సామాజిక విధానాలు – సంక్షేమ కార్యక్రమాలు
భారతదేశాన్ని సంక్షేమ రాజ్యంగా పరిగణిస్తారు. దేశ సామాజిక నిర్మాణంలో దాదాపు 60 శాతం పైగా జనాభా బలహీనవర్గాల ప్రజలు ఉన్నందున ప్రభుత్వ విధానాలన్నీ సామాజిక విధానాల కోణంలోనే రూపొందుతున్నాయి. అంతేకాకుండా ప్రభుత్వ కార్యక్రమాల్లో మొదటి ప్రాధాన్యత సంక్షేమ కార్యక్రమాలకే ఇవ్వబడుతోంది.
-శ్రేయోరాజ్యస్థాపన : శ్రేయోరాజ్య స్థాపనే భారత రాజ్యాంగ ప్రధాన లక్ష్యం. రాజ్యాంగంలోని ఆదేశ సూత్రాల సహాయంతో ఆర్థిక, సాంఘిక రంగాల్లో ప్రజలందరికీ సమాన అవకాశాలను కల్పించడం, దేశ సంపదను జనాభా ప్రాతిపదిక, సమన్యాయ సూత్రం ఆధారంగా పంచడం (నిబంధన 38 : సామాజిక, ఆర్థిక అసమానతలను తగ్గించడం, నిబంధన 39: సంపద కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతం కాకుండా చూడటం), బలహీన వర్గాలకు ప్రత్యేక రక్షణ కల్పించి వారి అభివృద్ధికి తోడ్పడటం.
పౌరులందరికీ ఒకే విధమైన శిక్షాస్మృతిని (నిబంధన 44) రూపొందించడం, ఇతర బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేయడం ద్వారా సంక్షేమ రాజ్యం స్థాపించబడుతుంది. ఆదేశ సూత్రాలు భారత రాజ్యాంగానికి ప్రత్యేకతను, విశిష్టతను కలిగిస్తున్నాయి. పాశ్చాత్య దేశాల రాజ్యాంగాల రాజకీయ సిద్ధాంతాల ప్రభావం ఆదేశ సూత్రాల్లో ప్రతిబింబిస్తుంది. బ్రిటన్‌లో విస్తృత ప్రచారం పొందిన ఫెబియన్ సోషలిజం ముద్ర ఆదేశ సూత్రాల మీద ఎక్కువగా కనబడుతుంది. ఐర్లాండ్ రాజ్యాంగం నమూనాలో భారత రాజ్యాంగం ఆదేశ సూత్రాలను చేర్చింది.
ఐర్లాండ్ రాజ్యాంగంలో సాంఘిక విధాన ఆదేశ సూత్రాలు (Directive prinicples of social policy) మన రాజ్యాంగంలో రాజ్య విధాన ఆదేశ సూత్రాల (Directive principles of state policy) రూపంలో చేర్చారు. అయితే ఇది పూర్తి అనుకరణం మాత్రం కాదు. ఆదేశ సూత్రాల్లో అత్యధికం భారత సాంఘిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితుల ఆధారంగా రూపొందించినవే గ్రామపంచాయతీలు. కుటీర పరిశ్రమలు, మద్యపాన నిషేధం, బలహీన వర్గాలకు సంబంధించిన ఆదేశ సూత్రాలు పూర్తిగా స్వదేశీయం, ప్రజా సంక్షేమ సాధనకు అవసరమైన సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని చేకూర్చే సమాజాన్ని స్థాపించడమే ఆదేశ సూత్రాల అంతిమ లక్ష్యం.
సామాజిక విధానాల అవసరం?
-పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజా ప్రభుత్వం ఆయా సామాజిక వర్గాల సంక్షేమం, అభివృద్ధి, అభ్యున్నతికి అవసరమైన సామాజిక విధానాలను రాజ్యాంగ పరిధికి లోబడి రూపొందింస్తుంది. భారతదేశం కూడా ఈ విధానాన్ని అనుసరిస్తుంది. భారతదేశ సామాజిక పరిణామక్రమంలో వర్ణవ్యవస్థ క్రమంగా కులవ్యవస్థగా రూపాంతరం చెందింది. ప్రస్తుతం కుల ప్రాతిపదికనే సామాజిక జీవనం కొనసాగుతుంది. సామాజిక, ఆర్థిక, రాజకీయ సాంస్కృతిక ప్రక్రియలన్నింటిలో కుల ప్రస్తావన స్పష్టంగా కన్పిస్తుంది. ప్రాంతీయ, ఆర్థిక, సామాజిక అసమానతలను తొలగించి సామ్యవాద తరహా సమసమాజాన్ని (Egaliterian) స్థాపించే మహోన్నత లక్ష్యంతో స్వాతంత్య్రానంతరం పంచవర్ష ప్రణాళికలను రూపొందించారు. వీటి ద్వారా కిందిస్థాయిలో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి వివిధ కార్యక్రమాల సహాయంతో కృషిచేస్తున్నారు. 1952 మొదలు నేటివరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వందలాది సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను బలహీనవర్గాల కోసం రూపొందించి అమలుపరుస్తున్నాయి. సార్వత్రిక ప్రాథమిక విద్యకోసం సర్వశిక్ష అభియాన్, అందరికీ ఆరోగ్యం కోసం జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్, జాతీయ పట్టణ ఆరోగ్య మిషన్,
అందరికీ ఆవాసం కోసం ఇందిరా ఆవాస్ యోజన, రాజీవ్ ఆవాస్ యోజన, పేదరికం, నిరుద్యోగం నిర్మూలన కోసం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కార్యక్రమం వంటి వాటిని భారత సామాజిక విధానాలకు ప్రధాన ఉదాహరణలుగా పేర్కొనవచ్చు. సామాజిక విధానాల రూపకల్పన అనేది ప్రభుత్వ సామాజిక బాధ్యతలను తెలుపుతుంది. ఆరోగ్యవంతమైన, ఆనందమైన సమాజాన్ని నిర్మించడమే సామాజిక విధానాల అంతిమ లక్ష్యం. ఆధునిక రాజ్యాల్లో ఆర్థికవృద్ధి కంటే సామాజిక వికాసానికి, మానవాభివృద్ధికి అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. కాబట్టి భారత్‌తో సహా ప్రపంచంలోని అనేక దేశాలు సామాజిక విధానాలకు పెద్దపీట వేస్తున్నాయి.
-సమాజంలోని మానవ వనరులు, దేశాభివృద్ధికి ప్రధాన ఆధారంగా ఉపయోగపడుతాయన్న సత్యాన్ని జపాన్, సింగపూర్, ఫిన్లాండ్, ఐర్లాండ్, డెన్మార్క్ లాంటి దేశాలు నిరూపించాయి. భౌతిక వనరులను వినియోగించేకొద్దీ వాటి పరిమాణం తగ్గిపోతుంది. భవిష్యత్‌లో వాటి కొరత ఏర్పడుతుంది. కానీ మానవ వనరులను ఉపయోగించేకొద్దీ వాటి విలువ పెరుగుతూనే ఉంటుంది. దీంతో పటిష్టమైన, ప్రణాళికబద్దమైన సామాజిక విధానాలను అవలంబించగలిగితే అధిక జనాభా కూడా మానవ వనరుల రూపంలో దేశాభివృద్ధికి క్రియాశీల సాధనంగా ఉపయోగపడుతుంది.
ప్రజాస్వామ్యంలో ప్రజలే పాలకులు/ప్రభుత్వం కాబట్టి ప్రభుత్వ విధానాల్లో మొదటి ప్రాధాన్యత సామాజిక విధానాలకే ఉంటుంది. భారతదేశంలో అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వ విధానాల్లో వీటికి అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు స్పష్టంగా కనపడుతుంది. ఆమ్ ఆద్మీ బీమా యోజన మొదలు కల్యాణలక్ష్మి వరకు ఏ పథకాన్ని పరిశీలించినా అందులో సామాజిక విధానం కనపడుతుంది. సామాజిక, ఆర్థిక అసమానతల తొలగింపు, పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పనతో సహా సామాజిక భద్రతా కార్యక్రమాలన్నింటి సమాహారమే సామాజిక విధానం.
సంక్షేమంతోనే వికాసం
-20వ శతాబ్దంలో యూరప్‌లో సంభవించిన పారిశ్రామిక విప్లవం, అమెరికాలో సంభవించిన మహా ఆర్థిక మాంద్యం ఫలితంగా దేశ ఆర్థిక వ్యవహారాల్లో రాజ్యం ఒక బలమైన శక్తిగా అవతరించింది. రాజ్యం ఆర్థిక లక్ష్యాలతో పాటు సామాజిక న్యాయం, సమానత్వం వంటి సామాజిక లక్ష్యాలను సాధించే సాధనంగా అవతరించింది. ముఖ్యంగా రెండో ప్రపంచ యుద్ధానంతర కాలంలో రాజ్యం తన ఆర్థిక సామాజిక అభివృద్ధి లక్ష్యాల సాధనకుగాను చేపట్టాల్సిన కార్యక్రమాల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఈ పరిణామాల అంతిమ ఫలితమే సంక్షేమ రాజ్య అవతరణ. ఈ విధంగా అవతరించిన సంక్షేమ రాజ్యం (Welfare state) సుస్థిరమైన అభివృద్ధిని సాధించడంతో పాటు పెట్టుబడిదారీ వ్యవస్థ, ఉదార, ప్రజాస్వామ్యం వంటి లక్ష్యాలను సాధించడం కూడా ఒక ప్రాధాన్యతగా భావించాల్సి వచ్చింది.
-సంక్షేమ రాజ్య అవతరణ ప్రభుత్వ వ్యవస్థపై ప్రగాఢమైన ప్రభావాన్ని చూపింది. సంక్షేమ రాజ్యంలోని ప్రభుత్వం పారిశ్రామిక, వాణిజ్యం, ఆర్థిక, విత్త, ప్రజారోగ్యం, సామాజిక భద్రత, విద్య వంటి సంక్షేమ రంగాల్లో అనేక కార్యక్రమాలను చేపట్టడం తప్పనిసరి అయింది. యూరప్ దేశాల్లో ఉదయించిన సంక్షేమ రాజ్య భావన క్రమంగా ప్రపంచం మొత్తం వ్యాపిం చిం ది. 1950వ దశాబ్దిలో ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా ప్రాంతాల్లో ఉద్భవించిన భారత్ లాంటి తృతీయ ప్రపంచ దేశాల్లో అత్యధిక శాతం సంక్షేమ రాజ్యాన్ని నిర్మించుకున్నాయి.
భారతదేశంలో సంక్షేమ విధానం
-భారతదేశంలో సంక్షేమ విధానాలు, పథకాలు, ఇతర కార్యక్రమాల రూపకల్పన, వాటి అమలుకు ప్రత్యేక పాలనా యంత్రాంగం ఉంది. సమాజంలోని వివిధ పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి అవసరమైన వాటిని రూపొందించి అమలుచేయడమనేది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత. కాబట్టి ప్రతిస్థాయిలో ప్రత్యేకమైన పాలనా యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు. కేంద్ర, రాష్ట్ర స్థాయిలో ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖలు, బోర్డులు, కమిషన్లు, కార్పొరేషన్లు, డిపార్ట్మెంట్లు, ఏజెన్సీలను ఏర్పాటుచేశారు.
సంక్షేమ రంగం – ముఖ్యాంశాలు
-దేశంలో 1985లో కేంద్ర ప్రభుత్వం సంక్షేమ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది.
-1988లో సంక్షేమ మంత్రిత్వ శాఖ పేరును సామాజిక న్యాయం, సాధికారిత మంత్రిత్వశాఖగా (Social Jusitce and Empoverment) మార్చారు.
-రాజ్యాంగంలోని 338వ నిబంధన ప్రకారం షెడ్యూల్డ్ కులాల, షెడ్యూల్డ్ తెగల ప్రయోజనాలను కాపాడటానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించే అధికారం భారత రాష్ట్రపతికి ఉంది.
-రాష్ట్రపతి మొదటిసారిగా 1951లో షెడ్యూల్డ్ కులాల, షెడ్యూల్డ్ తెగల కమిషనర్ అనే అధికారిని నియమించాడు.
-1978లో భారత ప్రభుత్వం ఒక తీర్మానం ద్వారా కమిషనర్ స్థానంలో షెడ్యూల్డ్ కులాల, షెడ్యూల్డ్ తెగల కమిషన్‌ను ఏర్పాటు చేసింది.
-1987 సెప్టెంబర్‌లో జాతీయ షెడ్యూల్ ్డ కులాల, షెడ్యూల్డ్ తెగల కమిషన్‌గా పేరు మార్చారు.
-65వ రాజ్యాంగ సవరణ చట్టం(1990) ద్వారా షెడ్యూల్డ్ కులాల, తెగల కమిషనర్ విధులను జాతీయ కమిషన్‌కు బదిలీ చేశారు.
-89వ రాజ్యాంగ సవరణ చట్టం(2004) ప్రకారం షెడ్యూల్డ్ కులాలకు, తెగలకు వేర్వేరు కమిషన్లు ఏర్పడ్డాయి.
N-Venkat-భారత ప్రభుత్వం 1989లో ప్రభుత్వ కంపెనీల చట్టం 1952 సెక్షన్ 25 ప్రకారం జాతీయ షెడ్యూల్డ్ కులాల, తెగల ఆర్థిక అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేసింది.
-2010లో భారత ప్రభుత్వం చేసిన ప్రకటన ద్వారా షెడ్యూల్డ్ కులాలు, తెగలకు వేర్వేరు ఆర్థిక అభివృద్ధి సంస్థలను ఏర్పాటు చేసింది.
-షెడ్యూల్డ్ కులాల, తెగల సంక్షేమం కోసం 1986లో ఒక పార్లమెంటరీ కమిటీని నియమించారు. ఇది 1978లో ఒక సంవత్సర పదవీకాలంతో స్థాయీ సంఘంగా (standing commitee) ఏర్పాటయింది.
-ఈ కమిటీలో 30 మంది సభ్యులుంటారు (లోక్‌సభ : 20, రాజ్యసభ : 10)
-ఈ కమిటీ షెడ్యూల్డ్ కులాలు, తెగలకు రాజ్యాంగంలో పొందుపర్చిన రక్షణలను పరిశీలించి వాటి అమలుకు సంబంధించిన విషయాలపై తగిన సిఫార్సులు చేస్తుంది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు