జంతుహింస నిషేధం చట్టాలు ఏం చెప్తున్నాయి!
తమిళనాడులో జల్లికట్టు క్రీడను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ మొదలైన ఉద్యమం తీవ్రస్థాయికి చేరటం ఇటీవల అందరి దృష్టిని ఆకర్శించింది. తమిళప్రజల సంస్కృతిలో భాగమైన ఈ క్రీడలో ఎద్దులను హింసిస్తున్నారని పేర్కొంటూ సుప్రీంకోర్టు దానిని నిషేధించటంతో తమిళులు ఉద్యమిస్తున్నారు. అయితే, దేశంలో జంతు, వన్యప్రాణి సంరక్షణ చట్టాల ప్రకారం జల్లికట్టును మాత్రమే కాకుండా ఆంధ్రాలో కోడిపందేలు, కర్ణాటకలో దున్నల పరుగు పందేలు (కంబళ) తదితర క్రీడలను కూడా నిషేధించాయి. జల్లికట్టు పోరాటంతో ఇప్పుడు ఇతర ప్రాంతాల్లో కూడా తమ సంప్రదాయక్రీడలను పునరుద్ధరించాలనే ఆందోళనలు ఊపందుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో జంతు, వన్యప్రాణి హింస నిరోధక, నిషేధ చట్టాలు ఏం చెప్తున్నాయనే అంశాలు నిపుణ పాఠకుల కోసం..
జల్లికట్టు ఉద్యమం దేశంలో జంతు ప్రేమికులకు, సంప్రదాయాలే ప్రాణంగా భావించేవారికి మధ్య వివాదంగా మారింది. జల్లికట్టు నిషేధానికి కారణమైన అంతర్జాతీయ జంతు సంరక్షణ సంస్థ పెటాను నిషేధిస్తామంటూ తమిళనాడులోని అధికార పార్టీ ప్రకటించటంతో ఈ అంశం చర్చకు దారితీసింది.
దేశంలోని ప్రతిపౌరుడు అన్ని ప్రాణులపట్ల జాలి, దయాగుణం కలిగి ఉండటం ప్రాథమిక విధి
భారత రాజ్యాంగం
- భారత్దేశం బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడే దేశంలో జంతు సంరక్షణకు చట్టాలు చేయడం మొదలైంది.
- మొదటిసారిగా దేశంలో జంతుహింసను నిరోధించేందుకు 1861లో కోల్‌కతాలో ఏర్పడిన సొసైటీ ఫర్ ది ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ యానిమల్స్ సంస్థకు బ్రిటిష్ ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది.
- ఈ సంస్థ ప్రోద్బలంతో మొదటిసారిగా 1876లో జంతుహింస నిరోధక చట్టాని చేశారు.
- 1945లో చేసిన డ్రగ్స్ అండ్ కాస్మొటిక్స్ చట్టంలో కూడా జంతువులపై హింసను నిరోధించే నిబంధనలు చేర్చారు.
- జంతుహింసను నిరోధించేందుకు 1960లో భారత ప్రభుత్వం అత్యంత కఠినమైన చట్టం చేసింది. పీసీఏ చట్టం 1960గా పిలుస్తున్న ఈ చట్టం ప్రకారం జంతువులు, వన్యప్రాణులను హింసించడం, చంపడం నేరం.
- ఈ చట్టాన్ని అనుసరించి దేశంలో జంతు సంరక్షణ బోర్డును కూడా ఏర్పాటుచేశారు.
- 1972లో వన్యప్రాణి సంరక్షణ చట్టం రూపొందించారు.
- 1998లో జంతు సంతానోత్పత్తి ప్రయోగాలపై ప్రత్యేక నిబంధనలు రూపొందించారు.
- వైద్య విద్య బోధనలో బతికి ఉన్న జంతువులను ఉపయోగించటాన్ని 2013లో ప్రభుత్వం నిషేధించింది.
- ఈ సంవత్సరంలోనే డాల్ఫిన్లను వినోదంకోసం వాడటాన్ని నిషేధించారు.
- జంతువులపై సౌందర్యసాధనాలను పరీక్షించటాన్ని 2014లో నిషేధించారు. ఈ రకమైన చట్టం చేసిన మొదటి ఆసియాదేశం భారతే.
పీపుల్స్ ఫర్ ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్ (పెటా)
దీన్ని 1980లో అలెక్స్ పచేకో అనే వ్యక్తి అమెరికాలో ఏర్పాటు చేశారు. దీని ముఖ్య నినాదం Animals are not ours to eat, wear, experiment on, use for entertainment or abuse in an other way.
ఇది ప్రపంచ వ్యాప్తంగా జంతువులపై జరిగే హింసను వ్యతిరేకిస్తూ, జంతు సంరక్షణకు తగు ప్రోత్సాహం ఇస్తూ ఉన్న ఒక సంపన్న ప్రైవేటు సంస్థ.
జల్లికట్టుపై ఉన్న వివాదమేంటి?
-జల్లికట్టులో జంతువులను హింసిస్తున్నారని, వాటిని సరైన విధంగా చూసుకోవడం లేదని కొన్ని జంతు సంక్షేమ సంఘాలు జల్లికట్టును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. వాటిలో Peoples for Ethical Treatment of Animals (PETA), Federation of India Animal Protection Agencies (FIAPA) సంస్థలు 2004 నుంచి తీవ్రంగా అడ్డుకుంటున్నాయి.
వివాదం జరిగిన పరిణామాలు
1. 2008లో Animal welfare Board of India (AWBI) అనే సంస్థ జంతువులను హింసిస్తున్నారని, ప్రేక్షకులకు కూడా గాయాలవుతున్నాయనే కారాణాలతో జల్లికట్టును పూర్తిగా నిషేధించాలని సుప్రీంకోర్టు తలుపుతట్టింది.
2. 2009లో సుప్రీంకోర్టు జల్లికట్టును నిషేధించింది.
3. 2009లోనే తమిళనాడు ప్రభుత్వం ఒక చట్టం చేసింది. జల్లికట్టును నిర్వహించాలి.
4. దీన్ని దృష్టిలో ఉంచుకొని 2010 నవంబర్ 27న సుప్రీంకోర్టు కొన్ని నియమాలు, సూచనలతో జల్లికట్టును నిర్వహించుకోవచ్చని ఆదేశాలిచ్చింది. ఏడాదిలో ఐదు నెలలు జల్లికట్టును జరుపుకోవచ్చని, దీన్ని జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో, AWBI ప్రతినిధుల సమక్షంలో జరగాలని నియమాలు పెట్టింది.
పర్యావరణ మంత్రిత్వశాఖ కొత్త తిరకాసు
-జంతువులకు శిక్షణ (కోతులు, ఎలుగుబంట్లు, పులులు, తదితర) ఇచ్చి వాటితో ప్రదర్శనలు ఇవ్వడాన్ని కేంద్ర ప్రభుత్వం 1991లో నిషేధించింది. ఈ జాబితాలో 2011లో పర్యావరణ మంత్రిత్వ శాఖ ఎద్దును కూడా చేర్చింది. కాబట్టి ఎద్దులతో కూడా ప్రదర్శనలు ఇవ్వద్దని ఆదేశాలివ్వాల్సిన అవసరం వచ్చింది. కానీ 2009లో తమిళనాడు ప్రభుత్వం చేసిన జల్లికట్టు చట్టం వల్ల జల్లికట్టును అలాగే కొనసాగించారు తమిళులు. ఆ సందర్భంలో 2010 నుంచి 2014 మధ్యలో దాదాపు 17 మంది చనిపోయారు, 1000కిపైగా తీవ్రంగా గాయపడ్డారు.
సుప్రీంకోర్టు-జల్లికట్టు
-పై పరిణామాలన్నింటిపై 2014 మేలో AWBI అనే సంస్థ సుప్రీంకోర్టు తలుపుతట్టింది. 2014లోనే జల్లికట్టును పూర్తిగా నిషేధిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
సుప్రీంకోర్టు ప్రకారం: జల్లికట్టు అనే క్రీడ Prevention of Cruelty of Animal Act (PCA)-1960ని బేఖాతర్ చేస్తుందని, ఈ చట్టానికి వ్యతిరేకంగా జల్లికట్టు జరుగుతుందని, పౌరుల ప్రాథమిక విధుల్లో భాగమైన ఆర్టికల్ 51(g) ప్రకారం జంతువులను ప్రేమతో, దయతో చూడాలని, అదేవిధంగా అధికరణ 21 (జీవించే హక్కు) ప్రకారం వాతావరణాన్ని భంగపరచడం (అంటే వాతావరణంలో జంతువులు కూడా భాగమే కాబట్టి) మానవ సమాజానికి అత్యంత అవసరమైన వాటిని భంగపరచడం తగదనీ, ఒకవేళ అలా చేస్తే అది ఆర్టికల్ 21ని పాటించకపోవడమే అని సుప్రీంకోర్టు పేర్కొంది.
సుప్రీంకోర్టు ఆదేశాలు
-తమిళనాడులో, మహారాష్ట్రలో గానీ, మరే ఇతర ప్రాంతంలో గానీ జంతువులను జల్లికట్టుకు వినియోగించడం, ఇతర క్రీడలకు ఉపయోగిచడం పూర్తిగా నిషేధమని పేర్కొంది.
సుప్రీంకోర్టు గుర్తించిన జంతు స్వేచ్ఛలు
1. ఆకలి నుంచి స్వేచ్ఛ (Freedom Hunger)
2. భయం, దుఃఖం నుంచి స్వేచ్ఛ (Freedom from Fear and Distress)
3. భౌతిక అసౌకర్యం నుంచి స్వేచ్ఛ (Freedom from Physical and Thermal discomfort)
4. బాధ, గాయం, రోగం నుంచి స్వేచ్ఛ (Freedom from Pain, Injury and Disease)
5. సాధారణ జీవనాన్ని గడిపే స్వేచ్ఛ (Freedom to Express Normal Pattern of Behaviour)
-AWBI సంస్థ సమర్పించిన, పోటీలు, వీడియోలు మొదలైన సాక్ష్యాలు మహారాష్ట్రలో జరిగే ఎద్దుల పందాలు, తమిళనాడులో జరిగే జల్లికట్టుపై స్వేచ్ఛలను తీవ్రంగా హరిస్తున్నాయని పేర్కొంది.
-AWBI ప్రకారం జల్లికట్టుకు సంబంధించి ఎలాంటి చారిత్రాత్మక, సాంప్రదాయ, మతపరమైన గుర్తింపు ఏమీ లేదని, ఇది సనాతన సాంప్రదాయం ఏమాత్రం కాదని పేర్కొంది. ఇది పీసీఏ-1960ని ఉల్లంఘించడమే అని వ్యాఖ్యానించింది.
-PETA (పెటా) ప్రకారం ఎద్దులను తీవ్రంగా కొట్టడం, వాటి తోకలను కాల్చడం, రకరకాలుగా హింసతో వాటిని రెచ్చగొట్టడం మొదలైనవన్నీ చేస్తున్నారని పేర్కొంది.
జంతుహింస నిరోధక చట్టం-1960
-పెంపుడు జంతువులను ఎక్కువ సమయం బంధించటం, వాటికి సరైన ఆహారం, నీరు సమయానికి ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తే ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ ఆఫ్ యానిమల్స్ (పీసీఏ) చట్టం 1960 సెక్షన్ 11 (1)(హెచ్) ప్రకారం యజమానికి జరిమానాతోపాటు మూడునెలల జైలుశిక్ష విధించవచ్చు.
-సెక్షన్ 11(1)(ఎం)(2), (ఎన్) ప్రకారం జంతువుల మధ్య ఎలాంటి పందేలు, కొట్లాట కార్యక్రమాలు నిర్వహించరాదు. అలా చేయటం తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు.
-సెక్షన్ 11(1)(ఐ),(జే) ప్రకారం ఏ కారణం చేతగానీ జంతువులను నిర్బంధించినవారికి మూడు నెలలవరకు జైలుశిక్ష విధించవచ్చు.
-సెక్షన్ 22 (2) ప్రకారం ఎలుగుబంట్లు, కోతులు, పులులు, చిరుతలు, సింహాలు, ఎద్దులకు బలవంతంగా శిక్షణ ఇవ్వటం, వినోద కార్యక్రమాలు, సర్కస్‌లలో ప్రదర్శించటం నేరం.
వన్యప్రాణి సంరక్షణ చట్టం-1972
-ఈ చట్టం ప్రకారం కోతులను వ్యక్తులు తమవెంట తిప్పుకోవటంగానీ, బలవంతంగా బంధించి ప్రదర్శించటంగానీ చేయకూడదు.
-సెక్షన్ 38 జే ప్రకారం జంతు ప్రదర్శనశాలల్లోని జంతువులను రెచ్చగొట్టడం, ఇబ్బందులకు గురిచేయటం నేరం. ఈ నేరం చేసినవారికి రూ. 25,000 వరకు జరిమానా, మూడేండ్ల వరకు జైలుశిక్ష విధించవచ్చు
-సెక్షన్ 9 ప్రకారం వన్యప్రాణులను బంధించటం, విషప్రయోగం చేయటం, అలా చేయటానికి ప్రయత్నించటం కూడా నేరం. ఈ నేరానికిగాను రూ. 25,000 వరకు జరిమానా, మూడేండ్లవరకు జైలు శిక్ష విధించవచ్చు.
-సెక్షన్ 9 ప్రకారం పక్షుల గూళ్లను చెదరగొట్టడం, వాటి గుడ్లను ధ్వంసం చేయటం, అలా చేయటానికి ప్రయత్నించటం కూడా నేరమే. అంతేకాకుండా పక్షి గూళ్లు ఉన్న చెట్ల కొమ్మలను నరకటం కూడా నేరం కిందికే వస్తుంది. ఈ నేరం చేసినవారికి రూ. 25,000వరకు జరిమానాతోపాటు ఏడేండ్ల వరకు జైలుశిక్ష విధించవచ్చు.
-జంతుహింస నిరోధక నియమాలు 2001లోని సెక్షన్ 11 (1)(డీ)తోపాటు మోటారు వాహనాల చట్టం 1978 ప్రకారం కూడా జంతువులను సౌకర్యంగాలేని వాహనాల్లో తరలించటం నేరం.
మరికొన్ని నిబంధనలు
1. రాజ్యాంగంలోని ఆర్టికల్ 51ఏ(జి) ప్రకారం దేశంలో ప్రతి ప్రాణిపట్ల దయ, సానుభూతి కలిగి ఉండాలి. ఇది ప్రతి భారతీయుడి ప్రాథమిక విధి.
2. ఇండియన్ పీనల్‌కోడ్ (ఐపీసీ) 428, 429 ప్రకారం జంతువులను చంపటం, హింసించటం శిక్షార్హమైన నేరం.
4. కోళ్లతోసహా ఏ జంవుతునైనా వధశాలలో కాకుండా బహిరంగ ప్రదేశాల్లో చంపకూడదు. వ్యాధిబారినపడిన, గర్భంతో ఉన్న జంతువులను వధశాలతోపాటు ఎక్కడా చంపకూడదు.
5. ఏబీసీ రూల్స్, 2001 ప్రకారం వీధికుక్కలకు సంతాన నిరోధ చర్యలు చేపట్టడంగానీ, ఇతర ప్రాంతాలకు బలవంతంగా తరలించటంగానీ చేయకూడదు.
9. కబేలా రూల్స్ 2001లోని రూల్ 3 ప్రకారం దేశంలో జంతువధ నిషేధం.
11. డ్రగ్స్ అండ్ కాస్మొటిక్స్ రూల్స్ 1945లోని 135(బి), 148(సి) ప్రకారం దేశంలో జంతువులపై సౌందర్య సాధనాలు పరీక్షించటం నిషేధం. విదేశాల్లో జంతువులపై పరీక్షించిన సౌందర్యసాధనాలను దిగుమతిచేసుకోవటం నిషేధం.
యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా
-1960లో వచ్చిన పీసీఏ చట్టం, సెక్షన్ 4కు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఏర్పర్చిన ఒక చట్టబద్ధ సలహా సంస్థ ఏడబ్ల్యూబీఐ.
-ఇది జంతు సంక్షేమ చట్టాలను రక్షిస్తూ, జంతు సంరక్షణకు సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలిస్తుంది.
-దీని ప్రధానకార్యాలయం చెన్నైలోని తిరువన్శ్రియార్లో ఉంది.
-ఇది 1990 వరకు ఆహార, వ్యవసాయ మంత్రిత్వ శాఖ పరిధిలో ఉండేది. 1990 నుంచి వాతావరణ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు