ఇవీ ప్రపంచ ప్రకృతిసిద్ధ మండలాలు..
భూమి ఉపరితలంపై ఏ ప్రదేశంలోనైతే శీతోష్ణస్థితి, నైసర్గికస్థితి, సహజ వృక్షసంపద, ఈ మూడింటి సంయుక్త ప్రభావమైన మానవ జీవన విధానంలో పోలిక ఉంటుందో అలాంటి ప్రాంతాన్ని ప్రకృతిసిద్ధ మండలం అంటారు.
-మానవుడు ఉష్ణోగ్రత ఆధారంగా భూ ఉపరితలాన్ని మూడు ఉష్ణోగ్రతా మండలాలుగా విభజించాడు.
1. అత్యుష్ణ మండలం 2. కవోష్ణ సమశీతోష్ణ మండలం 3. అతిశీతల ధృవమండలం
-ఒక ప్రదేశపు సహజ వృక్షసంపద విస్తరణను సహజంగా ఆ ప్రాంతపు ఉష్ణోగ్రత, వర్షపాతం, నేలలు నిర్దేశిస్తాయి. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఉష్ణోగ్రత మాత్రమే ఆధారంగా కొనసాగిన వర్గీకరణను మెరుగుపరిచి భూ ఉపరితలాన్ని నాలుగు శీతోష్ణ మండలాలుగా విభజించారు.
1. అత్యుష్ణ మండలం 2. వెచ్చని సమశీతోష్ణ మండలం 3. చల్లని సమశీతోష్ణ మండలం 4. అతిశీతల ధృవ మండలం
-ఒక ప్రదేశం సముద్రతీరానికి దగ్గరగా ఉంటే అక్కడి శీతోష్ణస్థితిని సముద్ర సామీప్య శీతోష్ణస్థితి అని, దూరంగా ఉంటే ఖండాంతర శీతోష్ణస్థితి అని వర్గీకరించారు.
-అక్షాంశం, సముద్ర సామీప్యాలను పరిగణిస్తూ ప్రపంచాన్ని ఒకే రకంగా ఉండే అనేక శీతోష్ణస్థితి మండలాలుగా విభజించారు. ఆ మండలాలను ప్రపంచ ప్రధాన ప్రకృతిసిద్ధ మండలాలు అంటారు.
భూమధ్యరేఖా మండలం
-అత్యధిక సంవత్సరిక వర్షపాతం సంభవించే భూమధ్య రేఖా మండలాన్ని ఉష్ణమండల వర్షప్రాంతాలు అంటారు.
-ఉనికి: భూమధ్యరేఖకు ఇరువైపులా 100 ఉత్తర, దక్షిణ అక్షాంశాలు, పవనాభిముఖ ప్రాంతాల్లో 150-200 అక్షాంశాల వరకు విస్తరించి ఉన్నాయి.
-విస్తరణ: దక్షిణ అమెరికా-అమెజాన్ నదీ హరివాణం: బ్రెజిల్, బొలీవియా, పెరూ, ఈక్వెడార్, కొలంబియా, వెనెజులా, గయానా, సురినామ్, ఫ్రెంచ్ గయానా, మధ్య అమెరికా, పశ్చిమ ఇండీస్ దీవుల తూర్పుతీర ప్రాంతాలు.
-ఆఫ్రికా-కాంగోనదీ హరివాణం: ఈక్వటోరియల్ గినీ, గేబన్, కాంగో, జైరే, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, సియొర్రాలియోన్, లైబీరియా, ఐవరీకోస్ట్ దేశాల సముద్ర తీర ప్రాంతాలు, టాంజానియా, మొజాంబిక్, మడగాస్కర్.
-ఆసియా: మలేషియా దక్షిణ ప్రాంతం, సింగపూర్, శ్రీలంక, ఇండోనేషియా, ఫిలిప్పైన్స్ దీవులు, బ్రూనై, సులావెసి, న్యూగినియా దేశాల్లోని కొన్ని ప్రాంతాలు, ఓషియానియాకు చెందిన ఇతర దీవులు.
-శీతోష్ణస్థితి: నిర్దిష్ట రుతువులు ఏర్పడవు. ఏడాదిలో చాలా వరకు ప్రతిరోజు సాయంత్రం సంవహన వర్షపాతం సంభవిస్తుంది. సంవత్సరిక వర్షపాతం 150-300 సెం.మీ.
-జావా ద్వీపంలోని బోగోర్ వద్ద సంవత్సరంలో 322 రోజులు ఉరుముల శబ్దం వినిపిస్తుంది.
-ఉష్ణోగ్రత 210-320 వరకు ఉంటుంది.
-ఉష్ణోగ్రతా వ్యత్యాసం 80C. ఈ కారణంగా రాత్రిని ఈ మండలం చలికాలంగా పేర్కొంటారు.
-సహజ వృక్ష సంపద: ఈ మండలంలో ప్రపంచంలోనే అత్యంత దట్టమైన అడువులు సెల్వాలు ఉన్నాయి.
-మహాగని, రోజ్‌వుడ్, సెడార్, ఎబోనీ, గట్టి కలపనిచ్చే వృక్షాలు పెరుగుతాయి.
-తీగ జాతికి చెందిన చెట్ల తీగలు వృక్షాల కాండాల మధ్య ఊయలలు కట్టిన విధంగా అల్లుకొని ఉండే వాటిని లయనాలు అంటారు.
-జంతు సంపద: సెల్వాలులో చెట్లు 40 నుంచి 50 మీటర్ల ఎత్తు వరకు ఏ విధమైన కొమ్మలు లేకుండా పెరుగుతాయి. అయితే, పైభాగంలో అకస్మాత్తుగా కొమ్మలు, రెమ్మలు ఏర్పడి సూర్యకిరణాలు భూమిపై ప్రసరించడానికి వీల్లేని పరిస్థితి ఉంటుంది. అందువల్ల ఈ అరణ్యాల్లో గడ్డి పెరుగదు. ఫలితంగా ఈ ప్రాంతాల్లో గడ్డి తినే జంతువులు వాటిని తినే క్రూర మృగాలూ ఉండవు. ప్రధాన విషసర్పం పెంజేరు. లయనాలపై అనకొండలు ఉంటాయి. ఆఫ్రికా ప్రాంతాల్లో గొరిల్లాలు, నీటిగుర్రం, ఒకాపిస్ ఉంటాయి.
-ప్రజలు: అమెజాన్, కాంగో నదుల హరివాణాల్లో జనసాంద్రత చదరపు కిలోమీటరుకు 5 కంటే తక్కువ. తీర ప్రాంతాల్లో జనసాంద్రత ఎక్కువ.
-జావా ద్వీపం ప్రపంచంలోని అధిక జనసాంద్రత ఉన్న ప్రాంతాల్లో ఒకటి.
-అమెజాన్ నదీ హరివాణంలో రెడ్ ఇండియన్లు, కాంగో నదీ హరివాణంలో పిగ్మీలు, మలేషియా అరణ్యాల్లో సెమాంగ్లు, సకామి, బోర్నియో ద్వీపంలో హెడ్‌హంటర్స్, సుమత్రా ద్వీపంలో కాబూలులు ఈ మండలంలో ముఖ్య ఆదిమ జాతులు.
-ఆర్థిక ప్రగతి: తోటల పెంపక వ్యవసాయానికి ప్రసిద్ధి.
-ప్రపంచ సహజ రబ్బరు మొత్తం ఉత్పత్తిలో 96 శాతం కంటే ఎక్కువ మలేషియా, ఇండోనేషియా దేశాల నుంచి లభిస్తుంది.
-వరి జావా ద్వీపం ప్రధాన పంట.
-ప్రపంచంలో గంధకాన్ని అధికంగా ఉత్పత్తి చేసే దేశం మెక్సికో. తగరాన్ని అధికంగా ఉత్పత్తి చేసే దేశం మలేషియా.
-సింగపూర్, రియోడిజనీరో, జార్జ్‌టౌన్, పోర్ట్ ఆఫ్ స్పెయిన్, మనాస్, లియోపోల్డ్విల్లీ, బాండుంగ్ నగరాలు అభివృద్ధి చెందాయి.
అయన రేఖా ఎడారులు/ ఉష్ణమండల ఎడారులు
-భూ ఉపరితలంపై వ్యవసాయానికి ఉపయోగపడని, ప్రజలు పెద్దగా నివసించని విశాలమైన ప్రాంతాలను ఎడారులు అంటారు.
-ఉనికి: ఖండాల పశ్చిమతీరంలో 150-300 ఉత్తర, దక్షిణ అక్షాంశాల మధ్య విస్తరించి ఉన్నాయి. అంటార్కిటికా మినహా అన్ని ఖండాల్లో ఉన్నాయి.
-విస్తరణ: సహారా ఎడారి: అమెరికా సంయుక్త రాష్ర్టాలకు రెట్టింపు పరిమాణం ఉన్న సహారాఎడారి ఆఫ్రికా ఖండం తూర్పు తీరం వరకు విస్తరించి ఉన్నది. ఇది పశ్చిమ సహారా, మారిటానియా, మాలి, నైగర్, చాద్, సూడాన్, మొరాకో, ట్యునీషియా, అల్జీరియా, లిబియా, ఈజిప్ట్, ఇథియోపియా, ఎరిట్రియా, సోమాలియా దేశాల్లో విస్తరించి ఉన్నది.
-అరేబియా ఎడారి: సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్, ఇజ్రాయెల్, జోర్డాన్, సిరియా, కువైట్, యూఏఈ దేశాల్లో విస్తరించి ఉన్నది.
-థార్ ఎడారి: పాకిస్థాన్‌లోని సింధు నది మధ్య, దిగువలోయ, పరిసర ప్రాంతాలతోపాటు అత్యధికంగా భారత్‌లోని రాజస్థాన్ రాష్ట్రంలో విస్తరించి ఉన్నది.
-ఆస్ట్రేలియా ఎడారి: దక్షిణార్ధగోళంలో అతిపెద్ద ఉష్ణమండల ఎడారి. ఆస్ట్రేలియా పశ్చిమ, దక్షిణ ప్రాంతాల్లో విస్తరించి ఉన్న ఈ ఎడారి ఆ దేశంలో 40 శాతం ప్రాంతాన్ని ఆక్రమించింది.
-కలహారి ఎడారి: ఆఫ్రికా ఖండంలోని నమీబియా, బోట్సువానా, అంగోలా, దక్షిణాఫ్రికా దేశాల్లో విస్తరించి ఉన్నది.
-అటకామా ఎడారి: దక్షిణ అమెరికాలోని ఆండీస్ పర్వతాలకు పశ్చిమంగా చిలీ ఉత్తర తీరప్రాంతం, పెరూ తీర ప్రాంతంలో విస్తరించి ఉన్నది.
-సోనారన్ ఎడారి: మెక్సికోలోని వాయవ్య ప్రాంతం, అమెరికా సంయుక్త రాష్ర్టాల్లోని కాలిఫోర్నియా, అరిజోనా రాష్ర్టాల్లో విస్తరించి ఉన్నది.
-శీతోష్ణస్థితి: ప్రపంచంలో అత్యధిక పగటి ఉష్ణోగ్రతలు (అజీజియా-580C డెత్‌వ్యాలీ/మృతలోయ 56.70C) నమోదవుతాయి.
-రేయింబవళ్ల ఉష్ణోగ్రత వ్యత్యాసం (140C నుంచి 390C) అధికం.
వర్షం కురిసేటప్పుడు, ఆ తర్వాత కొంతసేపటి వరకు కొన్ని తాత్కాలిక ప్రవాహాలు ఏర్పడుతాయి. ఇవి లోతయిన లోయల గుండా ప్రవహిస్తాయి. ఈ లోయలను వాడీలు అంటారు. ఈ ప్రవాహాలు చదునైన భూతలం ఉన్న తాత్కాలిక సరస్సుల్లోకి ప్రవహిస్తాయి. ఈ సరస్సులను ప్లాయాలు అంటారు.
ఎడారి భూతలం ఇసుక పొరతో కప్పి ఉంటే వాటిని ఎర్గ్ (ఇసుక ఎడారులు) అంటారు. ఇసుక పొర లేని వాటిని రెగ్ లేదా హమడా (రాతి ఎడారులు) అంటారు. ఎడారుల గుండా ప్రవహించే నదులను ఎక్సోటిక్ నదులు అంటారు. ఆఫ్రికాలో నైలు, ఆసియాలో సింధు, ఉత్తర అమెరికాలో కొలరాడో, దక్షిణాఫ్రికాలో ఆరెంజ్, ఆస్ట్రేలియాలో డార్లింగ్ నదులు ఇందుకు ప్రధాన ఉదాహరణ.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు