తెలంగాణ
టై సదస్సు
- ది ఇండస్ ఎంటర్‌ప్రెన్యూర్స్ (టీఐఈ-టై) 7వ గ్లోబల్ సమ్మిట్-2022 హైదరాబాద్‌లో డిసెంబర్ 14న ముగిసింది. మూడు రోజుల పాటు నిర్వహించిన ఈ సదస్సును డిసెంబర్ 12న మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అడోబ్ చైర్మన్, సీఈవో శంతను నారాయణ్‌కు ‘సీఈవో ఆఫ్ ది ఇయర్’ అవార్డును మంత్రి కేటీఆర్ అందజేశారు. టై గ్లోబల్ చైర్మన్ బీజే అరుణ్, వైస్ చైర్మన్ మురళి బుక్కపట్నం.
జాతీయ అవార్డు - మాతాశిశు సంరక్షణలో తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు రెండు జాతీయ అవార్డులు డిసెంబర్ 14న లభించాయి. దేశంలోనే తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మిడ్ వైఫరీ వ్యవస్థకు ప్రత్యేక అవార్డు లభించగా, హైరిస్క్ గర్భిణుల్ని గుర్తించి చికిత్స అందించడంలో రెండో స్థానం దక్కింది. ఢిల్లీలో నిర్వహించిన ‘నేషనల్ మెటర్నల్ హెల్త్ వర్క్‌షాప్’లో భాగంగా ఈ అవార్డులను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ ఎస్ పద్మజ అందుకున్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ ఈ అవార్డులను అందజేశారు.
రెడ్కోకు పురస్కారం
- తెలంగాణ స్టేట్ రెన్యువబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీఎస్ రెడ్కో)కు జాతీయ పురస్కారం దక్కింది. డిసెంబర్ 14న ఢిల్లీలో నిర్వహించిన 32వ జాతీయ ఇంధన పరిరక్షణ వారోత్సవాల్లో ‘సర్టిఫికెట్ ఆఫ్ మెరిట్’ను రెడ్కో చైర్మన్ సతీష్ రెడ్డి, ఎండీ జానయ్య అందుకున్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా కర్బన ఉద్గారాల వాడకాన్ని తగ్గించేందుకు అనేక కార్యక్రమాలను టీఎస్ రెడ్కో చేపడుతుంది. దేశంలోనే తొలిసారిగా ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్‌ను మున్సిపల్ చట్టంలో చేర్చిన రాష్ట్రంగా తెలంగాణ ఘనత సాధించింది.

క్రీడలు
డబ్ల్యూటీఏ అవార్డులు
- డబ్ల్యూటీఏ మహిళా టెన్నిస్ అవార్డులను డిసెంబర్ 12న ప్రకటించింది. ‘ప్లేయర్ ఆఫ్ ది ఇయర్-2022’ అవార్డు పోలిష్ క్రీడాకారిణి ఇగా స్వియాటెక్‌కు లభించింది. ఆమె ఈ అవార్డు గెలుచుకోవడం ఇదే మొదటిసారి. ‘డబుల్స్ టీమ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు’ చెక్ రిపబ్లిక్కు చెందిన బార్బోరా క్రెజ్సికోవ-కాటెరీనా సినియాకోవకు దక్కింది. ‘మోస్ట్ ఇంప్రూవ్డ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు బ్రెజిలియన్ క్రీడాకారిణి బీట్రిజ్ హద్దద్ మైయాకు లభించింది. డబ్ల్యూటీఏ అవార్డును గెలుచుకున్న మొదటి బ్రెలిజియన్ క్రీడాకారిణి ఈమె. ‘న్యూకమర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు చైనీస్ క్రీడాకారిణి జెంగ్ క్విన్వెన్కు దక్కింది. ‘కమ్‌బ్యాక్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు జర్మనీ క్రీడాకారిణి టట్జానా మారియాకు లభించింది. డబ్ల్యూటీ ప్లేయర్ అవార్డులను 1977లో ప్రవేశపెట్టారు.
గీతిక, అనిక
- అమెరికా అండర్-19 టీ20 మహిళల జట్టుకు తెలుగు అమ్మాయిలు గీతిక కొడాలి కెప్టెన్‌గా, కొలన్ అనిక రెడ్డి (నాగారం, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా, తెలంగాణ) వైస్ కెప్టెన్‌గా డిసెంబర్ 15న ఎంపికయ్యారు. 15 మందితో కూడిన జట్టును ప్రకటించగా.. అందరూ భారత మూలాలు ఉన్నవారే కావడం విశేషం. ఇందులో కెప్టెన్, వైస్ కెప్టెన్‌తో పాటు మరో ముగ్గురు భూమిక భద్రిరాజు, లాస్య ప్రియ ముల్లపూడి, సాయి తన్మయి తెలుగు రాష్ర్టాలకు చెందినవారు. ఆదితి, దిశ, ఇషాని, జీవన, పూజ గణేశ్, పూజ షా, రీతూ సింగ్, స్నిగ్ధ, సుహాని, తారానమ్ చోప్రా భారత మూలాలు ఉన్నవారు. అదేవిధంగా మరో తెలుగు అమ్మాయి కస్తూరి వేదాంతం రిజర్వ్ ప్లేయర్‌గా ఎంపికయ్యింది. అండర్-19 టీ20 వరల్డ్ కప్ జనవరి 14 నుంచి దక్షిణాఫ్రికాలో నిర్వహించనున్నారు.
వార్తల్లో వ్యక్తులు
భానుప్రకాశ్ రెడ్డి
- హైదరాబాద్‌కు చెందిన జీ భానుప్రకాశ్ రెడ్డికి ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ న్యూట్రిషన్ సైన్సెస్ (ఐయూఎన్‌ఎస్) ఫెలోగా డిసెంబర్ 11న ఎంపికయ్యారు. పోషకాహారంపై నిర్వహించే పరిశోధనలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ప్రతి నాలుగేండ్లకోసారి జరిగే ఇంటర్నేషనల్ న్యూట్రిషన్ కాంగ్రెస్‌లో పనిచేసేందుకు ఐయూఎన్‌ఎస్ ఫెలోకు ఎంపిక చేస్తారు. హైదరాబాద్‌లోని జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్)లో 25 ఏండ్లుగా సేవలందిస్తున్న ఆయన బయోకెమిస్ట్రీ విభాగానికి హెచ్వోడీగా పనిచేస్తున్నారు. చిన్న పిల్లల్లో విటమిన్ ఎ లోపం, పర్యవసానాలపై ఆయన చేసిన పరిశోధనలకు ఈ గౌరవం దక్కింది.
పీసీ రథ్ - కార్డియాలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా (సీఎస్ఐ) అధ్యక్షుడిగా హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ పీసీ రథ్ డిసెంబర్ 12న ఎన్నికయ్యారు. ఆయన 2023-24 ఏడాది ఈ పదవిలో ఉంటారు. చెన్నైలో జరిగిన సీఎస్ఐ వార్షిక సమావేశంలో ఆయనను ఎన్నుకున్నారు. ఆయన జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో కార్డియాలజీ విభాగానికి హెడ్‌గా పనిచేస్తున్నారు.
దేవ్ జోషి - ‘డియర్ మూన్’ అంతరిక్ష యాత్రకు వెళ్లే గ్రూపులో భారత్‌కు చెందిన దేవ్ జోషికి డిసెంబర్ 13న చోటు లభించింది. ఈ అంతరిక్ష యాత్రను ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ ఆధ్వర్యంలో చేపడుతున్నారు. చంద్రుడి సమీపానికి స్పేస్ ఎక్స్ చేపడుతున్న తొలి వాణిజ్య అంతరిక్ష యాత్ర డియర్ మూన్. దీంట్లో ఉన్న టికెట్లన్నింటినీ జపాన్ కుబేరుడు యసాకు మజావా కొనుగోలు చేశారు. తన వెంట పలు రంగాల నుంచి 8 మందిని ఇంటర్వ్యూ ద్వారా ఎంచుకున్నాడు. బాల్వీర్ టీవీ షోతో దేశవ్యాప్త క్రేజ్ సంపాదించిన నటుడు దేవ్ జోషి ఎంపికయ్యాడు.
జాస్మిన్ సెల్‌బర్గ్
- 60వ మిస్ ఇంటర్నేషనల్-2022 కిరీటాన్ని జర్మనీకి చెందిన జాస్మిన్ సెల్‌బర్గ్ గెలుచుకుంది. 66 మంది పాల్గొన్న ఈ పోటీలను డిసెంబర్ 13న జపాన్‌లోని టోక్యోలో నిర్వహించారు. మొదటిసారి ఈ పోటీలు 1960లో జరిగాయి.
జెరెమీ ఫరార్
- ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తన కొత్త ప్రధాన శాస్త్రవేత్త (చీఫ్ సైంటిస్ట్)గా జెరెమీ ఫరార్‌ను డిసెంబర్ 13న నియమించింది. ఈయన 2023 త్రైమాసికంలో బాధ్యతలు చేపడతారు. ప్రస్తుతం ఈ పదవిలో భారతదేశానికి చెందిన సౌమ్య స్వామినాథన్ ఉన్నారు. డాక్టర్ అమేలియా అఫుహామంగో చీఫ్ నర్సింగ్ ఆఫీసర్‌గా నియమితులయ్యారు.
రిషి రాజ్
- క్రీస్తు పూర్వం 5వ శతాబ్దం (2500 ఏళ్ల) నుంచి అనేక మంది సంస్కృత పండితులకు కొరకరాని కొయ్యగా మారిన ఓ వ్యాకరణ సమస్యను కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో పీహెచ్డీ చేస్తున్న భారత విద్యార్థి రిషి రాజ్పోపట్ (27) పరిష్కరించాడు. దీనికి సంబంధించిన రిసర్చ్ ‘ఇన్ పాణిని, వియ్ ట్రస్ట్: డిస్కవరింగ్ ది అల్గారిథమ్ ఫర్ రూల్ కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్ ఇన్ ది అష్టాధ్యాయి’ డిసెంబర్ 15న ప్రచురితమయ్యింది. భాషాశాస్త్ర పితామహుడిగా పేరుగాంచిన పాణిని బోధించిన ఓ నియమానికి పరిష్కారం చూపడం ద్వారా ఈ ఘనత సాధించాడు. ఈ ఆవిష్కరణ విప్లవాత్మకమని సంస్కృత నిపుణులు భావిస్తున్నారని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ పేర్కొంది. ఈ ప్రకారం పాణిని వ్యాకరణాన్ని కూడా కంప్యూటర్లో ఉపయోగించవచ్చని వెల్లడించింది.
అర్చన కే ఉపాధ్యాయురాలు, విషయ నిపుణులు, నల్లగొండ

అంతర్జాతీయం
అరబ్ స్పేస్‌క్రాఫ్ట్
- స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ డిసెంబర్ 11న రషీద్ రోవర్‌ను నింగిలోకి పంపింది. అరబ్ కంట్రీస్ ఆధ్వర్యంలో నిర్మించిన మొట్టమొదటి రోవర్ ఇది. దీన్ని దుబాయ్‌కు చెందిన మొహమ్మద్ బిన్ రషీద్ స్పేస్ సెంటర్ (ఎంబీఆర్ఎస్సీ) రూపొందించింది. ఇది చంద్రునిపైకి 2023, ఏప్రిల్‌లో చేరుతుంది. దీంతో యూఏఈ చంద్రుడిపై దిగిన నాలుగో దేశంగా నిలువనుంది. ఈ రోవర్‌కు దుబాయ్ మాజీ పాలకుడు దివంగత షేక్ రషీద్ బిన్ సయీద్ అల్ మక్తౌమ్ పేరు పెట్టారు.
- దీంతో పాటు జపాన్ ల్యాండర్ హకుటో-ఆర్ ఎం1ను కూడా ప్రయోగించారు. దీన్ని ఐస్పేస్ రూపొందించింది. చంద్రుడిపైకి వాణిజ్య నౌకను పంపిన తొలి ప్రైవేట్ సంస్థగా ఐస్పేస్ రికార్డు సృష్టించింది.
మౌంటెయిన్ డే
- ఇంటర్నేషనల్ మౌంటెయిన్ డే (అంతర్జాతీయ పర్వత దినోత్సవం)ను డిసెంబర్ 11న నిర్వహించారు. పర్వతాల విలువ గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (యూఎన్జీఏ) ఈ దినోత్సవాన్ని ఏర్పాటు చేసింది. ఈ డేని సస్టెయినబుల్ మౌంటెయిన్ డెవలప్మెంట్ 1992లో గుర్తించగా.. 2003 నుంచి నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయ పర్వత సంవత్సరంగా 2002ను యునైటెడ్ నేషన్స్ ప్రకటించింది. ఈ ఏడాది ఈ దినోత్సవ థీమ్ ‘ఉమెన్ మూవ్ మౌంటెయిన్స్’.
ఉక్రెయినియన్ పీపుల్ - ‘స్టాండింగ్ విత్ ది ఉక్రెయినియన్ పీపుల్’ పేరుతో సదస్సును పారిస్‌లో ఫ్రాన్స్ డిసెంబర్ 13న నిర్వహించింది. ఉక్రెయిన్‌లో పౌర పునరుద్ధరణకు, అంతర్జాతీయ మద్దతును సమన్వయం చేయడం, ప్రజల అత్యవసర మానవతా అవసరాలను పరిష్కరించే లక్ష్యంగా ఈ సదస్సును నిర్వహించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ పాల్గొన్న ఈ సదస్సులో వర్చువల్‌గా ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీ హాజరయ్యారు.
స్వలింగ సంపర్కుల రక్షణ బిల్లు
- అమెరికాలో స్వలింగ సంపర్కుల వివాహాలకు రక్షణ కల్పించే బిల్లు (సేమ్ సెక్స్ మ్యారేజ్ ప్రొటెక్షన్ బిల్)పై అధ్యక్షుడు జో బైడెన్ డిసెంబర్ 13న సంతకం చేశారు. దీంతో ఈ బిల్లు చట్టంగా మారింది. స్వలింగ వివాహాలను తొలిసారిగా 2000లో నెదర్లాండ్స్ చట్టబద్ధం చేసింది. ఆ తర్వాత ఇప్పటిదాకా 34 దేశాల్లో చట్టపరంగానో, కోర్టు ఆదేశాలతోనే ఇందుకు ఆమోదం లభించింది.
- ఐరాస సభ్యదేశాల్లో భారత్‌తో పాటు మొత్తం 71 దేశాలు స్వలింగ సంపర్కాన్ని నేరాల జాబితా నుంచి తొలగించాయి. భారత సుప్రీంకోర్టు 2013లో స్వలింగ సంపర్కం ప్రకృతి విరుద్ధమని, శిక్షార్హమైన నేరమని తీర్పు ఇచ్చింది. కానీ 2018లో ఇది ఎంతమాత్రం నేరం కాదంటూ చరిత్రాత్మక తీర్పు వెలువరించింది.

జాతీయం
భారత్-ఫిన్లాండ్
- మైగ్రేషన్, మొబిలిటీకి సంబంధించిన జాయింట్ డిక్లరేషన్‌పై భారత్-ఫిన్లాండ్ ఢిల్లీలో డిసెంబర్ 13న అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీనివల్ల ఒకరి దేశంలో మరొకరు అధ్యయనం, పరిశోధన చేయడం, ఉమ్మడి ఫ్రేమ్‌వర్క్‌ను అభివృద్ధి చేసుకునేందుకు వీలుంటుంది. విద్యార్థులు, విద్యావేత్తలు, పరిశోధకులు, వ్యాపారవేత్తలు, నిపుణుల కదలికలను సులభతరం చేయడానికి, అక్రమ వలసలను ఎదుర్కోవడం ఈ ఒప్పంద ఉద్దేశం. విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వీ మురళీధరన్, ఫిన్లాండ్ ఎంప్లాయ్మెంట్ మంత్రి తూలా హాటైనెన్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.
అగ్ని-5
- అణ్వాయుధాలను మోసుకెళ్లే సామర్థ్యమున్న అగ్ని-5 బాలిస్టిక్ క్షిపణిని భారత్ డిసెంబర్ 15న విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరంలో అబ్దుల్ కలాం ఐల్యాండ్‌లో ఈ ప్రయోగాన్ని చేపట్టారు. ఇది 5 వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. చైనా వద్ద ఉన్న డాంగ్ ఫెంగ్-41 మిసైళ్లు 12,000 నుంచి 15,000 కి.మీ. దూరంలోని లక్ష్యాలను ఛేదిస్తాయి. చైనాను దృష్టిలో పెట్టుకుని ఈ అగ్ని-5ను భారత్ రూపొందించింది. అగ్ని-1 నుంచి అగ్ని-4 వరకు గల క్షిపణులు 700-3,500 కి.మీ. లక్ష్యాలను ఛేదిస్తాయి. అగ్ని-5 డిజైన్, డెవలప్మెంట్ హైదరాబాద్‌లోని డీఆర్డీవో ల్యాబ్‌లలో జరిగింది.
ఐఎన్ఎస్ మొర్ముగావ్
- అత్యంత శక్తిమంతమైన శత్రు విధ్వంస యుద్ధనౌక ‘ఐఎన్ఎస్ మొర్ముగావ్’ను రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ముంబైలోని నేవల్ డాక్‌యార్డ్‌లో డిసెంబర్ 18న ప్రారంభించారు. గోవా విమోచన దినోత్సవం (డిసెంబర్ 19) సందర్భంగా ఈ యుద్ధనౌక ప్రారంభ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ యుద్ధనౌక 163 మీటర్ల పొడవు, 17 మీటర్ల వెడల్పు, 7,400 టన్నుల బరువు ఉంది. రూ.35,800 కోట్లతో దీన్ని నిర్మించారు. స్వదేశీ ఇన్పుట్లను కలిగి ఉన్న స్టెల్త్ డిస్ట్రాయర్లను అభివృద్ధి చేయడం ప్రాజెక్ట్ 15బి లక్ష్యం. ఈ ప్రాజెక్టు కింద నిర్మిస్తున్న నాలుగు నౌకల్లో ఐఎన్ఎస్ మొర్ముగావ్ రెండోది. మొదటిది ఐఎన్ఎస్ విశాఖపట్నం నవంబర్ 2021లో నావికాదళంలో ప్రవేశపెట్టారు.
Previous article
Five Year Program IPM @ IIM Indore
Next article
జేఈఈ మెయిన్ -2023
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు






