భారత నదీ పరివాహాలు
నదీవ్యవస్థ లేదా జీవ నదీవ్యవస్థ, ద్వీపకల్ప నదీవ్యవస్థ లేదా వర్షాధారిత నదీవ్యవస్థగా విభజించారు. ఈ నదుల ద్వారా ప్రవహించే నీటిలో 90 శాతం బంగాళాఖాతంలో,10 శాతం అరేబియా సముద్రంలో కలుస్తుంది.
ఏడాది పొడవునా నీటి ప్రవాహం కలిగిన నదులను జీవనదులు అంటారు. ఇవి వర్షాకాలంలో వర్షపు నీటిని, తర్వాతి కాలాల్లో పర్వత శిఖరాల్లో మంచు కరిగిన నీటి ప్రవాహం కలిగి ఉంటాయి. హిమాలయ నదులైన గంగ, సింధు, బ్రహ్మపుత్ర, వాటి ఉపనదులను జీవనదులుగా పిలుస్తున్నారు. దేశంలోని మొత్తం ప్రవాహ పరిమాణంలో 70 శాతం ఈ నదులదే ఉంది.
గంగానది
ఇది అలకనంద, భగీరథ అనే రెండు నదుల కలయిక.
-ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లా కుమయూన్ హిమాలయాల్లో ఉన్న కేదార్నాథ్ సమీపంలోని గౌముఖ్ వద్దగల గంగోత్రి హిమానీ నదం వద్ద భగీరథ, ఘర్వాల్ జిల్లాలోని బద్రినాథ్ సమీపంలోని సంతోపంత్ అనే హిమానీనదం వద్ద అలకనంద జన్మిస్తుంది.
-ఈ రెండు నదులు దేవప్రయాగ వద్ద ఒకటిగా కలిసి గంగానది ఏర్పడి.. హరిద్వార్ వద్ద మైదాన ప్రాంతంలో కలిసి 2,525 కి.మీ. ప్రవహిస్తుంది (ఉత్తరాఖండ్-110 కి.మీ., ఉత్తరప్రదేశ్-1450 కి.మీ., బీహార్-445 కి.మీ., పశ్చిమబెంగాల్- 520 కి.మీ.). ఇది దేశంలో ప్రవహిస్తున్న నదుల్లో అత్యంత పొడవైనది. దేశ భూభాగంలో 28.3 శాతం పరివాహక ప్రాంతాన్ని కలిగి ఉంది.
-ఇది ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమబెంగాల్ గుండా ప్రవహించి బంగ్లాదేశ్‌లోకి ప్రవేశించి బంగాళాఖాతంలో కలుస్తుంది.
-పశ్చిమబెంగాల్లో ఈ నదిపై నిర్మించిన ఫరక్కా బ్యారేజీకి దక్షిణంగా హుగ్లీ-భగీరథ, పద్మ అనే శాఖలుగా విడిపోతుంది.
-ఇందులో హుగ్లీ-భగీరథ పశ్చిమబెంగాల్, పద్మ శాఖ బంగ్లాదేశ్‌లో ప్రవేశిస్తుంది.
-పద్మానది గౌలుండో (బంగ్లాదేశ్) అనే ప్రాంతంలో బ్రహ్మపుత్రానదితో కలిసి మేఘనా నదిగా పిలుస్తారు. ఇది సాగర్ దీవుల వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది.
ఉపనదులు
-శారద, రామ్గంగ, గండక్, ఘాగ్రా, కోసి, భాగమతి (హిమాలయాల్లో జన్మించి దక్షిణ దిశలో ప్రవహిస్తూ ఎడమవైపు నుంచి గంగలో కలుస్తాయి), చంబల్, బెట్వాకెన్, సోన్, దామోదర్, ట్రాన్స్ (ద్వీపకల్ప భూభాగంలో జన్మించి ఉత్తర దిశలో ప్రవహించి కుడివైపు నుంచి గంగలో కలుస్తాయి), యమున (హిమాలయాల్లో జన్మించి దక్షిణదిశలో ప్రవహించి కుడివైపు నుంచి గంగతో కలుస్తుంది).
ఉపనదుల్లో ముఖ్యమైనవి..
యమున
ఉత్తరాఖండ్‌లోని ఘర్వాల్ జిల్లాలో బందేర్పూంచ్ కనుమల్లో యమునోత్రిలోని ఘర్వాల్ వద్ద జన్మిస్తుంది. ఇది గంగా ఉపనదుల్లో అతిపెద్దది.
-ఒకప్పటి సరస్వతి నదితోపాటు అలహాబాద్ (ఉత్తరప్రదేశ్) వద్ద గంగానదితో కలుస్తుంది. ఈ ప్రాంతాన్నే ప్రయాగ అని పిలుస్తారు. దీనిపొడవు 1376 కి.మీ. ఇది ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, ఢిల్లీల్లో ప్రవహిస్తుంది. దీని ఉపనదులు చంబల్, బెట్వా, కెన్, కాల్సింధి.
-యమునా నది ఉపనదుల్లో చంబల్ అతిపెద్దది. ఇది మధ్యప్రదేశ్‌లోని మాల్వా పీఠభూమిలో జనపావో కొండల్లో ఉన్న షిహావా వద్ద జన్మిస్తుంది. Badland topographyకి ప్రసిద్ధి. దీన్ని చంబల్ రావినెస్ అని పిలుస్తారు.
గండక్
ఇది ఎవరెస్టు, ధవళగిరి శిఖరాల మధ్య జన్మించే కాళిగండక్, త్రిశూల్గంగ అనే రెండు నదుల కలయిక. ఇది మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, బీహార్లలో మొత్తం 630 కి.మీ. ప్రవహించి పాట్నా సమీపంలోని సోనాపూర్ వద్ద గంగానదిలో కలుస్తుంది.
కోసి
టిబెట్‌లోని ఎవరెస్ట్ పర్వతాల్లో జన్మిస్తుంది. ఇది సన్‌కోసి, తామర్కోసి, అరుణ్‌కోసి అనే మూడు నదుల కలయికతో ఏర్పడుతుంది. దీన్ని సప్తకోసి అని, బీహార్ దుఃఖదాయని అని పిలుస్తారు. మొత్తం 720 కి.మీ. ప్రవహిస్తుంది.
సోన్
మధ్యప్రదేశ్‌లోని అమర్‌కంఠక్ వద్ద జన్మిస్తుంది. నర్మదకి వ్యతిరేకదిశలో ప్రవహిస్తూ పాట్నాలోని ధనీపూర్ వద్ద గంగానదిలో కలుస్తుంది.
రామ్గంగ
ఉత్తరాఖండ్‌లోని ఘర్వాల్ జిల్లాలో జన్మిస్తుంది. 784 కి.మీ. ప్రవహించి కనౌజ్ వద్ద గంగానదిలో కలుస్తుంది.
ఘాగ్రా
టిబెట్‌లోని గుర్లమదాంత్ శిఖరం వద్ద జన్మించి బీహార్‌లోని చాప్రా వద్ద గంగానదిలో కలుస్తుంది. దీన్ని నేపాల్‌లో కర్ణాలి అని పిలుస్తారు.
దామోదర్
ఇది చోటానాగపూర్ పీఠభూమిలోని టోరి వద్ద జన్మిస్తుంది. పగులు లోయగుండా ప్రవహించి హుగ్లీనదిలో కలుస్తుంది. దీని ప్రధాన ఉపనది బార్కార్.
బ్రహ్మపుత్ర
-ఇది టిబెట్ హిమాలయాల్లోని మానససరోవరం సమీపంలోని కైలాసగిరి కొండల్లో చెమయుంగ్‌డుంగ్ హిమానీనదం వద్ద జన్మిస్తుంది. అరుణాచల్‌ప్రదేశ్ సరిహద్దుల్లోని నామ్చాబార్వా శిఖరం వద్ద ఉన్న సాధియా పట్టణం సమీపంలో భారత్‌లోకి ప్రవేశిస్తుంది. షియాంగ్ అనే నదితో కలిసి కొంతదూరం ప్రయాణించి దిహంగ్ అనే ప్రాంతంవద్ద దిహంగ్, లోహిత్ అనే నదులతో కలుస్తుంది.
-అరుణాచల్‌ప్రదేశ్, అసోంల గుండా దేశంలో మొత్తం 885 కి.మీ. ప్రవహిస్తుంది. మొత్తంగా గంగానదికి వ్యతిరేక దిశలో భారత్, బంగ్లాదేశ్‌లలో 2900 కి.మీ. పొడవు ప్రయాణిస్తుంది.
-దీన్ని ఎరుపు నది అని, అసోం దుఃఖదాయని అని, టిబెట్‌లో సాంగ్పో, బంగ్లాదేశ్‌లో జమున అని పిలుస్తారు.
-ప్రపంచంలోకెల్లా అతిపెద్ద నదీ ఆధారిత దీవి మజూలి ఈ నదిలో ఉంది. దేశంలో మగవారి పేరుతో పిలుస్తున్న ఏకైక నది బ్రహ్మపుత్ర.
-ఉపనదులు: లోహిత్, తీస్తా, బారక్, దిహంగ్ లేదా సికాంగ్, బుర్హీదిహంగ్, ధన్సారి, సుభాన్‌సిరి, సంకోష్, కమెంగ్.
-దీని ప్రధాన ఉపనది తీస్తా.
ద్వీపకల్ప లేదా వర్షాధార నదులు
-వర్షాకాలం మాత్రమే నీటిప్రవాహం కలిగి ఉండే నదులను వర్షాధార నదులు అంటారు. సాధారణంగా వేసవికాలంలో ఈ నదులు ఎలాంటి నీటి ప్రవాహం లేకపోవడంతో ఎండిపోయి ఉంటాయి. ఇలాంటి నదులన్నీ ద్వీపకల్ప భారతదేశానికి చెందినవిగా చెప్పవచ్చు.
-ద్వీపకల్ప భూభాగం పడమర నుంచి తూర్పునకు వాలి ఉంది. దీంతో 90 శాతం నదులు పడమరలో జన్మించి తూర్పునకు ప్రవహిస్తూ బంగాళాఖాతంలో కలుస్తున్నాయి. మిగిలిన 10 శాతం నదుల్లో కొన్ని ఉత్తర దిశలో ప్రవహించి గంగానదీ వ్యవస్థతోనూ, మరికొన్ని పశ్చిమ దిశలో ప్రవహిం చి అరేబియా సముద్రంలోనూ కలుస్తున్నాయి.
-ద్వీపకల్ప నదులను ముఖ్యంగా రెండు రకాలుగా విభజించవచ్చు. అవి..
1. తూర్పువైపు ప్రవహించే నదులు- గోదావరి, కృష్ణా, మహానది, కావేరి, పెన్నా.
2. పశ్చిమవైపు ప్రవహిస్తున్న నదులు- నర్మద, తపతి, సబర్మతి.
కృష్ణానది
-మహారాష్ట్రలోని పశ్చిమకనుమల్లో భాగమైన మహాబలేశ్వరం వద్ద జన్మిస్తుంది. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల గుండా మొత్తం 1440 కి.మీ. ప్రయాణిస్తుంది.
-ఆంధ్రప్రదేశ్‌లోని హంసలదీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది.
-పరివాహక ప్రాంతం 2,50,000 చ.కి.మీ.
-ఇది మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్ మండలంలోని తంగడి వద్ద మన రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది.
-మహబూబ్‌నగర్, నల్లగొండ, కర్నూలు, కృష్ణా జి ల్లాల మీదుగా ప్రవహించి విజయవాడ (ఆంధ్రప్రదేశ్)కు దిగువగా రెండు పాయలుగా విడిపోతుంది.
-ఈ నదిపై మంచి నీటి సరస్సు కొల్లేరు ఉంది.
-ఉపనదులు: తుంగభద్ర, ఘటప్రభ, మలప్రభ, దూద్గంగ, పంచ్‌గంగ (కుడివైపు ఉపనదులు), కోయన, పాలేరు, డిండి, మూసి, భీమా, మున్నేరు (ఎడమవైపు నుంచి కలిసే నదులు)
-తుంగభద్ర: ఇది కృష్ణా ఉపనదుల్లో అతిపెద్దది. కర్ణాటకలోని వరాహ పర్వతాల్లో జన్మిస్తుంది. తుంగ, భద్ర అనే రెండు నదుల కలయిక వల్ల ఏర్పడింది.
-మూసీనది: వికారాబాద్ జిల్లా శివారెడ్డిపేట వద్దగల అనంతగిరి గుట్టల్లో జన్మిస్తుంది. వికారాబాద్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల గుండా 240 కి.మీ. ప్రవహించి వాడపల్లి వద్ద కృష్ణానదిలో కలుస్తుంది.
-డిండి: పూర్వపు మహబూబ్‌నగర్ జిల్లా షాబాద్ గుట్టల్లో జన్మిస్తుంది. నల్లగొండ జిల్లా దేవరకొండ సమీపంలో ఏలేశ్వరం వద్ద కృష్ణానదిలో కలుస్తుంది. దీన్ని మీనాంబరం అని కూడా పిలుస్తారు.
-మున్నేరు: వరంగల్ జిల్లాలోని పాకాల చెరువులో జన్మించి నల్లగొండ జిల్లాలో కృష్ణానదిలో కలుస్తుంది.
మహానది
-ఇది ఛత్తీస్‌గఢ్ దండకారణ్య ప్రాంతంలోని రాయ్‌పూర్ జిల్లాలో ఉన్న సిహన అడవుల్లో (అమర్‌కంఠక్ పీఠభూమిలో) జన్మిస్తుంది. ఒడిశాలోని కటక్ సమీపంలో బంగాళాఖాతంలో కలుస్తుంది.
-ఇది ఛత్తీస్‌గఢ్, ఒడిశాల్లో 857 కి.మీ. పొడవు (ఒడిశాలో ఎక్కువ దూరం) ప్రవహిస్తుంది. పరివాహ ప్రాంతం 1,32,000 చ.కి.మీ.
-ఈ నది ఎగువ ప్రాంతంలో టీ కప్పు ఆకృతిలో ఛత్తీస్‌గఢ్ మైదానం ఉంది.
-ప్రపంచంలోనే అతి పొడవైన హీరాకుడ్ ఆనకట్ట ఈ నదిపైనే ఉంది. దీన్ని సంబల్పూర్కు 15 కి.మీ. దూరంలో నిర్మించారు.
-ఉప్పునీటి సరస్సు చిల్కా సరస్సు ఉంది.
-ఉపనదులు: ఇబ్, మాండ్, హశ్డో, జంక్ శివోనాథ్, టేల్
పెన్నా నది
-కర్ణాటకలోని మైసూర్ సమీపంలో ఉన్న నందిదుర్గ కొండల్లో జన్మిస్తుంది. పినాకిని అని పిలిచే ఈ నది అనంతపురం జిల్లాలోని హిందూపూర్ సమీపంలో ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశిస్తుంది. కడప, నెల్లూరు జిల్లాల గుండా మొత్తం 600 కి.మీ. ప్రవహించి ఊటుకూరు వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది.
-ఈ నది సముద్రంలో కలిసే ప్రాంతానికి సమీపంలో పులికాట్ అనే ఉప్పునీటి సరస్సు ఉంది.
-ఉపనదులు: జయమంగళ, చిత్రావతి, కుందేరు, పాపాఘ్ని, చెయ్యేరు, సలిగేరు.
కావేరి
-తమిళనాడులో ప్రధాన నది అయిన కావేరి కర్ణాటకలోని కూర్గ్ జిల్లాలోని బ్రహ్మగిరి వద్ద తలైకావేరి అనే ప్రాంతంలో జన్మిస్తుంది.
-మొత్తం 805 కి.మీ. ప్రవహించి తమిళనాడులోని శ్రీరంగం వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది.
-పరివాహక ప్రాంతం 80,290 కి.మీ. కర్ణాటకలో 41 శాతం, తమిళనాడులో 56 శాతం, కేరళలో 3 శాతం విస్తరించి ఉంది.
-ఏడాదిలో దాదాపు పదినెలలు ఈ నదిలో నీటి ప్రవాహం ఉంటుంది. అందువల్ల దీన్ని దక్షిణ గంగ అని పిలుస్తారు.
-ఉపనదులు: హేమావతి, హేరంగి, లోకపావనిచ షింషా, ఆర్కావతి, కుందా, లక్ష్మణతీర్థ.
నర్మద
-మధ్యప్రదేశ్‌లోని అమర్‌కంఠక్ పీఠభూమిలో జన్మిస్తుంది. సోన్ నది వ్యతిరేకదిశలో వింధ్య, సాత్పూరా పర్వత శ్రేణులగుండా మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్‌లలో మొత్తం 1312 కి.మీ. ప్రవహిస్తుంది. గుజరాత్‌లోని గల్ఫ్ ఆఫ్ ఖంబట్ వద్ద గల బ్రోచ్ (భరూచ్ జిల్లా) వద్ద అరేబియా సముద్రంలో కలుస్తుంది.
-ఇది పశ్చిమవైపు ప్రవహించి అరేబియా సముద్రంలో కలిసే, దేశంలో పగులు లోయల్లో ప్రవహిస్తున్న అతి పొడవైన నది.
-ఈ నదీ ప్రవాహంలో కపిలధార (23 మీ.), దూన్ధర్ అనే రెండు ప్రధాన జలపాతాలు ఉన్నాయి.
-దీని పరివాహక ప్రాంతం 93,180 చ.కి.మీ.
-ఉపనదులు: బుర్హానర్, బుర్నా, హీరాన్, తావా, హిరన్, బంజర్, షక్కర్, దూధి, ఒరిసాన్.
తపతి
-మధ్యప్రదేశ్‌లోని సాత్పూరా కొండల్లో ముల్తాయ్ (బిటువల్ జిల్లాలో) వద్ద జన్మిస్తుంది. ఇది పశ్చిమ వైపునకు ప్రవహించే నదుల్లో రెండో పెద్దది.
-నర్మదకి సమాంతరంగా 724 కి.మీ. పొడవు ప్రవహిస్తుంది. పరివాహక ప్రాంతం 64,750 కి.మీ.
-మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ర్టాల (సాత్పూరా అజంతా పర్వతశ్రేణుల మధ్య) గుండా ప్రవహిస్తూ గల్ఫ్ ఆఫ్ ఖంబట్ వద్ద అరేబియా సముద్రంలో కలుస్తుంది.
-ఇది ఎక్కువభాగం మహారాష్ట్రలో ప్రవహిస్తుంది.
-ఉపనదులు పూర్ణా, బేతుల్, గిర్నా, అరుణావతి, పంజాల్, పలేర్. ప్రధానమైన ఉపనది పూర్ణా.
జలపాతాలు-నదులు
-కుంతాల- కడెం (తెలంగాణ)
-జోగ్ (జొర్సోప్సా)- శరావతి (కర్ణాటక)
-శివసముద్రం-కావేరీ (కర్ణాటక)
-దూద్‌సాగర్- మాండవి నది (గోవా)
-కపిలధార- నర్మద (మధ్యప్రదేశ్)
-యన్నా- మహాబలేశ్వర్ నది (మహారాష్ట్ర)
-డుడుమా- మాచ్‌ఖండ్ (ఆంధ్రప్రదేశ్)
నదీతీరంలో పట్టణాలు
-జీలం- శ్రీనగర్
-తావి- జమ్ము
-చీనాబ్- రాంబుల్
-సట్లెజ్- లూథియానా, ఫిరోజ్‌పూర్
-యమునా- ఢిల్లీ, ఆగ్రా, మధుర
-గంగా- రుషికేష్, హరిద్వార్, కాన్పూర్, వారణాసి, అలహాబాద్, పాట్నా
-అలకనందా- బద్రీనాధ్
-రామ్గంగ- కనౌజ్
-గోమతి- లక్నో
-సరయూ- అయోధ్య
-మహానది- కటక్, సంబాల్పూర్
-సబర్మతి- అహ్మదాబాద్
-బ్రహ్మపుత్ర- డిబ్రూగఢ్, ధూబ్రి
-హుగ్లీ- కోల్‌కతా
-బ్రహ్మిణి- రూర్కెలా
-దామోదర్- దుర్గాపూర్
-బెట్వా- సాంచి, విదిశ
-చంబల్- గాంధీనగర్
-నర్మదా- జబల్పూర్, అమర్‌కంఠక్, ఫిరోజాబాద్
-తపతి- సూరత్
-గోదావరి- నాసిక్, నాందేడ్, భద్రాచలం
-మంజీరా- సంగారెడ్డి
-కృష్ణా- మహాబలేశ్వరం, నాగార్జున సాగర్
-తుంగభద్ర- కర్నూలు
-సాల్సెట్టి- ముంబై
-మాండోవి- పనాజి
సింధూనది
-దేశంలో రెండో ముఖ్యమైన నదీవ్యవస్థ అయిన సింధూనది టిబెట్‌లోని కైలాసగిరి కొండల్లో మానస సరోవరం వద్ద బొఖార్ చూలో జన్మిస్తుంది.
-టిబెట్, భారత్, పాకిస్థాన్‌ల మీదుగా 2800 కి.మీ. దూరం ప్రయాణించి కరాచీ వద్ద అరేబియా సముద్రంలో కలుస్తుంది.
-ఇది థాంచోక్ వద్ద భారత్‌లోకి ప్రవేశించి జమ్ముకశ్మీర్‌లో జస్కర్, లఢక్ పర్వత శ్రేణుల మధ్య 709 కి.మీ. ప్రవహించి పాకిస్థాన్‌లోకి ప్రవేశిస్తుంది.
-సింధూ నదిని టిబెట్‌లో సింగి ఖంబన్ (సింహపు నోరు) అని పిలుస్తారు.
-దీని ముఖ్యమైన ఉపనదులు జీలం, చీనాబ్, బియాస్, రావి, సట్లెజ్ (ఇవి ఎడమవైపు ప్రవహిస్తాయి), ష్యోక్, గిల్గిట్, జస్కర్, షిగార్, హంజా, ద్రాస్ (ఇవి కుడివైపు ప్రవహిస్తాయి).
చీనాబ్
జస్కర్ శ్రేణిలోని బార్లాప్ చెలా కనుమ వద్ద జన్మిస్తుంది. ఇది చంద్ర, బాగా అనే రెండు నదుల కలయిక. ఇది సింధూ ఉపనదుల్లో అతిపెద్దది. దేశంలో మొత్తం 1180 కి.మీ. ప్రవహిస్తుంది. ముల్తాన్ (పాక్) వద్ద సింధూనదిలో కలుస్తుంది.
జీలం
ఇది కశ్మీర్ లోయలోని వెరినాగ్ వద్ద జన్మిస్తుంది. మొత్తం 724 కి.మీ. ప్రవహించి పాకిస్థాన్‌లో ప్రవేశించడానికి ముందు ఊలార్ సరస్సులో కలుస్తుంది. ఇది భారత్, పాక్ సరిహద్దు ద్వారా ప్రవహించే సింధూనది ఉపనది.
-ఇది పాకిస్థాన్‌లోని జాంగ్ వద్ద చీనాబ్ నదితో కలుస్తుంది.
రావి
హిమాచల్‌ప్రదేశ్‌లోని కులు పర్వతాల్లో ఉన్న రోహతంగ్ కనుమ వద్ద జన్మింస్తుంది. రాష్ట్రంలోని చంబా లోయ, పంజాబ్ గుండా మొత్తం 722 కి.మీ. ప్రవహిస్తుంది. ఇది చీనాబ్ నదిలో కలుస్తుంది.
బియాస్
రోహతంగ్ కనుమలో బియాస్ కుంద్ వద్ద జన్మిస్తుంది. ఇది భారత భూభాగంలో మాత్రమే ప్రవహించే సింధూ ఉపనది. దౌల్ధర్ శ్రేణిని చీల్చుకుంటూ కాంగ్రాలోయ గుండా (హిమాచల్‌ప్రదేశ్) 460 కి.మీ. ప్రహిస్తుంది. పంజాబ్‌లోని హరికే అనే ప్రాంతంలో సట్లెజ్ నదిలో కలుస్తుంది.
సట్లెజ్
టిబెట్‌లోని మానస సరోవరం వద్ద రాకస్ సరస్సులో జన్మిస్తుంది. హిమాలయ పర్వతాల్లోని షిప్కిలా కనుమ గుండా హిమాచల్‌ప్రదేశ్‌లోకి ప్రవేశించి పంజాబ్ మీదుగా 1,450 కి.మీ. ప్రవహిస్తుంది. పాకిస్థాన్‌లోని మైథాన్కోట్ వద్ద సింధూనదిలో కలుస్తుంది. భారత్, చైనా, పాకిస్థాన్ మీదుగా ప్రవహించే సింధూ ఉపనది సట్లెజ్.
గోదావరి
-మహారాష్ట్రలోని పశ్చిమకనుమల్లో భాగమైన నాసిక్ త్రయంబకేశ్వరం వద్ద బ్రహ్మగిరి కొండల్లో జన్మిస్తుంది.
-దక్షిణభారతదేశ నదుల్లో అతిపొడవైనది గోదావరి నదీ వ్యవస్థ. దీనికే వృద్ధగంగ లేదా దక్షిణ గంగోత్రి అనే పేర్లు ఉన్నాయి.
-మొత్తం పొడవు 1,465 కి.మీ.
-పరివాహక ప్రాంతం 3,19,389 చ.కి.మీ. మహారాష్ట్ర (48.6 శాతం), మధ్యప్రదేశ్ (10 శాతం), ఛత్తీస్‌గఢ్ (10.9 శాతం), ఒడిశా (5.5 శాతం), తెలంగాణ (18.8 శాతం), ఆంధ్రప్రదేశ్ (4.5 శాతం), పుదుచ్చేరిలలో పరివాహక ప్రాంతం ఉంది.
-నిర్మల్ జిల్లాలోని బాసర వద్ద తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. నిర్మల్, మంచిర్యాల మీదుగా.. నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ప్రవహిస్తుంది. పాపికొండల్లోని ఇరుకైన లోయలగుండా ప్రవహిస్తూ.. పోలవ రం ఎగువన ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించి ఉభ య గోదావరి జిల్లాల్లో ప్రవహించి రాజమండ్రికి 17 కి.మీ. దూరంలో సముద్రంలో కలుస్తుంది.
-బంగాళాఖాతంలో కలవడానికి ముందు గోదావరి నది గౌతమి, వశిష్ఠ, వైనతేయ, తుల్య, భరద్వాజ అనే ఐదు పాయలుగా విడిపోతుంది.
-ఉపనదులు: మంజీర, ప్రవర, మూల, కిన్నెరసాని (కుడివైపు నుంచి వచ్చి గోదావరిలో కలిసే నదులు), ప్రాణహిత, వార్ధా, వెన్‌గంగ, పెన్‌గంగ, ఇంద్రావతి, శబరి, సీలేరు, మాచ్‌ఖండ్, మానేరు, కడెం నదులు (ఎడమవైపు నుంచి గోదావరిలో కలుస్తాయి).
మంజీరా
మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలోని బాల్ఘాట్ కొండల్లో జన్మిస్తుంది. మెదక్ జిల్లాలోకి ప్రవేశించి 724 కి.మీ. ప్రవహించి నిజామాబాద్ జిల్లాలోని కొండలవాడి దగ్గర కందుకుర్తి అనే ప్రాంతంలో గోదావరిలో కలుస్తుంది. దీని పరివాహక ప్రాంతం 30,844 చ.కి.మీ.
ప్రాణహిత
మధ్యప్రదేశ్‌లోని సాత్పూరా పర్వతాల్లో జన్మిస్తుంది. ఇది పెన్‌గంగా, వెన్‌గంగా, వార్ధా అనే మూడు నదుల కలయిక. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా గుండా ఆదిలాబాద్ జిల్లాలోకి ప్రవేశిస్తుంది. కాళేశ్వరం వద్ద గోదావరిలో కలుస్తుంది. మహారాష్ట్ర, తెలంగాణల్లో 113 కి.మీ. ప్రవహించే ఈ నది పరివాహక ప్రాంతం 1,09,078 చ.కి.మీ.
మాచ్‌ఖండ్
ఏపీలోని విశాఖపట్నం జిల్లా గూడెం వద్ద ఉన్న మూడుగుల కొండల్లో జన్మిస్తుంది. ఉత్తరదిశలో ప్రవహిస్తూ ఒడిశాలో ప్రవేశించి తిరిగి తన దిశను మార్చుకుని దక్షిణం వైపుగా ప్రయాణిస్తుంది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు