దేహానికి ఎదుగుదల.. భాగాలకు పెరుగుదల
మొక్కల పెరుగుదల, ప్రత్యుత్పత్తి, వివిధ జీవక్రియలను నియంత్రించ డానికి ప్రత్యేకమైన రసాయనాలు ఉంటాయి. వాటినే మొక్కల వృద్ధి నియంత్రకాలు అంటారు. ఇవి విత్తనాలు మొలకెత్తడం, ఫలాలు, పుష్పాలు ఏర్పడటం, కాయలు పండటం వంటి చర్యల్లో ప్రముఖపాత్ర వహిస్తాయి. పోటీ పరీక్షల్లో జీవశాస్త్రం సబ్జెక్టులో మొక్కల వృద్ధి నియంత్రకాలు అనే అంశం నుంచి ప్రశ్నలు ఉంటాయి. ఈ నేపథ్యంలో ఆక్సిన్లు, సైటోకైనిన్లు, జిబ్బరెల్లిన్ వంటి మొక్కల హార్మోన్ల విధుల గురించి తెలుసుకుందాం..
మొక్కల వృద్ధి నియంత్రకాలు
మొక్కల్లోని వివిధ భాగాల్లో ఉత్పత్తి చెంది ఆ స్థానం నుంచి మరొక భాగంలోకి చేరి అల్ప గాఢతతో ఒక క్రియను ప్రేరేపించే కర్బన రసాయనాలను వృద్ధి నియంత్రకాలు అంటారు. ఇవి మొక్కల్లో పెరుగుదలను నియంత్రిస్తాయి. అదేవిధంగా రసాయనిక సమన్వయం చేస్తాయి. వీటినే ఫైటో హార్మోన్లు అని కూడా పిలుస్తారు.
ఆక్సిన్లు
మొక్కల్లో మొదటగా కనుగొన్న హార్మోన్ ఆక్సిన్. ఇవి లేత ఆకులు, కాండాగ్రం, పూమొగ్గలు వంటి భాగాల్లో ఏర్పడతాయి. ఆక్సిన్ కణ వ్యాకోచం కలిగించడం ద్వారా పెరుగుదలను ప్రేరేపిస్తుంది. మొక్కల్లో కాండాగ్రం అధికంగా పెరగడాన్ని ఆక్సిన్లు వృద్ధి చెందిస్తాయి. ఈ ప్రక్రియనే అగ్రాధిక్యం అంటారు. ఖండించిన కాండం వేర్ల ఉత్పత్తిని ఆక్సిన్లు ప్రేరేపిస్తాయి. ఆక్సిన్లు మొక్కల అగ్రభాగాలు కాంతి వైపునకు పెరగడాన్ని, వేర్లు, భూమి వైపునకు పెరగడాన్ని ప్రోత్సహిస్తాయి. ఫలం ఏర్పడటానికి, ఫలాల పెరుగుదలకు ఆక్సిన్లు అవసరం.
ఉదాహరణ: NAA(నాఫ్తలీన్ ఎసిటిక్ ఆమ్లం), IAA (ఇండోల్ 3 ఎసిటిక్ ఆమ్లం), 2,4-డి (2,4 -డైక్లోరో ఫినాక్సీ ఎసిటిక్ ఆమ్లం)
జిబ్బరెల్లిన్లు
మొక్కల లేత ఆకులు, వేర్ల అంగాలు, వృద్ధి చెందే విత్తనాలు, మొలకెత్తే విత్తనాలు, పిండాల్లో జిబ్బరెల్లిన్లు ఉంటాయి. ఇవి మొక్కల కాండం పెరుగుదల, విత్తనాలు మొలకెత్తడం, సుప్తావస్థను తొలగించడం, అనిషేక ఫలాలు ఏర్పడటం, లింగ నిర్ధారణ వంటి వాటిని ప్రోత్సహిస్తాయి.
ఉదాహరణ: జిఎ1 (GA1), జిఎ2 (GA2), జిఎ3 (GA3)
సైటోకైనిన్లు
సైటోకైనిన్లు లేత పిండ కణజాలాలు, వృద్ధి చెందే కాయలు, పండ్లలో అధికంగా ఉంటాయి. ఇవి వేరు వ్యవస్థలో ఎక్కువగా తయారై కాండానికి రవాణా అవుతాయి. సైటోకైనిన్లు కణవిభజనను, కాండంలో పార్శ కోరకాల పెరుగుదల. పత్రరంధ్రాలు తెరుచుకోవడం వంటి వాటిని ప్రేరేపిస్తాయి. ఆక్సిన్ల వల్ల పత్రాలు ఆలస్యంగా పసుపు రంగులోకి మారతాయి. అంటే పత్రాలు పండడాన్ని నెమ్మదిస్తాయి.
ఉదాహరణ: కైనిటిన్, బెంజైల్ అమైన్
అబ్స్సిక్ ఆమ్లం
ఇది మొక్కల్లో పెరుగుదలను నిరోధించే పదార్థంగా పనిచేస్తుంది. సుప్తావస్థలో ఉన్న మొగ్గలు, విత్తనాలు, బాగా ముదిరిన పత్రాల్లో అబ్సిసిక్ ఆమ్లం ఎక్కువగా ఉంటుంది. ఈ ఫైటో హార్మోన్ మొగ్గలు, విత్తనాల్లో సుప్తావస్థను ప్రేరేపిస్తుంది. పత్ర రంధ్రాలు మూసుకొని పోవడం, పత్రాలు పసుపుపచ్చగా మారడాన్ని ప్రోత్సహిస్తుంది.
పండ్లలో ఇథిలీన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది.
ఇథిలీన్
విభాజ్య కణజాలం, కణుపు భాగాల్లో కూడా ఇథిలిన్ ఉత్పత్తి జరుగుతుంది. ఈ హార్మోన్ ఫలాలు పక్వానికి రావడానికి దోహదపడుతుంది. పత్రాలు పుష్పాలు రాలిపోవడాన్ని ఇథిలీన్ ప్రేరేపిస్తుంది. అగ్రాధిక్యతను పోగొడుతుంది.
ప్రాక్టీస్ బిట్స్
1. మొక్కల్లో రసాయనిక సమన్వయాన్ని జరపడానికి ఉపయోగపడేవి?
1) ఫైటో హార్మోన్లు 2) ప్రొటీన్లు
3) విటమిన్లు 4) ఖనిజ లవణాలు
2. ఫైటోహార్మోన్లలో ఏ హార్మోన్ పెరుగుదల నిరోధకంగా ఉంటుంది?
1) ఆక్సిన్ 2) జిబ్బరెల్లిన్
3) సైటోకైనిన్ 4) అబ్సిసిక్ ఆమ్లం
3. మొక్కల్లో ఆక్సిన్లు కింది ఏ భాగాల్లో ఏర్పడతాయి?
1) కాండాగ్రం 2) ఫలాలు
3) విత్తనాలు 4) పిండాలు
4. ఖండించిన కాండం నుంచి వేర్లు ఏర్పడటానికి ఉపయోగపడే ఏ ఫైటోహార్మోన్ను వ్యవసాయం, ఉద్యానవన రంగాల్లో వినియోగిస్తారు?
1) జిబ్బరెల్లిక్ ఆమ్లం
2) కైనిటిన్
3) ఇండోల్ ఎసిటిక్ ఆమ్లం
4) ఇథిలీన్
5. ఆక్సిన్లు ఏవిధంగా ఉపయోగపడతాయి?
1) కణుపు మాధ్యమాల పెరుగుదలకు
2) పండ్ల పక్వతకు
3) విత్తనాల అంకురణకు
4) గుల్మనాశకాలుగా
6. వ్యవసాయ రంగంలో జిబ్బరెల్లిన్లు ఏ విధంగా ఉపయోగపడతాయి?
1) అగ్రాధిక్యతను పెంచడానికి
2) ద్రాక్షలో విత్తన రహిత ఫలాలు పొందడానికి
3) కలుపు మొక్కలను నిర్మూలించడానికి
4) విత్తనాల సుప్తావస్థ ప్రోత్సహించడానికి
7. కింది వాటిలో వాయురూపంలో ఉండే ఫలాల పరిపక్వతకు ఉపయోగపడే హార్మోన్ ఏది?
1) ఆక్సిన్ 2) సైటోకైనిన్
3) జిబ్బరెల్లిక్ ఆమ్లం 4) ఇథిలీన్
8. మొక్కల్లో వృద్ధి నిరోధకంగా పనిచేసే హార్మోన్ ఏ భాగాల్లో ఎక్కువగా ఉంటుంది?
1) కాండాగ్రం
2) పరిపక్వం చెందిన ఫలాలు
3) సుప్తావస్థలో ఉన్న విత్తనాలు
4) వేరు అగ్రం
9. ఫలదీకరణం జరగకుండానే అండాశయం ఫలంగా మారడాన్ని అనిషేకఫలనం అంటారు. దీన్ని ప్రేరేపించే హార్మోన్ ఏది?
1) ఇండోల్ ఎసిటిక్ ఆమ్లం
2) జిబ్బరిల్లిక్ ఆమ్లం
3) నాఫ్తలీన్ ఎసిటిక్ ఆమ్లం
4) ఇండోల్ బ్యూటరిక్ ఆమ్లం
10. కింది వాటిలో మొక్కల్లో ఏర్పడే ఫైటోహార్మోన్ కాదు?
1) సైటోకైనిన్ 2) కైనిటిన్
3) ఇథిలీన్ 4) ఫైకోఎరిథ్రిన్
11. మిరప పంటలో పూత రాలిపోకుండా ఉండటానికి వాడే హార్మోన్ ఏది?
1) కైనటిన్ 2) జియాటిన్
3) ఇండోల్ ఎసిటిక్ ఆమ్లం
4) ఫినాక్సి ఆమ్లం
12. మొక్కల దేహ భాగాల్లో మాత్రమే జరిగే ప్రత్యుత్పత్తిని ఏమంటారు?
1) శాఖీయ ప్రత్యుత్పత్తి
2) లైంగిక ప్రత్యుత్పత్తి
3) అలైంగిక ప్రత్యుత్పత్తి
4) అంతర ప్రత్యుత్పత్తి
13. కాండం ద్వారా మాత్రమే వ్యాప్తి చెందే మొక్కకు ఉదాహరణ.
1) వేప 2) చెరకు 3) వరి 4) గోధుమ
14. ఏ భూగర్భ కాండంలో కన్నులు అనే నిర్మాణాలుండి వాటి నుంచి కొత్త మొక్కలు ఏర్పడతాయి?
1) క్యారెట్ 2) అరటి
3) బంగాళాదుంప 4) పసుపు
15. కింది వాటిలో మార్పు చెందిన భూగర్భకాండం ఏది?
1) ముల్లంగి 2) బీట్రూట్
3) క్యారెట్ 4) పసుపు
16. మనం కూరల్లో వాడే అల్లం దేని రూపాంతరం?
1) మార్పు చెందిన వేరు
2) మార్పు చెందిన భూగర్భకాండం
3) వాయుగత కాండం
4) రసయుత భూగర్భకాండం
17. శాఖీయ ప్రత్యుత్పత్తి వల్ల తరువాతి తరంలో కలిగే లక్షణం ఏంటి?
1) కొత్త లక్షణాలు ఏర్పడతాయి
2) ఉత్పరివర్తనాలు కలుగుతాయి
3) తల్లి మొక్కల లక్షణాలు ఉంటాయి
4) రెండు మొక్కల లక్షణాలు ఉంటాయి
18. ఏ మొక్క వేరుపై మొగ్గలు ఏర్పడి అవి వాయుగతమై కొత్త మొక్కలు ఏర్పడతాయి?
1) అరటి 2) మందార
3) అల్లం 4) కరివేపాకు
19. రణపాల మొక్క కింది ఏవిధంగా ప్రత్యుత్పత్తి చూపుతుంది?
1) కాండపు మొగ్గల ద్వారా
2) వేరు మొగ్గల ద్వారా
3) పత్రపు మొగ్గల ద్వారా
4) కాండ ఛేదనాల ద్వారా
20. కింది ఏ మొక్కల్లో వాయుగతంగా ఉండే మిధ్యాకాండం ఉంటుంది?
1) మందార 2) అరటి
3) జామ 4) క్రోటాన్
21. పుష్పంలోని రక్షక, ఆకర్షణ పత్రావళిని కలిపి ఏమని పిలుస్తారు?
1) అనావశ్యక భాగాలు
2) శాఖీయ భాగాలు
3) ప్రాథమిక భాగాలు
4) ఆవశ్యక భాగాలు
22. ఏ మొక్క వేరుపై మొగ్గలు ఏర్పడి అవి వాయుగతమై కొత్త మొక్కులు ఏర్పడతాయి?
1) అరటి 2) మందార
3) అల్లం 4) కరివేపాకు
23. కింది వాటిని జతపరచండి.
మొక్క క్రోమోజోమ్ల సంఖ్య
ఎ. ముల్లంగి i. 18
బి. బఠానీ ii. 14
సి. వరి iii. 24
డి. మొక్కజొన్న iv. 20
1) ఎ- i బి-ii సి-iii డి-iv
2) ఎ- iv బి-iii సి-ii డి-i
3) ఎ- iii బి-ii సి-i డి-iv
4) ఎ- i బి-ii సి-iv డి- iii
24. కింది వాటిని జతపరచండి.
పుష్ప వలయం పుష్ప భాగాలు
ఎ. మొదటి i.అండకోశం
బి. రెండవ ii. కేసరావళి
సి. మూడవ iii. ఆకర్షణ పత్రాలు
డి. నాలుగవ iv. రక్షణ పత్రాలు
1) ఎ- i బి- ii సి-iii డి-iv
2) ఎ- iii బి-ii సి-i డి-iv
3) ఎ-iv బి-ii సి-iii డి-i
4) ఎ- iv బి-iii సి-ii డి-i
25. అంకురచ్ఛదయుత విత్తనాలకు ఉదాహరణ.
1) చిక్కుడు 2) వరి 3) బఠాని 4) శనగ
26.మొక్కల ప్రత్యుత్పత్తిలో రెండో పురుష సంయోగ బీజదం ద్వితీయ కేంద్రకంతో సంయోగం చెందిన తర్వాత ఏర్పడే నిర్మాణం, దాని కేంద్రక స్థితి తెలపండి?
1) అండాంతర: కణజాలం- 3n
2) సంయుక్త బీజం- 2n
3) పరిచ్ఛదం-2n
4) అంకురచ్ఛదం-3n
సమాధానాలు
1. 1 2. 4 3. 1 4. 3 5. 4 6. 2 7. 4 8. 3 9. 2 10. 4 11. 3 12. 1 13. 2 14. 3 15. 4 16. 2
17. 3 18. 4 19. 3 20. 2 21. 4 22. 4 23. 1 24. 4 25.2 26.4
మొక్కల శాస్త్రీయ నామాలు
శాస్త్రీయ నామం సాధారణ నామం
నీలంబియం తామర
న్యూసిఫెరా నింఫియా ఆల్బ కలువ
ఒరైజా సటైవా వరి
ట్రిటికమ్ ఈస్టివమ్ గోధుమ
బాంబుసా బాంబస్ వెదురు
ఎల్యుసీన్ కొరకానా రాగులు
హోర్డియమ్ వల్గేర్ బార్లీ
సఖారమ్ అఫిసినారమ్ చెరుకు
సోర్గమ్ బైకలర్ జొన్న
రిసినస్ కమ్యునిస్ ఆముదం
ఫిల్లాంథస్ ఎంబ్లికా ఉసిరి
మెంథా ఆర్వెన్సిస్ పుదీనా
కైసాంథిమమ్ ఇండికమ్ చామంతి
హీలియాంథస్ ఆన్యువస్ పొద్దుతిరుగుడు
కుకుమిస్ సటైవస్ దోస
లుప్ఫా అక్యుటాంగుల బీర
అరాఖిస్ హైపోజియా వేరుశనగ
పైసమ్ సటైవమ్ బఠాని
డాలికస్ లాబ్లాబ్ చిక్కుడు
కజానస్ కజాన్ కందులు
విగ్న రేడియేటా పెసర
టీరోకార్పస్ సాంటలినస్ ఎర్రచందనం
టామరిండస్ ఇండికా చింతకాయ
సాంటాలం ఆల్బం చందనం
నికోటియానా టొబాకమ్ పొగాకు
కోకస్ న్యూసిఫెరా కొబ్బరి
అవీనా సటైవా ఓట్లు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు