వేయిస్తంభాల గుడి శాసనాన్ని లిఖించింది?
రుద్రదేవుడు/మొదటి ప్రతాపరుద్రుడు (1158-62, 1163-95)
- కాకతీయ వంశ పాలకుల్లో రుద్రదేవుడి కాలానికి ఒక ప్రత్యేకత, చారిత్రక ప్రాధాన్యం కలదు.
- 1158-62 వరకు సామంత రాజుగా, 1163-95 వరకు స్వతంత్ర రాజుగా పరిపాలన చేశాడు.
- అనుమకొండ వేయిస్తంభాల గుడి శాసనం (1163) రుద్రదేవుడు 1163లో సంపూర్ణ స్వాతంత్య్రాన్ని ప్రకటించుకుని తెలంగాణలో మొదటి విశాల రాజ్యాన్ని స్థాపించాడని తెలుపుతుంది.
- ఈ శాసనాన్ని ‘అచితేంద్రుడు’ లిఖించాడు.
- రుద్రదేవుడు నగర పాలకుడైన (కరీంనగర్ నగునూర్) దొమ్మరాజును, పొలవాస (జగిత్యాల) పాలకుడైన రెండో మేడరాజు, మైలిగ దేవుడు, చోడోదయుడు మొదలైన వారిని యుద్ధంలో ఓడించి తన ఆధిపత్యాన్ని తెలంగాణలో నెలకొల్పాడని వేయిస్తంభాల గుడి శాసనం తెలుపుతుంది.
- రుద్రదేవుడు కలచురి రాజ్యాన్ని ఆక్రమించి, కందూరి రాజ్యాన్ని జయించి తన సామ్రాజ్యంలో విలీనం చేసుకున్నాడు.
- రాజనీతి దురంధరుడైన రుద్రదేవుడు కందూరి ఉదయచోడుని కుమార్తె పద్మావతిని వివాహమాడి ఆ రాజ్యానికి అతడిని సామంతుడిగా నియమించాడు.
- ఈ వివాహం సందర్భంగా రుద్రదేవుడు ‘రుద్రసముద్ర తటాకం’ అనే చెరువును తవ్వించాడు.
- ఇతడి రాజ్యం ఉత్తరాన గోదావరి వరకు, పశ్చిమాన బీదర్ వరకు, దక్షిణాన శ్రీశైలం వరకు వ్యాపించింది.
- రుద్రదేవుడు తన విజయాలకు సూచకంగా ఒక విజయ శాసనాన్ని అనుమకొండలో వేయించి రుద్రేశ్వర, వాసుదేవ, సూర్యదేవుల విగ్రహాలను ప్రతిష్టించి గొప్ప ఆలయాన్ని నిర్మించాడు (వేయిస్తంభాల గుడి).
- రుద్రదేవుడు ఓరగల్లు కోట నిర్మాణాన్ని పూర్తిచేశాడు.
- 1182లో జరిగిన పల్నాడు యుద్ధంలో నలగమరాజుకు తన మద్దతు తెలిపాడు.
- ఇతడి మంత్రి ఇనంగాల బ్రహ్మారెడ్డి వేయించిన ద్రాక్షారామ శాసనం (1158) ప్రకారం ఇతడు పరాక్రమశాలి.
- రుద్రదేవుడు సంస్కృతంలో నీతిసారం అనే గ్రంథాన్ని రాశాడు. ‘విద్యాభూషణ’ బిరుదు కలవాడు.
- ఇతడి మంత్రి వెల్లంకి గంగాధరుడు కరీంనగర్ శాసనం (1170) వేయించాడు. గంగాధరుడు అనుమకొండలో ఒక చెరువు, ప్రసన్నకేశవస్వామి ఆలయాన్ని కట్టించాడు.
- 1195లో యాదవ రాజైన జైతుగి చేతిలో రుద్రదేవుడు ఓడిపోయి ప్రాణాలు కోల్పోయాడు.
- రుద్రదేవుడికి పుత్రులు లేనందువల్ల అతడి సోదరుడు మహాదేవుడు కాకతీయ రాజ్యాధికారాన్ని చేపట్టాడు. ఈ విషయాన్ని ‘ఖండవల్లి తామ్రదాన పత్రం’ ధృవపరుస్తుంది.
మహాదేవుడు (1195-99)
- రుద్రదేవుడికి పుత్రులు లేనందున అతడి తమ్ముడు మహాదేవుడు రాజ్యానికి వచ్చాడు. ఈ విషయాన్ని ప్రతాపరుద్రుడి ఖండవల్లి తామ్రదాన పత్రం తెలుపుతుంది.
- మహాదేవుడికి సంబంధించిన రెండు శాసనాలు మనకు లభిస్తున్నాయి. ఒకటి 1197 నాటి పెద్దపల్లి తాలూకాలోని సుండెల్ల గ్రామంలోనిది, రెండోది వరంగల్లు కోటలో తేదీ లేని విరిగిన శాసనం.
- ఇతడు తన సోదరుడు రుద్రదేవుడి మరణానికి ప్రతీకారంగా యాదవ రాజ్యంపై దండెత్తి ప్రాణాలు కోల్పోయాడు.
- ‘ప్రతాప చరిత్ర, సోమదేవ రాజీయం’ వంటి గ్రంథాల ద్వారా యాదవ దేశంపై మొదటి జైతుగి పాలనాకాలంలో మహాదేవుడు దండయాత్ర చేశాడని, శత్రువు రాజధానిపై జరిగిన దండయాత్రలో రాత్రిపూట ఏనుగుపై అధిష్టించి యుద్ధం చేస్తూ వధించబడ్డాడని తెలుస్తుంది.
- మహాదేవుడి భార్య బయ్యాంబ. వీరికి గణపతిదేవుడు అనే కుమారుడు, మైలమ లేక మైలాంబ, కుందమాంబ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
- మహాదేవుడు శైవ మతస్థుడు ఇతడికి శైవ దీక్షను ఇచ్చిన గురువు ధ్రువేశ్వర పండితుడు.
- ఇతడి సేనానుల్లో విశ్వాసపాత్రుడు, కడు సమర్థుడు రేచర్ల రుద్రుడు.
- యాదవ రాజు చేతిలో కాకతీయ సేనలు పరాజయం పొంది రాజ్యం సంక్షోభంలో ఉన్న తరుణంలో రేచర్ల రుద్రుడు చాకచక్యంగా వ్యవహరించి కాకతీయుల అధికారాన్నికాపాడాడు.
గణపతి దేవుడు (1199-1262)
- కాకతీయుల్లో అత్యంత పరాక్రమశాలి, గొప్పవాడైన గణపతిదేవుడు యావత్ తెలుగు మాట్లాడే ప్రజలందరినీ సమైక్యం చేసి కాకతీయ చక్రవర్తుల్లో అత్యంత ఎక్కువ కాలం (63 ఏండ్లు) వరంగల్ రాజధానిగా నేటి తెలంగాణ, ఆంధ్రలను పాలించాడు.
- ఇతడు ఓరుగల్ల్లును పూర్తిగా నిర్మించి రాజధానిని అనుమకొండ నుంచి ఓరుగల్లుకు మార్చాడు.
- ఇతడి పరిపాలనా కాలానికి సంబంధించిన తొలి శాసనం 1199, డిసెంబర్ 26న వేయించినది పెద్దపల్లి జిల్లా మంథనిలో లభించింది.
- రేచర్ల రుద్రసేనాని కృషి ఫలితంగా యాదవ రాజు జైతుగి గణపతి దేవుడిని చెరసాల నుంచి విడుదల చేయడమేగాక తన కూతురైన ‘సోమలదేవి’ని ఇచ్చి వివాహం చేశాడు.
- మహాదేవుడి మరణం తర్వాత గణపతి దేవుడు బందీగా ఉన్న కాలంలో అల్లకల్లోలమైన కాకతీయ రాజ్యాన్ని ఆంతరంగిక తిరుగుబాట్ల నుంచి కాపాడి రేచర్ల రుద్రుడు గణపతి దేవుడిని పట్టాభిషిక్తుడిని చేశాడు. దీంతో రేచర్ల రుద్రుడు ‘కాకతీయ రాజ్యభార ధౌరేయుడు, కాకతీయ రాజ్య సమర్థుడు’ అనే బిరుదులు పొందాడు.
గణపతి దేవుడి సైనిక విజయాలు
- గణపతి దేవుడు గొప్ప విజేత. విశాల సామ్రాజ్య నిర్మాత.
- తన సుదీర్ఘ 63 ఏండ్ల పరిపాలనాకాలంలో అద్భుత సైనిక విజయాలను సాధించాడు. అతడి సేనాధిపతులు రేచర్ల రుద్రుడు, మల్యాల చౌడుడు అతడి విజయాల్లో కీలకపాత్ర పోషించారు.
- గణపతి దేవుడు ఆక్రమించిన అన్ని రాజ్యాలను తన సామ్రాజ్యంలో ప్రత్యక్షంగా విలీనం చేయలేదు. కొన్ని రాజ్యాల పాలకులను సామంతులుగా గుర్తించాడు. మరికొందరితో వైవాహిక సంబంధాలు నెలకొల్పుకున్నాడు. ఈ విధంగా తన రాజనీతిని ప్రదర్శించాడు.
తీరాంధ్ర విజయం
- రాజధానిలో తన పరిస్థితిని చక్కదిద్దుకున్నాక గణపతిదేవుడు తన దృష్టిని తీరాంధ్ర దేశంపై మళ్లించాడు.
- మల్యాల చౌండ సేనాని నాయకత్వంలో కాకతీయ సైన్యాలు కృష్ణానది ముఖద్వారం వద్ద ఉన్న ద్వీపం లేక దీవిపై దండెత్తాయి.
- అయ్య వంశస్థుడైన పినచోడుడి ఆధీనంలో ఉన్న ఈ ప్రాంతాన్ని కాకతీయులు ఆక్రమించుకొనగా ఈ సైనిక విజయానికి గుర్తింపుగా గణపతిదేవుడు తన సేనానికి ‘ద్వీపలుంఠకుడు, దివి చూరకారుడు’ అనే బిరుదుల్ని ఇచ్చాడు.
- 1203 నాటి మల్యాల చౌండుని కొండపర్తి శాసనం ఈ విజయాన్ని గురించి వర్ణిస్తుంది.
- రాజనీతి కారణాలవల్ల జయించిన భూభాగాన్ని తన రాజ్యంలో కలుపుకోకుండా పినచోడుడిని సామంతుడిగా చేసుకొని ఆయన కుమార్తెలైన నారాంబ, పేరాంబలను గణపతిదేవుడు వివాహం చేసుకున్నాడు.
- అంతేకాకుండా పిన్నచోడుడి కుమారుడైన జాయపను గణపతి దేవుడు తన కొలువులోకి తీసుకొని గజసాహిణిగా నియమించాడు.
- ఆ రోజుల్లో తీరాంధ్ర ప్రాంతంలో అత్యంత బలవంతమైన రాజ్యం వెలనాటి రాజ్యం. దీని పాలకుడు పృథ్వీశ్వరుడు.
- గణపతి దేవుని బావమరిది నతవాడి రుద్రుడు వేయించిన ‘బెజవాడ శాసనం’ ప్రకారం తీరాంధ్ర ప్రాంతాన్ని పాలిస్తున్న పృథ్వీశ్వరుని రాజ్యంపై దండెత్తి గణపతి దేవుడి సేనలు అఖండ విజయాన్ని సాధించాయి.
- ఈ దండయాత్ర కాలంలోనే కాకతీయ సేనలు ధరణి కోటకు చెందిన కోట నాయకులపై దండెత్తగా వారు గణపతి దేవుని సార్వభౌమాధికారాన్ని అంగీకరించి సామంతులుగా మారారు.
- వెలనాడు పృథ్వీశ్వరుడు గణపతిదేవుని సేనలతో ముఖాముఖి యుద్ధంలో ఓడిపోయి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విజయానికి గుర్తుగా శాసనాల్లో గణపతిదేవుడిని ‘పృథ్వీశ్వర శిర కందుక క్రీడావినోద (పృథ్వీశ్వరుని తల అనే బంతితో ఆడుకొన్నవాడు)’ అని వర్ణించి ఉంది.
- 1213 నాటి చేబ్రోలు శాసనం ప్రకారం గణపతిదేవుడు జాయపసేనాపతిని వెలనాడు దేశ పాలకుడిగా నియమించాడు.
దక్షిణ దండయాత్రలు
- నెల్లూరు ప్రభువు ఒకటో మనుమసిద్ధి మరణానంతరం అతడి కుమారుడు తిక్కసిద్ధి నెల్లూరు ప్రభువు కావడానికి గణపతిదేవుడు సహకరించాడు.
- ఇందుకుగాను తిక్కసిద్ధి గణపతిదేవుడికి ‘పాకనాటి’ గ్రామాన్ని ఇచ్చాడు. దీనిని పాలించడానికి గణపతిదేవుడు గంగాసాహినిని నియమించాడు.
- కళింగ దండయాత్ర కాకతీయ గణపతి దేవుడికి ఆశించినంత ఫలితమివ్వలేదు. ఇదేకాలంలో గణపతిదేవుడు అక్కడి రాజ్యాలతో వైవాహిక సంబంధాలను నెలకొల్పాడు.
- తన పెద్ద కూతురైన గణపాంబను కోట రుద్రుడి కుమారుడైన మైనబేతకిచ్చి వివాహం చేశాడు. రెండో కూతురైన రుద్రమదేవిని నిడదవోలు పాలకుడైన చాళుక్య వీరభద్రుడికి ఇచ్చి వివాహం చేశాడు.
- చివరికి కళింగ రాజైన అనియంక భీముని అనంతరం అతడి కుమారుడైన మొదటి నరసింహదేవుడి కాలంలో 1238లో కాకతీయ సైన్యాలు కళింగ, వేంగీ రాజ్యాలపై దండెత్తి విజయం సాధించాయి.
- పాండ్యులతో యుద్ధాలు
- 1263లో పాండ్య సేనలు జటావర్మ వీరపాండ్యుని నేతృత్వంలో నెల్లూరుకు సమీపంలో ‘ముత్తుకూరు’కు చేరాయి. నెల్లూరు పాలకుడు రెండో మనుమసిద్ధికి సహాయంగా వచ్చిన గణపతి దేవుడి నేతృత్వంలో కాకతీయ సైన్యాలకు పాండ్య సైన్యాలకు యుద్ధం జరిగింది.
- ఈ యుద్ధంలో నెల్లూరు ప్రభువు ప్రాణాలు కోల్పోయి నెల్లూరు పాండ్య రాజ్యంలో భాగమయ్యింది. ఈ విధంగా తన 63 ఏండ్ల పాలనాకాలంలో ఎన్నడూ ఎరుగని పరాజయాన్ని గణపతిదేవుడు ముత్తుకూరు యుద్ధంలో పొందాడు. ఈ పరాజయంతో గణపతి దేవుడు రాజ్య నిర్వహణా భారం నుంచి తప్పుకొని తన కుమార్తె రుద్రమదేవికి పరిపాలనా బాధ్యతలు అప్పగించాడు.
- గణపతి దేవుడి బిరుదులు- ఆంధ్రాధీశుడు, సకలదేశ ప్రతిష్ఠాపనాచార్య, రాయగజకేసరి
- తిక్కసిద్ధి మరణానంతరం ‘విజయగండగోపాలుడు’ ఇతరుల సహాయం పొంది నెల్లూరు ప్రభువు అయ్యాడు. దీంతో తిక్కసిద్ధి కుమారుడైన రెండో మనుమసిద్ధి గణపతిదేవుడి సహాయం అర్థిస్తూ రాయబారిగా తన ఆస్థాన కవి తిక్కన సోమయాజిని గణపతిదేవుడి వద్దకు పంపించాడు.
- అప్పుడు గణపతిదేవుడు తన సామంత భోజుడిని పంపించగా విజయగండ గోపాలుడిని ఓడించి మనుమసిద్ధిని ప్రభువు చేశాడు.
- దీనికిగాను రెండో మనుమసిద్ధి గణపతిదేవుడికి ‘మోటుపల్లి’ ఓడరేవును ఇచ్చాడు. గణపతిదేవుడు మోటుపల్లి ఓడరేవును అంతర్జాతీయ ఓడరేవుగా అభివృద్ధిపరిచి వర్తకుల రక్షణ కోసం మోటుపల్లి అభయ శాసనం వేయించాడు.
- అంతేకాకుండా ఈ మోటుపల్లి అభయ శాసనాన్ని అమలుపరచడానికి ‘సిద్ధయదేవుడిని’ నియమించాడు.
కళింగ దండయాత్ర
వెలనాడు, నెల్లూరు తెలుగు చోళ రాజ్యాలపై విజయాలు సాధించిన గణపతి దేవుడు గతంలో పృథ్వీశ్వరుడి ఆధీనంలో ఉన్న కళింగ భూభాగాన్ని ఆక్రమించడానికి తన సైన్యాలను నడిపాడు.
గణపతి దేవుడి సేనాధిపతి ఇందులూరి సోమయమంత్రి నేతృత్వంలో కాకతీయ సేనలు విజయం సాధించాయి. ఈ విషయాన్ని సమకాలీన రచన ‘శివయోగసారం’ తెలుపుతుంది.
ఇందులూరి సోమయమంత్రి కొలను రాష్ట్రపాలకుడిగా నియమితులయ్యారు.
ప్రాక్టీస్ బిట్స్
1. రుద్రదేవుడి అనుమకొండ వేయిస్తంభాల గుడి శాసనాన్ని (1163) లిఖించింది?
ఎ) అచితేంద్రుడు బి) హరిసేనుడు
సి) జాయపసేనాని డి) శివదేవుడు
2. కాకతీయ చక్రవర్తుల్లో అత్యధిక కాలం పరిపాలించినది?
ఎ) మహాదేవుడు బి) గణపతిదేవుడు సి) రుద్రమదేవి డి) ప్రతాపరుద్ర-2
3. కాకతీయ రాజ్యభారధౌరేయుడు అనే బిరుదు కలిగినవారు?
ఎ) రేచర్ల రుద్రుడు బి) రేచర్ల ప్రసాదిత్యుడు సి) మల్యాల చోడుడు డి) ఎవరూకాదు
4. ధ్రువేశ్వర పండితుడు ఏ కాకతీయ రాజు శైవమత గురువు?
ఎ) రుద్రదేవుడు బి) గణపతిదేవుడు సి) మహాదేవుడు డి) ప్రోలరాజు-2
5. కిందివాటిలో సరైనది?
ఎ) గణపతిదేవుడు మోటుపల్లి ఓడరేవును అంతర్జాతీయ ఓడరేవుగా అభివృద్ధిపరిచి వర్తకుల రక్షణ కోసం మోటుపల్లి అభయశాసనం వేయించాడు
బి) ఈ మోటుపల్లి అభయశాసనాన్ని అమలుపరచడానికి సిద్ధయ దేవుడిని నియమించాడు
సి) ఎ డి) ఎ, బి
సాసాల మల్లికార్జున్
అసిస్టెంట్ ప్రొఫెసర్
ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, కోరుట్ల
9492 575 006
- Tags
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు