విద్యాసంస్థలకు రాష్ట్రస్థాయి ర్యాంకులు
ఎన్ఐఆర్ఎఫ్ తరహాలో నూతన విద్యా విధానం
తొలుత వర్సిటీలు, ఇంజినీరింగ్, డిగ్రీ కాలేజీలకు జారీ
దశలవారీగా మిగతా కాలేజీలకూ ర్యాంకుల కేటాయింపు
కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ఉన్నత విద్యామండలి
పరిశోధనలను ప్రోత్సహించేలాప్రత్యేకంగా రిసెర్చ్ సెల్ ఏర్పాటు
ఉన్నత విద్యా సంస్థల్లో పోటీతత్వాన్ని, ప్రమాణాలను పెంచేందుకు తెలంగాణ ఉన్నత విద్యామండలి పలు కీలక నిర్ణయాలను తీసుకొన్నది. దీనిలో భాగంగా రాష్ట్రంలోని విద్యాసంస్థలకు ర్యాంకులను జారీచేయాలని నిర్ణయించింది. ప్రాథమికంగా ప్రభుత్వ, ప్రైవేట్ యూనివర్సిటీలు, ఇంజినీరింగ్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలకు.. దశలవారీగా మిగతా కాలేజీలకు ర్యాంకులు కేటాయించనున్నది. ఈ మేరకు బుధవారం జరిగిన ఉన్నత విద్యామండలి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (ఈసీ) సమావేశంలో నిర్ణయం తీసుకొన్నారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలను త్వరలోనే రూపొందించి అమలు చేయనున్నారు.
ఎన్ఐఆర్ఎఫ్ తరహాలో..
నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్) పేరుతో కేంద్ర ప్రభుత్వం ఏటా విద్యాసంస్థలకు ర్యాంకులను జారీచేస్తున్నది. ఇదే తరహా రాష్ట్రంలోనూ ర్యాంకులు జారీచేయాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే పలు రాష్ట్రాలు సొంతంగా ర్యాంకులు జారీచేస్తున్నాయి. కేరళ, కర్ణాటక, ఉత్తరప్రదేశ్‌లో విద్యాసంస్థలకు ర్యాంకులు జారీచేస్తున్న విధానంపై తెలంగాణ ఉన్నత విద్యామండలి అధికారులు అధ్యయనం చేశారు. అంతేకాకుండా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ (నేపా), ఎన్ఐఆర్ఎఫ్ రూపకల్పనలో కీలకంగా వ్యవహరించిన ఢిల్లీ ఐఐటీ ప్రొఫెసర్ ప్రసాద్ నుంచి సలహాలు తీసుకొన్నారు. ఆయా వివరాలను బుధవారం ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశం ముందుంచారు. వీటిపై సమగ్రంగా చర్చించి తెలంగాణలోనూ అమలు చేయాలని నిర్ణయించారు.
అనుమతులు ఆన్లైన్లో
ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజీల ఏర్పాటుకు, కొత్త కోర్సులు ప్రవేశ పెట్టేందుకు, కోర్సుల మార్పిడికి ఇచ్చే అనుమతుల ప్రక్రియను పూర్తిగా ఆన్లైన్లో, పేపర్‌లెస్ పద్ధతిలో జరపాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఈ విధానంలో అమల్లోకి రానున్నది. ఇందుకోసం సింగిల్ విండో వ్యవస్థను అందుబాటులోకి తీసుకురానున్నారు.
ప్రత్యేకంగా రిసెర్చ్ సెల్
వర్సిటీలు, కాలేజీల్లో విద్యార్థులు గత కొనేండ్ల నుంచి పరిశోధనలకు ప్రాధాన్యమిచ్చి నూతన ఆవిష్కరణలను రూపొందిస్తున్నారు. అంతటితో ఆగకుండా అనేక పేటెంట్ హక్కులను సొంతం చేసుకొంటున్నారు. ఇలాంటి వారిని ప్రోత్సహించేందుకు రిసెర్చ్ సెల్‌ను ఏర్పాటు చేయాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ఎన్ఐఆర్ఎఫ్ సహా రాష్ట్రస్థాయిలో జారీచేసే ర్యాంకుల్లో పరిశోధనలకే పెద్దపీట వేస్తుండటంతో ప్రత్యేకంగా రిసెర్చ్ సెల్‌ను ఏర్పాటు చేయాలని ఉన్నత విద్యామండలి అధికారులు నిర్ణయించారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు