Biology – TET, DSC Special | నేలపై స్థిరత్వం.. భాగాల అభివృద్ధి.. ఆహార ఉత్పాదన
మొక్కలు
మొక్కలు సాధారణంగా మూడు రకాలుగా ఉంటాయి. అవి.. తీగలు/ఎగబాకే మొక్కలు, పొదలు, వృక్షాలు.
తీగలు/ఎగబాకే మొక్కలు: కాండం బలహీనంగా ఉండి, చెట్లపై గానీ, పందిర్లపై గానీ, ఏదైనా ఆధారంపై గానీ పెరుగుతాయి.
ఉదా: బీర, మల్లె, కాకర
పొదలు: ఈ మొక్కల కాండం మొదలు నుంచి అనేక కొమ్మలు గుంపులు గుంపులుగా పెరుగుతాయి.
వృక్షాలు: ఇవి పెద్దవిగా, విశాలంగా ఉంటాయి. వీటి కాండం దృఢంగా, మందంగా ఉండి కలప లభిస్తుంది. ఈ మొక్కల్లో ప్రధానంగా వేరు, కాండం, పత్రం అనే భాగాలు అభివృద్ధి చెంది ఉంటాయి.
వేరు
- నేల లోపల ఉండే మొక్క భాగం వేరు. ఇది బూడిద వర్ణంలో ఉంటుంది.
- ఇది మృత్తిక నుంచి నీరు, ఖనిజ లవణాలను గ్రహిస్తుంది.
- మొక్కకు స్థిరత్వాన్ని ఇస్తుంది.
- కొన్ని మొక్కల్లో వేర్లు ఆహార పదార్థాలను నిల్వ చేయడం వల్ల ఉబ్బినట్లు కనిపిస్తాయి. వీటిని దుంప వేర్లు అంటారు.
ఉదా: క్యారెట్, బీట్రూట్, ముల్లంగి, చిలగడ దుంప
వేరు - వేరు వ్యవస్థ రెండు రకాలుగా ఉంటుంది. అవి.. తల్లి వేరు వ్యవస్థ, పీచు వేరు వ్యవస్థ.
తల్లి వేరు వ్యవస్థ: దీనిలో ప్రధానమైన వేరు ఉంటుంది. దీని నుంచి చిన్న చిన్న పక్కవేర్లు ఏర్పడతాయి.
ఉదా: ద్విదళ బీజాలు, వేప, చింత
పీచు వేరు వ్యవస్థ: దీనిలో కాండం పీఠ భాగం నుంచి అనేక సన్నని కేశాల వంటి వేర్లు ఏర్పడతాయి. వీటిని పీచు వేర్లు అంటారు.
ఉదా: ఏకదళ బీజాలు, వరి, జొన్న, మొక్కజొన్న - నీటి మొక్కల వేర్లు మృదువుగా, స్పాంజిలాగా ఉండి తేలడానికి సహాయపడతాయి.
- గులాబి, మల్లె వంటి మొక్కల్లో వేర్లు లోతులోకి పెరగవు.
- మర్రి, వేప, చింత వృక్షాల్లో వేర్లు నేల లోతుల్లోకి చొచ్చుకొని పోతాయి.
- కొన్ని మొక్కల వేర్లను వేసవిలో చల్లదనం కోసం ఉపయోగించే కూల్ మ్యాట్స్లోనూ దుస్తులు ఉంచే అల్మారల్లో మంచి వాసన కోసం ఉపయోగిస్తారు.
- లెమన్ గ్రాస్ వేర్లను సువాసన తైలాల్లోనూ, దోమలను తరిమే పదార్థాల్లో ఉపయోగిస్తారు.
కాండం - మొక్కలోని నేల పైభాగాన్ని కాండం అంటారు.
- కాండం నుంచి కొమ్మలు, పత్రాలు, పువ్వులు, ఫలాలు ఏర్పడతాయి.
- ఇది వేరు గ్రహించిన నీటిని, ఖనిజ లవణాలను మిగతా శాఖలకు, భాగాలకు, పత్రాలకు సరఫరా చేస్తుంది.
- మొక్కలు నిలకడగా నిలబడటానికి సహాయపడతుంది.
- కొన్ని మొక్కల్లో కాండం ఆహార పదార్థాలను నిల్వ చేసి ఉబ్బినట్లు ఉంటుంది.
ఉదా: బంగాళాదుంప, అల్లం, పసుపు, చెరకు, చామ, కంద, ఉల్లి, నీరుల్లి
వాయు వినిమయం - పత్రంలోని పత్ర రంధ్రం, కాండంలో ఉన్న లెంటిసెల్స్ ద్వారా వాయు వినిమయం విసరణ పద్ధతి ద్వారా జరుగుతుంది.
నోట్: వరంగల్ జిల్లాలో ఒక సంప్రదాయ కుటీర పరిశ్రమ ఉంది. ఇక్కడ ఎండిన ఆకులపై నృత్యాలు, సంప్రదాయ చిత్రాలు గీస్తారు. - మొక్కల కొమ్మలను, పత్రాలను లేదా పూర్తి మొక్కలను భద్రపరచడాన్ని హెర్బేరియం అంటారు. ఇది మొక్కలు, వాటి భాగాలపై పాఠశాలలు, కళాశాలల్లో ప్రయోగ పరీక్షలకు, పరిశోధన చేయడానికి ఉపయోగపడుతుంది.
గ్లోబల్ వార్మింగ్ (భూతాపం) - చెట్లను నరికివేయడం వల్ల వాతావరణంలో కార్బన్ డై ఆక్సైడ్ ఎక్కువ అవుతుంది. అందువల్ల భూమి వేడెక్కుతుంది. దీన్నే భూగోళం వేడెక్కడం లేదా గ్లోబల్ వార్మింగ్ అంటారు.
- గ్లోబల్ వార్మింగ్ వల్ల వర్షాలు తగ్గుతాయి.
- స్వీడన్‌కు చెందిన గ్రెటాథన్‌బర్గ్ అనే పర్యావరణ కార్యకర్త యూఎన్వో వాతావరణ సదస్సు (2018)లో ప్రసంగించారు.
- ఈ కార్యకర్త వాతావరణ మార్పులపై చేపట్టిన ఉద్యమం అంతర్జాతీయ గుర్తింపు పొందింది.
కాగితం తయారీ - వెదురు, యూకలిప్టస్, సుబాబుల్ వంటి చెట్ల నుంచి కాగితం తయారవుతుంది.
- మన అవసరాల కోసం ప్రతిరోజు వేల కొలది చెట్లను నరుకుతున్నారు.
- కాగితాన్ని పొదుపు చేస్తే చెట్లను కాపాడినట్లే.
- ఒక టన్ను పేపర్ తయారు చేయడానికి 17 వృక్షాలను నరికివేయాల్సి వస్తుంది.
- పేపర్‌ను వాడిన తర్వాత దాన్ని 5-7 సార్లు రీసైక్లింగ్ చేసి ఉపయోగించవచ్చు. తద్వారా అడవుల నరికివేతను తగ్గించవచ్చు.
కంప్రెస్డ్ కార్డ్బోర్డ్ - ఫర్నిచర్ తయారు చేయడానికి మనం పూర్వం ఎక్కువగా అడవులను నరికి ఆ వృక్షాలను చెక్కలుగా చేసి ఫర్నిచర్ తయారు చేసేవారు.
- చెక్కపొట్టు, కర్ర ముక్కలతో కలిపి చేసిన గుజ్జుకు రసాయన సల్ఫేట్ కలిపి సెల్యూలోజ్ను తయారు చేస్తారు.
- ఈ గుజ్జును కర్ర ముక్కలకు ఉపయోగించి కార్డ్బోర్డ్లను తయారు చేస్తారు. ఇది కర్రలా గట్టిగా బలంగా ఉంటుంది.
- కంప్రెస్డ్ కార్డ్‌బోర్డ్‌ను తయారు చేయడం వల్ల కలప కోసం అడవులను అధికంగా నరకవలసిన అవసరం ఉండదు.
పర్యావరణ పరిరక్షణ సంస్థలు - నేషనల్ గ్రీన్ కోర్: గ్రామస్థులకు పర్యావరణం మీద అవగాహన కల్పించడం. ఉన్నత పాఠశాలల్లో దీని కార్యకలాపాలు జరుగుతున్నాయి. పాఠశాలను పచ్చదనం చేయడం, శ్రమ విలువను గుర్తించడం, వాతావరణ కాలుష్యాన్ని గుర్తించడం దీని లక్ష్యాలు. పని అనుభవం ద్వారా పచ్చదనాన్ని ఆస్వాదించవచ్చు.
- కౌన్సిల్ ఫర్ గ్రీన్ రివల్యూషన్: కౌన్సిల్ ఫర్ గ్రీన్ రివల్యూషన్ (సీజీఆర్)వారు గ్రామాల్లో పాఠశాలల ద్వారా పని చేస్తున్నారు. ఇది ప్రధానంగా ప్రకృతిని కాపాడటానికి ఏర్పడింది. విద్యార్థులకు పర్యావరణ పట్ల అవగాహన కల్పిస్తుంది. హరిత యజ్ఞంలో విద్యార్థులను భాగస్వాములను చేస్తుంది. కోటి మొక్కలు నాటడం ఈ సంస్థ లక్ష్యం. ఒక్కొక్క విద్యార్థికి ఐదు మొక్కలు అందిస్తుంది. ఈ సంస్థ చేపట్టిన ఉద్యమం పేరు వన ప్రేరణ ఉద్యమం. వన ప్రేరణ ఉద్యమంలో గ్రామస్థులు, టీచర్లు, విద్యార్థులు భాగస్థులు. ఈ కార్యక్రమంలో భాగంగా ఒకేరోజు రెండు లక్షల మొక్కలను నాటారు. ఈ ఉద్యమంలో భాగమైన విద్యార్థులకు వన ప్రేమి పురస్కారం, మెడల్‌తో సత్కరిస్తుంది.
- హరిత పాఠశాల పురస్కారం: నాగర్‌కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలంలోని గడ్డంపల్లిలోని పాఠశాలకు వచ్చింది. ఈ పాఠశాలకు సీజీఆర్ 400 రకాల మొక్కలను అందజేసింది. వీటిలో సగం పాఠశాలలో, సగం ఇళ్లలో నాటారు. అంతేకాకుండా మొక్కలకు పుట్టినరోజులు జరిపారు. పాఠశాలల్లో విద్యార్థులతో పర్యావరణ ప్రతిజ్ఞ చేయిస్తారు.
వివిధ ప్రాంతాల్లో పెరిగే మొక్కలు - మైదాన ప్రాంతం: రావి, మర్రి, మామిడి, చింత, బ్లాక్‌బెర్రి మొదలైనవి
- పర్వత ప్రాంతం: పైన్, ఓక్ తదితరాలు
- ఎడారి ప్రాంతం: బ్రహ్మజెముడు, నాగజెముడు, కాక్టస్, కలబంద మొదలైనవి
- నీటి అడుగున వేరు ఉండేవి: కలువ, తామర
- నీటిపైన: డక్‌వీడ్, గుర్రపు డెక్క
- నీటి మధ్యలో: హైడ్రిల్లా, టేప్గ్రాస్
పర్యావరణ ఉద్యమాలు
ఖజారి వృక్షపు కౌగిలి ఉద్యమం: ఈ ఉద్యమం 1730లో జరిగింది. ఈ ఉద్యమానికి నాయకత్వం వహించింది అమృతాదేవి. ఇందులో 350 మంది వైష్ణవులు పాల్గొన్నారు. వైష్ణవులకు పవిత్రమైనవి ఖజారి వృక్షాలు. ఖజారి వృక్షాలను నరికివేస్తున్నప్పుడు వైష్ణవులు వాటిని కౌగిలించుకునేవారు. అమృతాదేవి బిష్ణోయ్ తెగకు చెందినవారు. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ మహారాజు 1730లో నూతన రాజమందిరం నిర్మించడానికి చెట్లను నరికివేయాలని మంత్రులను ఆదేశించారు. ఆ సమయంలో చెట్లను కౌగిలించుకున్నందుకు అమృతాదేవిని నరికి చంపారు.
చిప్కో ఉద్యమం: 1970లో జరిగింది. ఈ ఉద్యమానికి ప్రేరణ ఇచ్చింది ఖజారి వృక్షపు కౌగిలి ఉద్యమం. చిప్కో ఉద్యమాన్ని నడిపించింది సుందర్‌లాల్ బహుగుణ. చిప్కో అంటే హిందీలో హత్తుకోవడం అని అర్థం.
నల్ల వ్యాలీ వన రక్షణ సమితి: ఇది మెదక్ జిల్లాలో ఉంది. 1993లో ఏర్పడింది. దీనిలోని సభ్యుల సంఖ్య ప్రారంభంలో 600 మంది. నల్ల వ్యాలీ అటవీ ప్రాంతంలో వన సంరక్షణ సమితి సభ్యులకు కేటాయించిన భూమి 310.40 హెక్టార్లు. వీరు అటవీ ప్రాంతంలో అనేక నీటి కుంటలు నిర్మించారు.
పత్రం
- మొక్క జీవితంలో ముఖ్యమైన భాగం.
- ప్రతి పత్రంలో పీఠం, పత్ర వృంతం, పత్ర దళం వంటి భాగాలుంటాయి.
- కాండంపై పత్ర పీఠం, అంటుకుని ఉండే ప్రదేశాన్ని కణుపు అంటారు.
- మొక్కల పత్రాలు ఆకుపచ్చగా, ఉండటానికి గల కారణం పత్రహరితం.
- పత్ర పీఠాన్ని, పత్ర దళాన్ని పత్ర వృంతం కలుపుతుంది.
- పత్ర దళంలో అనేక రేఖలు ఉంటాయి. వీటిని ఈనెలు అంటారు.
- వీటి మధ్యలో పొడవాటి ఈనెలను మధ్య ఈనె అంటారు. దీని నుంచి సన్నగా ఉండే ఈనెలను పార్శ/పక్క ఈనెలు అంటారు.
- పత్ర దళం, నడిమ ఈనె, పార్శ ఈనెలు పత్రానికి ఆకారాన్ని పటుత్వాన్ని ఇస్తాయి.
ఈనెల వ్యాపనం - పత్రంలోని ఈనెలు అమరి ఉండే విధానాన్ని ఈనెల వ్యాపనం అంటారు.
- ఇది రెండు రకాలుగా ఉంటుంది. అవి.. జాలాకార ఈనెల వ్యాపనం (తల్లి వేరు వ్యవస్థ కలిగిన ద్విదళ బీజ మొక్కలు), సమాంతర ఈనెల వ్యాపనం (పీచువేరు వ్యవస్థ కలిగిన ఏకదళ బీజ మొక్కలు)
పత్రం విధులు - పత్రం రెండు ముఖ్యమైన విధులను నిర్వర్తిస్తుంది. అవి.. కిరణజన్య సంయోగక్రియ, బాష్పోత్సేకం.
- పత్రంలోని రంధ్రాల (కాండంలోని లెంటిసెల్స్) ద్వారా నీరు ఆవిరి రూపంలో బయటకు పోవడాన్ని బాష్పోత్సేకం అంటారు.
- పత్ర రంధ్రం చుట్టూ ఉండే రక్షక కణాలు మూత్ర పిండం ఆకారంలో ఉంటాయి.
బోన్సాయ్ వృక్షాలు
- వీటిని వామన వృక్షాలు అంటారు. అంటే పొట్టి వృక్షాలు.
- ఎంత పెద్ద చెట్టునైనా ఒక చిన్న పూలకుండిలో గాని, చిన్న సైజు కుండల్లో గాని పెంచవచ్చు. మర్రిచెట్టును కూడా కుండీల్లో పెంచవచ్చు.
- బోన్సాయ్ వృక్షాల పెంపకమనేది జపాన్ దేశపు సంప్రదాయ కళ.
టి.కృష్ణ
విషయ నిపుణులు,
ఏకేఆర్ స్టడీ సర్కిల్, వికారాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు