ప్రార్థనా స్థలాల చట్టం ఏం చెబుతుంది?
ప్రస్తుతం దేశవ్యాప్తంగా రాజ్యాంగ మౌలిక లక్షణంగా సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో ఉద్ఘాటించిన లౌకికత్వం చుట్టూ వివాదాలు అలుముకుంటున్నాయి. అయోధ్య రామజన్మ భూమి కేసులో సుప్రీంకోర్టు తీర్పు తరువాత దేశంలో ఇలాంటి వివాదాలకు అవకాశం లేదని భావించిన కొద్ది రోజులకే ‘జ్ఞానవాపీ మసీదు-కాశీ విశ్వేశ్వరాలయం, మధుర శ్రీకృష్ణ ఆలయం-షాహీ ఈద్గా, కుతుబ్ మీనార్ల రూపంలో మందిర్-మసీద్’ లాంటి కొత్త వివాదాలు తెరమీదకు వచ్చి లౌకికత్వాన్ని గందరగోళంలో పడేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ అంశాల గురించి సున్నితంగా, బ్యాలెన్స్డ్గా ఉద్యోగార్థులు అధ్యయనం చేయాలి.
అసలు వివాదం ఏంటి?
సన్నివేశం-1 జ్ఞానవాపీ మసీదు వివాదం
# ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలోగల ప్రసిద్ధ కాశీవిశ్వనాథ ఆలయం పక్కన, జ్ఞానవాపీ మసీదు వెనుకభాగంలో ఉన్న శృంగార గౌరీ దేవి దర్శనానికి, పూజలకు అనుమతి ఇవ్వాలని రాఖీసింగ్తో పాటు నలుగురు మహిళలు స్థానిక కోర్టులో 2021లో పిటిషన్ వేశారు. మసీదు గోడవద్ద ఉన్న గౌరీ, గణేశ్, హనుమాన్, నంది విగ్రహాలకు రోజూ పూజలు చేసుకునేందుకు అనుమతించాలని వీరు కోరారు. దీంతో పాటు ప్లాట్ నంబర్ 9130 తనిఖీ, వీడియోగ్రఫీకి డిమాండ్ చేశారు. దీనికి అంగీకరిస్తూ స్థానిక కోర్టు మసీదు సర్వేకు ఆదేశించింది.
#మసీదులో సర్వేపై అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించి, సర్వేపై తక్షణ స్టే విధించాలని కోరగా, సర్వోన్నత న్యాయస్థానం అందుకు తిరస్కరించింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనం ఈ మొత్తం వ్యాజ్యంపై విచారణ నిర్వహిస్తున్నది.
# సర్వేలో భాగంగా మసీదు పరిసరాల్లో శివలింగం కనిపించిందని, ఆ పరిసరాలను వెంటనే సీజ్ చేయాలని స్థానిక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో దేశవ్యాప్తంగా ఇది చర్చనీయాంశంగా మారింది.
చారిత్రక నేపథ్యం
# 1669లో మొఘల్ పాలకుడు ఔరంగజేబు పురాతన విశ్వేశ్వరాలయాన్ని ధ్వంసం చేసి, జ్ఞానవాపీ మసీదును నిర్మించాడని అందుకు అప్పటి గవర్నర్ అబుల్ హసన్‌ను ఆదేశించాడని సాఖిబ్ఖాన్ రచించిన ‘యాసిర్ అలంగిరి’ పుస్తకంలో పేర్కొన్నారు. దీనిపై 1991లో వారణాసి కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్లో పండిట్ సోమ్‌నాథ్ వ్యాస్ ఆ మసీదు ఉన్న ప్రాంతం హిందువులకు చెందాలని పేర్కొన్నారు. 2021, ఆగస్టు 18న వారణాసి హైకోర్టులో రాఖీసింగ్తో పాటు నలుగురు మహిళలు మసీదులో ప్రార్థనలకు అనుమతివ్వాలని పిటిషన్ దాఖలు చేశారు.
సన్నివేశం-2 షాహీ ఈద్గా మసీదు వివాదం
# ఉత్తరప్రదేశ్ మధురలోని కత్రా కేశవ్ దేవ్ మందిరం (శ్రీకృష్ణ ఆలయం) కాంప్లెక్స్‌లోని షాహీ ఈద్గా మసీదును తొలగించాలని 2020, సెప్టెంబర్ 25న లక్నోకు చెందిన రంజన అగ్నిహోత్రితో పాటు మరో ఆరుగురు శ్రీకృష్ణ విరాజమాన్ సన్నిహితులుగా పేర్కొంటూ స్థానిక సివిల్ కోర్టులో పిటిషన్ వేశారు.
#శ్రీకృష్ణ జన్మభూమి ట్రస్ట్ కు చెందిన 13.37 ఎకరాల్లో షాహీ ఈద్గా మసీదును నిర్మించారని వారు పేర్కొన్నారు. ఈ మసీదును తొలగించి సదరు భూమిని హిందూ ట్రస్ట్ కు అప్పగించాలని వారు కోరగా 2020, సెప్టెంబర్ 30న స్థానిక కోర్టు దానిని తోసిపుచ్చింది. అయితే ఇటీవల కాలంలో ఆ మసీదు లోపల హిందూ దేవాలయాల ఆనవాళ్లు ఉన్నాయా లేవా, లోపల గుడి ఆనవాళ్లను పరిరక్షించాలని, బయటివారు మసీదులోకి ప్రవేశించకుండా అడ్డుకోవాలని పిటిషన్ వేయడంతో మరోసారి ‘మందిరం-మసీదు’ వివాదానికి ఇది ఆజ్యం పోసినట్లయ్యింది.
సన్నివేశం-3 కుతుబ్ మీనార్ వివాదం
#ఢిల్లీలోని అరుదైన పురాతన కట్టడమైన కుతుబ్ మీనార్‌ను కుతుబుద్దీన్ ఐబక్ నిర్మించలేదని, దీన్ని హిందూ రాజు రాజా విక్రమాదిత్య నిర్మించాడని పురావస్తు శాఖ మాజీ రీజినల్ డైరెక్టర్ ధరమ్వీర్ శర్మ ప్రకటన చేయడంతో ఇది దేశవ్యాప్తంగా సంచలనం అయ్యింది.
# కుతుబ్ మీనార్ టవర్‌లో 25 అంగుళాల వంపు ఉంటుందని, సూర్యుడిని పరిశీలించేందుకు ఇలా నిర్మించారని, అందుకే జూన్ 21న సూర్య ఆయనంలో (ఉత్తరాయనం నుంచి దక్షిణాయానానికి మారే క్రమం) కనీసం అరగంట పాటు ఆ ప్రాంతంపై నీడ పడదని, కుతుబ్మీనార్ డోర్ కూడా ఉత్తర ముఖంగా ఉంటుందని, అది రాత్రివేళ ధ్రువనక్షత్రాన్ని చూసేందుకే అలా ఏర్పాటు చేశారని శర్మ వివరించారు. దీంతో ఇది కూడా ముస్లిం పాలనలో ధ్వంసం అయి, నిర్మించిందనే వాదనలూ తెరపైకి వచ్చాయి. ప్రస్తుతం ఈ విషయం ఢిల్లీ కోర్టులో ఉంది.
#అయితే కుతుబ్ మీనార్లో హిందూ, జైన ఆలయాల ఆనవాళ్లు ఉన్నాయన్న వాదనలను భారత పురావస్తు శాఖ తోసిపుచ్చింది.
సన్నివేశం-4 తాజ్‌మహల్ వివాదం
# ప్రపంచ ఏడు వింతల్లో ఒకటిగా విరాజిల్లుతున్న సుందర పాలరాతి కట్టడం తాజ్‌మహల్ కూడా ‘మందిరం-మసీదు’ వివాదంలో అంతర్భాగం అయ్యింది. అయోధ్యలోని బహ్రమౌ నివాసి అయిన డాక్టర్ రజనీశ్ సింగ్ అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్‌లో పిటిషన్ దాఖలు చేశాడు.
#ఈ పిటిషన్లో ఆయన ‘తాజ్‌మహల్ అనేది తేజోమహాలయ’ అనే హిందూ ఆలయ ఆనవాళ్లమీద నిర్మించారని, ఈ ఆలయాన్ని 1212లో రాజు పర్మార్‌ది దేవ్ నిర్మించాడని, తరువాత అది జైపూర్ రాజు రాజా మాన్సింగ్ ఆధీనంలోకి వెళ్లి, చివరగా రాజా జై సింగ్ వారసత్వంగా దాన్ని పాలించాడని ప్రస్తావించాడు. అదేవిధంగా తేజోమహాలయ భూమిని షాజహాన్ 1632లో ఆక్రమించాడని ప్రస్తావించాడు.
#ప్రముఖ చరిత్రకారుడు అయిన పీ యున్ ఓక్ రచించిన ‘తాజ్‌మహల్- ఏ ట్రూ స్టోరీ’ అనే పుస్తకంలోని అంశాల ఆధారంగా పిటిషనర్ ఈ అంశాలను ప్రస్తావించాడు. తాజ్‌మహల్‌లో మూసి ఉన్న కొన్ని గదుల వెనుక శివాలయం ఉందని, వాటిని ప్రజల సందర్శనార్థం తెరవాలని అయోధ్యకు చెందిన జగద్గురు పరమహంస డిమాండ్ చేస్తున్నారు.
# పై నాలుగు సన్నివేశాల్లోనూ ప్రాచీన హిందూ దేవాలయాలను ధ్వంసం చేసి మసీదుల (ముస్లిం కట్టడాలు)ను నిర్మించారని దేశవ్యాప్తంగా ఒక వర్గం గట్టిగా, ముస్లిం మతానికి చెందినవారు వీటిని ఖండిస్తూ ప్రకటనలు చేస్తుండటం వల్ల జాతీయ స్థాయిలో లౌకికత్వం ఉనికికి ప్రమాదం ఏర్పడగా.. ‘ప్రార్థనా స్థలాల చట్టం-1991’ మరోసారి వార్తల్లోకి ఎక్కింది.
ప్రార్థనా స్థలాల చట్టం-1991
#1991 బాబ్రీ మసీదు కూల్చివేతకు ముందు ఈ చట్టాన్ని 1991, సెప్టెంబర్ 18న రూపొందించారు. అప్పటి పీవీ నర్సింహారావు ప్రభుత్వం బాబ్రీ మసీదు-రామ మందిర వివాదం నేపథ్యంలో ఈ చట్టాన్ని రూపొందించింది.
చట్టంలోని సెక్షన్లు – వివరాలు
సెక్షన్ 1- చట్టం పేరు, అమలు
#ఈ చట్టాన్ని ప్రార్థనా స్థలాల చట్టం (ప్రత్యేక నిబంధనలు)- 1991 అని పిలుస్తారు.
#ఇది దేశవ్యాప్తంగా అమలవుతుంది.
సెక్షన్ 2- నిర్వచనాలు
సెక్షన్ 3- మతపరమైన లేదా అందులోని తెగలకు సంబంధించిన ప్రార్థనాస్థలాల స్వభావాన్ని లేదా స్వరూపాన్ని మార్చే హక్కు ఏ వ్యక్తికీ లేదు.
సెక్షన్ 4 (1)- 1947, ఆగస్ట్ 15 నాటికి ప్రార్థనా స్థలాలు ఏ స్వరూపంలో ఉన్నాయో, అలాగే కొనసాగుతాయి.
సెక్షన్ 4(2)- ప్రార్థనా స్థలాల స్వరూపం, స్వభావాల విషయంలో మార్పులకు సంబంధించిన ఏ వ్యాజ్యాలు చెల్లవు. అంతకుముందు పెండింగ్‌లో ఉన్న కేసులన్నీ రద్దవుతాయి. కొత్తగా పిటిషన్ వేసే వీల్లేదు. కోర్టు, ట్రిబ్యునల్, ప్రభుత్వ అధికారులు.. ఎవరిముందూ ఏ దావాలు చెల్లవు.
సెక్షన్ 5- అయోధ్య బాబ్రీ మసీదు-రామ మందిరం వివాదం ఈ చట్టం పరిధిలోకి రాదు. ఎందుకంటే స్వాతంత్య్రానికి ముందే ఈ వివాదం కోర్టులో ఉంది.
#పురావస్తు శాఖ సర్వే పరిధిలోకి వచ్చే ప్రార్థనా స్థలాల నిర్వహణపై పరిమితులు ఉండవు.
సెక్షన్ 6- చట్టంలోని సెక్షన్ 3 ని ఉల్లంఘించిన వారికి 3 సంవత్సరాల జైలుశిక్ష విధిస్తారు (జరిమానా అదనం).
సెక్షన్ 7- ఇతర చట్టాలను అధిగమించే అధికారం (అమల్లో ఉన్న ఏ చట్టంపై అయినా ఇది ప్రభావం చూపుతుంది)
సెక్షన్ 8- ప్రజాప్రాతినిథ్య చట్టం- 1951కి సవరణ మినహాయింపు
# పురావస్తు ప్రదేశాలు, అవశేషాల చట్టం- 1958 కిందకు వచ్చే పురాతన, చారిత్రక కట్టడాలు, పురావస్తు ప్రదేశాలు, అవశేషాలు, పురాతన స్మారక చిహ్నాలకు ఈ చట్టం వర్తించదు.
#చట్టం అమల్లోకి రావడానికి ముందు ఏదైనా మతపర ప్రదేశానికి సంబంధించిన సమస్య పరిష్కరించి ఉంటే అది కూడా ఈ చట్టం పరిధిలోకి రాదు.
ముందుకెళ్లాల్సిన మార్గం
# పూర్వం చేసిన తప్పులకు ప్రస్తుత తరం మూల్యం చెల్లించుకోవాలనడం, జ్ఞానవాపీ మసీదు, షాహీ ఈద్గా మసీదు, కుతుబ్మీనార్, తాజ్‌మహల్ వంటి పురాతన కట్టడాల మూలాలను నిర్ధారించి, చారిత్రక తప్పిదాలను సరిదిద్దాలనుకోవడం రాజ్యాంగ మౌలిక సూత్రాలకు, 1991 ప్రార్థనాస్థలాల చట్టానికి విరుద్ధం.
#పూర్వ చరిత్ర ఈ నాటి ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగించకూడదని 2018లో నవ్‌తేజ్ సింగ్ జోహర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఉద్ఘాటించిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.
# 1991 ప్రార్థనా స్థలాల చట్టాన్ని సర్వకాల సర్వవ్యవస్థల్లో గౌరవించాలి. ఎలాంటి పక్షపాతం, రాగద్వేషాలు లేకుండా ఆ చట్టాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ సంస్థలు అమలు చేయాలి.
# పార్లమెంట్ ద్వారా రూపొందిన ఇలాంటి సున్నితమైన చట్టాలను ప్రజలందరూ సమైక్యంగా అనుసరించాలి.
#దేశంలో మత సామరస్యం పరిఢవిల్లడానికి, లౌకికత్వం పౌరుల హృదయాంతరాల్లో ఇమిడిపోవడానికి మీడియా సంస్థలు, మేధావులు కృషిచేయాలి.
# ఇలాంటి సున్నితమైన అంశాల పట్ల రాజకీయ పార్టీలు రెచ్చగొట్టే ధోరణిలో కాకుండా స్వీయ నియంత్రణ పాటించి, ఆదర్శవంతంగా నిలబడాలి.
#ఇలాంటి భావోద్వేగ ప్రేరేపిత సన్నివేశాల్లో ఉభయ పక్షాలకు సాంత్వన చేకూరేలా ఆదేశాలు ఇవ్వడంలో కిందిస్థాయి కోర్టులు ఆచితూచి వ్యవహరించాలి.
#భారత సర్వోన్నత న్యాయస్థానం ఈ విషయంలో అధికరణ 142 ప్రకారం తనకున్న విశేష అధికారాలను ఉపయోగించి స్పష్టమైన మార్గదర్శకాలు జారీచేయాలి.
భారతదేశంలో లౌకికత్వం
#దేశంలో లౌకికత్వం గురించి రాజ్యాంగ ప్రవేశిక తెలియజేస్తుంది. ప్రవేశికలో లౌకికత్వం అనే పదాన్ని 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. రాజ్యాంగంలోని 3వ భాగంలోని ప్రాథమిక హక్కుల్లో గల 25 నుంచి 28 వరకు అధికరణలు మతపరమైన హక్కుల గురించి తెలియజేస్తున్నాయి. రాజ్యాంగంలో మనదేశాన్ని లౌకికరాజ్యంగా ప్రస్తావించారు.
లౌకికత్వం- సుప్రీంకోర్టు కేసులు
1) జేవియర్ కాలేజ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్ కేసు- 1974
సుప్రీంకోర్టు తీర్పు: భారతదేశం లౌకిక రాజ్యమే.
2) ఎస్సార్ బొమ్మై వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక కేసు- 1994
సుప్రీంకోర్టు తీర్పు: లౌకికత్వం రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగం. లౌకికత్వాన్ని ఉల్లంఘించే రాష్ట్రాలపై ప్రకరణ 356 ప్రకారం చర్యలు చేపట్టవచ్చు.
3) శబరిమలై కేసు- 2018
సుప్రీంకోర్టు తీర్పు: 10 నుంచి 50 సంవత్సరాల మధ్యగల మహిళలను రుతుస్రావం కారణంగా ఆలయాల్లోకి నిషేధించడం రాజ్యాంగ విరుద్ధం.
మతపరమైన ఘర్షణలు – ప్రతికూల ప్రభావాలు
1) భిన్నత్వంలో ఏకత్వం అనే భావన దెబ్బతింటుంది. జాతీయవాదం ప్రశ్నార్థకమవుతుంది.
2) దేశంలో మతసామరస్యతకు భంగం కలుగుతుంది.
3) లౌకికత్వం అనే రాజ్యాంగ మౌలిక స్వరూపం సంక్షోభంలో పడిపోతుంది.
4) 1948 నాటి మతోన్మాద యుద్ధ వాతావరణం నెలకొంటుంది.
5) దేశంలో లా అండ్ ఆర్డర్ క్రమం తప్పి, పరిపాలన వ్యవహారాలు ప్రమాదంలో పడిపోతాయి.
6) భారతదేశం విశ్వవ్యాప్త సిద్ధాంతం అయిన ‘వసుదైక కుటుంబం’ నిర్వీర్యమవుతుంది.
7) రాజ్యాంగ వ్యవస్థలు సరిగా పనిచేయలేక పాలనా యంత్రాంగం కుప్పకూలుతుంది.
8) ప్రాంతీయ మతోన్మాద శక్తులు పెరిగిపోతాయి.
9) అంతర్జాతీయంగా దేశ ప్రభ మసకబారుతుంది.
10) దేశ ఆర్థిక వ్యవస్థ తిరోగమన బాట పడుతుంది.
ముగింపు
#భారతదేశం సర్వమతాల సమ్మేళనం. అన్ని మతాలను సమానంగా గౌరవించే అత్యంత పారదర్శకమైన మత స్వేచ్ఛ కలిగిన దేశం. మతాన్ని రాజ్యాంగం ప్రకారం ప్రాథమిక హక్కుగా అందిస్తున్న దేశం. ప్రాచీన కాలం నుంచి సర్వమానవ సౌభ్రాతృత్వమే లక్ష్యంగా కొనసాగుతున్న లౌకిక రాజ్యం. అయితే ఇటీవల దేశవ్యాప్తంగా పెరిగిపోతున్న మత ఘర్షణలు, మందిర్-మసీదు వివాదం, బురా వివాదం, హలాల్ వివాదం, ట్రిపుల్ తలాఖ్ వివాదం వంటివి దేశ అంతరంగిక సార్వభౌమత్వాన్ని సవాల్ చేసేలాగా ఉన్నాయి. వీటికి ఛాందసవాదం కలిగిన రాజకీయ పార్టీలు వత్తాసు పలకడం విచారకరం. ఇలాంటి నేపథ్యంలో పౌరులందరూ మతం, ప్రాంతానికి అతీతంగా, సంయమనం పాటిస్తూ, చట్టాలను గౌరవిస్తూ, సోదరభావంతో, పరిణితితో కూడిన ప్రవర్తనతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది.
పీ శ్రీరామ్‌చంద్ర
గ్రూప్స్ మెంటార్
హైదరాబాద్
8008356825
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు