భారతదేశం నేలలు ఎలాంటివి?
ఒక దేశ ఆర్థికాభివృద్ధిలో వ్యవసాయం అత్యంత ప్రధానమైనది. పంటలు బాగా పండాలంటే అక్కడ ఉండే భూమిపై ఆధారపడి ఉంటుంది. ఒక్కో ప్రాంతంలో ఒక్కోవిధంగా నేలలు విస్తరించి ఉంటాయి. ఒకప్రాంతంలో సారవంతమైన నేలలు అందుబాటులో ఉంటే, మరికొన్ని ప్రాం తాల్లో ఎడారి ప్రాంతాలు ఉంటాయి. దేశంలో విస్తరించి ఉన్న వివిధ రకాల నేలలు, వాటిలో ఏవిధమైన పంటలు సాగుచేయవచ్చు అనే విషయాలు తెలుసుకుందాం..
-శిలావరణ ఉపరితలంపై అనేక కర్బన, అకర్బన పోషకాలతో కూడుకున్న పలుచని పొరలనే నేలలు అంటారు. ఇవి స్వల్పకాలంలో పునరుద్ధరణ చెందలేని, దీర్ఘకాలంలో పునరుత్పత్తి చెందే ఒక గతిశీలమైన సహజ వనరులు. ఎందుకంటే 1 మీటరు మందంగల నేల ఏర్పడాలంటే దాదాపు 5 వేల నుంచి 10 వేల ఏండ్లు పడుతుంది. ఒక మీటరు నేల నిర్మించాలంటే కొన్ని రోజుల కాలవ్యవధి సరిపోతుంది. భూమిపై వృక్షజాతుల పెరుగుదలకు, ఒక దేశ ఆర్థికాభివృద్ధికి ఇవి అత్యంత కీలకం.
నేలలు రకాలు
-మృత్తికలు ఏర్పడే విధానాన్ని బట్టి వాటిని రెండు రకాలుగా విభజించవచ్చు. అవి..
1. స్థానబద్ధ మృత్తికలు (Sedentary Soils): శిలాశైథిల్యం కారణంగా ఏర్పడిన మృత్తిక మాతృశిలా ప్రాంతంపై నిక్షిప్తమవడంతో ఈ నేలలు ఏర్పడుతాయి. నల్లరేగడి నేలలు, లాటరైట్ నేలలు, ఎర్రనేలలు, సేంద్రియ నేలలు వీటికి ఉదాహరణలు.
2. నిక్షేపిత లేదా పరస్థానీయ మృత్తికలు (Drift/Transported Soils): బహిర్జనిత బలాల కారణంగా రవాణా అయ్యే ఒండ్రుమట్టి శిథిలాలు వేరొక ప్రాంతంలో నిక్షేపితం చెందడం వల్ల ఈ మృత్తికలు ఏర్పడుతాయి. ఉదా: ఒండ్రుమట్టి నేలలు.
-రష్యాకు చెందిన దెకుబస్, అమెరికా శాస్త్రజ్ఞుడు మార్పట్లు మృత్తికలు ఏర్పడే ప్రాంతాల లక్షణాలు, అక్కడి శీతోష్ణస్థితి వంటి అంశాలను ఆధారంగా చేసుకుని వాటిని 3 వర్గాలుగా విభజించారు. అవి..
1. మండల మృత్తికలు (Zonal Soils): ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంలో మాతృశిలా శైథిల్యం చెందడం వల్ల ఈ నేలలు ఏర్పడుతాయి. ఇవి విశాలంగా విస్తరించి ఉన్న ముఖ్యమైన మృత్తికలు.
-ఉదా: ఎర్ర నేలలు, నల్లరేగడి నేలలు, లాటరైట్, సేంద్రియ నేలలు, ఎడారి మృత్తికలు
2.అంతర మండల మృత్తికలు (Intra Zonal Soils): నీటిలో కరిగిన లవణాలు భూమిలోపల నుంచి కేశనాళికీయత ప్రక్రియద్వారా భూ ఉపరితలంపైకి వచ్చి అందులోని నీరు ఆవిరైపోగా మిగిలిన లవణాలు గడ్డకట్టగా ఏర్పడిన నేలలు అంతర మండల మృత్తికలు.
-ఉదా: లవణ మృత్తికలు, పీట్, టెర్రరోసా నేలలు.
3.అమండల మృత్తికలు (Azonal Soils): వివిధ లవణాలు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి రవాణా కావడం వల్ల ఇవి ఏర్పడుతాయి.
-ఉదా: ఒండ్రు, లోయస్ నేలలు.
-నేలలు ఏర్పడే విధానాన్ని గురించి అధ్యయనం చేసే శాస్ర్తాన్ని లిథాలజీ అని, నేలల భౌతిక, రసాయనిక ధర్మాలను గురించి అధ్యయనం చేసే శాస్ర్తాన్ని పెడాలజీ అని అంటారు.
-ఓల్కర్ (1893), లెదర్ (1898) అనే శాస్త్రవేత్తల పరిశోధనలతో భారతదేశంలోని మృత్తికలను ప్రధానంగా 4 రకాలుగా వర్గీకరించారు. అవి..
1. గంగా-సింధు ఒండలి మృత్తికలు, 2. నల్లరేగడి మృత్తికలు, 3. ఎర్ర మృత్తికలు, 4. లాటరైట్
మృత్తికలు
-భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రిసెర్చ్-ఐసీఏఆర్) పరిధిలోని నేషనల్ బ్యూరో ఆఫ్ సాయిల్ సర్వే అండ్ ద ల్యాండ్ యూజ్ ప్లానింగ్ ఇన్స్టిట్యూట్ నేలలపై పరిశోధనలు నిర్వహించింది.
-ఇది మృత్తికల లక్షణాలను పరిగణలోకి తీసుకుని నేలలను 8 రకాలుగా విభజించింది. అవి..
ఒండ్రుమట్టి నేలలు (Alluvial Soils)
-నదులు క్రమక్షయం చేసి తీసుకొచ్చిన ఒండ్రు మట్టి నిక్షేపాలతో ఈ మృత్తికలు ఏర్పడ్డాయి. ఇవి నదీ ప్రవాహానికి ఇరువైపులా, నదీ మైదానాలు, డెల్టా ప్రాంతాల్లో ఏర్పడుతాయి.
-వీటిలో సున్నం, పొటాష్, భాస్వరం వంటి వివిధ రకాల ఖనిజ పోషకాలు సమృద్ధిగా ఉండటంతో అత్యంత సారవంతమైనవిగా ఉంటాయి.
-ఈ నేలలు దేశ భూభాగంలో 24 శాతం (సుమారు 7.7 లక్షల చ.కి.మీ.) విస్తరించి ఉన్నాయి.
-ఇవి గంగా-సిధు డెల్టా, బ్రహ్మపుత్ర, ఒడిశాలోని మహానది డెల్టా, తెలంగాణలోని గోదావరి-కృష్ణా నదీ లోయలు, తమిళనాడులోని కావేరి డెల్టా, ఉత్తరాన పంజాబ్ నుంచి అసోం వరకు, కేరళలోని పశ్చిమ కనుమల పశ్చిమ ప్రాంతం, మధ్యప్రదేశ్, గుజరాత్‌లలో నర్మద, తపతి నదీలోయ ప్రాంతాల్లో ఈ నేలలు విస్తరించి ఉన్నాయి.
-దేశంలో మిగిలిన నేలలు ఇన్‌సిటు రకానికి చెందినవి కాగా, ఒండ్రుమట్టి నేలలు ఎక్స్‌సిటు రకానికి చెందినవి.
-గంగా మైదానంలో వీటిని ఖాదర్, భంగర్, బాబర్, టెరాయ్ అని పిలుస్తారు.
-ఖాదర్: బాగా మెత్తగా ఉండే కొత్త ఒండ్రు మట్టి నేలలను ఖాదర్ అంటారు. ఇవి లేతరంగులో ఉండి లైమ్, పొటాష్లను కలిగి ఉంటాయి.
-భంగర్: పాత ఒండ్రు మట్టి నేలలను భంగర్ అని పిలుస్తారు. ఇవి ముదురు రంగులో ఉండి, బంకమన్నును అధికంగా కలిగి ఉంటాయి.
-బాబర్: శివాలిక్ పర్వత పాదాలవెంట ముతక లేదా గులకరాళ్లతో కూడిన ఒండలి నేలలను బాబర్ అంటారు.
-టెరాయి: బాబర్‌కు దక్షిణాన సిల్ట్ నేలలో కూడిన తుంపర పల్లపు భూములను టెరాయి అంటారు.
-దేశంలో ఈ నేలలు ఉన్న ప్రాంతాల్లో వరి, గోధుమ, చెరకు, నూనె గింజలకు సంబంధించిన పంటలు ప్రధానంగా సాగవుతున్నాయి.
ఎర్రనేలలు
-ఇవి తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో ఎక్కువగా కన్పిస్తాయి.
-తక్కువ వర్షపాతం, అధిక ఉష్ణోగ్రతల వల్ల స్ఫటిక, రూపాంతర శిలలు శైథిల్యం చెంది ఈ మృత్తికలు ఏర్పడుతాయి. ప్రధానంగా గ్రానైట్ శిలలు విచ్ఛిన్నం చెందడం వల్ల ఏర్పడుతాయి.
-ఇవి ఎరుపు రంగులో ఉండటానికి కారణం అందులో కరిగి ఉన్న ఐరన్ ఆక్సైడ్.
-ఈ నేలల్లో ఇనుము, ఫెర్రోమెగ్నీషియం ఖనిజాలు పుష్కలంగా, సున్నపురాయి, కంకర, నైట్రోజన్, పాస్ఫారికామ్లం, ఫ్రీకార్బొనేట్లు లోపించి ఉంటా యి. అందువ్ల ఇవి ఎక్కువ పొడిగా, తక్కు వ సారవంతంగా గాలి పారేటట్లు ఉంటాయి.
-ఇవి దేశ భూభాగంలో సుమారు 29 శాతం ఆక్రమించి ఉన్నాయి. ముఖ్యంగా తమిళనాడులో ఎక్కువగా విస్తరించి ఉన్నాయి. కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో, తెలంగాణ, మధ్యప్రదేశ్‌లోని తూర్పు ప్రాంతం, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లోని చోటా నాగ్‌పూర్ ప్రాంతాల్లో ఈ నేలలు ఉన్నాయి.
-ఇక్కడ ఎక్కువగా గోధుమ, పత్తి, పొగాకు, దుంపలు, నూనె పంటలు సాగవుతున్నాయి.
మోడల్ ప్రశ్నలు
1. ఇటీవల తన కెరీర్లో 7వ ఆసియా బిలియర్డ్స్ చాంపియన్‌షిప్ గెలుచుకున్న వ్యక్తి ఎవరు?
1) మణన్ చంద్ర
2) పంకజ్ అద్వానీ
3) సుభాష్ అగర్వాల్
4) ఎవరూ కాదు
2. ఆగ్నేయాసియా దేశాల కూటమి (ASEAN)తో భారత్‌కు బంధం ఏర్పడి
2017 నాటికి ఎన్నేండ్లు పూర్తయ్యాయి?
1) 15 2) 23 3) 25 4) 26
3. తెలంగాణ రాష్ట్ర హస్తకళల సంస్థ గోల్కొండ లోగోలో ఉన్న పక్షి?
1) నెమలి 2) పావురం
3) పాలపిట్ట 4) పిచ్చుక
4. దేశంలోని మొదటి డిజీ పేస్టేషన్గా గుర్తింపు పొందిన కాచిగూడ రైల్వేస్టేషన్ ఏ బ్యాంక్ సౌజన్యంతో డిజీ పే విధానాన్ని అమల్లోకి తెచ్చింది?
1) యాక్సిక్ బ్యాంక్
2) ఐసీఐసీఐ బ్యాంక్
3) ఎస్బీఐ
4) ఆంధ్రాబ్యాంక్
5. కిందివాటిలో ఇండియాలోని e Bays కార్యకలాపాలను ఏ కంపెనీ కొనుగోలు చేసింది?
1) అమెజాన్ 2) ఫ్లిప్‌కార్ట్
3) స్నాప్‌డీల్ 4) పేటీఎం
6. ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం Leave No One Behind ఎవరికి సంబంధించింది?
1) మహిళలు, అమ్మాయిలు
2) పిల్లలు 3) శరణార్థులు
4) ఎవరూ కాదు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు