శాతవాహనులు వృత్తులు – వ్యాపారాలు
శాతవాహనుల కాలంలో 18 రకాల వృత్తులుండేవని శాసనాల వల్ల తెలుస్తుంది. హాలిక (వ్యవసాయదారులు), కోలికులు (నేత పనివారు), తిలపిసకలు (నూనె తీసేవారు), కాసాకారులు (ఇత్తడి పనివారు), కులరికులు (కుమ్మరి పనిచేసేవారు), తెసకారులు (మెరుగు పెట్టేవారు), కమారులు (కమ్మరి పనిచేసేవారు), మాలాకారులు (పూల వర్తకులు), ఓదయాంత్రికులు (ఉదక యంత్రాలను తయారు చేసేవారు), లోహ వాణియలు (ఇనుప వర్తకులు), సువణకారులు (సువర్ణకారులు), వధకులు (వడ్రంగులు), సేలవధకులు (రాతిపని చేసేవారు), అవేసినులు (చేతివృత్తులవారు), లేఖకులు (మేదరివారు), మీఠికులు (రాయి మెరుగుపెట్టేవారు), గధికులు (సుగంధ ద్రవ్యాల వర్తకులు), మణికారులు (రత్నపనివారు) అనే వృత్తులవారిని శాసనాలు, సమకాలీన సాహిత్యం పేర్కొన్నాయి.
-ఒక్కో వృత్తిని అనుసరించినవారు ఒక్కో శ్రేణిగా ఏర్పడ్డారు. ప్రతి శ్రేణికి శ్రేష్టి అనే అధ్యక్షుడు ఉండేవారు. జున్నార్ శాసనం ధన్నుక (ధాన్యం), కాసాకార, తెసకార శ్రేణులను పేర్కొన్నది. నాసిక్ శాసనం కులరిక, తిలపిసక, ఓదయాంత్రిక శ్రేణులను పేర్కొన్నది.
-సంఘ (శ్రేణి) సభ్యులకు ఉండాల్సిన కట్టుబాట్లను సంఘంవారే ఏర్పర్చి అమలుచేసేవారు. ఈ కట్టుబాట్లను శ్రేణిధర్మం అనేవారు. శ్రేణి ధర్మాన్ని రాజ్యం గుర్తించేది. ఈ వృత్తి సంఘాలే తరువాతికాలంలో కులాలుగా రూపొందాయి. శ్రేణులు డిపాజిట్లు తీసుకునేవి, అప్పులు ఇచ్చేవి.
-రుషభదత్తుని నాసిక్ శాసనం గోవర్ధనాహారంలోని చేనేత పనివారి శ్రేణి రెండు డిపాజిట్లను స్వీకరించినట్లుగా పేర్కొంది. అందులో మొదటి నెలకు ఒక శాతం వడ్డీరేటుపై 2,000 కర్షాపణలు, రెండోది నెలకు 3/4 శాతం వడ్డీరేటుపై 1,000 కర్షాపణలు. ఇందులో మొదటిది డిపాజిట్‌పై వచ్చే వడ్డీ మొత్తాన్ని నాసిక్ గుహ విహారంలోని 20 మంది భిక్షవులకు (బౌద్ధ) ఒక్కొక్కరికి ఏడాదికి వస్ర్తాలు కొనేందుకుగాను 12 కర్షాపణలు ఖర్చుపెట్టడానికి ఉద్దేశించినది, రెండో డిపాజిట్‌పై వచ్చే వడ్డీ మొత్తాన్ని ఆ బౌద్ధ సన్యాసులకు ఇతర అవసరాల నిమిత్తం ఖర్చు పెట్టేందుకు ఇచ్చేవారు.
-జున్నార్ శాసనం వల్ల బౌద్ధ మతానికి చెందిన ఒక వ్యక్తి తన రెండు వ్యవసాయ క్షేత్రాల నుంచి వచ్చిన ఆదాయాన్ని కొనచిక అనే పట్టణంలో ఉన్న శ్రేణిలో డిపాజిట్ చేసి దానిపై వడ్డీ ద్వారా వచ్చే ఆదయాన్ని చెట్లు నాటేందుకు ఉపయోగించాడని తెలుస్తుంది. శ్రేణుల కార్యకలాపాల్లో నిజాయితీ, నిష్పక్షపాతం ఉండేది.
స్వదేశీ-విదేశీ వ్యాపారాలు:
శాతవాహన యుగంలో దేశీయ వాణిజ్య కేంద్రాలను రేవు పట్టణాలను కలుపుతూ రహదారులు ఉండే వి. తూర్పుతీరంలో మచిలీపట్టణం నుంచి ఒకటి, వినుకొండ నుంచి ఇంకొకటి ఈ రెండు రహదారులు హైదరాబాద్ సమీపంలో కలిసి పశ్చిమ తీరరేవు పట్టణాలను కలిపేవని తెలుస్తుంది. ఎడ్లబండి ప్రధాన ప్రయాణ సాధనం. వర్తకులు బిడారులుగా ఏర్పడి ప్రయాణం సాగించేవారు. విదేశాలతో వ్యాపారం చేసే వర్తకులను సార్ధవాహులు అనేవారు. వీరు శ్రేణులుగా ఏర్పడి శ్రేష్టి (సెట్టి) నాయకత్వంలో వ్యాపారం సాగించేవారు. ఒక అజ్ఞాత నావికుడు రాసిన పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ టాలమీ రచించిన జాగ్రఫీ, ప్లీనీ రచించిన నేచురల్ హిస్టరీ అనే గ్రంథాలు, దక్షిణాపథంలో అనేక చోట్ల లభించిన రోమన్ నాణేలు, ఓడముద్ర గల శాతవాహనుల నాణేలు వీరి కాలం నాటి విదేశీ వ్యాపారాన్ని సూచిస్తున్నాయి.
శాతవాహనుల కాలంలో రోమ్తో ఎక్కువ విదేశీ వ్యాపారం జరిగేదని దొరికిన రోమన్ నాణేల ద్వారా తెలుస్తుంది. రోమన్ నాణేలు తెలంగాణలోని నల్లగొండ జిల్లాలోని గొట్టిపర్తి, అక్కెనపల్లి, ఏలేశ్వరం, కరీంనగర్ జిల్లాలోని నుస్తులాపూర్, పెద్దబంకూర్, ఖమ్మం జిల్లాలోని నాగవరప్పాడులో విడివిడిగా కుప్పలుగా కూడా దొరికాయి. ఏపీలో నెల్లూరు, అత్తిరాల, అమరావతి, నాగార్జునకొండ, వినుకొండ, చేబ్రోలు, ఒంగోలు, నంధ్యాలలో విరివిగా దొరికాయి. తమిళనాడులోని అరికమేడు (పుదుచ్చేరి సమీపంలో) వద్ద ఎన్నో బంగారు నాణేలు దొరికాయి. ఈ అరికమేడు ప్రధాన రోమన్ వర్తక కేంద్రం ప్రతి సంవత్సరం రోమ్ నుంచి భారతదేశానికి కోటి 25 లక్షల దీనార్లు చేరేవని ప్లీనీ పేర్కొన్నాడు.
రోమన్ సామ్రాజ్యానికి ఎగుమతులు :
రోమ్కు ఎగుమతి అవుతున్న సరుకుల్లో సుగంధ ద్రవ్యాలు, మణులు, ముత్యాలు, పట్టుబట్టలు, సన్నని పట్టు సెల్లాలు ఉండేవి. ముఖ్యంగా దక్షిణ భారతదేశ వస్ర్తాలపై రోమనులకు విపరీతమైన మోజు ఉండేది. రోమన్ యువతులు సిగ్గువిడిచి భారతదేశం నుంచి దిగుమతి అయ్యే సాలెగూళ్ల వంటి సన్నని వస్ర్తాలను ధరించి తిరుగేవారని క్రీ.శ. 70 ప్రాంతంలో రోమన్ శాసనసభలో ప్లినీ వాపోయాడు. ఈ కాలపు ఎగుమతుల వల్ల శాతవాహన సామ్రాజ్యానికి టన్నులకొద్ది బంగారం నాణేల రూపంలో దిగుమతి అయి ఉంటుందని మనం ఊహించవచ్చు. సామాన్య జనులు కూడా బంగారు ఆభరణాలు ధరించటం అజంతా చిత్రాల్లో కనిపిస్తుంది.
ఇంకా రోమన్ సామ్రాజ్యానికి రకరకాలైన జంతువులను, నెయ్యి, నువ్వుల నూనె, పట్టు, పట్టువస్ర్తాలు, నూలుబట్టలు, మిరియాలు, వనమూలికలు, తమలపాకులు, బెల్లం, చందనం చెక్క, టేకు చెక్కలు, కొబ్బరికాయలు, ఉల్లిపాయలు, ఉక్కు మొదలైనవి ఎగుమతి చేసేవారు. వీరి నుంచి భారతదేశం దిగుమతి చేసుకునే వస్తువుల్లో బంగారం, వెండి, రాగి, గాజు సామానులు, మత్తుపానీయాలు మొదలైనవి అయితే వాణిజ్యం మొదటి నుంచి భారతీయులకే లాభదాయకంగా ఉండేది. అందువల్ల రోమన్ దేశపు బంగారం పెద్ద మొత్తంలో భారతదేశం చేరింది. శాతవాహనుల కాలంలో పశ్చిమతీరంలోని సోపార, కల్యాణి, భరుకచ్చం (బ్రోచ్) వంటి రేవు పట్టణాల ద్వారా, తూర్పుతీరంలో కంటక సేల (ఘంటసాల), కొడ్డూర (గూడూరు), మైసోలియా (మచిలీపట్నం), ఆల్లోసిగ్నేలు (ఆదుర్రు) వంటి ఓడరేవుల ద్వారా విదేశీ వ్యాపారం జరిగేదని టాలమీ రచనల వల్ల తెలుస్తుంది.
సామాజిక, సాంఘిక పరిస్థితులు :
కుతూహలుని లీలావతి, హాలుని గాధాసప్తశతి, గుణాఢ్యుని బృహత్కథ ఆధారంగా రాయబడ్డ కథా సరిత్సాగరం, అమరావతి, భట్టిప్రోలు, నాగార్జున కొండ స్థూపాలపై గల శిల్పాల ఆధారంగా శాతవాహనుల కాలం నాటి సామాజిక పరిస్థితులను తెలుసుకోవచ్చు. శాతవాహనుల కాలంనాటికి బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అనే నాలుగు ప్రధాన వర్ణాలు కాక, వృత్తులను బట్టి ఉపవర్ణాలు లేక కులాలు ఏర్పడినవి. అయితే వర్ణ ధర్మాలు, కుల ధర్మాలను అందరూ కచ్చితంగా పాటించినట్లు కనపడదు. వీరి కాలంలో కులవ్యవస్థ అంత కఠినంగా లేదు. కులాంతర వివాహాలు జరిగినట్లు కధాసరిత్సాగరం గ్రంథం వల్ల తెలుస్తుంది. నాటి శాసనాల్లో బ్రాహ్మణుల ప్రసక్తి ఎక్కువ కనిపించదు. వీరి కాలంలో సమష్టి కుటుంబ వ్యవస్థ ఉండేది.
కుటుంబంలోని సభ్యులందరు ఉమ్మడిగా చేసిన దానాల వివరాలు శాసనాల్లో లభిస్తాయి. పితృస్వామ్య వ్యవస్థ నెలకొన్నప్పటికీ, స్త్రీలకు సమాజంలో గౌరవం, స్వేచ్ఛ ఉండేవి. ఉన్నత కుటుంబీకులైన మహిళలు తమ భర్త పదవుల హోదాను ధరించేవారు. ఉదా: మహభోజియని, మహాసేనాపత్ని, మహా తలవరిని వంటి బిరుదులు ధరించేవారు. మొదటి శాతకర్ణి భార్య నాగానిక.. తన భర్త మరణానంతరం కుమారుడు వేదిశ్రీకి సంరక్షకురాలిగా రాజ్య భారాన్ని వహించింది. గౌతమిపుత్ర శాతకర్ణి తల్లి గౌతమిబాలశ్రీ వేయించిన నాసిక్ ప్రశస్తిలో తాను స్వతంత్రంగా చేసిన దానాలు వివరాలు ఉన్నాయి.
స్త్రీలు వర్తక సంస్థల్లో, వివిధ పరిశ్రమలకు సంబంధించిన శ్రేణి, నిగమాల్లో పెట్టుబడులను కూడా పెట్టేవారు. నాటి స్త్రీ పురుషులకు ఆభరణాలపై ఎక్కువగా మోజు ఉండేదని తెలుస్తున్నది. కోటిలింగాల, ధూళికట్ట, పెద్దబంకూరు, కదంబాపూర్, కొండాపూర్ మొదలైన చోట్ల జరిపిన తవ్వకాల్లో మట్టిగాజులు, కడియాలు, రకరకాల పూసలు, చెవి పోగులు, కంకణాలు, కాళ్ల అందెలు, దండ కడియాలు లభ్యమయ్యాయి. గాథాసప్తశతిలోని గాథలు, నాటి శిల్పాలను బట్టి గ్రామ జీవితం నిరాడంబరంగానూ, నగర జీవితం సంపన్నంగానూ ఉండేదని, మొత్తం మీద స్త్రీ పురుషులు ఉల్లాసవంతమైన జీవితం గడిపేవారని తెలుస్తుంది. ఎడ్ల పందేలు, కోడి పందేలు నాటి ప్రజల ఇతర వినోదాలు. ధనవంతుల ఇళ్లల్లో, కర్మాగారాల్లో, వ్యవసాయ పనుల్లో, వ్యాపారుల వద్ద బానిసలు పనిచేసేవారు. గుణాఢ్యుని బృహత్కథలో అనేక సందర్భాల్లో బానిస వ్యాపారం గురించి ప్రస్తావన ఉంది. బానిసలను నీచంగా చూసేవారు.
మత పరిస్థితులు :
ప్రాచీన కాలంలో దక్షిణాపథంలో చెట్లు, పుట్టలు, పాములు, గ్రామదేవతలు మొదలైన ప్రకృతి శక్తులను కొలుస్తూ ఉండేవారు. ఇది ద్రావిడ లక్షణం. ఈ పరిస్థితిలో ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన వైదికమతం, వేదాంతం, జైన, బౌద్ద మతాలు, దక్షిణాపథ ప్రజలను ప్రభావితం చేశాయి.
శాతవాహనుల నాణేలు
-శాతవాహనులు రాగి, సీసం, తగరం, వెండి లోహాలతో అనేక పరిమాణాల్లో నాణేలను ముద్రించారు. ఈ నాణేలను కర్షాపణం, పథకం, ప్రతీక, సువర్ణం అనే పేర్లతో పిలిచేవారు.
-ఈ నాణేలు కొన్ని అండాకృతిలో, కొన్ని చతురస్రంగా ఉన్నాయి. వీటిలో సువర్ణం అనేది బంగారు నాణెం. కర్షాపణం వెండి నాణెం. 35 కర్షాపణ నాణేలు ఒక సువర్ణంతో సమానం.
-శాతవాహనుల నాణేలపై సింహం, ఏనుగు, చైత్యం, గుర్రం, త్రిరత్న, వృషభం, స్వస్తిక్, ఉజ్జయినీ, నందిపాద, ఢమరుకం, అంకుశం, కమలం, శంఖం, సూర్యకిరణాలను ప్రసరిస్తున్న సూర్యుడు, ఈదుతున్న చేపలు వంటి చిహ్నాలు ఉన్నాయి.
-రాష్ట్రంలోని కోటిలింగాల, పెద్దబంకూరు, కొండాపూర్, ధూళికట్ట మొదలైన ప్రాంతాల్లో అనేక శాతవాహనుల నాణేలు బయల్పడ్డాయి. ఈ నాణేలపై సిరి, చిముఖశాత అనే వ్యాఖ్యలు ఉన్నాయి.
-కోటిలింగాల, కొండాపూర్‌లలో లభించిన నాణేలు శాతవాహనుల స్వస్థలం ఉత్తర తెలంగాణ అని రుజువు చేస్తున్నాయి.
-గౌతమీపుత్ర శాతకర్ణి పునర్ముద్రించిన జోగల్తంబి వెండి నాణేల వల్ల నహపాణుని వధించి, అతని ప్రాంతాలను గౌతమీపుత్ర శాతకర్ణి ఆక్రమించినట్లు తెలుస్తుంది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు