అధికార భాషలు – కొన్ని విశేషాలు
రాజ్యాంగంలోని 17వ భాగంలో 343 నుంచి 351 వరకు గల ప్రకరణలు అధికార భాషల గురించి తెలియజేస్తున్నాయి. వీటికి సంబంధించిన ప్రొవిజన్లు నాలుగు భాగాలు ఉన్నాయి. అవి కేంద్ర అధికార భాష, ప్రాంతీయ భాషలు, న్యాయ, చట్ట సంబంధమైన భాష, ప్రత్యేక ఆదేశాలు.
కేంద్రం భాష
కేంద్ర అధికార భాషకు సంబంధించి రాజ్యాంగంలో కింది ప్రొవిజన్లు చేర్చారు.
1. దేవనాగరి లిపిలో రాసిన హిందీ భాషే కేంద్ర అధికార భాష. కేంద్రంలో అధికార అవసరాలకు వాడే అంకెల మాత్రం అంతర్జాతీయంగా వాడుకలో ఉన్న భారతీయ అంకెలు. కానీ దేవనాగరి లిపి అంకెలు వాడరు.
2. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుంచి 15 ఏండ్లు (1950 నుంచి 1965 వరకు) కేంద్రంలో అన్ని అధికారిక అవసరాలకు ఇంగ్లిష్ భాషనే ఉపయోగించాలి.
3. 15 ఏండ్ల తర్వాత నిర్దిష్ట అవసరాలకు ఇంగ్లిష్ భాషను కొనసాగించడానికి పార్లమెంటు అవకాశం కల్పించవచ్చు.
4. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన ఐదేండ్లకు మళ్లీ పదేండ్ల చివర, హిందీ భాష వినియోగం పెంపు, ఇంగ్లిష్ వినియోగంపై ఆంక్షలు, ఇంకా ఇతర సంబంధిత విషయాలపై సిఫారసులు చేయడానికి రాష్ట్రపతి ఒక కమిషన్‌ను ఏర్పాటుచేయాలి.
5. ఈ కమిషన్ సిఫారసులను పరిశీలించి అభిప్రాయాలను రాష్ట్రపతికి నివేదించేందుకు ఒక పార్లమెంటరీ కమిటీని ఏర్పాటుచేయాలి. దీనికి అనుగుణంగా 1955లో రాష్ట్రపతి బీజీ ఖేర్ అధ్యక్షతన అధికార భాషా కమిషన్‌ను ఏర్పాటుచేసింది. ఈ కమిషన్ తన నివేదికను 1956లో రాష్ట్రపతికి సమర్పించింది. ఈ నివేదికను గోవింద్ వల్లభ్ పంత్ అధ్యక్షతన 1957లో ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ పరిశీలించింది. అయితే రాజ్యాంగం ఆదేశించిన విధంగా తర్వాత 1960లో మరో అధికార భాష కమిషన్ ఏర్పాటు కాలేదు. తర్వాత 1963లో పార్లమెంటు అధికార భాషా చట్టాన్ని చేసింది. ఈ చట్టం ప్రకారం హిందీతో పాటు ఇంగ్లిష్ భాష వినియోగం (1965 తర్వాత) కూడా కొనసాగుతుంది. కేంద్రంలో అన్ని అధికారిక అవసరాలకు, పార్లమెంట్‌లోనూ హిందీతోపాటు ఇంగ్లిష్ భాష కొనసాగుతుంది. ఈ చట్టంలో ఇంగ్లిష్ భాషను (కాలపరిమితి లేకుండా) వినియోగించడానికి వీలైంది. ఇంకా కొన్ని సందర్భాల్లో హిందీతో పాటు ఇంగ్లిష్‌ను తప్పనిసరిగా వినియోగించేందుకు ఈ చట్టానికి 1967లో తగిన సవరణ కూడా చేశారు.
ప్రాంతీయ భాషలు
రాజ్యాంగం వివిధ రాష్ర్టాల అధికార భాషలను ప్రత్యేకించి నిర్దేశించలేదు. ఈ విషయంలో కింది కొన్ని నిబంధనలు చేసింది.
1. రాష్ట్ర శాసనసభలు ఆ రాష్ట్రంలో మాట్లాడే భాషల్లో ఒక భాషను లేదా కొన్ని భాషలను లేదా హిందీని అధికార భాషగా ప్రకటించవచ్చు. ఈలోపు ఇంగ్లిష్ ఆ రాష్ట్ర అధికార భాషగా కొనసాగుతుంది. ఈ ప్రొవిజన్ ప్రకారం చాలా రాష్ర్టాలు అక్కడి ప్రధాన ప్రాంతీయ భాషను తమ అధికార భాషగా ప్రకటించుకున్నాయి. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ తెలుగును, కేరళ మలయాళాన్ని, అసోం రాష్ట్రం అస్సామీని, పశ్చిమ బెంగాల్ బెంగాలీని, ఒడిశా ఒడియాను అధికార భాషలుగా చేసుకున్నాయి. తొమ్మిది ఉత్తరాది రాష్ర్టాలైన హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, బీహార్, జార్ఖండ్, హర్యానా, రాజస్థాన్‌లు హిందీని తమ అధికార భాషగా ప్రకటించాయి. ఇక గుజరాత్ రాష్ట్రం గుజరాతితోపాటు హిందీని, గోవా కొంకణి భాషతోపాటు మరాఠీని, కశ్మీర్ ఉర్దూని తమ అధికార భాషలుగా గుర్తించాయి. ఈశాన్య రాష్ర్టాలైన మేఘాలయ, అరుణాచల్‌ప్రదేశ్, నాగాలాండ్‌లు ఇంగ్లిష్‌ను తమ అధికార భాషగా ప్రకటించాయి. రాజ్యాంగం 8వ షెడ్యూల్లో గుర్తించిన అధికార భాషల నుంచే కాక ఇతర భాషలను కూడా రాష్ర్టాలు తమ అధికార భాషగా ఎంపిక చేసుకోవడం విశేషం.
2. ప్రస్తుతానికి కేంద్ర అధికార భాషే (ఇంగ్లిష్) రాష్ర్టానికి, కేంద్రానికి, రాష్ర్టాల మధ్య అనుసంధాన భాషగా కొనసాగుతుంది. కానీ రెండు లేదా మూడు రాష్ర్టాలు ఇంగ్లిష్ బదులు హిందీని తమ అనుసంధాన భాషగా వినియోగించుకోవడానికి అంగీకరించాయి. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్లు ఇటువంటి ఒప్పందం కుదుర్చుకున్న రాష్ర్టాల్లో ఉన్నాయి. అధికారభాషా చట్టం (1963) ప్రకారం హిందీ అధికార భాషగాలేని రాష్ర్టాలు కేంద్రంతో తమ ఉత్తరప్రత్యుత్తరాలను నడపటానికి ఇంగ్లిష్ భాషను ఉపయోగించుకోవాలి. అలాగే హిందీ, హిందీయేతర రాష్ర్టాలు తమ మధ్య ఉత్తరప్రత్యుత్తరాలకు హిందీ వినియోగంతో పాటు ఇంగ్లిష్ అనువాదాన్ని కూడా అందించాలి.
3. ఏదైనా రాష్ట్రంలో గణనీయ సంఖ్యలో ఒక భాషను మాట్లాడే ప్రజలు ఆ భాషను తమ రాష్ట్ర అధికార భాషగా చేయాలనే డిమాండ్ చేసిన సందర్భంలో రాష్ట్రపతి సంతృప్తి చెందితే, ఆ భాషను కూడా సంబంధిత రాష్ట్రం అధికార భాషగా గుర్తించాలని ఆదేశాలు జారీ చేయవచ్చు. రాష్ర్టాల్లో మైనార్టీల భాషాప్రయోజనాలను కాపాడటం ఈ ప్రొవిజన్ ఉద్దేశం.
న్యాయ వ్యవస్థ, శాసనాల భాష
కోర్టుల్లోనూ, శాసన ప్రక్రియల్లోనూ ఉపయోగించే భాషకు సంబంధించి రాజ్యాంగం కింది నిబంధనల్లో వివరించింది.
1. పార్లమెంట్ చట్టం చేసే వరకు కింది అంశాల్లో ఇంగ్లిష్ భాషనే ఉపయోగించాలి.
ఎ. సుప్రీంకోర్టు, అలాగే ప్రతి హైకోర్టులో జరిగే న్యాయ ప్రక్రియ
బి. కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో అన్ని అధికారిక పత్రాలు, బిల్లులు, చట్టాలు, ఆర్డినెన్స్‌లు, ఆదేశాలు, నియమాలు, నియంత్రణలు, ఉప నియమాలు తయారీ.
2. రాష్ట్ర హైకోర్టులో న్యాయ ప్రక్రియకు హిందీ లేదా మరేదైనా అధికార భాషను ఉపయోగించడానికి రాష్ట్రపతి ముందస్తు అనుమతిని గవర్నర్ కోరవచ్చు. అయితే హైకోర్టులు వెలువరించే తీర్పులు, డిక్రీలు ఆదేశాలు మాత్రం ఇంగ్లిష్‌లోనే ఉండాలి.
3. రాష్ట్రంలో పాలనా వ్యవహారాలకు సంబంధించి అంటే అన్ని అధికారిక పత్రాలు, బిల్లులు, చట్టాలు, ఆర్డినెన్స్‌లు, దేశాలు, నియమాలు, నియంత్రణలు, ఉప నియమాల తయారీకి ఏదైనా భాషను (ఇంగ్లిష్ తప్ప) ఉపయోగించుకునే అధికారం రాష్ట్ర శాసనసభలకు ఉంటుంది. అయితే వీటికి ఇంగ్లిష్ అనువాదం ప్రతిని జతచేయాలి.
-అధికార భాషా చట్టం, 1963 ప్రకారం రాష్ట్రపతి ఆధ్వర్యంలో జారీ అయ్యే చట్టాలు, ఆర్డినెన్స్‌లు, ఆదేశాలు, నియంత్రణలు, ఉప చట్టాల హిందీ అనువాదాలు అధికారికమైనవిగా భావించాలి. పార్లమెంట్లో ప్రవేశపెట్టే ప్రతి బిల్లుకు హిందీ అనువాదాన్ని జత చేయాలి. అలాగే కొన్ని కేసుల్లో రాష్ట్ర చట్టాలకు లేదా ఆర్డినెన్స్‌లకు హిందీ అనువాదాలు ఉండాలి. రాష్ట్రపతి ముందస్తు అనుమతితో గవర్నర్ తమ రాష్ట్రంలో హైకోర్టు హిందీ లేదా మరే ఇతర అధికార భాషలోనైనా తీర్పులు, డిక్రీలు, ఆదేశాలు ఇచ్చేందుకు అనుమతి ఇవ్వవచ్చు. అయితే వీటన్నింటికీ ఇంగ్లిష్ అనువాదాన్ని జత చేయాలి. 1971లో ఒక ఫిర్యాది తన హెబియస్ కార్పస్ పిటిషన్‌ను హిందీలో వాదించడానికి ప్రయత్నించినప్పుడు సుప్రీంకోర్టు కోర్టు భాష ఇంగ్లిష్ అయినందున, హిందీలో వాదనలను అనుమతించడం రాజ్యాంగ విరుద్ధం అని చెబుతూ అతని పిటిషన్‌ను రద్దు చేసింది.
ప్రత్యేక ఆదేశాలు
-భాషాపరమైన అల్ప సంఖ్యాక వర్గాల ప్రయోజనాలు కాపాడేందుకు హిందీ భాషను అభివృద్ధి చేసేందుకు రాజ్యాంగం కొన్ని ప్రత్యేక ఆదేశాలను ఇచ్చింది. అవి
భాషాపరమైన అల్ప సంఖ్యాక వర్గాల రక్షణ
-దీనికి సంబంధించి రాజ్యాంగం కొన్ని నిబంధనలు చేసింది.
1. ఫిర్యాదుదారుడు తన సమస్యకు సంబంధించి ఫిర్యాదును లేదా వినతిపత్రాన్ని రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వాలు ఉపయోగించే ఏ భాషలోనైనా సంబంధిత రాష్ట్ర అధికారులకు పంపవచ్చు. సదరు విజ్ఞాపన అధికార భాషలో లేదన్న కారణంగా తిరస్కరించడానికి వీలులేదు.
2. భాషాపరమైన అల్ప సంఖ్యాక వర్గాలకు చెందిన పిల్లలకు ప్రాథమిక విద్యాస్థాయిలో వారి మాతృభాషలోనే బోధన సాగే విధంగా సదరు రాష్ట్ర ప్రభుత్వం లేదా స్థానిక ప్రభుత్వాలు తగిన వసతుల ఏర్పాట్లు చేయాలి. ఈ విషయంలో రాష్ట్రపతి తగిన ఆదేశాలు జారీ చేయవచ్చు.
3. భాషాపరమైన అల్పసంఖ్యాక వర్గాలకు రాజ్యాంగం కల్పించిన రక్షణలకు సంబంధించి అన్ని అంశాలపై దర్యాప్తు జరిపేందుకు రాష్ట్రపతి ఒక ప్రత్యేకాధికారిని నియమిస్తాడు. ఈ అధికారులు సమర్పించిన నివేదికలను రాష్ట్రపతి పార్లమెంట్ ఎదుట ఉంచుతారు. సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలకు పంపిస్తాడు.
హిందీ భాష అభివృద్ధి
-భిన్న సంస్కృతులకు నిలయమైన భారతదేశంలో ఒక ఉమ్మడి అనుసంధాన భాషగా హిందీని అభివృద్ధి చేసి, విస్తృతపరిచే బాధ్యతను రాజ్యాంగం కేంద్రంపై పెట్టింది. హిందుస్థానీలోనూ, ఇతర భాషల్లోను (8వ షెడ్యూల్లో గుర్తించిన భాషలు) ఉన్న భావ ప్రకటన పద్ధతులను, నుడికారాలను, శైలిని సమ్మిళితం చేసి పదజాలం సృష్టించడం ద్వారా హిందీ భాషను సుసంపన్న చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా రాజ్యాంగం కేంద్రానికి సూచించింది. ప్రస్తుతం (2013) రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో 22 భాషల (ముందుగా ఇవి 14 భాషలు)ను చేర్చారు. అవి అస్సామీ, బెంగాలీ, బోడో, డోగ్రీ (డోంగ్రీ), గుజరాతీ, హిందీ, కన్నడ, కాశ్మీరీ, కొంకణి, మాథిలీ (మైథిలీ), మళయాళం, మణిపురి, మరాఠీ, నేపాలీ, ఒడియా, పంజాబీ, సంస్కృతం, సంతాలి, సింధి, తమిళం, తెలుగు, ఉర్దూ. 21వ రాజ్యాంగ సవరణ చట్టం, 1992 ద్వారా కొంకణి, మణిపురి, నేపాలి భాషలను, 92వ రాజ్యాంగ సవరణ చట్టం 2003 ద్వారా బోడో, డోంగ్రీ, మాథిలి, సంతాలి, భాషలను 8వ షెడ్యూల్లో చేర్చారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు