History of Telangana with Satavahanas |శాతవాహనులతో తెలంగాణ చరిత్రలో నూతన శకం
శాతవాహన యుగం
-దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన తొలి ప్రధాన రాజవంశం శాతవాహనులది. దక్షిణ భారతదేశంలో తొలి విశాల సామ్రాజ్యాన్ని స్థాపించి సుదీర్ఘకాలంపాటు రాజకీయ సమైక్యతను కల్పించిన ఘనత వీరిది. సుమారు రెండున్నర శతాబ్దాలు పరిపాలించిన వీరి కాలంలో దక్షిణ భారతదేశంలో సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో ప్రగతిశీలక మార్పులు చోటుచేసుకున్నాయి. వీరి కాలంలో సాహిత్య, వాస్తు, శిల్పకళలకు గొప్ప ఆదరణ లభించింది.
-మౌర్యుల కాలంలో సామంతులుగా ఉండి కణ్వ వంశ కాలంలో స్వాతంత్య్రాన్ని ప్రకటించుకున్నారు. తెలంగాణలోని కరీంనగర్ జిల్లా కోటిలింగాలవద్ద వీరి పాలన ప్రారంభమై తరువాత ప్రతిష్ఠానపురం (పైఠాన్) రాజధానిగా, మలిశాతవాహనుల కాలం నాటికి ధనకటకాన్ని (ధాన్యకటకం లేదా అమరావతి) రాజధానిగా చేసుకొని పాలించారు.
-వీరు ఉత్తరభారతదేశంలో మగథ వరకు తమ దిగ్విజయయాత్రను నిర్వహించారు. శాతవాహన సామ్రాజ్యం పశ్చిమాన అరేబియా సముద్రం నుంచి తూర్పున బంగాళాఖాతం వరకు వ్యాపించింది. శాతవాహనులు తెలంగాణ ప్రాంతానికి గుర్తించదగిన సాంస్కృతిక సేవను అందించారు.
శాతవాహనులకు సంబంధించిన చారిత్రక ఆధారాలు సాహిత్య ఆధారాలు
-పురాణాలు: పురాణాలు శాతవాహన రాజుల పేర్లను తెలుపుతున్నాయి. పురాణాలు వీరిని ఆంధ్రభృత్యులని పేర్కొన్నాయి.
-వాయు, విష్ణు, భాగవత పురాణాలు శాతవాహన రాజుల సంఖ్యను 30గా పేర్కొన్నాయి. మత్స్యపురాణం వీరి సంఖ్య 29 అని, 460 ఏండ్లు పరిపాలించారని పేర్కొంది.
-వాత్సాయనుడి కామసూత్రాలు: వాత్సాయనుడు కామసూత్రాల్లో కుంతల శాతకర్ణి రాజును పేర్కొన్నారు.
-సోమదేవుడు రాసిన కథాసరిత్సాగరంలో సాత యక్షుని వాహనంగా కలవాడే శాతవాహనుడని పేర్కొన్నాడు.
-ఐతరేయ బ్రాహ్మణం విశ్వామిత్రుడు శపించి తరిమివేసిన సొంత సంతానం 50 మందిలో ఒకని సంతానం ఆంధ్రులని పేర్కొంటుంది.
-మహాభారతంలో ఆంధ్రులు కౌరవుల పక్షాన యుద్ధం చేశారని, వారిని సహదేవుడు ఓడించినట్లు పేర్కొంది.
-బాణుడు రాసిన హర్షచరిత్రలో శాతవాహన రాజు నాగార్జుని మిత్రుడని యజ్ఞశ్రీ శాతకర్ణి త్రిసముద్రాదీశ్వరుడు అని పేర్కొన్నాడు.
-ఆచార్య నాగార్జునుడు తను రాసిన సుహృల్లేఖ (స్నేహితునికి లేఖ) గ్రంథంలో శాతవాహన రాజైన యజ్ఞశ్రీ శాతకర్ణి గురించి ప్రస్తావించారు.
-కుతూహలుడు ప్రాకృతంలో రాసిన లీలావతి పరిణయంలో హాల చక్రవర్తి తన సైన్యాన్ని తూర్పు భాగానికి తీసుకొని వెళ్లాడని పేర్కొంది. అంతేగాక హాలుని వివాహం సప్తగోదావరి తీరాన జరిగిందని తెలిపింది. ఈ సప్తగోదావరి ప్రాంతం ప్రస్తుతం జగిత్యాల జిల్లాలోని వేంపల్లి వెంకట్రావ్పేటగా చరిత్రకారులు గుర్తించారు.
-మెగస్తనీస్ తన ఇండికా గ్రంథంలో ఆంధ్రులు మంచి శక్తిమంతులని, వారికి 30 కోటలు ఉన్నాయని, లక్ష పదాతిదళం ఉన్నదని పేర్కొన్నాడు.
పురావస్తు ఆధారాలు
-శాసనాలు: మొదటి శాతకర్ణి భార్య దేవి నాగానిక ఈ శాసనాన్ని వేయించింది. ఇది అలంకార శాసనం. దీనిపై తొలి శాతవాహన రాజుల ప్రతిమలు చెక్కి ఉన్నాయి. ఈ శాసనంవల్ల మొదటి శాతకర్ణికి వీర, శూర, అప్రతిహత చక్ర, దక్షిణాపథపతి బిరుదులు ఉండేవని, ఇతడు రెండుసార్లు అశ్వమేథ యాగం చేశాడని తెలుస్తుంది.
-నాసిక్ శాసనం: ఈ శాసనాన్ని శాతవాహన చక్రవర్తి గౌతమీపుత్ర శాతకర్ణి తల్లి గౌతమీబాలశ్రీ తన మనుమడైన వాసిష్టీపుత్ర పులోమావి 19వ పాలనా సంవత్సరంలో వేయించింది. ఈ శాసనం గౌతమీపుత్ర శాతకర్ణి సాధించిన విజయాలను, ఘనతలను తెలుపుతుంది. క్షత్రియ దర్పమాణమర్దన, ఏకబ్రాహ్మణ, త్రిసముద్రతోయపీతవాహన మొదలైన బిరుదులు శాతకర్ణికి ఉన్నాయని ఈ శాసనం తెలుపుతుంది.
-జునాఘడ్, గిర్నార్ శాసనం: క్షాత్రప రుద్రదాముడు వేయించిన ఈ శాసనంలో యజ్ఞశ్రీ శాతకర్ణిని రుద్రదాముడు రెండుసార్లు ఓడించి తనకు సన్నిహిత బంధువైనందున విడిచిపెట్టినట్లు పేర్కొన్నాడు.
-హాథిగుంఫా శాసనం: ఈ శాసనాన్ని ఖారవేలుడు వేయించాడు. దీనిలో మొదటి శాతకర్ణి రాజ్యమైన కన్నబెన్నపై దాడిచేసినట్లు తెలిపాడు.
కట్టడాలు, నాణేలు
-కొండాపూర్: ఇది మెదక్ జిల్లాలో ఉంది. శాతవాహనులకు చెందిన సుమారు 4000 నాణేలు ఇక్కడ లభించాయి. సదవాహన, గౌతమీపుత్ర శాతకర్ణి, వాసిష్టీపుత్ర శాతకర్ణి, పులోమావి, యజ్ఞశ్రీ శాతకర్ణి నాణేలు ఇందులో ఉన్నాయి. కొండాపూర్‌ను శాతవాహనుల టంకశాల నగరమని మల్లంపల్లి సోమశేఖరశర్మ వ్యాఖ్యానించారు. మెగస్తనీస్ పేర్కొన్న ఆంధ్రుల 30 కోటల్లో ఇది ఒకటి.
-కోటిలింగాల: ప్రస్తుత జగిత్యాల జిల్లాలోని గోదావరి, పెద్దవాగు, సంగమ స్థానంలో ఉంది. ఇక్కడ జరిపిన తవ్వకాల్లో శాతవాహనుల కోటగోడలు, ఒక బురుజు బయటపడ్డాయి. ఇక్కడ శాతవాహనుల్లో మొదటి రాజైన శ్రీముఖుని నాణేలు, శాతవాహనుల పూర్వపు రాజుల నాణేలు దొరికాయి. శాతవాహనుల సామ్రాజ్యానికి ఇది తొలి రాజధాని.
-పెద్దబంకూరు: ప్రస్తుతం పెద్దపల్లి జిల్లాలో ఉంది. ఇక్కడ 22 వేలకు పైగా ఉన్న శాతవాహనుల నాణేలకుండ, వీరి కాలంనాటి 3 ఇటుక కోటల అవశేషాలు, ఇటుకలతో నిర్మించిన 22 చేదబావులు బయటపడ్డాయి. ఇక్కడ రోమన్ చక్రవర్తులైన ఆగస్టస్, సీజర్, టైబీలియస్ నాణేలు కూడా దొరికాయి.
-ధూళికట్ట: పెద్దపల్లి జిల్లాలో ఉంది. ఇక్కడ జరిపిన తవ్వకాల్లో శాతవాహనుల కాలంనాటి బౌద్ధస్థూపం బయల్పడింది. దీన్ని మట్టికోటగా పిలుస్తున్నారు. కోటలోపల రాజభవనాలు, బావులు, ధాన్యాగారాలు మొదలైన అవశేషాలు బయటపడ్డాయి.
-శాతవాహనుల జన్మస్థలం: వీరి జన్మస్థానం, తొలి రాజధాని గురించి చరిత్రకారుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.
-కోస్తాంధ్రవాదం: శాతవాహనుల తొలి నివాసం ఆంధ్ర అని, ఆర్జీ భండార్కర్, వీఏ స్మిత్, బార్నెట్, రాప్సన్ మొదలైన చరిత్రకారులు అభిప్రాయపడ్డారు. కానీ ఈ వాదనను తరువాత కాలంలో కొట్టివేశారు.
-మహారాష్ట్రవాదం: శాతవాహనుల జన్మస్థానం మహారాష్ట్ర అని, తొలి రాజధాని ప్రతిష్ఠానపురం (పైఠాన్) అని పీటీ శ్రీనివాస్ అయ్యంగార్, కే గోపాలచారి, డీసీ సర్కార్, భండారీలు తెలిపారు.
-ఇంకా శాతవాహనుల జన్మభూమి ప్రాంతం విదర్భ అని వీవీ మిరాశి, కర్ణాటకలోని బళ్లారి అని వీఎస్ సుక్తాంకర్ అభిప్రాయపడ్డారు. కానీ వీరు తగిన ఆధారాలు చూపలేకపోయారు.
-తెలంగాణవాదం: ప్రస్తుత జగిత్యాల జిల్లాలోని ధర్మపురి ప్రాంతానికి చెందిన సుగనభట్ల నరహరిశర్మ అనే తపాలా శాఖ ఉద్యోగి కోటిలింగాలలో లభించిన నాణేలను సేకరించి 1970లో ప్రముఖ శాసనపరిశోధకుడు డా. పీవీ పరబ్రహ్మశాస్త్రిగారికి అందజేశారు. ఈ నాణేల్లో శాతవాహన వంశస్థాపకుడు, తొలి రాజైన శ్రీముఖుని నాణేలు కేవలం కోటిలింగాలలోనే లభించడంతో శాతవాహనుల పాలన తెలంగాణలోనే ప్రారంభమైందని అజయ్మిత్రశాస్త్రి, దేమె రాజిరెడ్డి, ఠాకూర్ రాజారాంసింగ్, కృష్ణశాస్త్రి మొదలైనవారు పేర్కొన్నారు.
-వీరి పాలన కోటిలింగాల నుంచే ప్రారంభమైందని పురావస్తు తత్వవేత్త పీవీ పరబ్రహ్మశాస్త్రి కూడా పేర్కొన్నారు. ఈ విధంగా మొదటి శాతవాహన రాజ్యం కోటిలింగాల కేంద్రంగా తెలంగాణలోనే ఏర్పడిందని చెప్పడం
సమంజసం.
-శాతవాహనుల పరిపాలనలో తెలంగాణ చరిత్ర, సంస్కృతి పలువిధాలుగా అభివృద్ధిచెందాయి. మొత్తానికి వీరి పాలనతో తెలంగాణ చరిత్రలో ఒక నూతనశకం ప్రారంభమైందని చెప్పవచ్చు.
శాతవాహన పాలకులు
శ్రీముఖుడు
-పురాణ పట్టికల ప్రకారం శాతవాహన రాజుల్లో శ్రీముఖుడు మొదటివాడు.
-ఇతడే శాతవాహన రాజ్య స్థాపకుడు.
-కోటిలింగాల వద్ద దొరికిన శ్రీముఖునికి సంబంధించిన 8 నాణేల్లో ఒకటి మాత్రమే పోటెన్ అనే మిశ్రమ నాణెం, మిగిలినవన్నీ రాగి నాణేలు.
-ఈ నాణేలపై శ్రీముఖుని పేరు చీముకుడని ముద్రించి ఉంది.
-శాసనాల్లో సిముకుడిగా, పురాణాల్లో చిస్మకుడుగా, నాణేలపై చీమకుడుగా ముద్రించారు.
-శ్రీముఖుడు మొదట జైన మతాన్ని స్వీకరించి అనేక జైన గుహలను నిర్మించారు.
-తన చివరి రోజుల్లో వైదికమతాన్ని స్వీకరించాడు.
-ఇతను తన పరిపాలన కాలంలో భూజక, పిటినిక, పుళింద మొదలైన జాతులను ఓడించి రాజ్య విస్తరణకు పునాదులు వేశాడు.
-శ్రీముఖుడు రఠికుల కుమార్తె నాగానికకు తన కుమారుడైన మొదటి శాతకర్ణితో వివాహం జరిపించి, వారి సహాయంతో తన ఆధిక్యతను పెంపొందించుకున్నాడు.
-మౌర్య చక్రవర్తి అశోకుడు శ్రీముఖునికి రాజ అనే బిరుదును ఇచ్చాడు.
కృష్ణుడు (కన్హ)
-శ్రీముఖుని మరణానంతరం అతని కుమారుడైన మొదటి శాతకర్ణి యుక్త వయస్కుడు కానందున శ్రీముఖుని సోదరుడు కృష్ణుడు రాజయ్యాడు.
-ఇతను కన్హేరి, నాసిక్ గుహలను తొలిపించాడు.
-శాతావాహనుల్లో శాసనాన్ని వేయించిన మొదటి రాజు ఇతడు.
-ఇతని శాసనం ప్రకారం ఇతని రాజోద్యోగి (మహామాత్ర) ఒకరు నాసిక్‌లో బౌద్ధగుహాలయాన్ని నిర్మించాడు.
-ఇతను వేయించిన కన్హేరి శాసనంలో మహామాత్ర అనే పదంవల్ల శాతవాహనులు మౌర్యుల పాలనా విధానం కొనసాగించినట్లు తెలుస్తుంది.
మొదటి శాతకర్ణి
-పురాణాలు మొదటి శాతకర్ణి కృష్ణుని కుమారుడని పేర్కొన్నాయి.
-కానీ నానాఘాట్లోని శిల్పాలను బట్టి మొదటి శాతకర్ణి శ్రీముఖుని కుమారుడని తెలుస్తుంది.
-ఇతని భార్య నాగానిక వేయించిన నానాఘాట్ శాసనంవల్ల ఇతని ఘనత తెలుస్తుంది.
మొదటి శాతకర్ణి శుంగులపై విజయానికి చిహ్నంగా రెండు అశ్వమేథయాగాలు, ఒక రాజసూయయాగం, అనేక క్రతువులు నిర్వహించి దక్షిణాపథపతి అనే బిరుదును పొందారు.
-నానాఘాట్ శాసనాన్ని బట్టి ఇతనికి వీర, శూర, అప్రతిహతచక్ర బిరుదులు ఉన్నట్లు తెలుస్తుంది.
-ఖారవేలుని హాథిగుంఫా శాసనం ప్రకారం ఖారవేలుడు మొదటి శాతకర్ణిని లెక్కచేయక తన సైన్యాలను కన్నబెన్న వరకు పురోగమించి ముషిక నగరాన్ని ధ్వంసం చేసినట్లు తెలుస్తుంది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు