళిక
డి) వికేంద్రీకరణ ప్రణాళిక
12. ప్రభుత్వ పాత్రను బట్టి ప్రణాళికల వర్గీకరణలు ఏవి?
ఎ) నిర్దేశాత్మక- ఆదేశాత్మక ప్రణాళిక
బి) ఆదేశాత్మక సూచనాత్మక ప్రణాళిక
సి) సూచనాత్మక మార్కెట్ ప్రణాళిక
డి) ఏదీకాదు
13. ప్రణాళిక రచన కింది స్థాయి నుంచి పై స్థాయికి కదలడాన్ని ఏ ప్రణాళిక?
ఎ) పంచవర్ష ప్రణాళిక
బి) కేంద్రీకృత ప్రణాళిక
సి) వికేంద్రీకృత ప్రణాళిక
డి) ఆదేశాత్మక ప్రణాళిక
14. వికేంద్రీకృత ప్రణాళికలను మొదట అమలు చేసిన దేశం ఏది?
ఎ) అమెరికా బి) రష్యా
సి) చైనా డి) ఏదీకాదు
15. పూర్తిగా ప్రభుత్వ నియంత్రణలో ప్రణాళికల రూపకల్పన అమలు పరిచే ప్రణాళిక ఏది?
ఎ) నిర్దేశాత్మక ప్రణాళిక
బి) ఆదేశాత్మక ప్రణాళిక
సి) సూచనాత్మక ప్రణాళిక
డి) ) ఎ, బి
16. సూచనాత్మక ప్రణాళికలను మొదట అమలు పరిచిన దేశం ఏది?
ఎ) అమెరికా బి) బ్రిటన్
సి) ఫ్రాన్స్ డి) రష్యా
17. భారతదేశంలో ఏయే ప్రణాళికలను దీర్ఘదర్శి ప్రణాళికలుగా సూచిస్తారు?
ఎ) 1, 5 బి) 3, 6
సి) 3, 7 డి) 8, 12
18. 3 నుంచి 6 సంవత్సరాల కాలవ్యవధితో రూపొందించిన ప్రణాళికలు ఏవి?
ఎ) స్వల్పకాలిక ప్రణాళిక
బి) మధ్యకాలిక ప్రణాళిక
సి) దీర్ఘకాలిక ప్రణాళిక డి) పైవన్నీ
సమాధానాలు
1-ఎ 2-బి 3-సి 4-బి
5-బి 6-సి 7-బి 8-బి
9-డి 10-సి 11-బి 12-బి
13-సి 14-ఎ 15-డి 16-సి
17-సి 18-బి
పానుగంటి కేశవ రెడ్డి
రచయిత
వైష్ణవి పబ్లికేషన్స్
గోదావరిఖని
9949562008
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు