Economic system | నాణ్యతను పాటించేది.. స్వేచ్ఛను అంగీకరించేది
ఆర్థిక వ్యవస్థ- రకాలు
- ఒక దేశంలో, రాష్ట్రంలో వస్తుసేవల ఉత్పత్తి పంపిణీలను ఎవరు నిర్వహించాలో నిర్ణయించే పద్ధతినే ఆర్థిక వ్యవస్థ అంటారు.
- ఒక నిర్ణీత భౌగోళిక ప్రాంతం, రాష్ట్రం, దేశానికి సంబంధించిన అర్థశాస్ర్తాన్ని ఆ ప్రాంత, రాష్ట్ర, దేశ ఆర్థిక వ్యవస్థ అంటారు.
- వివిధ దేశాల, రాష్ర్టాల సామాజిక, ఆర్థిక పరిస్థితులను బట్టి ఆర్థిక వ్యవస్థ వివిధ రకాలుగా ఉంటుంది. ఉదా: అమెరికా ఆర్థిక వ్యవస్థ, భారతదేశ ఆర్థిక వ్యవస్థ, తెలంగాణ, ఏపీ ఆర్థిక వ్యవస్థలు
- ఆర్థిక కార్యకలాపాల (ఉత్పత్తి, పంపిణీ, వినిమయం, వినియోగం) నిర్వహణ, ఉత్పత్తి కారకాల (భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన) యాజమాన్యం ఆధారంగా ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు స్థూలంగా మూడు రకాలుగా విభజించవచ్చు.
1. పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ
2. సామ్యవాద ఆర్థిక వ్యవస్థ
3. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ
1. పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ - ఆర్థిక కార్యకలాపాల నిర్వహణ, ఉత్పత్తి కారకాల యాజమాన్యం ప్రభుత్వ రంగం కంటే ఎక్కువగా ప్రైవేటు రంగం ఆధీనంలో ఉంటే అటువంటి ఆర్థిక వ్యవస్థను పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ అంటారు.
- వస్తు సేవల ఉత్పత్తి, పంపిణీలను ప్రైవేటు వ్యక్తులే నిర్వహిస్తూ పూర్తి స్వేచ్ఛ, పూర్తి పోటీ, లాభార్జన ధ్యేయంతో నడిచే అనియంత్రిత ప్రణాళిక రహిత వ్యవస్థను ‘పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ’ అంటారు.
- పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ మూలాలు 16వ శతాబ్దంలో మొదలయ్యాయి.
- సంప్రదాయ ఆర్థిక వ్యవస్థ నుంచి వచ్చిన మొదటి అభివృద్ధిగా పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థను పేర్కొనవచ్చు.
- పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థకు అధిక ప్రాచుర్యం కల్పించినది ఆడమ్ స్మిత్.
- ఆడమ్ స్మిత్ 1776లో రచించిన (An Enquiry in to the Nature and Causes of the Wealth of Nations) దేశాల సంపద స్వభావం కారణాల పరిశోధన గ్రంథం ఆధారంగా పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ రూపొందింది.
- దీన్ని ‘మార్కెట్ ఆర్థిక వ్యవస్థ మోడల్’ అని ‘స్వేచ్ఛా మార్కెట్ ఆర్థిక వ్యవస్థ’ అని ‘ప్రీ ఎంటర్ప్రైజ్ ఎకానమీ’ అని కూడా అంటారు.
- పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థకు ఉదా: అమెరికా, కెనడా, ఇంగ్లండ్, ఫ్రాన్స్, జర్మనీ
పెట్టుబడిదారీ విధానం/ పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ లక్షణాలు
ఎ. ప్రైవేటు ఆస్తి: పెట్టుబడిదారీ విధానంలో ఇది అతి ముఖ్య లక్షణం. పరిశ్రమలు, యంత్రాలు, యంత్ర పరికరాలు మొదలగునవి. ప్రైవేటు ఆస్తులు, ప్రైవేటు వ్యక్తుల/ ప్రైవేటు కంపెనీల ఆధీనంలో ఉంటాయి.
బి. ఎంటర్ప్రైజ్ స్వేచ్ఛా: ఈ వ్యవస్థలో ప్రతి వ్యక్తికి ఎవరి జోక్యం లేకుండా వారి సొంత ఆర్థిక నిర్ణయాలు తీసుకునే హక్కు ఉంటుంది. అంటే వ్యక్తులు, కుటుంబాలు, సంస్థలు అదృశ్య హస్తం (Invisible hand) ద్వారా ప్రేరేపించబడి సొంత ప్రయోజనాలను ఆశించి, సొంత ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించి సమాజానికి కావాల్సిన వస్తు సేవలను అందిస్తాయి.
సి. లాభాపేక్షిత: పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ ముఖ్య లక్షణాల్లో లాభాలను ఆర్జించడం ఒకటి. ఈ వ్యవస్థలో అన్ని కంపెనీలు తమ ఉత్పత్తులను వినియోగదారులకు విక్రయించి గరిష్ఠ లాభాలను పొందడం.
డి. ధర విధానం: ఈ విధానంలో ధరను మార్కెట్ శక్తులైన డిమాండ్, సప్లయ్‌లు నిర్ణయిస్తాయి. అంతేకాకుండా వస్తు సేవల ఉత్పత్తి ఎవరు, ఎంత ఉత్పత్తి చేయాలనేది కూడా మార్కెట్ శక్తులే నిర్ణయిస్తాయి.
ఇ. వినియోగదారు సార్వభౌమాధికారం: ఈ వ్యవస్థలో కంపెనీలు/పరిశ్రమలు ఉత్పత్తి స్థాయిని వినియోగదారుల డిమాండ్లచే నియంత్రించబడుతుంది. అంటే వినియోగదారుడు ఏ వస్తుసేవల ఉత్పత్తిని కొనుగోలు చేయాలో నిర్ణయించుకునే సార్వభౌమాధికారం కలిగి ఉంటారు.
ఎఫ్. ప్రభుత్వ జోక్యం: పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ జోక్యం ఉండదు. అంటే ఆర్థిక కార్యకలాపాల నిర్వహణలో ప్రభుత్వం ‘LAISSEZ FAIR’ విధానాన్ని అనుసరిస్తుంది. అంటే స్వేచ్ఛా మార్కెట్ ఆర్థిక విధానం ఉంటుంది.
జి. స్వేచ్ఛా వాణిజ్యం: ఈ వ్యవస్థలో అంతర్జాతీయ వాణిజ్యాన్ని ప్రోత్సహించే తక్కువ సుంకం ఉంటుంది.
హెచ్: కార్మిక మార్కెట్లో సౌలభ్యం: పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో శ్రామిక శక్తిని నియమించుకోవడం, తొలగించుకోవడం సులభంగా ఉంటుంది.
ఐ. యాజమాన్య స్వేచ్ఛ: ఈ వ్యవస్థలో ఒక వ్యక్తి ఎంత ఆస్తినైనా కూడబెట్టుకోవచ్చు. దాన్ని తన ఇష్టానుసారం ఉపయోగించుకోవచ్చు. అతని మరణం తర్వాత అదే ఆస్తి వారసత్వ హక్కు ద్వారా వారసులకు బదిలీ
చేయవచ్చు.
పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ-ప్రయోజనాలు - వినియోగదారుల డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పుత్తులను ఉత్పత్తి చేయడం వల్ల పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో మరింత సామర్థ్యం పెరుగుతుంది.
- ప్రభుత్వం లేదా బ్యూరోక్రాటిక్ జోక్యం తక్కువగా ఉంటుంది.
- పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో ప్రజాస్వామ్య హక్కులు, స్వేచ్ఛ అంగీకరించబడతాయి.
- ఈ విధానంలో వృత్తి ప్రత్యేకీకరణ, నాణ్యత ఉంటుంది.
- ఈ వ్యవస్థలో వ్యక్తిగత ఎదుగుదలకు, వ్యాపార కార్యకలాపాలకు, నూతన ఆవిష్కరణలకు అనుకూల వాతావరణం ఉంటుంది.
- ఈ ఆర్థిక వ్యవస్థ మోడల్‌ను 1777 నుంచి అమెరికా, ఉత్తర అమెరికా, పశ్చిమ యూరప్ దేశాలు అనుసరించి అభివృద్ధి సాధించాయి.
పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ-లోపాలు - పెట్టుబడిదారీ విధానం వల్ల ఆదాయ అసమానతలు ఏర్పడుతాయి. ఈ విధానంలో కార్మికులు, వినియోగదారులపై సంస్థలు గుత్తాధిపత్యాన్ని పొందుతాయి.
- పెట్టుబడిదారీ విధానం అధిక లాభార్జనతో వనరులను ఇష్టానుసారంగా ఉపయోగించడం వల్ల సహజ సమతుల్యత నాశనం అవడమే కాకుండా పర్యావరణ సమస్యలకు దారి తీస్తుంది.
- ఈ వ్యవస్థలో సామర్థ్యం ఉన్నవారే మనుగడ సాధించగలరు. పేదవారిని పట్టించుకునేవారు ఉండరు.
- ఈ విధానం వల్ల సమాజంలో ధనిక-పేద వర్గాల మధ్య అంతరం పెరగడమే కాకుండా ధనిక వర్గం, పేద వర్గాన్ని అన్ని విధాలుగా దోపిడీ చేస్తుంది.
- ఈ విధానం వల్ల ఆర్థిక, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక అసమానతలు పెరుగుతాయి.
- 1929లో ప్రపంచ వ్యాప్తంగా ఏర్పడిన ఆర్థిక మాంద్యం వల్ల మార్కెట్ ఆర్థిక వ్యవస్థ మోడల్ ప్రాబల్యాన్ని
కోల్పోయింది.
పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ-విమర్శ - పెట్టుబడిదారీ విధానంపై విభిన్న అభిప్రాయాలు ఉన్నప్పటికీ ప్రముఖంగా పెట్టుబడిదారీ విధానం అంతర్గతంగా దోపిడీ, అస్థిరత, నిలకడ లేనిదనే విమర్శ ఉంది.
- ఈ విధానం భారీ ఆర్థిక అసమానతలను సృష్టించి, ప్రజలను సరకులుగా మారుస్తుంది. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమైనదిగా చెప్పవచ్చు.
- ఇది మానవ హక్కులు, జాతీయ సార్వభౌమాధికారం క్షీణతకు దారి తీస్తుంది.
- ఇది సామ్రాజ్యవాదాన్ని ప్రోత్సహిస్తుంది.
ప్రాక్టీస్ బిట్స్
1. ఆర్థిక కార్యకలాపాల నిర్వహణ, ఉత్పత్తి కారకాల యాజమాన్యం ఆధారంగా ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థను ఎన్ని రకాలుగా
వర్గీకరించవచ్చు?
ఎ. 2 బి. 3 సి. 4 డి. 5
2. ఒక నిర్ణీత భౌగోళిక ప్రాంతానికి సంబంధించిన అర్థశాస్ర్తాన్ని ఏమంటారు?
ఎ. ఆర్థిక సంఘం బి. ఆర్థిక విధానం
సి. ఆర్థిక వ్యవస్థ డి. ఆర్థిక రంగం
3. వస్తుసేవల ఉత్పత్తి, పంపిణీలను ప్రైవేటు వ్యక్తులు నిర్వహిస్తే దాన్ని ఏమంటారు?
ఎ. పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ
బి. సామ్యవాద ఆర్థిక వ్యవస్థ
సి. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ డి. పైవన్నీ
4. పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ మూలాలు ఏ శతాబ్దంలో మొదలయ్యాయి?
ఎ. 15 బి. 16 సి. 17 డి. 18
5. ‘దేశాల సంపద’ గ్రంథ రచయిత ఎవరు?
ఎ. మార్షల్ బి. రికార్డో
సి. ఆడమ్‌స్మిత్ డి. కీన్స్
6. పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థకు ఉదాహరణ?
ఎ. అమెరికా బి. కెనడా
సి. ఇంగ్లండ్ డి. పైవన్నీ
7. ఏ గ్రంథం ఆధారంగా పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ రూపొందింది?
ఎ. అర్థశాస్త్ర స్వభావం, ప్రాముఖ్యత
బి. దేశాల సంపద స్వభావం కారణాల పరిశోధన
సి. ఆర్థిక సూత్రాలు
డి. ప్రణాళిక-ఆర్థికాభివృద్ధి
8. పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థకు మరొక పేరు?
ఎ. మార్కెట్ ఆర్థిక వ్యవస్థ మోడల్
బి. స్వేచ్ఛా మార్కెట్ ఆర్థిక వ్యవస్థ
సి. ప్రీ ఎంటర్ ప్రైజ్ ఎకానమీ
డి. పైవన్నీ
9. వ్యక్తులు, కుటుంబాలు, సంస్థలు, అదృశ్య హస్తం ద్వారా ప్రేరేపించబడి సొంత ప్రయోజనాలను ఆశించే వ్యవస్థ ఏది?
ఎ. పెట్టుబడిదారీ వ్యవస్థ
బి. సామ్యవాద ఆర్థిక వ్యవస్థ
సి. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ డి. పైవన్నీ
10. కింది వాటిలో మార్కెట్ శక్తులు ఏవి?
ఎ. డిమాండ్ బి. సప్లయ్
సి. ఎ, బి డి. ధర
11. ఆర్థిక వ్యవస్థలో ధరను నిర్ణయించేవి ఏవి?
ఎ. డిమాండ్ బి. సప్లయ్
సి. మార్కెట్ శక్తులు
డి. ఉత్పత్తి పరిమాణం
12. పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వం ఎటువంటి విధానాన్ని అనుసరిస్తుంది?
ఎ. Laissez Fair
బి. Free Market
సి. Free Economy
డి. Free Zone
13. వ్యక్తిగత ఆస్తి, సంపాదన, పెంపు, అనుభవించే అవకాశం గల వ్యవస్థ ఏది?
ఎ. Capitalist Economy
బి. Socialist Economy
సి. Mixed Economy
డి. పైవన్నీ
14. ఆదాయ అసమానతలు అధికం గల ఆర్థిక వ్యవస్థ ఏది?
ఎ. పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ
బి. సామ్యవాద ఆర్థిక వ్యవస్థ
సి. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ
డి. పైవన్నీ
15. ఆర్థిక మాంద్యం ఏ సంవత్సరంలో వచ్చింది?
ఎ. 1928-29 బి. 1929-30
సి. 1930-31 డి. 1931-32
16. ప్రజాస్వామ్యానికి విరుద్ధమైన ఆర్థిక వ్యవస్థ ఏది?
ఎ. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ
బి. పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ
సి. సామ్యవాద ఆర్థిక వ్యవస్థ
డి. పైవన్నీ
17. పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థకు అధిక ప్రాచుర్యం కల్పించినది ఎవరు?
ఎ. కీన్స్ బి. కారల్‌మార్క్స్
సి. ఆడమ్ స్మిత్ డి. పైవారందరు
18. కింది వాటిలో పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ లక్షణం?
ఎ. అధిక లాభార్జన
బి. వినియోగదారుని సార్వభౌమాధికారం
సి. స్వేచ్ఛా వాణిజ్యం డి. పైవన్నీ
19. ఆర్థిక, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక అసమానతలకు అవకాశం గల వ్యవస్థ ఏది?
ఎ. పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ
బి. సామ్యవాద ఆర్థిక వ్యవస్థ
సి. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ
డి. పైవన్నీ
20. అంతర్గత దోపిడీ, అస్థిరత, అసమానతలు, ఆధిపత్యానికి అవకాశం గల ఆర్థిక వ్యవస్థ ఏది?
ఎ. పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ
బి. సామ్యవాద ఆర్థిక వ్యవస్థ
సి. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ
డి. పైవన్నీ
21. వినియోగదారునికి సార్వభౌమాధికారం గల ఆర్థిక వ్యవస్థ?
ఎ. క్యాపిటలిజమ్ బి. సోషలిజమ్
సి. మిశ్రమ వ్యవస్థ డి. ఎ, బి
22. ‘ఫాదర్ ఆఫ్ క్యాపిటలిజమ్ ఎకానమీ’ ఎవరు?
ఎ. రాబిన్స్ బి. మార్షల్
సి. ఆడమ్‌స్మిత్ డి. జేఎం కీన్స్
23. Wealth of Nations గ్రంథం ఏ సంవత్సరంలో రూపొందించబడింది?
ఎ. 1776 బి. 1786
సి. 1876 డి. 1886
24. ఆర్థిక కార్యకలాపాల నిర్వహణ, ఉత్పత్తి కారకాల యాజమాన్యం ప్రభుత్వ రంగం కంటే ప్రైవేటు రంగం ఆధీనంలో అధికంగా ఉంటే అటువంటి ఆర్థిక వ్యవస్థను ఏమంటారు?
ఎ. పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ
బి. సామ్యవాద ఆర్థిక వ్యవస్థ
సి. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ
డి. పైవన్నీ
సమాధానాలు
1. బి 2. సి 3. ఎ 4. బి
5. సి 6. డి 7. బి 8. డి
9. ఎ 10. సి 11. సి 12. ఎ
13. ఎ 14. ఎ 15. బి 16. బి
17. సి 18. డి 19. ఎ 20. ఎ
21. ఎ 22. సి 23. ఎ 24. ఎ
పానుగంటి కేశవ రెడ్డి
రచయిత
వైష్ణవి పబ్లికేషన్స్
గోదావరిఖని
9949562008
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు