నోరు తెరిస్తే నొప్పి.. మాట్లాడితే వ్యాప్తి!
శరీర విధులన్నీ సక్రమంగా జరుగుతున్నప్పుడు ఆ వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నట్లు. సంతులిత ఆహారం, క్రమబద్ధమైన వ్యాయామం, పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన పరిసరాలు శరీర ఆరోగ్యానికి అవసరం. సక్రమంగా పనిచేసే శరీర విధులను తాత్కాలికంగా గాని,శాశ్వతంగా గాని కల్లోలపరిచే పరిస్థితిని ‘వ్యాధి’ అంటారు.
ఉష్ణమండల వ్యాధులు
-వ్యాధిజనక జీవులు శరీరంలో ప్రవేశించింది మొదలు, ఆ వ్యక్తి అస్వస్థతకు గురయ్యే వ్యవధిలో అనేక దశలుంటాయి. ఈ దశలన్నింటినీ కలిపి వ్యాధి పద్ధతి అంటారు. వ్యాధి పద్ధతిలో నాలుగు దశలుంటాయి. అవి. 1. వ్యాధి సంక్రమణ దశ 2. పొదిగే కాలం 3. వ్యక్తమయ్యే దశ 4. అంత్యదశ.
సంక్రమణ దశ
– వ్యాధిజనక జీవి మన శరీరంలోకి ప్రవేశించడాన్ని వ్యాధి సంక్రమణ అంటారు. ఇది వ్యాధికి మొదటి మెట్టు.
– ప్రత్యక్షంగా తాకడం వల్ల, సంక్రమిక వస్తువులను తాకినప్పుడుగానీ, ఆహారం, నీరు, గాలి, ఈగలు, దోమలు, ఎలుకలు వంటి జంతువుల ద్వారా గానీ వ్యాధి కారకం శరీరంలోకి ప్రవేశించవచ్చు.
-వ్యాధిజనక జీవి శరీరంలోకి ప్రవేశించక ముందు ఉండే ఆవాసాన్ని సంక్రమిక కారక ఆశ్రయం అంటారు.
-ఆశ్రయాలు మూడు రకాలు అవి:
ఎ. మానవ ఆశ్రయాలు బి. జంతు ఆశ్రయాలు సి. నిర్జీవ పదార్థపు ఆశ్రయాలు.
-వ్యాధిజనక జీవులు అధిక సంఖ్యలో ఉంటూ, ఏవిధమైన అస్వస్థత కలుగజేయకుండా ఉండే ఆశ్రయ జీవులను వాహక జీవులు అంటారు.
– వ్యాధిజనక జీవులు వాటి ఆశ్రయ జీవుల్లో వ్యాధిని కలిగించవచ్చు లేదా కలిగించకపోవచ్చు.
-ప్లేగు కలిగించే బ్యాక్టీరియాలను ఎలుకలు, ఎల్లో జ్వరం కలిగించే వాటికి కోతులు, మలేరియా జ్వరానికి దోమలు, హెపటైటిస్ వంటి వైరస్ జ్వరానికి వాహకాలుగా మానవులు వ్యవహరిస్తారు.
-వ్యాధికారక ఆశ్రయం నుంచి అతిథేయి దగ్గరకు రవాణా చేసే పద్ధతిని వ్యాధి వ్యాప్తి అంటారు.
– ప్రత్యక్ష తాకిడి: చర్మం, కంటి అంటు వ్యాధులు ప్రత్యక్షంగా శరీర తాకిడి ద్వారా వ్యాప్తి చెందుతాయి. ధనుర్వాతం కలుగజేసే బ్యాక్టీరియాలు నేల నుంచి గాయం ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తాయి.
– గవద బిళ్లలు, ఫ్లూ జ్వరం, ఆటలమ్మ, పడిశం, కోరింత దగ్గు, క్షయ మొదలైన వ్యాధులు సూక్ష్మ బిందువుల ద్వారా సంక్రమణ చెందుతాయి.
క్షయ, ఫ్లూ జ్వరం, ఆటలమ్మ, తట్టు, న్యుమోనియా వంటి వ్యాధులు గాలి వల్ల సంక్రమణ చెందుతాయి.
బ్రిటన్‌లో పశువులు వ్యాధికారక సూక్ష్మజీవులతో కలుషితమైన మేత తినడం వల్ల మ్యాడ్-కౌ అనే వ్యాధి ప్రబలి చాలా సంచలనం కలిగించింది.
పొదిగే కాలం
-ఇది వ్యాధి పద్ధతిలో రెండో దశ.
– వ్యాధి జనకక్రిమి శరీరంలో ప్రవేశించినప్పటి నుంచి అస్వస్థత కనబడే వరకు గల కాలాన్ని పొదిగేకాలం అంటారు.
– పొదిగే కాలంలో సూక్ష్మజీవులు అతి త్వరగా విభజన చెంది అధిక సంఖ్యలో ఉత్పత్తి అవుతాయి.
-వివిధ వ్యాధులకు పొదిగే కాల పరిమితులు వేరుగా ఉంటాయి.
-ఆటలమ్మ, తట్టు, గవదబిళ్లలు వంటి వ్యాధులకు ఈ పొదిగే కాలం 10 రోజుల నుంచి 3 వారాల పాటు ఉంటుంది.
-హెపటైటిస్, రేబిస్, కుష్ఠు వ్యాధులకు ఈ కాల పరిమితి కొన్ని వారాల నుంచి కొన్ని సంవత్సరాల వరకు ఉంటుంది.
-అతినిద్ర వ్యాధిలో పొదిగే కాలం 20-30 సంవత్సరాల వ్యవధి ఉంటుంది.
వ్యక్తమయ్యే దశ
– వ్యాధి క్రమంలో ఇది మూడో దశ.
– అతిథేయి కణజాలాలకు హాని, మార్గాలను అడ్డుకోవడం, మామూలు క్రియలకు అవరోధం వల్ల అతిథేయిలో రోగ లక్షణాలు కనబడతాయి.
-కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు, లేక శరీరంలో మారిన జీవ క్రియలను తెలియజేసే లక్షణాల వల్ల వ్యాధిని పోల్చవచ్చు. ఇటువంటి సూచనలను రోగ లక్షణాలు అంటారు.
-రోగ లక్షణాలను పరిశీలించి వైద్యులు వ్యాధిని నిర్ధారణ చేస్తారు. ఇలా లక్షణాలు కనిపించడాన్ని వ్యక్తమయ్యే దశ అంటారు.
వ్యాధి అంత్యదశ
– వ్యాధి పద్ధతిలో ఇది చివరి దశ. ఈ దశలో వ్యాధి పద్ధతి తాత్కాలికంగానో లేక శాశ్వతంగానో ఆగిపోతుంది.
-వ్యాధి అంతమవడానికి మూడు మార్గాలున్నాయి. అవి
1. రోగిలోని వ్యాధినిరోధక వ్యవస్థ ద్వారా
2. వైద్యుడు ఇచ్చే మందులు తీసుకోవడం వల్ల
3. వ్యాధి వల్ల రోగి మరణించడం (సహజంగా అంతమవడం)
-వ్యాధి తగ్గిన వెంటనే రోగి స్వస్థత చెందడు. మామూలు ఆరోగ్యస్థితికి రావడానికి కొంతకాలం పడుతుంది. ఈ కాల వ్యవధిని పునరారోగ్య ప్రాప్తి వ్యవధి అంటారు.
కామెర్లు
-ఇది రక్తం, కణజాలాల్లో పసుపు రంగు వర్ణద్రవ్యం చేరడం వల్ల వచ్చే వ్యాధి.
-కాలేయంలో వయస్సు అయిపోయిన ఎరరక్త కణాలు చనిపోయినప్పుడు వాటి నుంచి బైలురుబిన్ అనే వర్ణద్రవ్యం ఏర్పడుతుంది.
– కాలేయ కణాలు (హెపాటోసైట్స్) బైలురూబిన్ను పిత్త ద్రావణంలోకి స్రవింపజేస్తుంది.
– మూత్రంలో ఉండే పచ్చటి రంగు బైలురూబిన్, దాని జీవక్రియ పదార్థాల వల్ల కలుగుతుంది.
పచ్చ కామెర్ల వ్యాధి కలగడానికి కారణం
-బైలురూబిన్ ఎక్కువగా ఉత్పత్తి కావడం వల్ల, కాలేయంలో అధిక సంఖ్యలో ఎరరక్త కణాలు నాశనం అవడం వల్ల పచ్చ కామెర్ల వ్యాధి సంభవిస్తుంది.
– పైత్యరస ఉత్పత్తిలో స్రవించడంలో ఆటంకం కలగడం వల్ల, పిత్తాశయంలో రాళ్లు ఏర్పడినప్పుడు కూడా పచ్చకామెర్లు రావచ్చు.
-కాలేయ కణాలు సరిగా పనిచేయనప్పుడు, కాలేయ కణాలు మరణించడం వల్ల కూడా ఇలా జరుగుతుంది. వ్యక్తి హెపటైటిస్ వైరస్‌లతో బాధపడుతున్నప్పుడు కూడా ఈ స్థితికి దారితీస్తుంది.
-హెపటైటిస్ వైరస్లు వివిధ రకాలుగా ఉంటాయి. అవి. హెపటైటిస్-ఎ, హెపటైటిస్-బి, హెపటైటిస్-డి,
హెపటైటిస్-ఇ, హెపటైటిస్-ఎఫ్, హెపటైటిస్- జి.
– ప్రపంచంలో ప్రతి సంవత్సరం సుమారు 200 బిలియన్ల ప్రజలు హెపటైటిస్ వ్యాధికి గురవుతున్నారు.
-శిశు జనన సమయంలో తల్లి నుంచి శిశువులకు, ఆహారం, నీరు, పాల ద్వారా శరీరంలోకి రక్తం ఎక్కించినప్పుడు, ఒకే సిరంజిని ఎక్కువ మందికి ఉపయోగించినప్పుడు ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది.
– మన దేశంలో సుమారు 30 శాతం కంటే ఎక్కువ జనాభాలో ఈ హెపటైటిస్ వైరస్ కాలేయంలో కణాలను (హెపాటోసైట్స్) పాడు చేస్తాయి.
-కంటి తెల్లగుడ్డు పసుపు పచ్చగా మారుతుంది.
పచ్చ కామెర్ల లక్షణాలు
-చర్మం రంగు పసుపు వర్ణంలోకి మారుతుంది.
-మూత్రం పచ్చగా ఉంటుంది.
– రోగికి ఆకలి లేకపోవడం, కడుపు ఉబ్బరింపు (గాలిచేరటం వల్ల), మలబద్ధకం.
– కాలేయ ప్రాంతంలో పచ్చిగా ఉంటుంది.
– రక్తంలో బైలురూబిన్ స్థాయి హెచ్చుగా ఉంటుంది.
గవద బిల్లలు
– సాధారణంగా ఈ వ్యాధి 5-15 ఏళ్ల పిల్లల్లో వస్తుంది.
-మిక్సోవైరస్ పెరొటైడిస్ (ఆర్ఎన్ఏ) అనే వైరస్ వల్ల ఈ వ్యాధి కలుగుతుంది.
-ఈ వైరస్ జన్యు పదార్థంలో ఒకే పోగు ఉండే ఆర్ఎన్ఏ ఉంటుంది.
– ప్రత్యక్ష తాకిడి వల్లగానీ, రోగి తుంపర వంటి సూక్ష్మ బిందువుల ద్వారా గానీ ఈవ్యాధి వ్యాపిస్తుంది.
– ఈ వ్యాధి పొదిగే కాలం 2-3 వారాలు. సాధారణంగా ఇది 18 రోజులు ఉంటుంది.
-ఈ వ్యాధితో బాధపడే వారిలో లాలాజల గ్రంథులు ప్పిపెడతాయి. నోరు తెరిచినప్పుడు ప్పి, చెవిప్పి, జ్వరం దీని లక్షణాలు.
– ఇది క్లోమం, మూత్రపిండాలకు కూడా వ్యాపిస్తుంది.
– దీనికి నిర్దిష్టమైన చికిత్స లేదు. కానీ టీకా తీసుకోవడం వల్ల వ్యాధి మళ్లీ రాకుండా చేయవచ్చు.
మెదడు వాపు
– ఇది దోమల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధి.
– ఈ వ్యాధికి అర్బోవైరస్ (ఆర్థోపొడా జీవుల ద్వారా వ్యాప్తి చెందేవి) జాతికి చెందిన వైరస్లు.
– మనుషులనే కాకుండా ఈ వైరస్లు అనేక జంతువులు, పక్షులను కూడా ఈ వ్యాధికి గురిచేస్తాయి.
– పందులు, పశువులు, కోళ్లు ఈ వైరస్‌కు ప్రధాన సకశేరుక అతిథేయిలు.
– ఈ వైరస్ క్యూలెక్స్ దోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది.
-ఈ వ్యాధికి పొదిగే కాలం 5-15 రోజులు.
-కొద్ది జ్వరంతో, తలప్పితో మొదలై తర్వాత జ్వర తీవ్రత ఎక్కువై ఫిట్స్ వస్తాయి.
– ఈ వ్యాధి కేంద్రనాడీ మండలం మీద ప్రభావం చూపుతుంది.
తట్టు (అమ్మవారు) లేదా దద్దుర్లు
-ఈ వ్యాధిని రుబెల్లా అని కూడా అంటారు. రుబెల్లా అంటే ఎరటి మచ్చలు అని అర్థం.
-అబూబాకర్ అనే అరేబియన్ వైద్యుడు ఈవ్యాధి గురించి మొదటిసారి వర్ణించాడు.
– పారామిక్సో వైరస్ (ఆర్ఎన్ఏ) ఈ వ్యాధిని కలిగిస్తుంది.
– మనదేశంలోని పిల్లలు అధిక సంఖ్యలో ఈ వ్యాధి బారిన పడుతున్నారు.
-దగ్గు, జ్వర లక్షణాలు ఉంటాయి. తరువాత శరీరంపై దద్దుర్లు ఏర్పడతాయి.
– ఈ వ్యాధి వ్యాప్తికి ప్రత్యేక వాహకం లేదు. తట్టుతో బాధపడే వారి ముక్కు నుంచి స్రవించే నీరు, లాలాజలంలో తుంపర ద్వారా సంక్రమణ చెందుతుంది.
–ఆరు నెలల నుంచి మూడు సంవత్సరాలలోపు ఈ వ్యాధికి గురవుతారు.
-వ్యాధి పొదిగే కాలం జ్వరం రావడానికి ముందు 10 రోజులు, ఒంటి మీద దద్దుర్లు వచ్చే ముందు 12-14 రోజుల వరకు ఉంటుంది.
-వ్యాధిలో ఉండే ప్రథమ లక్షణాలు అస్వస్థత భావన, జ్వరం, తుమ్ములు, ముక్కు నుంచి నీరు కారడం, దగ్గు, కళ్లు ఎరబడటం.
– రోగిని వేరుగా ఉంచడం వల్ల ఈ వ్యాధిని తగ్గించవచ్చు.
ప్రాక్టీస్ బిట్స్
1. కామెర్ల వ్యాధిని కలగజేసే వైరస్ దేని ద్వారా వ్యాప్తి చెందుతుంది? (2)
1) గాలి 2) నీరు
3) జంతువులు 4) ఆహారం
2. ప్లేగు వ్యాధి కలిగించే బ్యాక్టీరియాకు వాహకంగా పనిచేసే జంతువులు? (1)
1) ఎలుకలు 2) కుక్కలు
3) పిల్లులు 4) గొరెలు
3. ఎల్లో జ్వరానికి వాహకాలుగా ఏవి పనిచేస్తాయి? (4)
1) ఎలుకలు 2) కుక్కలు
3) పిల్లులు 4) కోతులు
4. రోగకారక క్రిములతో కలుషితమైన మేత తినడం వల్ల పశువులకు మ్యాడ్-కౌ వ్యాధి ఏ దేశంలో వచ్చింది? (3)
1) ఇండియా 2) పాకిస్థాన్
3) బ్రిటన్ 4) అమెరికా
5. అతినిద్ర వ్యాధికి పొదిగే కాలం ఎంత? (1)
1) 20-30 సంవత్సరాలు
2) 30-40 సంవత్సరాలు
3) 40-50 సంవత్సరాలు
4) 50-60 సంవత్సరాలు
6. మెదడు వాపు వ్యాధిని కలిగించే వైరస్ రకం ఏది? (3)
1) రిట్రో వైరస్ 2) రైనో వైరస్
3) అర్బో వైరస్ 4) జికా వైరస్
7. తట్టు (అమ్మవారు) వ్యాధిని కలిగించే వైరస్ ఏది? (2)
1) ఎడినో వైరస్ 2) పారామిక్సో వైరస్
3) కరోనా వైరస్ 4) పోలియో వైరస్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు