అమలుకాని తెలంగాణ రక్షణలు
తెలంగాణలో భూముల అమ్మకం, కొనుగోళ్లకు తెలంగాణ ప్రాంతీయ మండలి ఆమోదం ఉండాలి.. ప్రాథమిక, మాధ్యమిక విద్యాభివృద్ధికి అవసరమైన అభివృద్ధి ప్రణాళికలను ఈ కమిటీనే రూపొందించాలి.. కానీ అవేమీ జరుగలేదు.. తెలంగాణ మిగులు నిధులు కోట్ల రూపాయలు ఏమయ్యాయని అడిగితే వలస పాలకులు ఎగతాళిచేసేవారు.. అలా వలసాధిపత్యం వల్ల ప్రాంతీయమండలి నామమాత్రంగానే ఉండిపోయింది.. ఈ మండలి కార్యక్రమాలు, దాని అమలు విఫలమైనతీరు నిపుణ పాఠకుల కోసం ప్రత్యేకం..
2014, సెప్టెంబర్ 18న స్కాట్లాండ్ ఇంగ్లండ్ నుంచి విడిపోయి స్వతంత్ర దేశంగా అవతరించడానికి నిర్వహించిన రెఫరెండంలో 55.33 శాతం స్కాటిష్ ప్రజలు బ్రిటన్లోనే కొనసాగాలని అభిప్రాయపడ్డారంటే యునైటెడ్ కింగ్డమ్ ఐక్యతకు స్కాటిష్ స్థాయి సంఘం కల్పించిన రక్షణలు ఏ విధంగా ఉన్నాయో అర్థమవుతుంది. కోస్తాంధ్ర 1953కు పూర్వం మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు రాయలసీమ ప్రాంతానికి కొన్ని రక్షణలు కల్పిస్తూ దాని అభివృద్ధి కోసం ఒక బోర్డును ఏర్పాటుచేసింది. దీన్నే సీడెడ్ డిస్ట్రిక్ట్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు అని అంటారు. దీని పేరును తరువాత రాయలసీమ అభివృద్ధి బోర్డుగా మార్చారు. 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడటంతో ఇది రద్దయింది.
తెలంగాణ ప్రాంతీయ కమిటీ సమావేశాలు రాష్ట్ర శాసనసభ భవనంలోనే జరిగేవి. తెలంగాణ ప్రాంతానికి చెందిన ముసాయిదా బిల్లులన్నీ ప్రాంతీయ కమిటీ ఆమోదం పొందాలి. తెలంగాణకు సంబంధించిన ఆర్థిక సంబంధంలేని బిల్లును ప్రాంతీయ బిల్లు అంటారు. ఈ ప్రాంతీయ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టే ముందు తెలంగాణ ప్రాంతీయ కమిటీ ఆమోదం విధిగా పొందాలి. ఏదైనా బిల్లు ప్రాంతీయ బిల్లు అవునా కాదా అనే సందిగ్ధం వచ్చినప్పుడు దాన్ని తేల్చే నిర్ణయాధికారం గవర్నర్కు ఉంటుంది.
ప్రాంతీయ మండలి పరిశీలన అంశాలు
-ప్రాంతీయ కమిటీ పరిధిలోకి కొన్ని బిల్లులు రావు. అవి ద్రవ్య సంబంధమైనవి. అదే విధంగా తెలంగాణ ప్రాంతానికి వర్తించే ఏదైనా శాసనం ఆంధ్రాప్రాంతానికి కూడా వర్తింపజేయాలని భావించినప్పుడు దాన్ని ప్రాంతీయ సంఘంలో ప్రవేశపెట్టాల్సిన అవసరం లేదు. ప్రాంతీయ కమిటీకి ఈ దిగువ విషయాలను పరిశీలించే అధికారం ఉంటుంది.
1) తెలంగాణ ప్రాంతంలో వ్యవసాయభూముల అమ్మకం, కొనుగోళ్లకు ఈ కమిటీ ఆమోదం తప్పనిసరి, వ్యవసాయ భూముల అమ్మకం మొత్తం దీని నియంత్రణలో ఉంటాయి.
2) రాష్ట్ర శాసనసభ రూపొందించిన సాధారణ ప్రణాళిక అభివృద్ధి సంస్థలు, జిల్లా బోర్డులు, జిల్లా సంస్థలకు సంక్రమించే రాజ్యాంగబద్ద అధికారాలను ఈ కమిటీ పరిశీలిస్తుంది.
3) తెలంగాణ ప్రాంతం ప్రాథమిక, మాధ్యమిక విద్యాభివృద్ధికి అవసరమైన అభివృద్ధి ప్రణాళికలను ఈ కమిటీ రూపొందిస్తుంది.
4) తెలంగాణ ప్రాంతంలోని విద్యాసంస్థల్లో తెలంగాణ విద్యార్థుల ప్రవేశాలకు ఆటంకం జరగకుండా పరిశీలించే అధికారం దీనికుంది.
5) తెలంగాణలో మద్యపాన నిషేధ విషయం దీని పరిధిలోనే ఉంటుంది.
6) తెలంగాణలోని కుటీర-చిన్నతరహా పరిశ్రమలు వ్యవసాయం సహకార సంఘాలు, మార్కెట్లు, సంతలు వంటివన్ని దీని పరిధిలోనే ఉంటాయి.
7) తెలంగాణ ప్రాంతంలోని ఉద్యోగ నియామకాలను ఇది పరిశీలిస్తుంది.
మినీ ప్రభుత్వంలా ఉండాలి!
పెద్దమనుషుల ఒప్పందం అమలు విషయంలో ఆంధ్రా నాయకులు ఎప్పుడు తమ చిత్తశుద్ధిని ప్రదర్శించలేదు. ఆంధ్రలో తెలంగాణ విలీనానికి మరో మార్గం కనిపించక పెద్దమనుషుల ఒప్పందం చేసుకున్నారే తప్ప దాని అమలుకు కించిత్తు ఆసక్తి చూపలేదు. పెద్దమనుషుల ఒప్పందం ప్రకారం తెలంగాణకు విస్తృతమైన అధికారాలతో కూడిన ప్రాంతీయ మండలి ఏర్పడాలి. పెద్దమనుషులు ఒప్పందాన్ని పర్యవేక్షించే అధికారాలతో పాటు తెలంగాణ అభివృద్ధికి ప్రణాళికను తయారుచేసుకునే అధికారాలు ఈ మండలికి కల్పించాలి. ఒక విధంగా తెలంగాణ ప్రాంతీయ మండలి ఒక మినీ ప్రభుత్వం లాంటిది. అధికారాలతో కూడిన ఇలాంటి మండలి ఏర్పడి ఉంటే తెలంగాణకు రాజకీయ వ్యక్తీకరణ జరిగేది, రాజకీయ నాయకత్వం ఎదిగేది, నీటిపారుదల, విద్య, ఉద్యోగ రంగాల్లో కొంతైనా న్యాయం జరిగేది.
పంజాబ్ ప్రాంతీయ కమిటీ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయం ఉండేది. కానీ తెలంగాణ ప్రాంతీయ కమిటీ సమావేశంలో అదిలేదు. కానీ సభ్యులు అడిగిన సమాచారాన్ని మాత్రం ప్రభుత్వం అధికారికంగా అందించేది. ప్రాంతీయ కమిటీ తమవద్దకు వచ్చిన ప్రతి బిల్లును క్షుణ్ణంగా చర్చించి ఆమోదించే అధికారం ఉండేది. ఈ కమిటీలో రెండురకాల ఉపసంఘాలు ఉండేవి.
1) స్థాయి ఉపసంఘాలు మూడు ఉండేవి. ఎ) స్థానిక పాలన ప్రజారోగ్య స్థాయి ఉపసంఘం బి) విద్యా విషయక స్థాయి ఉపసంఘం సి) అభివృద్ధి విషయాల స్థాయి ఉపసంఘం. ఇవి నిర్ణీత విషయాలపై ఏర్పడి ఆ అంశాలను విస్తృతంగా చర్చించే అధికారం కలిగి ఉండేవి. తాత్కాలిక ఉపసంఘాలు అవసరాన్ని బట్టి ఎన్నయినా ఉండవచ్చు.
2) తాత్కాలిక ఉపసంఘాలు: తెలంగాణ ప్రాంతీయ కమిటీకి ప్రత్యేక విషయాలపై తాత్కాలిక ఉపసంఘాలను ఏర్పాటుచేసుకునే అధికారాలు ఉండేవి. ఈ తాత్కాలిక ఉపసంఘాల సంఖ్యలో పరిమితి అంటూ ఏమీలేదు. వాటికి నిర్దేశించిన పని పూర్తికాగానే అవి రద్దవుతాయి. ప్రతి ఉపసంఘంలో తొమ్మిది మంది సభ్యులుండేవారు. వీరిని తెలంగాణ ప్రాంతీయ కమిటీ సభ్యులు ఎన్నుకునేవారు. వీరిలో ఒకరిని చైర్మన్గా ప్రాంతీయ కమిటీ చైర్మన్ నియమించేవారు. ఈ ఉపసంఘాలు సమర్పించిన ప్రతిపాదనల నివేదికలను ప్రాంతీయ కమిటీ ఏకగ్రీవంగా ఆమోదించి, అమలు కోసం ప్రభుత్వానికి సమర్పించేది. కానీ ఇవి ఏనాడు అమలు కాలేదు.
తెలంగాణ ప్రాంతానికి కొన్ని ప్రత్యేక రక్షణలు కల్పించిన తరువాతనే ఆంధ్రప్రాంతంలో తెలంగాణను విలీనం చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాన్ని ఏర్పర్చారు. ఈ సందర్భంగా ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి కల్పించిన రక్షణల అమలు ఉమ్మడి రాష్ట్ర మనుగడకు కీలకమన్న విషయాన్ని గమనించాలి. అయితే ఇలాంటి రక్షణల అమలు కేంద్రప్రభుత్వం పర్యవేక్షణ లేకుండా అసాధ్యమని రాష్ర్టాల పునర్వ్యవస్థీకరణ సంఘం అధ్యక్షుడు జస్టిస్ ఫజల్ అలీ అభిప్రాయపడి, ఈ అంశాన్ని తమ నివేదికలో పొందుపర్చారు. శ్రీభాగ్ ఒడంబడిక వంటి ఏర్పాటుగాని, బ్రిటన్ దేశంలో స్కాట్లాండ్కు ఇచ్చిన రక్షణలుకాని తెలంగాణకు న్యాయం చేకూర్చలేవని అభిప్రాయపడుతూ కేంద్రం నేరుగా జోక్యం చేసుకొని అజమాయిషీ చేస్తే తప్ప అటువంటి రక్షణలకు అర్థం ఉండదని తమ నివేదికలో పేరా 383, 384లో పేర్కొన్నారు.
కమిషన్ విశ్లేషణ నిజమని చరిత్ర రుజువు చేసింది. తెలంగాణకు చట్టపరంగా కల్పించిన రక్షణల అమలు విషయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంగాని, ఆంధ్రప్రాంత నాయకత్వంగాని ఎలాంటి శ్రద్ధ కనబర్చలేదు. రక్షణల అమలుకు పాల్పడకుండా వాటి ఉల్లంఘనలకే ప్రాధాన్యమిస్తూ పోవడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మనుగడ ప్రశ్నార్థకమైంది. తెలంగాణ ఉద్యమం అనివార్యమైంది.
మిగులు నిధులపై శ్వేతపత్రం
1961లో తెలంగాణ ప్రాంతీయ కమిటీ అధ్యక్షుడు కే అచ్యుతరెడ్డి సూచనలకు స్పందించిన నాటి ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య తెలంగాణ మిగులు నిధులతో పోచంపాడు ప్రాజెక్టును నిర్మిస్తామని, కొత్తగూడెంలో ఎరువుల కర్మాగారం నెలకొల్పుతామని ప్రకటించారు. 1961లో సంజీవయ్య ప్రభుత్వం ఒక శ్వేతపత్రం ప్రచురించింది. అందులోని ముఖ్యాంశాలు..
1) నిజాం సెక్యూరిటీలకు సంబంధించిన రూ. 13 కోట్లు తెలంగాణ అభివృద్ధికి ఖర్చు చేస్తామని పేర్కొంది.
2) ఇప్పటివరకు ఆంధ్రలో ఖర్చుపెట్టిన తెలంగాణ మిగులు నిధులను తృతీయ ప్రణాళికలో తెలంగాణలో ఖర్చుచేస్తామని పేర్కొంది.
3) వీటికి అదనంగా మరో రూ. 12 కోట్లతో తెలంగాణలో ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతామని వాగ్దానం చేసింది.
సంజీవయ్య తరువాత వచ్చిన ముఖ్యమంత్రులు ఎవరూ వీటిని పట్టించుకోకపోవడంతో పాటు తెలంగాణ మిగులు నిధులను ఆంధ్ర అభివృద్ధికి తరలించారు. ఆ రోజుల్లో వరంగల్ నుంచి వెలువడిన జనధర్మ పత్రిక, కొద్దిమంది ఎమ్మెల్యేలు, మేధావులు మాత్రమే తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నిస్తూ వచ్చారు. 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడే నాటికి హైదరాబాద్ రాష్ట్రం రూ. 4.49 కోట్ల మిగులు నిధులతో ఉండగా ఆంధ్రరాష్ట్రం రూ. 2.07 కోట్ల లోటుతో ఉంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్ర అభివృద్ధి చెంది తెలంగాణ వెనుకబడిపోవడానికి కారణం తెలంగాణ మిగులు నిధులను యధేచ్ఛగా ఆంధ్ర అభివృద్ధికి తరలించడమే. ఈ విషయాన్ని కేవీ రంగారెడ్డి మా కోట్లాది రూపాయలు ఏమయ్యాయి అని ప్రశ్నిస్తే అప్పటి ఆర్థిక మంత్రి బ్రహ్మానందరెడ్డి ఏ కోట్లు పాత కోట్లా-కొత్త కోట్లా అని గేలిచేశారు. 1956-61 మధ్యకాలంలో ఆంధ్రలో 2072 గ్రామాల విద్యుద్దీకరణ జరిగితే తెలంగాణలో 490 గ్రామాల్లో మాత్రమే జరిగింది.
అదేవిధంగా 1961-66 మధ్యకాలంలో ఆంధ్రలో 1452 గ్రామాల్లో విద్యుద్దీకరణ జరిగితే తెలంగాణలో 370 గ్రామాల్లో మాత్రమే జరిగింది. ఈ పరిణామాల ఫలితంగా ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ దారుణమైన అన్యాయానికి, వివక్షకు గురైంది. ఉమ్మడి రాష్ట్రంలో తీవ్రమైన ప్రాంతీయ అసమానతలు చోటుచేసుకున్నాయి. ఈ అన్యాయాలు, అసమానతలు, వివక్షను ప్రజాక్షేత్రంలో ప్రశ్నించడం 1968 నుంచి ప్రారంభమై క్రమంగా పుంజుకొని ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర కోరికకు బలమైన పునాదులు పడ్డాయి.
తెలంగాణ ప్రాంతీయ కమిటీ అధ్యక్షులు
1) కే అచ్యుతరెడ్డి – 1960-64
2) టీ హయగ్రీవాచారి – 1964-67
3) జే చొక్కారావు – 1967-72
4) కే రాజమల్లు – 1972-73
ఉపాధ్యక్షులు
1) మాసూమాబేగం – 1960-64
2) టీ రంగారెడ్డి – 1964-67
3) కే రాజమల్లు – 1967-72
4) సయ్యద్ రహ్మత్ అలీ – 1972-73
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు