ఫిస్టియా మొక్కలో వేరువ్యవస్థ రకం?
పుష్పించే మొక్కల స్వరూపశాస్త్రం
-మొక్క భాగాలైన వేరు, కాండం (Stem), పత్రం, పుష్పం, ఫలం, విత్తనాల స్వరూపాన్ని గురించిన అధ్యయనాన్ని స్వరూపశాస్త్రం (Morphology) అంటారు.
వేరు
-విత్తనం మొలకెత్తినప్పుడు మొదటగా ఏర్పడే నిర్మాణాన్ని ప్రథమ మూలం (Radicle) అని, తర్వాత భూమిపైకి ఏర్పడే నిర్మాణాన్ని ప్రథమ అక్షం/ప్రథమ కాండం (Plumule) అంటారు.
-సాధారణంగా ప్రథమ మూలం నుంచి వేరు ఏర్పడుతుంది. వేర్లు భూమి ఆకర్షణ దిశలో పెరుగుతాయి.
-వేరు గోధుమ రంగులో ఉంటుంది. దానిపై కణుపులు (Nodes), కణుపు మధ్యమాలు (Internodes) ఉండవు.
వేరు వ్యవస్థ- రకాలు
-వేరు వ్యవస్థ ప్రధానంగా రెండు రకాలుగా ఉంటుంది. అవి.. తల్లివేరు వ్యవస్థ (Tap Root System), పీచువేరు వ్యవస్థ (Fibrous Root System)
-నదులు సముద్రాల్లో కలిసే ప్రదేశంలో ఉప్పునీటిలో పెరిగే మొక్కలను మాంగ్రూవ్ మొక్కలు అంటారు.
తల్లివేరు వ్యవస్థ
-ప్రథమ మూలం నేరుగా మృత్తికలోకి సాగి మృత్తికలో ప్రాథమిక వేరుగా (Primary root) పెరుగుతుంది. ఇది పార్శంగా ద్వితీయ, తృతీయ శాఖలను ఏర్పరుస్తుంది.
-ప్రాథమిక వేరు, దాని శాఖలతో కలిసి తల్లివేరు వ్యవస్థను ఏర్పరుస్తుంది.
ఉదా: ద్విదళబీజాలు (Dicotyledons)- చిక్కుడు, బఠాని, వేరుశనగ, ఆవాలు, మందార, వేప, మామిడి.
పీచువేరు వ్యవస్థ
-ప్రథమ మూలం స్వల్పకాలికంగా ఉండి, దాని స్థానంలో అనేక పార్శ వేర్లు ఏర్పడి అన్నీ ఒకే ఎత్తులో ఉంటాయి. దీన్నే గుబురు వేరు లేదా పీచువేరు వ్యవస్థ అంటారు.
ఉదా: ఏకదళ బీజాలు (Monocotyledons)- వరి, గోధుమ, ఆస్పరాగస్
-కొన్ని మొక్కల్లో వేర్లు ప్రథమ మూలం నుంచి కాకుండా మొక్క ఇతర భాగాల నుంచి ఉద్భవిస్తాయి. ఇలాంటి వేరు వ్యవస్థను అబ్బురపు వేరు వ్యవస్థ (Adventitious root system) అంటారు.
ఉదా: మాన్స్టెరా, మర్రి చెట్టు (Banyan tree)
వేరు విధులు
-మొక్కను భూమిలో స్థాపించి స్థిరత్వాన్ని ఇస్తుంది.
-మృత్తిక నుంచి నీటిని, ఖనిజ లవణాలను శోషిస్తుంది, ఆహార పదార్థాలను నిల్వ చేస్తుంది.
-మొక్కల వృద్ధి నియంత్రకాలలో కొన్నింటిని సంశ్లేషణ చేస్తుంది.
-మృత్తికా క్రమక్షయాన్ని (నేలకొత) నివారిస్తుంది.
-కరివేప, వేప మొక్కల్లో వేరు మొగ్గలు ప్రత్యుత్పత్తికి తోడ్పడుతాయి.
వేరు రూపాంతరాలు
-వివిధ రకాల విధులను నిర్వర్తించడానికి వేర్లలో కలిగే మార్పులను వేరు రూపాంతరాలు (Modifications of Root) అంటారు. ఇది 9 రకాలుగా ఉంటాయి.
1. నిల్వ చేసే లేదా దుంప వేరు
-శాఖాహార జంతువుల నుంచి రక్షించుకోవడానికి కొన్ని ద్వివార్షిక మొక్కలు (రెండేండ్ల జీవితకాలం ఉండేవి) మొదటి ఏడాదిలో అవి తయారుచేసుకున్న ఆహార పదార్థాలను వేర్లలో నిలువచేసుకుంటాయి. రెండో ఏడాదిలో ఉపయోగించుకుంటాయి. కాబట్టి ఈ పంటలను మొదటి ఏడాది చివర్లో తీయాలి.
ఉదా: డాకస్ కరోట (క్యారెట్), రఫానస్ సటైవం (ముల్లంగి-Radish), టర్నిప్లలో తల్లివేర్లు ఆహార పదార్థాలను నిలువ చేస్తాయి.
-మొరంగడ్డ (Sweet potato)లో అబ్బురపు వేర్లు ఆహార పదార్థాలను నిలువ చేస్తాయి.
-ఆస్పరాగస్, బీటావల్గారిస్ (బీట్రూట్)లో పీచువేర్లు ఆహార పదార్థాలను నిలువ చేస్తాయి.
-వేర్లు లేని మొక్కలు: నీటిలో పెరిగే ఉల్ఫియా, యుట్రిక్యులేరియా
ఊడవేర్లు
-మొక్కల కొమ్మల బరువు మోయడానికి పైనుంచి కొన్ని శాఖలు నేలలోకి వెళ్లి వేర్లుగా రూపాంతరం చెందుతాయి. వీటినే ఊడవేర్లు (Prop roots) లేదా స్తంభాల్లాంటి వేర్లు (Pillor roots) అంటారు.
ఉదా: ఫైకస్ బెంగాలెన్సిస్ (మర్రిచెట్టు)
ఊతవేర్లు
-కాండం కణుపు నుంచి ఏర్పడే వేర్లను ఊతవేర్లు (Stilt roots) అంటారు.
ఉదా: చెరుకు, మొక్కజొన్న, జొన్న, వెదురు, మొగలి (Pendanus)
శ్వాసించేవేర్లు (శ్వాసమూలాలు)
-కొన్ని మొక్కల్లో వేర్లు భూమిపైకి వచ్చి నిటారుగా పెరుగుతాయి. ఇలాంటి వేర్లను శ్వాస మూలాలు (Pneumatophores) అంటారు. ఈ వేర్లు శ్వాసక్రియకు అవసరమైన ఆక్సిజన్‌ను పొందడానికి సహాయపడుతాయి.
ఉదా: రైజోఫొరా, అవిసీనియా (మాంగ్రూవ్ మొక్కలు)
వెలామిన్ వేర్లు
-ఇతర మొక్కలపై పెరిగే వృక్షోపజీవ మొక్కల్లో (Epiphytes) అబ్బురపు వేర్లు వాతావరణంలోని తేమను శోషించడానికి ప్రత్యేకించబడుతాయి. అటువంటి వేర్లను వెలామిన్ వేర్లు అంటారు.
ఉదా: వాండా (ఆర్కిడేసి కుటుంబం), వానిల్లా.
-వానిల్లా మొక్క బీజదళాల నుంచి లభించే వెనిల్లిన్ను ఐస్‌క్రీమ్ తయారీలో ఫ్లేవర్‌గా ఉపయోగిస్తారు.
-రాష్ట్రంలో అతిపెద్ద మర్రిచెట్టు పిల్లలమర్రి (మహబూబ్‌నగర్)
-దేశంలో, ప్రపంచంలో అతిపెద్ద మర్రిచెట్టు తిమ్మమ్మ మర్రిమాను ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలో ఉంది.
హాస్టోరియల్ వేర్లు
-ఇతర మొక్కలపై నీరు, ఖనిజాలు, ఆహారపదార్థాల కోసం ఆధారపడే మొక్కలు.. హాస్టోరియల్ వేర్లు (Hastorial roots) లేదా పరాన్నజీవ వేర్లను (Parasitic roots) కలిగి ఉంటాయి.
ఉదా: విస్కమ్, ైస్ట్రెగ మొక్కలు పాక్షిక పరాన్న జీవమొక్కలు. ఇవి అతిథేయి మొక్క నుంచి నీటిని, ఖనిజాలను శోషించడానికి హాస్టోరియల్ వేర్లను అతిథేయి దారువులోకి పంపిస్తాయి.
-కస్క్యుట, రఫ్లీషియా మొక్కలు సంపూర్ణ పరాన్న జీవ మొక్కలు. ఇవి అతిథేయి మొక్క నుంచి నీటిని ఆహార పదార్థాలను గ్రహించడానికి తమ హాస్టోరియల్ వేర్లను అతిథేయి దారువు, పోషక కణజాలంలోకి పంపిస్తాయి.
-సేంద్రీయ వ్యవసాయం ఎక్కువగా ఈశాన్య రాష్ర్టాల్లో (మేఘాలయా, అసోం) చేస్తారు.
-సేంద్రీయ వ్యవసాయం కోసం భారత ప్రభుత్వం ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో నేషనల్ సెంటర్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్ (ఎన్‌సీఓఎఫ్)ను 2004లో స్థాపించింది.
బుడిపెవేర్లు
-ఫాబేసి కుంటుంబానికి చెందిన మొక్కల్లో వాతావరణంలోని నత్రజనిని స్థాపించడానికి రైజోబియం అనే బ్యాక్టీరియా వాటి వేరు వ్యవస్థలో నివాసం ఉండి బుడిపెలను ఏర్పరుస్తుంది. అలాంటి వేర్లను బుడిపె వేర్లు (Nodular roots) అంటారు.
ఉదా: కంది, పెసర, బఠాని, చిక్కుడు, వేరుశనగ, ైగ్లెరిసీడియా వంటి ఫాబేసి కుటుంబానికి చెందిన మొక్కలు
స్వాంగీకరణ వేర్లు
-కొన్ని మొక్కల వేర్లు పత్రహరితాన్ని (Chorophil) కలిగి ఉండి కిరణజన్య సంయోగక్రియకు తోడ్పడుతాయి. ఇలాంటి వాటిని స్వాంగీకరణ (Assimilatory) లేదా కిరణజన్య సంయోగక్రియ వేర్లు అంటారు.
ఉదా: టీనియోఫిల్లమ్ (Taeniophyllum).
-మొక్కలన్నీ స్వయంగా ఆహారాన్ని తయారు చేసుకోలేవు. కొన్ని మొక్కలు ఆహారం, నీటిని ఇతర మొక్కల నుంచి అపహరిస్తాయి. అలాంటి మొక్కలను పరాన్న జీవ మొక్కలు (Parasitic plants) అంటారు.
సంతులనం జరిపే వేర్లు
-కొన్ని మొక్కలు నీటిపై స్వేచ్ఛగా తేలియాడుతూ ఉంటాయి. ఇలాంటి మొక్కలు అలల తాకిడికి బోర్లా పడినప్పుడు (తల కిందులుగా) తిరిగి యధాస్థానానికి తీసుకువచ్చే వేర్లను సంతులనం జరిపే వేర్లు (Balancing roots) అంటారు.
ఉదా: ఫిస్టియా (అంతరతామర)
-ఈ మొక్కల వేర్లలో గాలి నిల్వ ఉంటుంది. వీటినే రూట్ ప్యాకెట్స్ అంటారు. ఇవి మొక్క నిటిపై తేలడానికి తోడ్పడుతాయి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు