ఇంటర్ ఇంగ్లిష్‌లో తెలంగాణ వైభవం
# ఫస్టియర్, సెకండియర్ కొత్త పుస్తకాల్లో ఎన్నో ప్రత్యేకతలు
# తెలంగాణ పోరాటగాథ, సంస్కృతి అంశాలకు ప్రాధాన్యం
ఈ రోజుల్లో సిమెంట్.. స్టీల్ వాడకుండా నిర్మాణాలు సాధ్యమేనా? అసాధ్యం అనుకుంటాం. కానీ, సంగారెడ్డి శివారులో వీటిని వాడకుండానే దేవాలయాన్ని నిర్మిస్తున్నారు. లైమ్, బెల్లం, జ్యూట్, కరక్కాయ, మారేడు బిల్వం, ఇసుక, రాళ్లను వినియోగించి ఆలయ నిర్మాణం చేపడుతున్నారు.
మనమేదైనా బంగారు ఆభరణాన్ని ధరిస్తే కొంత కాలానికే మెరుగుపోతుంది. కానీ, యాదాద్రి దేవాలయ గోపురాలకు చేయించిన బంగారు తాపడం 50 ఏండ్ల వరకు చెక్కు చెదరకుండా ఉంటుంది. ఇస్రో, నాసా రాకెట్ల ప్రయోగానికి వినియోగించే నానో టెక్ గోల్డ్ డీపొజిషన్ (ఎన్‌టీజీడీ) టెక్నాలజీని యాదగిరిగుట్ట ఆలయ బంగారు తాపడంలో వినియోగించారు.
ఇలాంటివెన్నో ప్రత్యేకతలు తెలుసుకోవాలంటే ఇంటర్మీడియట్ ఫస్టియర్, సెకండియర్ ఇంగ్లిష్ పాఠ్యపుస్తకాలను చదవాల్సిందే. ఈ రెండు పుస్తకాల్లో తెలంగాణ అంశాలను పాఠంగా ప్రవేశపెట్టారు. సురవరం ప్రతాపరెడ్డి, పద్మశ్రీ తిమ్మక్క, కరోనా సమయంలో ఆపన్న హస్తం అందించిన స్ఫూర్తి ప్రదాత సేవాగుణాన్ని పాఠ్యాంశాలుగా చేర్చారు.
మన తెలంగాణ వైభవం..
సాధారణంగా చరిత్ర పుస్తకాల్లో మాత్రమే సాంస్కృతిక వైభవాన్ని చాటుతారు. కానీ, ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఇంగ్లిష్ పుస్తకాలను విభిన్నంగా తయారుచేశారు. తెలంగాణ పోరాటగాథలు మొదలుకొని.. మన సంస్కృతి, వారసత్వానికి ప్రతీకలైన వాటిని పాఠ్యాంశాలుగా ప్రవేశపెట్టారు. రీడింగ్ కాంప్రహెన్సివ్ పేరుతో ఒక్కో పుస్తకంలో 15 అంశాల గురించి ప్రస్తావించారు. స్వరాష్ట్ర వైభవాన్ని చాటేలా 60 వరకు అంశాలను సిలబస్‌లో చేర్చారు. ఇది వరకు జాతీయ, అంతర్జాతీయ అంశాలను మాత్రమే చేర్చేవారు. స్వరాష్ట్రంలో తెలంగాణ వైభవాన్ని చాటేలా అంశాలను పొందుపర్చారు. ఆయా అంశాలపై పరీక్షల్లో ప్రశ్నలిస్తుండగా, రీడింగ్ కాంప్రహెన్సివ్కు 8 మార్కులు కేటాయిస్తున్నారు. గత ఏడాది ఫస్టియర్‌కు కొత్త పుస్తకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ ఏడాది కొత్తగా సెకండియర్ పుస్తకాన్ని ముద్రించారు. మరో వారం రోజుల్లో ఆ పుస్తకాలు విద్యార్థుల చేతికి అందుతాయి.
చేర్చినవి ఇవే..
# యునెస్కో గుర్తింపు పొందిన ప్రముఖ దేవాలయం రామప్ప. దేవాలయ ప్రాశస్థ్యాన్ని తెలంగాణ గ్లోరీ పేరుతో పుస్తకంలో వివరించారు.
# డిగ్రీలో ప్రవేశాల ప్లాట్‌ఫాం.. డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్). దోస్త్ అథెంటికేషన్పైనా ఒక అంశాన్ని పాఠ్యాంశాల్లో చేర్చారు.
# నిరుడు తుదిశ్వాస విడిచిన గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం (ఎస్పీ బాలు) గురించి, పాటలు, ఆయన ఘనత, పొందిన అవార్డుల గురించి పరిచయం చేశారు.
# హైదరాబాద్ కొత్తపేటలోని మియావాకీ ఫారెస్ట్ దేశంలో అతిపెద్దది. 10 ఎకరాల్లో మియావాకీ పద్ధతిలో మొక్కలునాటారు. ఈ విషయాన్ని సైతం పుస్తకంలో అంతర్భాగంగా చేర్చారు.
# సిద్దిపేటకు సమీపంలో కొండపాక వద్ద 100 ఎకరాల్లో ఆనందనిలయం పేరుతో అద్భుత బృందావనాన్ని నిర్వహిస్తున్నారు. ఇక్కడ వృద్ధాశ్రమం, దేవాలయం నిర్వహిస్తుండగా, ఈ అంశాన్ని సైతం చేర్చారు.
# ఆసు యంత్రాన్ని కనిపెట్టిన పద్మశ్రీ డాక్టర్ చింతకింది మల్లేశం, కొత్వాల్ రాజబహద్దూర్ వెంకట్రామిరెడ్డి, దుశ్చర్ల సత్యనారాయణ, క్రికెటర్ మిథాలిరాజ్, కరోనా సమయంలో విశేషంగా సేవలందించిన అన్నం శ్రీనివాసరావు గురించి సంక్షిప్తంగా పరిచయం చేశారు.
# కాళేశ్వరం.. గోదావరి పరవళ్లకు కొత్తనడకలు నేర్పుతూ ఇక్కడ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ చారిత్రాత్మకం. రైతుల్లో కొంగొత్త ఆశలు రేకెత్తిస్తూ, పసిడిపంటలు పండించడమే కాకుండా, తెలంగాణను సజీవ జలధారలుగా మార్చిన ఈ ప్రాజెక్ట్.. ఇప్పుడు ఇంటర్ ఇంగ్లిష్ పుస్తకంలో చోటుదక్కింది.
# సిద్దిపేట స్వచ్ఛబడి.. చెత్తసేకరణ, నిర్వహణలో దేశంలోనే రెండో ఉన్నస్థానంలో ఉన్నది. బెంగళూరుకు చెందిన పాఠశాల మొదటిస్థానంలో ఉండగా, సిద్దిపేట స్కూల్ రెండో స్థానంలో ఉన్నది. దీని గురించి కూడా పాఠ్యపుస్తకంలో పేర్కొన్నారు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు