Challenging courses are a bit new | చాలెంజింగ్ కోర్సులు కొంచెం కొత్తగా..!
ఆధునిక కాలంలో విప్లవాత్మక మార్పులు సంతరించుకుంటున్న రంగాల్లో విద్యావిధానం ప్రముఖమైనది. సమాజ అవసరాలకు అనుగుణంగా విద్యావిధానంలో ఇప్పటికే అనేక మార్పులు వచ్చాయి. ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞాన విప్లవం తారాస్థాయికి చేరటంతో ఆ ప్రభావం విద్యపై బలంగా పడింది. దాంతో అనేక కొత్త కోర్సులు పుట్టుకొస్తున్నాయి. ఉపాధి అవకాశాలు కూడా వాటికే ఎక్కువగా ఉంటుండటంతో విద్యార్థులు వాటివైపు ఆకర్శితులవుతున్నారు. ప్రస్తుతం బాగా ఉద్యోగ డిమాండ్ ఉన్న కొత్త కోర్సులు, సమీప భవిష్యత్తులో డిమాండ్ సంతరించుకోనున్న కొన్ని కోర్సులపై నిపుణ పాఠకులకోసం ప్రత్యేకం..
మెకానికల్
-సమాంతరంగా ఉండే కోర్సులు: మెకానికల్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్, మెకానికల్ అండ్ ఆటోమేషన్ ఇంజినీరింగ్, మెకానికల్ అండ్ ప్రొడక్షన్ ఇంజినీరింగ్, మెకానికల్ ఆటోమొబైల్.
టూల్ ఇంజినీరింగ్ అంటే?
-ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్‌లో ఇదొక భాగం. రకరకాల టూల్స్, మెషీన్స్‌ను రూపొందించడం. తక్కువ ఖర్చు, సమయం, పనివారితో మెటీరియల్‌ను ఉత్పత్తి చేయడానికి కావాల్సిన యంత్రాలను తయారుచేయడం. దీనిలో జిగ్స్, ఫిక్సర్స్, ప్రెస్ టూల్స్, క్రియేటింగ్ డై కాస్టింగ్ డిజైన్స్, ప్లాస్టిక్ మౌల్డ్స్ డిజైన్ వంటి తయారీ ప్రధాన కర్తవ్యం.
-కోర్సులు: పదోతరగతి వారికి ఐటీఐ, ఇంటర్ ఎంపీసీ వారికి డిగ్రీ కోర్సులు. బీఈ/బీటెక్ వారికి ఎంఈ/ఎంటెక్ కోర్సులు ఉన్నాయి.
టూల్ ఇంజినీరింగ్ కాలేజీలు
-సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్- హైదరాబాద్
-గురు గోవింద్ సింగ్ ఇంద్రప్రస్థ యూనివర్సిటీ ఢిల్లీ- బీ వొకేషనల్ రిఫ్రిజిరేషన్ అండ్ కండిషనింగ్. ఇది మూడేండ్ల కోర్సు.
-విశ్వేశ్వరయ్య టెక్నాలజికల్ యూనివర్సిటీ, బెల్గావి – బీటెక్ టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్.
-ఇండో డానిష్ టూల్ రూం, ఈస్ట్ సింగ్భం- డిప్లొమా ఇన్ టూల్ అండ్ మేకింగ్. గవర్నమెంట్ టూల్ రూం అండ్ ట్రెయినింగ్ సెంటర్, బెంగళూరు, ఢిల్లీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ ఇంజినీరింగ్, ఢిల్లీ- బీఈ టూల్ ఇంజినీరింగ్.
-ఇండో జర్మన్ టూల్ రూం, ఔరంగాబాద్- డిప్లొమా ఇన్ టూల్ అండ్ డై మేకింగ్.
-ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్‌రూం ట్రెయినింగ్, లక్నో. ఐడీఈఎంఐ, ముంబై. ఎంఎస్ఎంఈ సీటీటీసీ, కోల్‌కతా. సీటీటీసీ, భువనేశ్వర్. కెల్ట్రాన్ టూల్‌రూం రిసెర్చ్ అండ్ ట్రెయినింగ్ సెంటర్, ఆరూర్.
కెరీర్ @ 2025
2025 నాటికి విస్తృత అవకాశాలు రావచ్చని నిపుణులు అంచనా వేస్తున్న రంగాలు ఇవే…
-రోబోటిక్స్, యాప్ డెవలప్మెంట్, బిల్డింగ్ ఆటోమేషన్, డాటా అనలిటిక్స్, వేస్ట్ మేనేజ్మెంట్, 3డీ ప్రింటింగ్, 3డీ యానిమేషన్, వర్చువల్ రియాలిటీ, డిజిటల్ మార్కెటింగ్, ఈ లెర్నింగ్, జెనిటిక్స్, హెల్త్‌కేర్ టెక్నాలజీ, జీఐఎస్, వెల్నెస్ మేనేజ్మెంట్, రిమోట్ సెన్సింగ్, రెన్యువబుల్ ఎనర్జీ, ఆర్గానిక్ అగ్రికల్చర్, అర్బన్ ప్లానింగ్, అర్బన్ ట్రాన్స్పోర్ట్.
ఫ్యాషన్ టెక్నాలజీ
-ప్రపంచంలో ఫ్యాషన్‌కు ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫ్యాషన్‌రంగంలో అపారమైన అవకాశాలు ఉన్నాయి. కావాల్సిందల్లా సృజనాత్మకత, విభిన్నత. కాబట్టి వైవిధ్యమైన ఫ్యాషన్‌కు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది.
-ముఖ్యంగా యాక్ససరీస్, దుస్తులు, కలర్ మిక్సింగ్, మార్కెటింగ్, గార్మెంట్స్, డిజైన్ కాన్సెప్ట్స్ వీటిలోకీలకమైనవి.
-ఫ్యాషన్ టెక్నాలజీకి సంబంధించి పలుకోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రధానంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్) అందించే కోర్సులు ప్రధానమైనవి.
-నిఫ్ట్‌లో బ్యాచిలర్ ఆఫ్ డిజైన్‌లో యాక్ససరీస్ డిజైన్, ఫ్యాషన్ డిజైన్, ఫ్యాషన్ కమ్యూనికేషన్, నిట్వేర్ డిజైన్, టెక్స్టైల్ డిజైన్ కోర్సులు ఉన్నాయి. వీటితోపాటు మాస్టర్ ఆఫ్ డిజైన్, మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ మేనేజ్మెంట్, మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సులు ఉన్నాయి.
-నిఫ్ట్‌కు హైదరాబాద్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, చెన్నై, గాంధీనగర్, జోధ్‌పూర్, కాంగ్రా, కన్నూర్, కోల్‌కతా, ముంబై, న్యూఢిల్లీ, పాట్నా, రాయ్‌బరేలి, షిల్లాంగ్, శ్రీనగర్‌లలో క్యాంపస్‌లు ఉన్నాయి.
-ఉపాధి అవకాశాలు: దేశంలో వ్యవసాయం తర్వాత ఎక్కువమందికి ఉపాధి కల్పించే రంగం టెక్స్టైల్. దేశ ఆర్థిక వ్యవస్థలో హ్యాండ్లూమ్ కీలకపాత్ర పోషిస్తుంది. కేవలం దుస్తులకు సంబంధించే కాకుండా ఈ రంగం అభివృద్ధి చెందడానికి కావల్సిన ఆధునిక యంత్రాల రూపకల్పన, మార్కెటింగ్, దీనికి సంబంధించిన డిజైన్‌లో కూడా విస్తృత అవకాశాలు ఉన్నాయి. ఫ్యాషన్‌కు అనుబంధ రంగాలైన లెదర్ టెక్నాలజీ, ఫుట్‌వేర్, ప్లాస్టిక్ తదితరాల్లో కూడా ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉంటాయి.
-ఫ్యాషన్ డిజైనింగ్‌లో ఇంటర్ తర్వాత ఏడాది డిప్లొమా కోర్సు. డిగ్రీ, పీజీ కోర్సులు ఉన్నాయి.
-ఫ్యాషన్ డిగ్రీ కోర్సులు: బీఏ (ఫ్యాషన్ బిజినెస్ మేనేజ్మెంట్), బీఏ (ఫ్యాషన్ డిజైన్ అండ్ టెక్నాలజీ, ఫ్యాషన్ డిజైన్, ఫ్యాషన్ టెక్నాలజీ), బీకాం (జ్యూయలరీ డిజైన్, టెక్నాలజీ), బి.డిజైన్ (యాక్ససరీ డిజైన్), వీటికి అదనంగా పీజీ డిప్లొమా, డిప్లొమా, సర్టిఫికెట్, ఐటీఐ సర్టిఫికెట్ కోర్సులు ఉన్నాయి.
కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ అండ్ రిసెర్చ్
-ప్రపంచంలో ఎవర్గ్రీన్ కెరీర్‌కు ఈ కోర్సు అని చెప్పవచ్చు. మానవజాతి మనుగడ ఉన్నంతవరకు ఈ కోర్సుకు అవకాశాలు ఉంటాయి. వేగంగా పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా, పలురకాల విపత్తులను తట్టుకొనే విధంగా, నిత్యనూతన శోభతో గృహాలు, పలు కట్టడాలు, నిర్మాణాలు చేపట్టాల్సిన అవసరం రోజురోజుకు పెరుగుతూనే ఉంది. బీఈ/బీటెక్‌లలో సివిల్ ఇంజినీరింగ్ చేసినవారే కాకుండా ఈ రంగానికి అనుబంధంగా మరెన్నో కొత్త రంగాలు వస్తున్నాయి. వీటిలో ముఖ్యంగా రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్, స్మార్ట్ సిటీ డెవలప్మెంట్ మేనేజ్మెంట్, క్వాంటిటీ సర్వేయింగ్, క్వాలిటీ కంట్రోల్, ప్రాజెక్ట్ ఇంజినీరింగ్ అండ్ మేనేజ్మెంట్, అడ్వాన్స్డ్ కన్స్రక్షన్ మేనేజ్మెంట్ తదితర విభాగాలు ఉన్నాయి.
-కోర్సులు అందించే సంస్థలు: దేశంలోని అన్ని ప్రధాన విశ్వవిద్యాలయాలు, ఇంజినీరింగ్ కాలేజీల్లో బీఈ/బీటెక్ సివిల్ ఇంజినీరింగ్, ఎంఈ/ఎంటెక్ కోర్సులు ఉన్నాయి.
-ప్రధానంగా నిర్మాణ రంగంలో ప్రొఫెషనల్స్‌ను తయారుచేయడానికి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ అండ్ రిసెర్చ్ (ఎన్‌ఐసీఎంఏఆర్)ను ఏర్పాటుచేశారు. దేశవ్యాప్తంగా క్యాంపస్‌లు కలిగి ఉన్న ఈ సంస్థలో ఫుల్‌టైం, పార్ట్‌టైం, డిస్టెన్స్, ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్స్‌ను అందిస్తుంది.
-ఎన్‌ఐసీఎంఏఆర్ అందించే కోర్సులు- పోస్టు గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ అడ్వాన్స్డ్ కన్స్ట్రక్షన్, ప్రాజెక్ట్ ఇంజినీరింగ్ అండ్ మేనేజ్మెంట్, రియల్ ఎస్టేట్ అండ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్, డెవలప్మెంట్ అండ్ మేనేజ్మెంట్, స్మార్ట్‌సిటీ డెవలప్మెంట్ అండ్ మేనేజ్మెంట్, క్వాంటిటీ సర్వేయింగ్ అండ్ కాంట్రాక్ట్ మేనేజ్మెంట్, హెల్త్, సేఫ్టీ అండ్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ తదితర ఫుల్‌టైం కోర్సులు ఉన్నాయి.
-ఎన్ఐసీఎంఏఆర్లో పీజీ, గ్రాడ్యుయేట్, పార్ట్‌టైం, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కోర్సులు ఉన్నాయి.
-ఎన్‌ఐసీఎంఏఆర్ క్యాంపస్‌లు పుణె,హైదరాబాద్, గోవా, ఢిల్లీ ఎన్సీఆర్, ముంబైలలో ఉన్నాయి.
-వివరాల కోసం www.nicmar.ac.in
ఫారెన్ లాంగ్వేజ్‌లు
విభిన్న సంస్కృతుల్లో, దేశవిదేశాలలో పనిచేయాలనుకొనేవారికి విలక్షణమైన కోర్సులు ఇవి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు భాషల్లో ఇష్టమైన ఒక భాషను నేర్చుకొని కెరీర్‌గా మలుచుకోవచ్చు. పలు ఎంఎన్‌సీలు, కేంద్రం, యూనివర్సిటీలు విదేశీ భాషలు నేర్చుకొన్నవారికి అవకాశాలు కల్పిస్తున్నాయి.
-విదేశీ భాషలు: అరబిక్, చైనీస్, బల్గేరియన్, ఫ్రెంచ్, స్పానిష్, ఇటాలియన్, జపనీస్ ముఖ్యమైనవి.
-ఇంటర్, డిగ్రీ తర్వాత ఈ కోర్సులు చేయవచ్చు.
-కాలేజీలు: ఇఫ్లూ, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ, కురుక్షేత్ర యూనివర్సిటీ, చైనీస్ లాంగ్వేజ్ ఇన్స్టిట్యూట్, మధురై కామరాజ్ విశ్వవిద్యాలయం తదితర సంస్థలు.
-ఉపాధి అవకాశాలు: టీచింగ్, రిసెర్చ్ (దేశ, విదేశాల్లో), యూపీఎస్సీ ద్వారా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, రక్షణ శాఖ, రా, ఎంఎన్సీ, కాల్‌సెంటర్లు, ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్, టూరిజం, టూరిస్ట్ గైడ్స్ ఇలా పలు రకాల ఉద్యోగావకాశాలు ఉన్నాయి.
ఫోరెన్సిక్ రంగం
-ఫోరెన్సిక్ సైన్స్ అనేది విజ్ఞానశాస్త్రం, నేర న్యాయాల అధ్యయనం. శాస్త్రీయజ్ఞానం, మెథడాలజీల ఆధారంగా నేరాలను పరిశోధించడంలో ఫోరెన్సిక్ కీలకం. ఇది మల్టిడిసిప్లినరీ సబ్జెక్టు. దీనిలో కెమిస్ట్రీ, బయాలజీ, ఫిజిక్స్, జియాలజీ, సైకాలజీ, సోషల్‌సైన్స్, ఇంజినీరింగ్ సబ్జెక్టులు ఉంటాయి.
-నేరపరిశోధనలో భౌతిక ఆధారాలను సేకరించడం, భద్రపర్చడంలో ఫోరెన్సిక్ సైంటిస్టుల సహాయం తప్పనిసరి.
-ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఫోరెన్సిక్ ఉద్యోగావకాశాలు ఉన్నాయి.
-కోర్సులు: బీఎస్సీ (ఫోరెన్సిక్), ఎమ్మెస్సీ (ఫోరెన్సిక్), పీజీ డిప్లొమా ఇన్ ఫోరెన్సిక్, పీహెచ్డీ (ఫోరెన్సిక్), ఎంఫిల్ (ఫోరెన్సిక్).
-స్పెషలైజేషన్స్: ఫోరెన్సిక్లో బయాలజీ, సిరాలజీ, కెమిస్ట్రీ, టాక్సికాలజీ, బాలిస్టిక్స్, ఎంటమాలజీ, బాటనీ విభాగాలు ఉన్నాయి.
కోర్సులు అందిస్తున్న యూనివర్సిటీలు/సంస్థలు
-యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ, యూనివర్సిటీ ఆఫ్ లక్నో, గుజరాత్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ, మణిపాల్, భీం రావ్ అంబేద్కర్, పంజాబ్ యూనివర్సిటీలతో పాటు పలు ఇతర సంస్థలు కూడా ఈ కోర్సులను అందిస్తున్నాయి.
-ఉద్యోగావకాశాలు: ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్స్, లీగల్ కౌన్సెలర్స్, ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్, క్రైం సీన్ ఇన్వెస్టిగేటర్, టీచర్/ప్రొఫెసర్, క్రైం రిపోర్టర్, ఫోరెన్సిక్ ఇంజినీర్, లా కన్సల్టెంట్, హ్యాండ్రైటింగ్ ఎక్స్పర్ట్.
సైబర్ సెక్యూరిటీ, సైబర్ ఫోరెన్సిక్స్, సైబర్ లా
-శరవేగంగా పెరుగుతున్న సాంకేతికతో సులువుగా పనులు సమకూరుతున్నాయి. అలాగే నేరగాళ్లు సైబర్ దాడులు చేస్తూ విలువైన సమాచారం, ధనాన్ని కొల్లగొడుతున్నారు. ఇలాంటి తరుణంలో సంబంధంలేని వ్యక్తులు/సంస్థలు డాటాబేస్, నెట్‌వర్క్‌ల దాడుల నుంచి రక్షణ తప్పనిసరి. ఇటీవల ప్రపంచదేశాలు గతంలో మాదిరిగా నేరుగా యుద్ధాలు చేయకుండా సైబర్ దాడులు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పూర్తి సాంకేతికమయమైన అన్ని రంగాలను కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికోసం సైబర్ రంగ నిపుణుల అవసరం తప్పనిసరి. డిజిటల్ ఇండియా దిశగా దేశం అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఈ రంగంలో అవకాశాలు పుష్కలంగా ఉం టాయి. 2025 నాటికి 10 లక్షల మంది డిజిటల్ నిపుణులు అవసరమని అంచనా.
-కోర్సులు: బయోమెట్రిక్స్, సైబర్ ఫోరెన్సిక్స్, ఎండ్ పాయింట్ సెక్యూరిటీ, నెట్వర్క్ సెక్యూరిటీ, మొబైల్ అండ్ వెబ్ సెక్యూరిటీ, ఎస్‌సీఏడీ సెక్యూరిటీ, క్లౌడ్ సెక్యూరిటీ, హనీనెట్ టెక్నాలజీ.
-కోర్సులు అందిస్తున్న సంస్థలు: సీడాక్, ఐఐఐటీ, యూపీఈఎస్, అమృత యూనివర్సిటీ, హిందుస్థాన్ యూనివర్సిటీ, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, సీబీఐ అకాడమీతోపాటు పలు విశ్వవిద్యాలయాలు, ప్రైవేట్ సంస్థలు సైబర్ సెక్యూరిటీ, సైబర్ లాలో పలు కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి.
యానిమేషన్ అండ్ డిజైన్
దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాల్లో యానిమేషన్ అండ్ డిజైన్ ఒకటి. ముఖ్యంగా యానిమేషన్, గేమింగ్, డిజైన్, స్టోరీ బోర్డింగ్, వీఎఫ్ఎక్స్ ఫర్ ఫిల్మ్ మేకింగ్, యానిమేటెడ్ జీఐఎఫ్, ఫ్లాష్ యానిమేషన్ అండ్ డిజిటల్ వీడియో, 3డీ ఆబ్జెక్ట్స్ తదితరాలన్నీ వీటి కిందికి వస్తాయి.
-ఉపాధి అవకాశాలు: ఈ రంగంలో ఉపాధికి కొదవేలేదు. డిజైన్ మేనేజర్లు, క్యారెక్టర్యానిమేటర్, ట్రెయినర్, అసోసియేట్ మేనేజర్, ఫ్లాష్ యానిమేటర్, టీం లీడర్, క్రియేటివ్ హెడ్, టెలివిజన్, సినిమా, గేమ్స్ తదితర విభాగాల్లో అవకాశాలు ఉన్నాయి.
కోర్సులు అందించే ప్రముఖ
సంస్థలు:
-వెల్లూర్‌లోని విట్, సింబయాసిస్, చండీగఢ్ యూనివర్సిటీ, ఐఐఐటీడీఎం, జబల్పూర్, కురుక్షేత్ర యూనివర్సిటీ, మణిపాల్, మోడీ యూనివర్సిటీ, ఎన్ఐడీ, హైదరాబాద్‌లోని జేఎన్ఏఎఫ్ఏ, కోల్‌కతాలోని సీఐటీ, బిట్స్ వీటికితోడు పలు ప్రైవేట్ సంస్థలు అత్యున్నతమైన ప్రమాణాలతో ఈ కోర్సులను అందిస్తున్నాయి.
న్యూట్రిషన్ & డైటీషియన్
-వేగంగా మారుతున్న ఈ ప్రపంచంలో సమతుల్య ఆహారం తీసుకోవడం కీలకం. రకరకాల పరిస్థితుల మధ్య పనిచేయాల్సిన స్థితిలో మానసిక, శారీరక సమతుల్యంలో మనం తీసుకొనే ఆహారం కీలకం. అయితే పూర్వంలాగా అన్నింటిని తిని తట్టుకోలేని స్థితి. దీంతో ఎవరి శరీరారికి ఏది అవసరమో గుర్తించి, ఎంత మోతాదులో తీసుకోవాలో చెప్పేవారి అవసరం రోజురోజుకీ పెరుగుతుంది. మనిషి బయోకెమిస్ట్రీ, సైకాలజీ, ఫిజియాలజీ అన్నింటి మీద అవగాహన ఏర్పర్చుకొని కావాల్సిన ఆహార నియమాలను చెప్పేవారి డిమాండ్ పెరుగుతుంది. ఇదొక ప్రత్యేకమైన కోర్సు. మానవసేవతోపాటు తమ కెరీర్‌ను నిర్మించుకోవచ్చు. ఒకప్పుడు దేశ, రాష్ట్రస్థాయిలలో వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, సినిమాస్టార్స్ లాంటివారికి మాత్రమే ప్రత్యేక న్యూట్రిషన్స్/డైటీషియన్లు ఉండేవారు. కానీ, ప్రస్తుతం సామాన్యుడికీ రోజు ఏం తినాలి? ఎప్పుడు ఎంత మోతాదులో ఆహారం తీసుకోవాలి? అన్న నియమాలను తెలుసుకోవాల్సిన స్థితి ఏర్పడింది. వారివారి శరీర పరిస్థితులను బట్టి ఆహార నియమాలను అందించేవారి అవసరం ఏర్పడింది. 2020 నాటికి దేశంలో 50 శాతం మేర డిమాండ్ పెరుగనున్నది. ముఖ్యంగా వైద్యశాలలు, స్కూళ్లు, కాలేజీలు, ఎన్జీవోలు, నర్సింగ్హోమ్స్తోపాటు ప్రత్యేక క్లినిక్‌లు కూడా వస్తున్నాయి. ఇటీవల సొంతంగా క్లినిక్‌లు ఏర్పాటు చేసుకొని వ్యక్తిగత డైటీషియన్ సేవలు అందిస్తున్నవారి సంఖ్య పెరుగుతుంది.
-కోర్సులు: డిగ్రీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులు ఉన్నాయి.
-అందించే సంస్థలు: ఎన్ఐఎన్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైజీనిక్ పబ్లిక్ హెల్త్, ఇగ్నో, ఓయూ, అన్నామలై, మణిపాల్, లేడీ ఇర్విన్ కాలేజీ, జేడీ బిర్లా ఇన్స్టిట్యూట్, మంగళూరు యూనివర్సిటీ.
-న్యూట్రిషన్లో ప్రొఫెషనల్ విభాగాలు: అడ్మినిస్ట్రేటివ్ న్యూట్రిషనిస్ట్, బిజినెస్ న్యూట్రిషనిస్ట్, క్లినికల్ న్యూట్రిషనిస్ట్, కమ్యూనిటీ న్యూట్రిషనిస్ట్, కన్సల్టెంట్ న్యూట్రిషనిస్ట్, పీడియాట్రిక్ న్యూట్రిషనిస్ట్, రిసెర్చ్ న్యూట్రిషనిస్ట్.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు