మహిళా సాధికారత సాధిస్తున్నామా?
జనాభాలో దాదాపు సగం ఉన్న మహిళలు ఆర్థికంగా, సామాజికంగా సమాన హక్కులు, సాధికారత సాధించకుండా అభివృద్ధి అసాధ్యమన్న వాస్తవాన్ని ప్రపంచమంతా ఆమోదిస్తున్నది. కుటుంబం, దేశం ప్రగతిపథంలో పురోగమించటంలో మహిళలే కీలకమన్న విషయాన్ని గుర్తెరిగిన ప్రభుత్వాలు వారి అభివృద్ధి, సాధికారత కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నాయి. అనేకరంగాల్లో ఇప్పటికీ వివక్ష కొనసాగుతున్నప్పటికీ మహిళల రక్షణ, స్వావలంబనకోసం అనేక చట్టాలు చేశాయి. భారత్లో కూడా రాజ్యాంగ రక్షణలతోపాటు అనేక చట్టాలు ఉన్నాయి. పోటీపరీక్షల్లో మహిళా సాధికారతపై ఇటీవలికాలంలో ఎక్కువగా ప్రశ్నలు వస్తున్న నేపథ్యంలో నిపుణ పాఠకులకోసం ఈ వ్యాసం..
ఇటీవల కాలంలో మహిళా సాధికారతపై చాలా అర్థవంతమైన చర్చ జరుగుతుంది. నేటి సమాజంలో మహిళా స్థితిగతులు, వారి పనితీరు, వారి హక్కులు, అమలవుతున్న చట్టాలపై ఎంతో అర్థవంతంగా, అవగాహనతో చర్చ జరుగుతుంది. అడపాదడపా దొరుకుతున్న అవకాశాలను అందిపుచ్చుకుంటూ పురోగమిస్తున్నారు. మగవాళ్లకు ఏమాత్రం తీసిపోమని, అన్నిరంగాల్లో మాకు వాటా ఇవ్వాల్సిందేనని గట్టిగా నినదిస్తున్నారు. ఇటీవల ఏపీలో జరిగిన మహిళా పార్లమెంటేరియన్ల సమావేశంలో ప్రతి ఒక్కరూ మహిళా సాధికారిత ఆవశ్యకతను నొక్కి చెప్పారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ ప్రభావం, జర్మనీలో అభిశంసనకు గురైన దిల్మారౌసెస్, అమెరికా ఫెడరల్ బ్యాంక్ అధ్యక్షురాలు జెనెట్ యెల్లెన్, IMF అధ్యక్షురాలు డిలార్ట్, మనదేశంలో ఎవరెస్టును (13 ఏండ్ల వయస్సులో) అధిరోహించిన మాలావత్ పూర్ణ, జయలలిత, శశికళ, ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అభ్యర్థి మాయావతి మొదలైనవారు మగవారికి ఏమాత్రం తీసిపోనివిధంగా అత్యంత చాకచక్యంగా, తెలివితో, ధైర్యంతో మొత్తం సమాజాన్ని తమవైపు తిప్పుకొని మేం మగవాళ్ల కంటే ఎక్కువే అని నిరూపిస్తున్నారు. ఈ సందర్భంలో మహిళా సాధికారత అంటే ఏమిటి? వారికి రాజ్యాంగపరంగా ఉన్న అవకాశాలేంటి? చట్టాలేంటి? పథకాలేంటి మొదలైన విషయాలను తెలుసుకోవడం పోటీపరీక్షల అభ్యర్థులకు ఆవశ్యక అంశం.
మహిళా సాధికారత అంటే..?
ఆధునిక సమాజంలో పురుషులతో సమానంగా హోదాను, అవకాశాల్ని అనుభవిస్తూ నిర్ణయాత్మక స్థితిలో మహిళలు ఉండటాన్ని మహిళా సాధికారత అంటారు.
-అంటే సమాజంలో మహిళలు, పురుషులు సమానమైన గౌరవాన్ని, స్థితిని పొందగలగాలి.
-వారు పొందగలిగే ప్రతి అవకాశాన్ని అందించాలి.
-ప్రతి నిర్ణయంలో మహిళలకు సమానమైన స్థితి ఉండాలి.
మహిళా స్థితి – ఒక చారిత్రక అవలోకన
భారతదేశంలో పూర్వం మహిళలు మగవాళ్లతో సమానంగా హోదాను, స్థితిని అనుభవించారు (పతంజలి, కాత్యాయని). అప్పటి మహిళలు బాగా చదువుకున్నారని, అత్యంత గౌరవప్రదమైన జీవితాన్ని వారు అనుభవించారని వివిధ ప్రాచీన గ్రంథాలు చెపుతున్నాయి.
-కానీ వేదకాలం తరువాత అప్రజాస్వామిక వేదాల వల్ల మహిళల స్థితి, హోదా, గౌరవం తీవ్రంగా పడిపోయాయి. వారిపై విధించిన ఆంక్షలు వారిని తక్కువ స్థాయికి నెట్టివేసి అవకాశాల నుంచి వారిని దూరం చేశాయి.
-సతీసహగమనం, బాల్య వివాహాలు మొదలైన ఆచారాలు మహిళలను సమాజంలో అసమాన హోదాకు తీసుకెళ్లాయి. అందులో పురుషులను ఉన్నతస్థితిలో నిలబెట్టడానికి ఎన్నో అప్రజాస్వామిక, అవమానకర నియమాలు, నిబంధనలు సమాజంలోకి చొరబడి మహిళలను తీవ్రంగా అణచివేసి, వారిని వివక్షకు గురయ్యేటట్టు చేశాయి.
మహిళలకు ఉండే ప్రత్యేక సమస్యలు
1. కనీస మానవ హక్కులను దూరం చేయడం: జీవించే హక్కు, మాట్లాడే హక్కు, నిర్ణయం తీసుకునే హక్కు మొదలైనవన్నీ వారికి దూరం చేయడం.
2. ప్రాథమిక హక్కులైన విద్య, ఆర్థిక స్వతంత్రత, సమానహోదా మొదలైనవన్నీ నిరాకరించడం.
3. మహిళలపై సమాజవైఖరి, గృహహింస, పనిచేసే దగ్గర లైంగిక, మానసిక హింస.
4. చారిత్రాత్మకంగా వారిని నాలుగు గోడలకే పరిమితం చేసి, వారిని బయటకు రాకుండా చేసి, వారిని తీవ్ర మానసిక వేదనకు గురిచేశారు.
5. లింగ అసమానత అన్ని రంగాల్లో పాతుకుపోయింది.
6. నిర్ణయాల్లో వారికి ప్రాధాన్యం లేకపోవడం.
7. మహిళను వివిధ భౌతిక హింసలకు గురిచేయడం పెరిగిపోయాయి.
8. గ్రామీణ, గిరిజన మహిళలకు ఆరోగ్య విషయాలపై సరైన అవగాహన కల్పించేవారు లేక, వారి స్థితిగతులపై అధ్యయనం చేసి, వారి ఆరోగ్యాన్ని మెరుగుపర్చే చర్యలు సరైన స్థాయిలో లేకపోవడం వల్ల వారు ఎంతో భౌతిక వేదనకు గురై గర్భిణిగా ఉన్నప్పుడు, ఇంకా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఎంతోమంది మహిళలు చనిపోతున్నారు.
మహిళలు – రాజ్యాంగపరమైన భద్రత
1. అధికరణ 14: చట్టం ముందు అందరూ సమానులే.
2. అధికరణ 15(1): లింగ భేదం ఆధారంగా ఎవరినీ వివక్షకు గురిచేయొద్దు.
3. అధికరణ 15(3): రాజ్యం మహిళల గురించి కొన్ని ప్రత్యేక సదుపాయాలు కల్పించవచ్చు.
4. అధికరణ 16: మహిళకు ఉద్యోగాల్లో, నియామకాల్లో సమాన అవకాశాలు.
5. అధికరణ 39(ఎ): మహిళకు పురుషులకు సమానమైన ఉపాధి కల్పించేటట్టు రాజ్యాన్ని ఆదేశిస్తుంది.
6. అధికరణ 42: పనిచేసే ప్రదేశాల్లో అన్ని సౌకర్యాలు కల్పించేటట్టు, గర్భధారణ సమయంలో ప్రత్యేక సదుపాయాలు కల్పించేటట్టు ఆదేశిస్తుంది.
7. అధికరణ 46: వెనుకబడిన వర్గాలకు విద్య, ఆర్థికపరమైన సదుపాయాలు కల్పించి వారికి సాంఘిక న్యాయం, వివక్ష నుంచి నుంచి భద్రతను కల్పించేటట్టు ఆదేశిస్తుంది.
8. అధికరణ 47: పోషకాహారం, మంచి జీవన ప్రమాణం, ప్రజావైద్యాన్ని పెంపొందించేట్టు రాజ్యాన్ని ఆదేశిస్తుంది.
9. అధికరణ 51(ఈ): మహిళలను కించపరిచే అన్ని వివక్షలను రూపుమాపాలని, వారి హోదాకు ఎలాంటి భగం కలిగించరాదని ఆదేశిస్తుంది.
10. అధికరణ 243 డీ (3): పంచాయతీ ఎన్నికల్లో 1/3వ వంతుకు తక్కువ కాకుండా అన్ని ప్రత్యక్ష ఎన్నికల్లో మహిళలకు సీట్లు కేటాయించాలి.
11. అధికరణ 243 డీ (4): చైర్మన్ పోస్టుల్లో 1/3వవంతుకు తక్కువ కాకుండా పంచాయతీల్లో మహిళలకు కేటాయించాలి.
12. అధికరణ 243 టీ (3): మున్సిపాలిటీల్లో 1/3వ వంతుకు తగ్గకుండా మహిళలకు అన్ని ప్రత్యక్ష ఎన్నికల్లో సీట్లు కేటాయించాలి.
13. అధికరణ 243 టీ (4): అన్ని చైర్మన్ పదవుల్లో (మున్సిపాలిటీ) మహిళలకు 1/3వ వంతుకు తక్కువ కాకుండా సీట్లు కేటాయించాలి.
-పై సదుపాయాలు, హక్కులు, భద్రతేకాకుండా రాజ్యాంగ పీఠికలో ఉన్న సామ్యవాద, లౌకిక, సాంఘిక న్యాయ మొదలైన పదాలు మహిళా స్థితి గురించి, వారి భద్రత గురించి, హోదా గురించి ప్రస్పుటంగా నొక్కి చెబుతాయి.
మహిళల హక్కుల కోసం, భద్రత కోసం ప్రభుత్వ చర్యలు, చేపట్టిన పథకాలు
1. జాతీయ మహిళా విధానం- 2001
2. సాంఘిక సాధికారత: విద్య, ఆరోగ్యం, పోషకాహారం, సరైన తాగునీటి సౌకర్యం, ఆవాసం
మహిళా విద్య కోసం తీసుకున్న వివిధ పథకాలు
1. సాక్షర భారత్ 2. జన శిక్షా సంస్థాన్
3. స్వాధార్ యోజన
4. స్త్రీ శక్తి పురస్కార్ యోజన
-విద్యపైనే కాకుండా, ఆరోగ్యం, తాగునీరు, ఆర్థిక స్వావలంబన, రాజకీయ స్వతంత్రత కోసం ప్రభుత్వం వివిధ పథకాలు ప్రవేశపెట్టింది. కానీ ఎన్నో ఏండ్ల నుంచి అపరిష్కృతంగా ఉన్న మహిళా వివక్షత ఈ చట్టాలు అమలు కాకుండా ఆపుతున్నది. అంటే సాంఘిక న్యాయం జరగకుండా, వివక్ష తొలగకుండా.. ఆర్థిక, రాజకీయ న్యాయం లభించదు.
మిలీనియం అభివృద్ధి లక్ష్యాల్లో మహిళలకు సంబంధించినవి
1. తీవ్ర పేదరికాన్ని, ఆకలిని నిర్మూలించడం
2. సార్వత్రిక ప్రాథమిక విద్యను సాధించడం
3. లింగ సమానత్వాన్ని పెంపొందిస్తూ మహిళా సాధికారతకు పాటుపడటం
4. శిశు మరణాలను తగ్గిచండం
5. మహిళల ఆరోగ్యాన్ని పెంపొందించడం
6. హెచ్ఐవీ /ఎయిడ్స్, మలేరియా, ఇతర రోగాలను పారదోలడం
7. వాతావరణ సుస్థిరలను పెంపొందించడం
8. ప్రపంచ భాగస్వామ్యాన్ని పెంపొందించడం
మహిళల భద్రత, సాంఘిక న్యాయం – చట్టాలు
రాజ్యాంగపరమైన నియమాలకు అనుగుణంగా, వారికి పూర్తి భద్రత కల్పించడానికి స్వాతంత్య్రానంతరం ఎన్నో చట్టాలు రూపుదిద్దుకున్నాయి. అవి..
1. గృహహింస నుంచి మహిళల భద్రతాచట్టం- 2005 (Protection of women from Domestic violance Act.)
2. పనిచేసే చోట మహిళపై హింస భద్రతా చట్టం- 2012 (Protection of women against harrassment at work place Act, 2012)
3. క్రిమినల్ చట్టం (సవరణ) 2013
-దీన్ని నిర్భయ దుర్ఘటన తరువాత మహిళా రక్షణ కోసం నియమించిన జస్టిస్ వర్మ కమిటీ సూచనలకు అనుగుణంగా రూపొందించారు.
-ఈ చట్టం ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ)ను, ఎవిడెన్స్ చట్టాన్ని, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (1973)ని, లైంగిక హింసకు సంబంధించిన చట్టాలను సవరిస్తూ.. మహిళలు లైంగికదాడికి గురైన కేసుల్లో ఉరిశిక్ష కూడా విధించవచ్చని పొందుపర్చారు.
4. వరకట్న నిషేధ చట్టం-1961
5. నిర్భంద పని నిషేధ చట్టం- 1976
ఈ చట్టాలేకాకుండా మహిళలను దృష్టిలో పెట్టుకొని మరిన్ని చట్టాలు రూపొందించారు. అవి..
1. మెటర్నిటీ బెనిఫిట్ చట్టం- 1961
2. మెడికల్ టెర్మినేషన్, ప్రెగ్నెన్సీ చట్టం- 1971
3. సమాన వేతన చట్టం- 1971
4. మహిళలను అగౌరవంగా చూపించే నిషేధ చట్టం- 1986
5. సతీచట్టం- 1987
6. గృహహింస చట్టం- 2005
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు