Economic system | శ్రమలో, ఫలితంలో సమ భాగస్వామ్యం
ఆర్థిక వ్యవస్థ-రకాలు
గతవారం తరువాయి..
సామ్యవాద ఆర్థిక వ్యవస్థ (Socialist Economy)
- సోషలిస్టు ఎకానమీ అనేది ఒక ఆర్థిక సంస్థ.
- ఆర్థిక కార్యకలాపాల నిర్వహణ, ఉత్పత్తి కారకాల యాజమాన్యం ప్రైవేటు రంగం కంటే అధికంగా ప్రభుత్వ రంగం ఆధీనంలో ఉంటే అలాంటి ఆర్థిక వ్యవస్థను ‘సామ్యవాద తరహా ఆర్థిక వ్యవస్థ’ అంటారు.
- వస్తుసేవల ఉత్పత్తి, పంపిణీ, ప్రజా శ్రేయస్సు దృష్ట్యా ప్రభుత్వమే నిర్వహిస్తూ ఉత్పత్తి కారకాల యాజమాన్యం, ప్రభుత్వ ఆధీనంలో జాతీయ ఆస్తిగా ఉండే ప్రణాళికా యుతమైన నియంత్రిత విధానమే ‘సామ్యవాద ఆర్థిక వ్యవస్థ’ అంటారు.
- మార్కెట్ ఆర్థిక వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతూ కారల్‌మార్క్స్ ప్రతిపాదించిన సిద్ధాంతాల ఆధారంగా సామ్యవాద తరహా ఆర్థిక వ్యవస్థ రూపొందించబడినది. దీన్నే ప్లానింగ్ మోడల్, స్టేట్ ఎకానమీ, కమాండ్ ఎకానమీ, సెంట్రల్లీ ప్లాన్డ్ ఎకానమీ అని అంటారు.
- 1848లో ‘కమ్యూనిస్ట్ మ్యానిఫెస్టో’ అనేది సాహిత్య వర్గాల్లో ఒక కొత్త రకం ఆర్థిక సిద్ధాంతంగా ఉద్భవించింది.
- కారల్‌మార్క్స్, ఫ్రెడరిక్ ఏంగెల్స్‌తో కలిసి రాసిన కమ్యూనిస్ట్ మ్యానిఫెస్టో అనేది ఒక దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి కొత్త, ప్రత్యేకమైన భావన అయిన సోషలిస్టు ఆర్థిక వ్యవస్థగా పేరు పొందింది.
- ఫాదర్ ఆఫ్ సోషలిజం ఎకానమీ – కారల్ మార్క్స్
- కారల్‌మార్క్స్ ప్రతిపాదించిన సిద్ధాంతాల్లో ప్రధానంగా 2 భాగాలు కలవు.
ఎ) సోషలిస్టు మోడల్: ఈ ఆర్థిక వ్యవస్థలో సహజ వనరులన్నీ ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి. కానీ కార్మికులపై మాత్రం ప్రభుత్వ నియంత్రణ తక్కువగా ఉంటుంది. దీనికి ఉదా: యూఎస్ఎస్ఆర్ మోడల్ (1917-1989) గా భావిస్తారు.
బి) కమ్యూనిస్ట్ మోడల్: ఈ ఆర్థిక వ్యవస్థలో సహజ వనరులతోపాటు, కార్మికులు కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉంటారు. దీనికి ఉదా: చైనా మోడల్ (1949-1985)గా భావిస్తారు.
సోషలిజం రకాలు
- ప్రపంచ వ్యాప్తంగా సోషలిజం వివిధ రూపాల్లో ఉంది.
1) ప్రజాస్వామ్య సోషలిజం
2) విప్లవ సోషలిజం
3) స్వేచ్ఛావాద సోషలిజం
4) మార్కెట్ సోషలిజం
5) గ్రీన్ సోషలిజం
సామ్యవాద ఆర్థిక వ్యవస్థ లక్షణాలు (Features of Socialist Economy)
వనరుల సామూహిక యాజమాన్యం
- ఈ వ్యవస్థలో వనరులతోపాటు ఉత్పత్తి కారకాల యాజమాన్యం కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి.
కేంద్ర ఆర్థిక ప్రణాళిక - ఈ ఆర్థిక వ్యవస్థలో ఎల్లప్పుడు కేంద్ర ప్రణాళిక సంఘం ఉంటుంది. ఇది అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించి ఏం ఉత్పత్తి చేయాలి, ఎంత ఉత్పత్తి చేయాలి ఎలా ఉత్పత్తి చేయాలి అనేది నిర్ణయిస్తుంది. అంతిమంగా సామాజిక ఆర్థిక లక్ష్యాలను నెరవేర్చడం.
వినియోగదారులకు ఎంపిక సౌకర్యం లేదు
- సోషలిస్టు ఆర్థిక వ్యవస్థలో ప్రతిపౌరునికి ప్రాథమిక అవసరాలను, సౌకర్యాలను, వస్తువులను ప్రభుత్వం హామీ ఇస్తుంది. కాని వినియోగదారుడు కోరుకున్న, ఎంపిక చేసుకునే స్వేచ్ఛలేదు ప్రభుత్వం తయారు చేసే ఉత్పత్తుల నుంచి మాత్రమే ఎంపిక చేసుకోవాలి.
ఆదాయం పంపిణీ సమానత్వం - సోషలిస్టు ఆర్థిక వ్యవస్థలో వ్యక్తిగత ఆస్తులు కూడబెట్టుకోవడానికి అవకాశం లేదు. ధనిక, పేదల మధ్య అంతరం తక్కువ పౌరులు సమాన అవకాశాలు అనుభవి స్తారు. సంపదను, ఆదాయాన్ని ప్రజా సంక్షేమం కోసం పౌర సమాజానికి సమాజానికి సమానంగా ప్రభుత్వమే అందిస్తుంది.
పోటీ మార్కెట్ లేకపోవడం - ఈ వ్యవస్థలో పోటీ మార్కెట్ అనే భావన ఉండదు. అంటే మార్కెట్ శక్తులైన డిమాండ్ సప్లయ్ అనే భావనలు కూడా ఉండవు.
ప్రజల భాగస్వామ్యం - ఈ ఆర్థికవ్యవస్థలో ప్రజలు వారి సామర్థ్యాన్ని బట్టి ఆర్థిక కార్యకలాపాల్లో పాలు పంచుకుంటారు. కానీ వారికి అవసరమైన సౌకర్యాలన్నింటినీ ప్రభుత్వం అందిస్తుంది.
ప్రభుత్వ గుత్తాధిపత్యం - ఈ రకమైన వ్యవస్థలో ఉత్పత్తి సంబంధిత పరిమాణం, నాణ్యత, ధర నిర్ణయం మొదలైన అంశాలన్నీ ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. అంతేకాకుండా రక్షిత వాణిజ్య విధానాలు, ఎగుమతులు, దిగుమతులు మొదలైన విధానాలను కూడా ప్రభుత్వమే నిర్వహిస్తుంది.
సామ్యవాద ఆర్థిక వ్యవస్థ ప్రయోజనాలు (Advantages of Socialist Economy)
- సామ్యవాద ఆర్థిక వ్యవస్థలో ఆదాయ అసమానతలు ఉండవు.
- సోషలిస్టు ఆర్థిక వ్యవస్థలో ఏ కార్మికుడు ఏ విధమైన దోపిడీకి గురికాడు.
- సామ్యవాద వ్యవస్థలో ప్రతీ వ్యక్తికి ప్రాథమిక అవసరాలను, వస్తువులను అందించడానికి ప్రభుత్వం హామీ ఇస్తుంది. అంతే కాకుండా విద్య, వైద్యం, ఆరోగ్య సంరక్షణ కల్పిస్తుంది.
- సామ్యవాద వ్యవస్థలో ఎటువంటి వివక్ష ఉండదు. అంటే ప్రభుత్వానికి సహకరించినా, సహకరించకపోయినా ప్రతి పౌరుడికి ఎటువంటి వివక్ష లేకుండా అందరికి సమాన అవకాశాలు, సౌకర్యాలు, కనీస అవసరాలను ప్రభుత్వమే అందిస్తుంది.
- ప్రొ. షుంపీటర్ సోషలిజానికి నాలుగు అనుకూల వాదాలను సూచించారు.
ఎ) ఎక్కువ ఆర్థిక సామర్థ్యం
బి) తక్కువ అసమానత కారణంగా సంక్షేమం
సి) గుత్తాధిపత్య పద్ధతి లేకపోవడం
డి) వ్యాపార ఒడుదొడుకులు లేకపోవడం
సామ్యవాద ఆర్థిక వ్యవస్థలోపాలు (Disadvantages of Socialist Economy)
- సామ్యవాద ఆర్థిక వ్యవస్థలో వనరుల అభిలషణీయ వినియోగం ఉండదు.
- సంపదను ఎవరు సృష్టించాలి, ఎలా సృష్టించాలి అనే అంశాలపై స్పష్టత ఉండదు.
- వ్యక్తిగత ఆస్తికి అవకాశం లేకపోవడం వల్ల వ్యక్తులు, పౌరులు సొంతంగా కష్టపడి నూతన కల్పన సృష్టించి, సంపదను సృష్టించే అవకాశం ఉండదు. కాబట్టి వ్యవస్థలోని సంస్థలన్ని ఇంటర్నల్ DECAY చెందుతాయి.
- దీనివల్ల ప్రజల్లో సోమరితనం పెరుగుతుంది.
- దీనిలో రాజ్యమే శ్రమదోపిడీ చేయడానికి ఆస్కారం ఉంది, దీన్నే స్టేట్ క్యాపిటలిజం అంటారు.
- దీంతో ఆర్థిక వృద్ధి కుంటుబడటం గాని, తక్కువ నమోదు కావడం గాని జరుగుతుంది.
సమీక్ష
- 1970 దశకం నాటికి సోషలిస్ట్ మోడల్ కమ్యూనిస్ట్ మోడల్ దేశాల్లో అంతర్గతంగా ఆర్థిక వ్యవస్థ పతనం చెందడం జరిగింది.
- ఫలితంగా 1980 దశకం నుంచి స్టేట్ ఎకానమీ దేశాలు తమ ఆర్థిక విధానాల్లో కొన్ని మార్పులు చోటుచేసుకున్నాయి. దీనినే మార్కెట్ సోషలిజం అంటారు.
- యూఎస్ఎస్ఆర్ మార్కెట్ ఆర్థిక వ్యవస్థ లక్షణాలు ఎక్కువగా ప్రారంభించి మిక్స్డ్ ఎకానమీగా మారింది. ఇది ట్విన్
పాలసీలను ప్రవేశ పెట్టింది.
1) Perestroika(Restructuring)
2) Glasnost (Openness) - యూఎస్ఎస్ఆర్ చేపట్టిన మార్పులను తూర్పు ఐరోపా దేశాలు ప్రవేశపెట్టాయి.
- 1985లో చైనా కూడా ఓపెన్‌డోర్ పాలసీ విధానాన్ని అవలంబించి మార్కెట్ ఆర్థిక వ్యవస్థ లక్షణాలను ప్రవేశ పెట్టింది.
ప్రాక్టీస్ బిట్స్
1. ఆర్థిక కార్యకలాపాల నిర్వహణ, ఉత్పత్తి కారకాల యాజమాన్యం ప్రైవేటు రంగం కంటే ప్రభుత్వ రంగం ఆధీనంలో అధికంగా ఉంటే అటువంటి ఆర్థిక వ్యవస్థను ఏమంటారు?
ఎ) పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ
బి) సామ్యవాద ఆర్థిక వ్యవస్థ
సి) మిశ్రమ ఆర్థిక వ్యవస్థ
డి) పైవన్నీ
2. ఎవరి సిద్ధాంతం ఆధారంగా సామ్యవాద ఆర్థిక వ్యవస్థ రూపొందింది?
ఎ) ఆడమ్‌స్మిత్ బి) రికార్డో
సి) కారల్‌మార్క్స్ డి) అరిస్టాటిల్
3. సామ్యవాద ఆర్థిక వ్యవస్థకు మరోపేరు?
ఎ) ప్లానింగ్ మోడల్
బి) స్టేట్ ఎకానమీ
సి) కమాండ్ ఎకానమీ
డి) పైవన్నీ
4. కమ్యూనిస్ట్ మ్యానిఫెస్టో గ్రంథ రచయిత?
ఎ) కారల్‌మార్క్స్ బి) ఫ్రెడరిక్ ఏంగెల్స్
సి) ఎ, బి డి) అరిస్టాటిల్
5. ఫాదర్ ఆఫ్ సోషలిస్ట్ ఎకానమీ?
ఎ) ఆడమ్‌స్మిత్ బి) కారల్‌మార్క్స్
సి) ఫ్రెడరిక్ ఏంగెల్స్ డి) అరిస్టాటిల్
6. కిందివాటిలో సామ్యవాద ఆర్థిక వ్యవస్థ లక్షణం ఏది?
ఎ) ఆదాయ పంపిణీ సమానత్వం
బి) ప్రజల భాగస్వామ్యం
సి) ప్రభుత్వ గుత్తాధిపత్యం
డి) పైవన్నీ
7. సామ్యవాద ఆర్థిక వ్యవస్థలో ఆదాయ అసమానతలు?
ఎ) ఉంటాయి బి) ఉండవు
సి) సమతుల్యం డి) ఏదీకాదు
8. ప్రొ. షుంపీటర్ సోషలిజానికి ఎన్ని వాదనలను సూచించారు?
ఎ) 2 బి) 3 సి) 4 డి) 5
9. సామ్యవాద ఆర్థిక వ్యవస్థలో ప్రజల మధ్య వివక్ష?
ఎ) ఉంటుంది బి) ఉండదు
సి) సమతుల్యం డి) ఏదీకాదు
10. ఒక దేశ ప్రజలకు కావలసిన కనీస ప్రాథమిక అవసరాలను, సౌకర్యాలను కల్పించే వ్యవస్థ ఏది?
ఎ) పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ
బి) సామ్యవాద ఆర్థిక వ్యవస్థ
సి) మిశ్రమ ఆర్థిక వ్యవస్థ
డి) పైవన్నీ
11. వ్యక్తిగత ఆస్తికి అవకాశం లేని ఆర్థిక వ్యవస్థ ఏది?
ఎ) పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ
బి) సామ్యవాద ఆర్థిక వ్యవస్థ
సి) మిశ్రమ ఆర్థిక వ్యవస్థ
డి) పైవన్నీ
12. రాజ్యమే శ్రమ దోపిడీ చేసే అవకాశం ఉన్నదాన్ని ఏమంటారు?
ఎ) స్టేట్ సోషలిజం
బి) స్టేట్ క్యాపిటలిజం
సి) స్టేట్ మిక్స్డ్ డి) ఎ, బి
13. కమ్యూనిస్ట్ మ్యానిఫెస్టో ఏ సంవత్సరంలో ప్రచురించారు?
ఎ) 1840 బి) 1845
సి) 1848 డి) 1849
14. సోషలిస్ట్ మోడల్, కమ్యూనిస్ట్ మోడల్‌ను సూచించినది ఎవరు?
ఎ) ఫ్రెడరిక్ ఏంగెల్స్ బి) కారల్‌మార్క్స్
సి) అరిస్టాటిల్ డి) సోక్రటిస్
15. కిందివాటిలో సోషలిస్ట్ మోడల్‌కు ఉదాహరణ?
ఎ) యూఎస్ఎస్ఆర్ బి) చైనా
సి) భారతదేశం డి) శ్రీలంక
16. కిందివాటిలో కమ్యూనిస్ట్ మోడల్‌కు ఉదాహరణ?
ఎ) భారతదేశం బి) నేపాల్
సి) చైనా డి) రష్యా
17. ఆర్థిక వ్యవస్థలో ఆదాయ అసమానతలు లేని వ్యవస్థ ఏది?
ఎ) పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ
బి) సామ్యవాద ఆర్థిక వ్యవస్థ
సి) మిశ్రమ ఆర్థిక వ్యవస్థ
డి) ఏదీకాదు
18. ఓపెన్‌డోర్ పాలసీని అవలంబించిన దేశం ఏది?
ఎ) రష్యా బి) చైనా
సి) అమెరికా డి) ఇండియా
19. కిందివాటిలో సామ్యవాద లక్షణాలు ఏవి?
ఎ) వినియోగదారుని సార్వభౌమాధికారం లేకపోవడం
బి) పోటీ మార్కెట్ లేకపోవడం
సి) ప్రజలు, పౌరుల మధ్య వివక్ష లేకపోవడం డి) పైవన్నీ
20. కింది వాటిలో సామ్యవాద ఆర్థిక వ్యవస్థకు చెందినవి ఏవి?
ఎ) ఆదాయ అసమానతలు లేకపోవడం
బి) వ్యక్తిగత ఆస్తికి అవకాశం లేకపోవడం
సి) కార్మిక దోపిడీ లేకపోవడం
డి) పైవన్నీ
21. అధిక ఆర్థిక సామర్థ్యం తక్కువ అసమానతలు, గుత్తాధిపత్యం లేకపోవడం వ్యాపార ఒడుదొడుకులు లేకపోవడం
వంటి నాలుగు వాదనలు సూచించింది ఎవరు?
ఎ) కారల్‌మార్క్స్
బి) ఫ్రెడరిక్ ఏంగెల్స్
సి) ప్రొ. షుంపీటర్
డి) అరిస్టాటిల్
22. సెంట్రల్లీ ప్లాన్డ్ ఎకానమీ (Centrally Planned Economy) అని ఏ ఆర్థిక వ్యవస్థను పేర్కొంటారు?
ఎ) పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ
బి) మార్కెట్ ఆర్థిక వ్యవస్థ
సి) సామ్యవాద ఆర్థిక వ్యవస్థ
డి) మిశ్రమ ఆర్థిక వ్యవస్థ
23. వస్తు సేవల ఉత్పత్తి, పంపిణీ, ప్రజాశ్రేయస్సు దృష్టితో రూపొందిన ఆర్థిక వ్యవస్థ ఏది?
ఎ) సామ్యవాద ఆర్థిక వ్యవస్థ
బి) ప్లానింగ్ మోడల్
సి) స్టేట్ ఎకానమీ
డి) పైవన్నీ
24. వనరుల దుర్వినియోగం, అస్పష్టత, ప్రజల్లో సోమరితనానికి అవకాశం గల ఆర్థిక వ్యవస్థ ఏది?
ఎ) క్యాపిలటలిస్ట్ ఎకానమీ
బి) సోషలిస్ట్ ఎకానమీ
సి) మిక్స్డ్ ఎకానమీ
డి) మార్కెట్ ఎకానమీ
సమాధానాలు
1-బి 2-సి 3-డి 4-సి
5-బి 6-డి 7-బి 8-సి
9-బి 10-బి 11-బి 12-బి
13-సి 14-బి 15-ఎ 16-సి
17-బి 18-బి 19-డి 20-డి
21-సి 22-సి 23-డి 24-బి
పానుగంటి కేశవ రెడ్డి
రచయిత
వైష్ణవి పబ్లికేషన్స్
గోదావరిఖని
9949562008
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?