Economy in Group-1 | గ్రూప్-1లో ఎకానమీ
గ్రూప్-1 సిలబస్ చాలా విస్తృతమైనది. కాబట్టి ఎంతో విశ్లేషణాత్మకంగా, విపులీకరించి చదవాల్సిన అవసరం ఉంది. అందులోనూ ఆర్థికశాస్త్ర అంశాలనైతే అత్యంత క్షుణ్ణంగా అర్థం చేసుకుంటూ చదవాలి. కనీసం 4 నుంచి 6 నెలల ముందు నుంచే కసరత్తు ప్రారంభిస్తే తప్ప ఎకానమీపై పట్టు సాధించడం కష్టం. అందుకే గ్రూప్-1 ఎకానమీ ప్రిపరేషన్‌ను ముందుగా ప్రారంభిస్తున్నాం..
ఎకానమీని ఎందుకు మొదటి సబ్జెక్టుగా, దీర్ఘకాలికంగా చదవాలి?
ఎకానమీ మొత్తం రెండు భాగాలుగా ఉంటుంది. 1. కోర్ అంశాలు 2. వర్తమాన అంశాలు. వర్తమాన ఎకానమీపైనే ఎక్కువ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. గత పరీక్షల ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే ఈ విషయం మనకు అర్థమవుతుంది. కానీ వర్తమాన అంశాలను అర్థం చేసుకోవాలంటే కోర్ అంశాలపై చాలా లోతైన అవగాహన ఉండాలి.
లేదంటే ఎకానమీలోని డాటా, స్టాటిస్టిక్స్ను గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం. అంటే ఎకానమీకి సంబంధించిన ప్రతి కోర్ అంశాన్ని దాని వర్తమాన అంశాలతో కలిపి చదువుకోవాలి. ఇలా కరెంట్ ఎకానమీని కనీసం 6 నెలలు ఫాలో అయితే తప్ప ఎకానమీపై పట్టుసాధించడం సులభం కాదు. ఇక ఎకానమీకి సంబంధించిన వృద్ధి, అభివృద్ధి సూచికలు, ద్రవ్యోల్బణ లెక్కలు, ద్రవ్యలోటు, కరెంట్ ఖాతాలోటు మొదలైన సూచికలు, లెక్కలన్నీ ప్రతి 3 నెలలకు, 6 నెలలకు లేదా సంవత్సరానికి విడుదలవుతాయి.
వీటన్నింటిని గుర్తుపెట్టుకోవాలన్నా, అర్థం చేసుకోవాలన్నా కచ్చితంగా ఆయా అంశాలపై, వాటి మౌలిక భావనలపై సంపూర్ణ అవగాహన ఎంతో అవసరం. అంతేగాకుండా గ్రూప్-1లో ఉన్న మొత్తం ఎకానమీని ఒక పద్ధతి ప్రకారం చదివి, అర్థం చేసుకుని, అన్ని ప్రశ్నలకు సమాధానం రాయాలంటే కనీసం 6 నెలల ప్రిపరేషన్ కావాలి. పై విషయాలన్నింటిని దృష్టిలో పెట్టుకుని గ్రూప్-1ఎకానమీని తొందరగా ప్రారంభిస్తున్నాం.
ప్రిలిమినరీ పరీక్ష (150 మార్కులు)
మొత్తం 150 మార్కుల ప్రిలిమినరీ పరీక్షలో జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీకి సంబంధించి 13 అంశాలుంటాయి. అంటే దాదాపు ఒక్కో అంశం నుంచి 10-12 మార్కులకు ప్రశ్నలు వస్తాయి. పదమూడు అంశాల్లో మూడు ప్రత్యక్షంగా, మూడు పరోక్షంగా ఎకానమీకి సంబంధించినవే ఉంటాయి.
ప్రత్యక్ష అంశాలు
1. కరెంట్ అఫైర్స్ – ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ ఎకానమీ అంశాలు
2. భారతదేశ ఆర్థిక, సామాజిక అభివృద్ధి
3. తెలంగాణ రాష్ట్ర విధానాలు
పరోక్ష అంశాలు
1. అంతర్జాతీయ సంబంధాలు, ఘటనలు (దాదాపు అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు, రిపోర్టులు, వర్తమాన సమావేశాల గురించి ఎక్కువ అంశాలుంటాయి)
2. భారతదేశంలో ప్రభుత్వ విధానాలు
3. లింగ, కుల, తెగ, వికలాంగుల హక్కులు, సమ్మిళిత విధానాలు.
-పై అంశాలన్నీ ఎకానమీకి సంబంధించినవేనని చెప్పవచ్చు. అంటే ప్రిలిమినరీ పరీక్షలో దాదాపు 30 నుంచి 40 మార్కులకు ఎకానమీ గురించిన ప్రశ్నలు మాత్రమే అడిగే అవకాశం ఉంది.
ప్రిలిమినరీకి ఎకానమీ ప్రిపరేషన్ ఎలా?
-ప్రిలిమినరీ ఎకానమీలో ఉన్న మొదటి అంశం కరెంట్ అఫైర్స్. ఇందులో జీడీపీ వృద్ధి రేటు, ద్రవ్యోల్బణం, బడ్జెట్, ప్రభుత్వ పథకాలు, కరెంట్ ఖాతాలోటు, ద్రవ్యలోటు, డీ మానిటైజేషన్, రేటింగ్ సంస్థలు మొదలైనవి ఉంటాయి.
-ఇక భారతదేశ ఆర్థిక, సామాజిక అభివృద్ధి. అంటే ప్రభుత్వ ఆర్థిక విధానాలు, వృద్ధి పర్యవసానాలు, ప్రభుత్వ పథకాలు, వెనుకబడిన వర్గాలకు ప్రభుత్వం అందిస్తున్న ప్రత్యేక సదుపాయాలు మొదలైనవి చదవాలి.
-మూడో అంశం తెలంగాణ రాష్ట్ర విధానాలు. అంటే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పథకాలైన మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా పింఛన్లు, టీఎస్-ఐపాస్, ఐటీఐఆర్ మొదలైనవి ఉంటాయి.
ప్రిలిమినరీలో ఎకానమీ కోసం చదవాల్సినవి..
-ప్రిలిమినరీ పరీక్షలో ఇచ్చే ఎకానమీ అంశాల్లో అతి తక్కువ కోర్ అంశాలు, అతి ఎక్కువ వర్తమాన అంశాలు ఉంటాయి. కాబట్టి న్యూస్ పేపర్‌ను ఫాలో అవడం కంపల్సరీ. దీంతోపాటు ప్రభుత్వ ప్రకటనలు, పథకాల సమగ్ర సమాచారం కోసం అధికారిక వెబ్సైట్లను దర్శించడం, ప్రభుత్వ రిపోర్టులు, అంతర్జాతీయ సంస్థల రిపోర్టులు – ఐఎంఎఫ్ (IMF), ప్రపంచ బ్యాంక్, డబ్ల్యూటీఓ (WTO), యూఎన్ఓ (UNO) మొదలైనవి అధ్యయనం చేయాలి. బడ్జెట్, ఆర్థిక సర్వే, కుల గణన, మౌలిక భావనల గురించి చదవాలి.
రిఫరెన్స్ బుక్స్
1. ఎకానమీ కీ కాన్సెప్ట్స్ – శంకర్ గణేశన్ (E/M)
2. తెలుగు అకాడమీ – బీఏ ఫస్టియర్ మైక్రో ఎకనామిక్స్ (సూక్ష్మ అర్థశాస్త్రం)
3. తెలుగు అకాడమీ – సీనియర్ ఇంటర్ ఎకనామిక్స్ (T/M, E/M)
4. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ – సూక్ష్మ, స్థూల అర్థశాస్త్రం (MA)
5. ఎన్సీఈఆర్టీ – 12వ తరగతి మాక్రో ఎకానమీ
గ్రూప్ 1 మెయిన్స్ – ఎకానమీ పాత్ర
-గ్రూప్ 1 పేపర్ 1లో మొత్తం 3 సెక్షన్లుంటాయి. అందులో సెక్షన్ 1లో రెండో అంశం ఆర్థిక వృద్ధి, న్యాయ అంశాలు పూర్తిగా ఎకానమీకి సంబంధించిన అంశం.
ఇది 50 మార్కులకు ఉంటుంది.
-ఇక పేపర్-2లోని సెక్షన్ 1, చాప్టర్-3లో బ్రిటిష్ ఇండియాలో భూమి శిస్తు విధానాలు, వ్యవసాయ వ్యాపారీకరణ, దుర్భిక్షాలు, పేదరికం, డీ ఇండస్ట్రియలైజేషన్, సంపద తరలింపు, వర్తక వాణిజ్యాల వృద్ధి, భారతదేశ ఆర్థిక రూపాంతరం, రైలు, రోడ్డు రవాణా, కమ్యూనికేషన్ నెట్వర్క్, టెలిగ్రాఫ్, పోస్టల్ సేవల గురించి ఉంటాయి.
-ఇక సెక్షన్ 2లో మూడో అంశం సాలార్జంగ్ సంస్కరణలు, నిజాంల పాలనలో సామాజిక-ఆర్థిక అభివృద్ధి, భూ విధానాలు, ఏడో నిజాం కాలంలో సామాజిక-ఆర్థిక అభివృద్ధి, రైల్వేలు, రవాణా, కమ్యూనికేషన్ వ్యవస్థ ఎదుగుదల, పరిశ్రమలు, విద్యాసంస్థల స్థాపన మొదలైనవన్నీ ఎకానమీ అంశాలే.
ఏం చదవాలి?
-ఎస్సేకి సంబంధించి వర్తమాన అంశాలు, న్యూస్ పేపర్, ప్రభుత్వ విధానాలు, ప్రభుత్వ రిపోర్టులు.
-పేపర్ 2లో బ్రిటిష్ ఇండియాలో భారత ఆర్థిక వ్యవస్థ అనే టాపిక్‌పై బిపిన్ చంద్రపాల్ పుస్తకం, ఇగ్నో పుస్తకాలు చదవాలి.
-మూడో అంశం తెలంగాణ చరిత్ర, సాలార్జంగ్ సంస్కరణలు మొదలైన వాటికోసం తెలుగు అకాడమీకి చెందిన తెలంగాణ ఆర్థిక వ్యవస్థ-పోటీ పరీక్షల ప్రత్యేకం చదవాలి.
-ఇక పేపర్-2 సెక్షన్ 3లో భారతదేశం, తెలంగాణ జాగ్రఫీ అంశాలన్నింటినీ వర్తమాన ఎకానమీ అంశాలతోపాటుగా చదవాలి. ప్రతి చాప్టర్‌ను ఎకానమీపై అవగాహన లేకుండా చదవడం అసాధ్యమని చెప్పవచ్చు. అందుకోసం సెక్షన్-3 మొత్తం భారతదేశం, తెలంగాణ ఆర్థిక సర్వే, తెలంగాణ సామాజిక, ఆర్థిక సర్వేలను క్షుణ్ణంగా చదవాలి.
పేపర్-3
-పేపర్-3 సెక్షన్ 1లో 3వ అంశం, 5వ అంశం, సెక్షన్ 2లో 2వ అంశం, సెక్షన్ 3 గవర్నెన్స్‌లో 3వ, 4వ అంశాలను కూడా ఎకానమీ అంశాలతో కలిపే చదవాలి.
పేపర్-4
-గ్రూప్-1 మెయిన్స్‌లో ఎకానమీ ఒక ప్రత్యేక సబ్జెక్టుగా పూర్తి 150 మార్కులు కేటాయించిన పేపర్ ఇది. ఇందులో మొత్తం 3 సెక్షన్లుంటాయి.
సెక్షన్ 1 – భారత ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి
సెక్షన్ 2 – తెలంగాణ ఆర్థిక వ్యవస్థ
సెక్షన్ 3 – అభివృద్ధి, పర్యావరణ సమస్యలు
పేపర్-6
-తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావంలో తెలంగాణ ఎకానమీ చాలా ప్రధానపాత్ర వహిస్తుంది. అందులో అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ఎకానమీ, 1969కి ముందు తెలంగాణ ఆర్థిక పరిస్థితి, కుమార్ లలిత్ కమిటీ, వశిష్ట భార్గవ కమిటీ, 1980లో ఆర్థిక సంస్కరణలు, 1991లో ఎల్పీజీ సంస్కరణలు మొదలైనవి ఉంటాయి. ఇవన్నీ ఆర్థికవ్యవస్థకు సంబంధించినవేనని గమనించాలి.
పేపర్ 4 – సెక్షన్ 1 ప్రిపరేషన్
-భారత ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి
-మొత్తం 5 చాప్టర్లలో జాతీయ ఆదాయ భావనలు, దాని లెక్కింపు ధోరణులు, పేదరికం, నిరుద్యోగిత, వాటి వివిధ భావనలు, ద్రవ్యం, బ్యాంకింగ్ పబ్లిక్ ఫైనాన్స్, భారత ఆర్థిక వ్యవస్థలో ప్రణాళికలు, నీతి ఆయోగ్‌కు సంబంధించిన అంశాలుంటాయి.
-పై అంశాలన్నీ ఆర్థికశాస్త్ర మౌలిక ప్రాథమిక భావనపై ఆధారపడిన అంశాలు కాబట్టి ఎకానమీ బేసిక్స్ మొత్తం చదవాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి తెలుగు అకాడమీ బీఏ ఫస్టియర్ పుస్తకం, ఇంటర్మీడియట్ ద్వితీయ సంవ్సతరం పుస్తకం చదవాలి.
-ఎకానమీ ప్రాథమిక భావనలపై సంపూర్ణ అవగాహన కోసం తెలుగు అకాడమీ, బీఆర్ అంబేద్కర్, ఇగ్నో పుస్తకాలను కనీసం ఒక్కసారైనా తిరగేయడం మీ ప్రిపరేషన్‌ను సులభతరం చేస్తుంది.
పేపర్ 4 – సెక్షన్ 2 ప్రిపరేషన్
-తెలంగాణ ఆర్థిక వ్యవస్థ
-ఈ సెక్షన్లో అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ఎకానమీ, హైదరాబాద్ రాష్ట్రంలో తెలంగాణ ఎకానమీ, మానవ వనరులు, భూ సంస్కరణలు, వ్యవసాయం, పరిశ్రమలు, సేవల రంగాల గురించి, తెలంగాణ ప్రభుత్వ విధానాల గురించి సమగ్ర సిలబస్ ఇచ్చారు. దీనిలో తెలంగాణ చరిత్ర, ఉద్యమంపై పూర్తి అవగాహనతోపాటు నూతన తెలంగాణలో వ్యవసాయ, పరిశ్రమలు, సేవలరంగ పరిస్థితిని పూర్తిగా చదవాలి.
-ఈ సెక్షన్లో తెలంగాణ రాష్ట్ర ఉద్యమం-రాష్ట్ర ఆవిర్భావ అంశాల కోసం తెలుగు అకాడమీ పుస్తకాలను, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ పోటీ పరీక్షల ప్రత్యేకం, తెలంగాణ సామాజిక ఆర్థిక చిత్రణ-2016, తెలంగాణ బడ్జెట్, తెలంగాణ ఎకానమీ చట్టాలు భూ సంబంధ, ఐటీ సంబంధ, టీఎస్-ఐపాస్ మొదలైన వాటితోపాటు ప్రభుత్వ పథకాలు తదితర అంశాల గురించి సమగ్రంగా చదవాలి.
పేపర్ 4 – సెక్షన్ 3 ప్రిపరేషన్
-అభివృద్ధి – పర్యావరణ సమస్యలు
-ఈ సెక్షన్లో పర్యావరణం వర్సెస్ అభివృద్ధి, సహజ వనరులు, ఆవరణ వ్యవస్థలు, పర్యావరణ కాలుష్యం, ప్రపంచ పర్యావరణ సమస్యలు అనే అంశాలు ఇచ్చారు.
-ఈ సెక్షన్‌కు సంబంధించి పర్యావరణ అంశాల నిర్వచనాలు, వాటి వివిధ అంశాలు, వాటితో అభివృద్ధికి ఉన్న సంబంధం, అంతర్జాతీయ పర్యావరణ అగ్రిమెంట్లు చదవాలి. అదేవిధంగా తెలుగు అకాడమీ – బీఏ ఫస్టియర్ ఎకానమీ పుస్తకం, శంకర్ ఐఏఎస్ ఎన్విరాన్మెంట్, తెలంగాణ పర్యావరణ శాఖ వెబ్సైట్, భారత పర్యావరణ శాఖ వెబ్సైట్, వర్తమాన రిపోర్ట్స్తోపాటు బేసిక్స్‌పై సంపూర్ణ అవగాహననిచ్చే పుస్తకాలను చదవాలి.
-అయితే 4వ పేపర్లో ఉన్న 3 సెక్షన్లకు మార్కెట్లో సమగ్రమైన పుస్తకం లేకపోవడం, ఉన్న వాటిలో కాన్సెప్ట్స్, స్టాటిస్టిక్స్ సరైన విధంగా ఇవ్వకపోవడం, తెలుగు మీడియం పుస్తకాలు అందుబాటులో లేకపోవడంవల్ల ఈ పేపర్ కొంత కఠినంగా అనిపిస్తుంది. కానీ ఒక పద్ధతి ప్రకారం పై అంశాలన్నింటిని వివిధ మాధ్యమాలు, పుస్తకాల నుంచి సేకరించి చదవగలిగితే ఈ పేపర్లో పూర్తి మార్కులు సాధించొచ్చు.
-గ్రూప్-1 సిలబస్‌ను పరిశీలించినైట్లెతే పరీక్ష మొత్తంలో ఎకానమీ నుంచే ఎక్కువ మార్కులకు ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ప్రిలిమ్స్‌లో – 40 నుంచి 50 మార్కులు, మెయిన్స్ పేపర్ 1లో – 50 మార్కులు, పేపర్ 2లో – 40 మార్కులు, పేపర్ 3లో – 40 మార్కులు, పేపర్ 4లో – 150 మార్కులు, పేపర్-6లో – 40 మార్కులు కలుపుకొని దాదాపు 300 మార్కులకు ఎకానమీ నుంచే ప్రశ్నలు రానున్నాయి. కాబట్టి ఎకానమీపై పట్టు సాధించడం ఆవశ్యకమనే విషయాన్ని గ్రహించి, అభ్యర్థులు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ మొదలు పెడితే విజయం సాధించడం సులభం.
గ్రూప్-1లో ఎకానమీ పాత్ర ఎంత?
గ్రూప్-1 పరీక్ష మొత్తంలో ఎకానమీ చాలా ప్రధానమైనది. ఎకానమీలో పట్టు సాధించినవారికి విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. గ్రూప్-1లో రెండు రకాల అభ్యర్థులుంటారు. 1. ఎకానమీ తెలియనివారు, అర్థం కానివారు, 2. ఎకానమీపై పట్టున్నవారు. గ్రూప్-1లో రెండో కేటగిరీవారు మాత్రమే విజయం సాధిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు
-గ్రూప్-1లో మొత్తం 3 లెవల్స్ ఉంటాయి. అవి.. 1. ప్రిలిమినరీ, 2. మెయిన్స్, 3. ఇంటర్వ్యూ
-పై మూడింటిలో ప్రిలిమినరీ కేవలం క్వాలిఫయింగ్ పరీక్షకాగా మెయిన్స్, ఇంటర్వ్యూలో వచ్చే మార్కులు అభ్యర్థి విజయాన్ని నిర్ణయిస్తాయి.
-ప్రిలిమినరీ కేవలం ఆబ్జెక్టివ్ తరహాలో 150 మార్కులకు ఉంటుంది. ప్రిలిమినరీలో క్వాలిఫై అయినవారికి మెయిన్స్ రాతపరీక్ష ఉంటుంది. మెయిన్స్‌లో మొత్తం 900 మార్కులకు 6 పేపర్లుంటాయి. ఇందులో 150 మార్కులకు ఒక ఇంగ్లిష్ క్వాలిఫయింగ్ పరీక్ష ఉంటుంది. ఇంటర్వ్యూకు 100 మార్కులుంటాయి. అంటే మొత్తం గ్రూప్-1 పరీక్ష 1000 మార్కులకు ఉంటుంది. ఇందులో కనీసం 50-60 శాతం మార్కులు పొందినవారికి విజయం దక్కే అవకాశం ఉంది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు