Biology | రవాణాదారులు.. అవరోధకారులు.. రోగ నిరోధకాలు
రక్త ప్రసరణ వ్యవస్థ
శరీరంలో జరిగే అన్ని జీవక్రియలు రక్త ప్రసరణ వ్యవస్థతో అనుసంధానమై ఉంటాయి. రక్తం శరీరానికి కావలసిన ఆక్సిజన్, ఆహార పదార్థాలు, హార్మోన్లను అన్ని అవయవాలకు చేరవేస్తుంది. జీవక్రియల ఫలితంగా ఏర్పడిన వ్యర్థాలు, కార్బన్ డై ఆక్సైడ్‌ను బయటకు పంపించడంలో తోడ్పడుతుంది. దేహంలో రక్తం తక్కువైతే జీవ క్రియలు సరిగ్గా జరగక మరణం సంభవిస్తుంది. ఈ నేపథ్యంలో రక్త ప్రసరణ వ్యవస్థ, రక్తం గురించి తెలుసుకుందాం..
- రక్త ప్రసరణ వ్యవస్థను కనుగొన్న శాస్త్రవేత్త- విలియం హార్వే
- రక్త ప్రసరణ వ్యవస్థలో గుండె, రక్తం, రక్తనాళాలు ఉంటాయి.
రక్తం
- రక్తం అనేది ఎరుపు రంగులో ఉండటానికి కారణమైన ప్రొటీన్-హిమోగ్లోబిన్
- కీటకాల రక్తం తెలుపు రంగులో ఉంటుంది. దానికి కారణం వాటి రక్తంలో హిమోగ్లోబిన్ ఉండదు.
- నత్తలు, పీతల రక్తం నీలి రంగులో ఉంటుంది. దానికి కారణమయ్యే ప్రొటీన్ హీమోసయనిన్.
- దోమ రక్తాన్ని పీల్చుకున్నప్పుడు అది గడ్డ కట్టకుండా ఉండటానికి హీమోలైసిన్ అనే ప్రొటీన్‌ను ఉత్పత్తి చేస్తుంది.
- జలగ రక్తాన్ని పీల్చుకునేటప్పుడు రక్తం గడ్డ కట్టకుండా ఉండటానికి హిరుడిన్ అనే ప్రొటీన్‌ను ఉత్పత్తి చేస్తుంది.
- రక్తం గడ్డకట్టక ముందు పైన ఏర్పడిన తెలుపు రంగు ద్రవాన్ని ప్లాస్మా అంటారు.
- రక్తం గడ్డ కట్టిన తర్వాత పైన ఏర్పడిన పసుపు రంగు ద్రవాన్ని సీరం అంటారు.
- రక్తంలో రెండు భాగాలుంటాయి.
అవి 1. ప్లాస్మా 2. రక్త కణాలు.
ప్లాస్మా - రక్తంలో ప్లాస్మా 55 శాతం ఉంటుంది.
- ప్లాస్మాలో నీరు 90 శాతం ఉంటుంది.
- ప్లాస్మాలో మూడు అతిముఖ్యమైన ప్రొటీన్లు ఉంటాయి. అవి..
అల్బుమిన్: ఈ ప్రొటీన్ లోపం వల్ల ఎడిమా అనే వ్యాధి వస్తుంది. కాళ్లలో నీరు చేరి ఉబ్బడం ఈ వ్యాధి లక్షణం.
గ్లోబ్యులిన్: ఈ ప్రొటీన్ ఆహార పదార్థాల జీర్ణక్రియలో పాల్గొంటుంది.
ప్రోథ్రాంబిన్: ఈ ప్రొటీన్ రక్తం గడ్డ కట్టడానికి తోడ్పడుతుంది.
రక్త కణాలు - రక్తంలో 45 శాతం రక్త కణాలుంటాయి.
- రక్త కణాల్లో 90 శాతం నీరుంటుంది.
- రక్త కణాలు రుచికి ఉప్పుగా ఉంటాయి.
- రక్త కణాల నిర్మాణం, స్వభావం, విధులను ఆధారంగా చేసుకుని మూడు రకాలుగా విభజించారు. అవి. 1. ఎర్ర రక్తకణాలు 2. తెల్ల రక్తకణాలు 3 రక్త ఫలకికలు.
ఎర్ర రక్తకణాలు (ఎరిత్రోసైట్లు)
- ఎర్ర రక్తకణాలు ఆక్సిజన్ రవాణాలో సహాయపడతాయి.
- ఎర్ర రక్తకణాల జన్మ స్థలం- అస్థి మజ్జ/ ఎముక మజ్జ
- ఎర్ర రక్తకణాలు ప్లీహంలో విచ్ఛిన్నమవుతాయి. కాబట్టి ప్లీహాన్ని ఎర్ర రక్తకణాల శ్మశాన వాటిక అంటారు.
- వీటి జీవిత కాలం 115 నుంచి 120 రోజులు.
- ఎర్ర రక్తకణాలు గుండ్రంగా ఒకదానికొకటి అంటిపెట్టుకుని ఉండి, ద్విపుటాకారంగా ఉంటాయి.
- క్షీరదాల ఎర్ర రక్తకణాల్లో కేంద్రకం ఉండదు. కానీ ఒంటె, లామా వంటి క్షీరదాల్లో కేంద్రకం ఉంటుంది.
- పురుషుల్లో ఎర్ర రక్తకణాలు 1 క్యూబిక్ మిల్లీలీటర్ రక్తంలో 4.5-6.5 మిలియన్లు ఉంటాయి.
- స్త్రీలలో 1 క్యూబిక్ మిల్లీ లీటర్‌కు 3.5 నుంచి 5.5 మిలియన్లు ఉంటాయి.
తెల్ల రక్తకణాలు (ల్యూకోసైట్లు)
- తెల్ల రక్తకణాల జన్మస్థలం- బాలగ్రంథి/ థైమస్ గ్రంథి
- తెల్ల రక్తకణాల విచ్ఛిన్న స్థలం-కాలేయం/శోషరసం
- తెల్ల రక్తణాల జీవిత కాలం- 12-13 రోజులు. వీటి సంఖ్య 1 క్యూబిక్ మిల్లీ లీటర్ రక్తంలో 4-11 వేలు ఉంటుంది.
- వ్యాధి నిరోధకశక్తిని పెంచడంలో తెల్ల రక్తకణాలు సహాయపడతాయి.
- తెల్ల రక్తకణాలు శరీరంలోకి ప్రవేశించిన వ్యాధికారక సూక్ష్మజీవులను చంపివేస్తాయి. కాబట్టి వీటిని రక్షకభటులు అంటారు.
- క్షీరదాల తెల్ల రక్తకణాల్లో కేంద్రకం ఉంటుంది.
- వీటికి నిర్దిష్టమైన ఆకారం ఉండదు. కాబట్టి వీటిని అమీబాను పోలి ఉన్న కణాలంటారు.
- ఏదైనా గాయం అయినప్పుడు వ్యాధికారక సూక్ష్మజీవులకు, తెల్ల రక్తకణాలకు యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో కొన్ని తెల్ల రక్తకణాలు చనిపోతాయి. చనిపోయిన రక్తకణాలు చీము రూపంలో బయటకు వస్తాయి.
- తెల్ల రక్తకణాల సంఖ్య పెరగడం వల్ల ల్యూకేమియా (బ్లడ్ క్యాన్సర్) వస్తుంది.
- తెల్ల రక్తకణాలను రెండు రకాలుగా విభజించారు అవి. గ్రాన్యులోసైట్స్, ఎగ్రాన్యులోసైట్స్.
గ్రాన్యులోసైట్స్ (రేణు సహిత తెల్ల రక్తకణాలు) - గ్రాన్యులోసైట్స్ను మూడు రకాలుగా వర్గీకరించారు. అవి ఇసినోఫిల్స్, బేసోఫిల్స్, న్యూట్రోఫిల్స్
ఇసినోఫిల్స్: ఇవి ఆమ్లస్థితిలో ఉంటాయి. గుర్రపు నాడ ఆకృతిలో ఉంటాయి. శరీరంలోకి ప్రవేశించిన విష పదార్థాలను విషరహితంగా మారుస్తాయి. వీటి సంఖ్య పెరగడం వల్ల అలర్జీ వంటి చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది.
బేసోఫిల్స్: ఇవి క్షార స్థితిలో ఉంటాయి. S ఆకారంలో ఉంటాయి. ఇవి గాయాలను మానడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. రక్తంలో ఇవి 0.1 శాతం ఉంటాయి. తెల్ల రక్తకణాల్లో అతితక్కువ సంఖ్యలో ఉండేవి బేసోఫిల్స్. వీటి దగ్గరికి వచ్చిన సూక్ష్మజీవులను భక్షిస్తాయి. కాబట్టి వీటిని భక్షక కణాలు అంటారు.
న్యూట్రోఫిల్స్: ఇవి తటస్థ స్థితిలో ఉంటాయి. నక్షత్రాకారంలో ఉంటాయి. రక్తంలో వీటి శాతం 6.7శాతం. తెల్ల రక్తకణాల్లో ఎక్కువగా ఉండేవి ఇవే. వీటి దగ్గరకు వచ్చిన సూక్ష్మజీవులను చంపేస్తాయి. కాబట్టి వీటిని సూక్ష్మ రక్షక భటులు అంటారు.
ఎగ్రాన్యులోసైట్స్ (రేణు రహిత తెల్ల రక్తకణాలు) - ఎగ్రాన్యులోసైట్స్ను వాటి నిర్మాణం, విధులను ఆధారంగా చేసుకుని రెండు రకాలుగా విభజించారు. అవి లింఫోసైట్లు, మోనోసైట్లు.
లింఫోసైట్స్: ఇవి తెల్ల రక్తకణాల్లోని అతిచిన్న కణాలు. లింఫోసైట్స్ అనేవి ప్రతిరక్షకాలను ఉత్పత్తి చేసి, వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. ఈ కణాలు ఎయిడ్స్ వ్యాధి వచ్చిన వారిలో నాశనం అవుతాయి. ఇవి రెండు రకాలు అవి..
T-లింఫోసైట్స్: ఈ కణాలు ఎయిడ్స్ వ్యాధి వచ్చిన వ్యక్తిలో నాశనం అవుతాయి.
B- లింఫోసైట్స్: ఈ కణాలు ఎయిడ్స్ వ్యాధి వచ్చిన వ్యక్తిలో వ్యాధినిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.
మోనోసైట్స్: ఇవి తెల్ల రక్తకణాల్లో ఉండే అతిపెద్ద కణాలు. వీటినే కాస్మటోసైట్స్/హిస్టోసైట్స్ అంటారు. ఈ కణాల సంఖ్య పెరగడం వల్ల ల్యూకోమియా/ బ్లడ్ క్యాన్సర్ వస్తుంది.
రక్త ఫలకికలు (త్రాంబోసైట్స్)
- రక్త ఫలకికలు అస్థిమజ్జలోని మెగా కార్డియోసైట్స్ కణాల్లో ఉద్భవిస్తాయి.
- కాలేయంలో విచ్ఛిన్నమవుతాయి. కాబట్టి కాలేయాన్ని రక్తఫలకికల శ్మశానవాటిక అంటారు.
- రక్త ఫలకికల జీవిత కాలం 3-10 రోజులు.
- రక్త ఫలకికలు రక్తం గడ్డకట్టడానికి సహాయపడతాయి.
- మానవుడిలో ఉండే రక్త ఫలకికల సంఖ్య 1 క్యూబిక్ మిల్లీలీటర్ రక్తంలో 1.50 లక్షల నుంచి 4 లక్షల వరకు ఉంటుంది.
- డెంగీ జ్వరం రావడం వల్ల రక్త ఫలకికల సంఖ్య తగ్గుతుంది.
- రక్తం గడ్డ కట్టడానికి సహాయపడే ప్రొటీన్లు- ప్రోథ్రాంబిన్, ఫైబ్రినోజన్
- రక్తం గడ్డకట్టడానికి సహాయపడే ఎంజైమ్- థ్రాంబోకైనేజ్
- ఫైబ్రిన్ అనేది విడిపోయిన రక్తకణాల పైన ఒక దారపు పోగుల వలె చుట్టి దాన్ని ఒకదగ్గరికి తీసుకొచ్చి రక్తం గడ్డకట్టడంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది.
- రక్తఫలకికల ఆకారం గుండ్రంగా ఉండి, ఒకదానితో ఒకటి కలిసిపోకుండా ద్వికుంభాకారంగా ఉంటాయి.
- క్షీరదాల రక్త ఫలకికల్లో కేంద్రకం ఉండదు.
రక్తనాళాలు
- రక్తనాళాల గురించి చదివే శాస్త్రాన్ని ఆంజియాలజీ అంటారు.
- రక్తనాళాలను ఉపయోగించి గుండెకు చేసే చికిత్సను ఆంజియోప్లాస్టి అంటారు.
- రక్తనాళాలు మూడు రకాలుగా ఉంటాయి. అవి. ధమనులు, సిరలు, రక్త కేశనాళికలు.
ధమనులు - ఇవి అతి ఎక్కువ దృఢత్వాన్ని కలిగి ఉంటాయి.
- ఇవి గుండె నుంచి రక్తాన్ని శరీర భాగాలకు తీసుకువెళతాయి.
- మంచి రక్తం ఎరుపు రంగులో ఉంటుంది. చెడు రక్తం కొంచెం నీలి రంగును సంతరించుకుంటుంది.
- ధమనుల్లో రక్తం అలల వలె ప్రవహిస్తుంది.
- ధమనులు అనగానే జఠరికలను పరిగణనలోకి తీసుకోవాలి.
- ధమనుల్లో మంచి రక్తం ప్రవహిస్తుంది. కానీ పుపుస ధమనిలో చెడు రక్తం ప్రవహిస్తుంది.
- ధమనులు మూడు రకాలు అవి మహా ధమని, పుపుస ధమని, కరోనరి ధమని.
మహా ధమని (బృహద్ధమని): ఇది ఎడమ జఠరిక నుంచి బయలుదేరి మంచి రక్తాన్ని ఊపిరితిత్తులకు తప్ప శరీర భాగాలకు తీసుకెళ్తుంది. ఇది అతిపెద్ద ధమని.
పుపుస ధమని: ఇది కుడి జఠరిక నుంచి బయలుదేరి చెడు రక్తాన్ని ఊపిరితిత్తుల్లోకి తీసుకెళ్తుంది. ఇది అతిచిన్న ధమని.
కరోనరి ధమని: ఇది ఎడమ జఠరిక నుంచి బయలుదేరి మంచి రక్తాన్ని హృదయ కండరాలకు తీసుకెళ్తుంది. ఈ ధమనుల్లో అడ్డంకులు ఏర్పడటం వల్ల గుండెకు సంబంధించిన వ్యాధులు వస్తాయి.
సిరలు - సిరలు అతితక్కువ దృఢత్వాన్ని కలిగి ఉంటాయి.
- ఇవి శరీర భాగాల నుంచి చెడు రక్తాన్ని గుండెకు చేరుస్తాయి. చెడు రక్తం కొద్దిగా నీలి వర్ణంలోకి మారుతుంది.
- సిరల్లో చెడు రక్తం ప్రవహిస్తుంది కానీ పుపుస సిరలో మంచి రక్తం ప్రవహిస్తుంది.
- సిరల్లో రక్తం ధారల వలె ప్రవహిస్తుంది.
- సిరలు అనగానే కర్ణికలను పరిగణనలోకి తీసుకోవాలి.
- ఇవి నాలుగు రకాలుగా ఉంటాయి.
పూర్వ మహాసిర: ఇది తల, కాళ్లు, చేతుల నుంచి చెడు రక్తాన్ని కుడి కర్ణికలలోకి చేరుస్తుంది.
పర మహాసిర: కాళ్ల మొదటి భాగం, మొండెం మొదటి భాగం నుంచి చెడు రక్తాన్ని కుడి కర్ణికలోకి చేరుస్తుంది.
పుపుస సిర: ఊపిరితిత్తుల నుంచి మంచి రక్తాన్ని ఎడమ కర్ణికలోకి చేరుస్తుంది.
కరోనరి సిర: హృదయ కండరాల నుంచి చెడు రక్తాన్ని కుడి కర్ణికలోకి చేరుస్తుంది.
రక్త కేశనాళికలు - రక్త కేశనాళికలు శరీరం అంతటా ఒక పలుచని గోడల వలె విస్తరించి ఉంటాయి.
- ఇవి సిరలతో ప్రారంభమై ధమనులతో అంతమవుతాయి.
- ధమనులు రక్తం ద్వారా తీసుకొచ్చిన ఆహార పదార్థాలను కణాలకు చేరవేస్తాయి.
- కణాల్లో ఏర్పడిన వ్యర్థ పదార్థాలను సిరల్లో చేరవేస్తాయి.
టి.కృష్ణ
విషయ నిపుణులు,
ఏకేఆర్ స్టడీ సర్కిల్, వికారాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు