బిర్యానీలో రాక్ఫ్లవర్గా వాడే లైకెన్ ఏది?
మొక్కలు – వర్గీకరణ
I. మొక్కలను పుష్పించడం అనే లక్షణాన్ని ఆధారంగా చేసుకుని రెండు రకాలుగా వర్గీకరిస్తారు. అవి.. పుష్పించని మొక్కలు (Cryptogams), పుష్పించే మొక్కలు (Phenerogams) లేదా బీజయుత మొక్కలు (Spermatophytes).
1. పుష్పించని మొక్కలు (Cryptogams)
ఎ. థాలోఫైటా – i. శైవలాలు (Algae), ii. శిలీంధ్రాలు (Fungai)
బి. బ్రయోఫైటా
సి. టెరిడోఫైటా
2. పుష్పించే మొక్కలు (Phenerogams)
ఎ. వివృత బీజాలు (Gymno sperms)
బి. ఆవృత బీజాలు (Angeo sperms) –
i. ద్విదళ బీజాలు (Dicotyledons)
ii. ఏకదళ బీజాలు (Monocotyledons)
పుష్పించని మొక్కలు (Cryptogams)
పుష్పాలు, ఫలాలు, విత్తనాలు లేని మొక్కలను పుష్పించని మొక్కలు అంటారు. వీటిని మూడు రకాలుగా విభజించవచ్చు.
అవి.. ఎ. థాలోఫైటా (Thallophyte),
బి. బ్రయోఫైటా (Bryophyte), సి. టెరిడోఫైటా (Pteridophyte).
థాలోఫైటా
నిజమైన వేర్లు, కాండం, పత్రం లేనటువంటి థాలస్ లాంటి దేహభాగాన్ని కలిగి ఉన్న మొక్కలను థాలోఫైట్లు అంటారు. వీటిని రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి..
i. శైవలాలు, ii. శిలీంధ్రాలు
శైవలాలు/నాచు
- శైవలాల అధ్యయనాన్ని ఫైకాలజీ/ఆల్గాలజీ అంటారు. శైవలాల పెంపకం లేదా వర్ధనాన్ని ఆల్గేకల్చర్ అంటారు.
- ఇవి స్వయంపోషక థాలోఫైట్లు. అంటే ఇవి పత్రహరితాన్ని కలిగి ఆహారాన్ని సొంతంగా తయారుచేసుకుంటాయి.
- వీటిలో ఉన్న వర్ణ పదార్థాలు (వర్ణ ద్రవ్యాలు), నిల్వ ఆహారపదార్థాల ఆధారంగా వీటిని మూడు తరగతులుగా విభజించవచ్చు. అవి.. క్లోరోఫైసీ/ఆకుపచ్చ శైవలాలు (Green Algae), ఫియోఫైసీ/గోధుమ శైవలాలు (Brown Algae), రొడోఫైసీ/ఎరుపు శైవలాలు (Red Algae).
- పై మూడు తరగతులే కాకుండా శైవలాల్లో డయాటమ్లు (వృక్ష ప్లవకాలు – Phytoplanktons), సయనోఫైసీ/నీలి ఆకుపచ్చ శైవలాలు (Blue green Algae) కూడా ఉన్నాయి.
- ఉదా: లామినేరియా, ఎక్టోకార్పస్, డిక్టియోటా, ప్యూకస్ సర్గాసమ్, మైక్రోసిస్టిస్, పాలీసైపోనియా, పోర్ఫైరా, గ్రాపిల్లేరియా, జెలిడియం, కాండ్రస్, క్లామిడోమోనాస్, వాల్వాక్స్, యూలోథ్రిక్స్, స్పైరోగైరా, కారా, అల్వా, క్లోరెల్లా, ట్రైకోడెస్మీ, స్పైరులినా, నాస్టాక్ అనబినా.
- ఫ్రిట్చ్ని శైవల శాస్త్ర పితామహుడు అని, ఎంవోపీ అయ్యంగార్ని భారత శైవల శాస్త్ర పితామహుడు అని అంటారు.
- క్లోరెల్లా శైవలాన్ని వ్యోమగాములు ఆక్సిజన్ కోసం ఆహారంగా వాడుతారు.
- సర్గాసమ్ అనే శైవలం వల్ల వెస్టిండీస్ సమీపంలోని సముద్రానికి సార్గాసో అనే పేరు వచ్చింది.
- మైక్రోసిస్టిస్ అనే శైవలాన్ని అతి పొడవైన శైవలం అంటారు.
- కాండ్రస్ (Irish moss) అనే శైవలం నుంచి తీసిన కర్రాజీన్ అనే పదార్థాన్ని పాల చిక్కదనానికి ఉపయోగిస్తారు.
- జెలిడియం, గ్రాపిల్లేరియా అనే శైవలాల నుంచి అగార్ అగార్ అనే పదార్థం లభిస్తుంది. దీన్ని కణజాల వర్ధనానికి, ఐస్క్రీమ్లు, జెల్లీల తయారీకి ఉపయోగిస్తారు. దీన్నే చైనాగడ్డి/జున్ను గడ్డి అని కూడా అంటారు.
- స్పైరులినా అనే శైవలంలో 60-70 శాతం వరకు ప్రొటీన్లు ఉండటం వల్ల దీని నుంచి టాబ్లెట్లు తయారు చేస్తున్నారు.
- నాస్టాక్ అనబినా అనే శైవలాలను జీవ ఎరువులు (Bio Fertilizers)గా ఉపయోగిస్తారు. ఇవి వాతావరణంలోని N2ను గ్రహించి మొక్కలకు అందిస్తాయి.
శిలీంధ్రాలు
- వీటి గురించిన అధ్యయనాన్ని మైకాలజీ అంటారు.
- మైకేలీ ని శిలీంధ్ర శాస్త్ర పితామహుడు అంటారు. ఏకకణ శిలీంధ్రం అయిన ఈస్ట్ మినహా మిగిలిన అన్ని శిలీంధ్రాలు తంతురూపంలో ఉంటాయి.
- ఇవి పరపోషక థాలోఫైట్లు. వీటిలో పత్రహరితం ఉండదు. ఇవి ఆహారం కోసం ఇతర జీవులపై ఆధారపడుతాయి.
- శిలీంధ్రాల్లోని శిలీంధ్రజాల బాహ్యస్వరూపం, సిద్ధబీజాలు ఏర్పడే విధానం, ఫలనాంగాల రకం మొదలైన వాటిని ఆధారంగా చేసుకుని శిలీంధ్రాలను వివిధ తరగతులుగా విభజించవచ్చు. అవి..
- ఫైకోమైసిటిస్-శైవల శిలీంధ్రాలు (Algal Fungi)
- ఆస్కోమైసిటిస్- సాక్ ఫంగై (Sac fungi)
- బెసిడియో మైసిటిస్- క్లబ్ ఫంగై (పుట్టగొడుగులు, పఫ్బాల్స్)
- డ్యుటిరోమైసిటిస్- ఇంపర్ఫెక్ట్ ఫంగై
- ఉదా: మ్యూకార్, రైజోపస్ (రొట్టెబూజు), ఆల్బుగో, ఈస్ట్ (ఏకకణ శిలీంధ్రం), పెనిసీలియం, ఆస్పర్జిల్లస్ ప్లావస్, క్లావిసెప్స్, న్యూరోస్పోరా, మొరెల్స్, ట్రఫుల్స్, పక్సీనియా, యూస్టిలాగో, పాలీపోరస్, లైకోపెర్డాన్, పుట్ట గొడుగులు, ఆల్టర్నేరియా, కొల్లెటోట్రైఖమ్, ట్రైకోడెర్మా.
- ఆల్బుగో అనే శిలీంధ్రం ఆవాల మొక్కపై తెల్లమచ్చల వ్యాధిని కలిగిస్తుంది.
- ఈస్ట్ అనే ఏకకణ శిలీంధ్రాన్ని పారిశ్రామికంగా కిణ్వన ప్రక్రియలో వివిధ రకాల ఉత్పత్తుల తయారీకి ఉపయోగిస్తారు.
- పెన్సిలియం నొటేటం నుంచి అలెగ్జాండర్ ఫ్లెమింగ్ 1929లో మొదటి యాంటీబయాటిక్ అయిన పెన్సిలిన్ తయారుచేశాడు. దీన్ని వండర్ డ్రగ్ అంటారు.
- పారిశ్రామికంగా పెన్సిలిన్ తయారీలో వాడే శిలీంధ్రం పెన్సిలియం క్రైసోజీనం.
- ఆస్పర్జిల్లస్ ప్లావస్ అనే శిలీంధ్రం వేరుశనగపై పెరిగి అప్లోటాక్సిన్ అనే విషపదార్థాన్ని ఉత్పత్తి చేస్తుంది. అప్లోటాక్సిన్ ఉన్న వేరుశనగ గింజను తింటే చేదుగా ఉంటుంది. కాలేయ క్యాన్సర్ వ్యాధి బారినపడే ప్రమాదం కూడా ఉంది.
- న్యూరోస్పోరా అనే శిలింధ్రాన్ని జీవరసాయనిక, జన్యుశాస్త్ర పరిశోధనల్లో విస్తృతంగా వాడుతారు.
- ఆహారంగా తీసుకునే పుట్టగొడుగులు- అగారికస్ జాతులు (అగారికస బైస్పోరస్)
కొల్లెటోట్రైఖమ్ అనే శిలీంధ్రం చెరుకులో ఎర్రకుళ్లు తెగులును కలుగజేస్తుంది.
లైకెన్లు (Lichens)
- వీటి అధ్యయనాన్ని లైకెనాలజీ అంటారు.
- ఒక శైవలం, ఒక శిలీంధ్రం సన్నిహితంగా కలిసి ఉండటం వల్ల ఏర్పడిన మొక్కలను లైకెన్లు అంటారు.
- లైకెన్లు కాలుష్య సూచికలుగా పనిచేస్తాయి.
- వీటిని ఆమ్ల, క్షారాలను గుర్తించే లిట్మస్ పేపర్ తయారీకి ఉపయోగిస్తారు.
- అంబెల్లికేరియా అనే లైకెన్ను కామెర్ల వ్యాధి చికిత్సలో ఉపయోగిస్తారు.
- బిర్యానీలో ఫార్మీలియా అనే లైకెన్ను రాక్ ఫ్లవర్గా, సుగంధ ద్రవ్యంగా వాడుతారు.
- అస్నియా అనే లైకెన్ను దగ్గుమందు తయారీలో, పెల్టిజెరాకానినా అనే లైకెన్ను రేబిస్ నివారణలో వాడుతారు.
బ్రయోఫైటా
- వీటి అధ్యయనాన్ని బ్రయాలజీ అంటారు.
- వీటిలో లివర్ వర్ట్లు, హార్న్ వర్ట్లు, మాస్లను చేర్చారు. వృక్షరాజ్యపు ఉభయచరాలు (Amp hibians of the plant kingdom) అంటారు. ఇవి కాలిపోయి తడిచిన నేలపై, నీటిలో పెరుగుతాయి.
ఇవి మొదటి నేలయుత మొక్కలు. - ఈ మొక్కల్లో మొదట లైంగిక అవయవాలు ఏర్పడ్డాయి. పురుష లైంగిక అవయవం ఆంథరీడియం, స్త్రీ లైంగిక అవయవం ఆర్కిగోనియం.
- వీటిలో మొదటిసారిగా పిండం ఏర్పడింది (ఇవి మొదటి పిండయుత మొక్కలు).
- ఈ మొక్కలకు వేరులాంటి మూలతంతువులు, పత్రం లాంటి పిల్లాయిడ్లు (పత్రాబాలు), కాండం వంటి కాలాయిడ్లు (కాండబాలు) ఉంటాయి. కానీ నిజమైన వేర్లు, కాండం, పత్రాలు ఉండవు.
- ఈ మొక్కలను మూడు తరగతులుగా విభజించారు. అవి..
- 1. హెపాటికాప్సిడా – లివర్ వర్ట్లు (కాలేయాకృతి మొక్కలు)
- 2. ఆంథోసెరటాప్సిడా – హార్న్ వర్ట్లు (కొమ్ము ఆకృతి మొక్కలు)
- 3. బ్రయాస్పిడా- మాస్లు
- ఉదా: రిక్సియా, మార్కాన్షియా, ఆంథోసిరాస్, ఫ్యునేరియా (Cord moss), పాలీట్రైకం (Haircap moss), స్ఫాగ్నం (Peat moss).
- స్ఫాగ్నం అనే మాస్ మొక్క ఇంధనంగా ఉపయోపడుతుంది.
టెరిడోఫైటా
- వీటి అధ్యయనాన్ని టెరిడాలజీ అంటారు.
- వీటిలో క్లబ్ మాస్లు, హార్స్ టెయిల్స్, ఫెర్న్ మొదలైన వాటిని చేర్చారు.
- ఈ మొక్కలను అలంకరణ కోసం పెంచుతారు.
- వీటిని వృక్ష రాజ్యపు సరీసృపాలు/పాములు (Snakes/Reptiles of the plant kingdom) అంటారు.
- ఇవి మొదటి నాళికా కణజాలయుత (Vascular tissue) మొక్కలు. దారువు (Xylem), పోషక కణజాలం (Phloeme) రెండింటిని కలిపి నాళికా కణజాలం (Vascular tissue)/ప్రసరణ కణజాలం (Transport tissue) అంటారు.
- దారువు: మొక్క వేర్ల ద్వారా పీల్చుకున్న నీటిని, ఖనిజ లవణాలను ఇతర భాగాలకు సరఫరా చేసేది దారువు.
- పోషక కణజాలం: మొక్కలోని పత్రంలో తయారైన పిండిపదార్థాలు/పోషక పదార్థాలు/
- ఆహారపదార్థాలను ఇతర భాగాలకు సరఫరా చేసేది పోషక కణజాలం.
- టెరిడోఫైట్లు మొదటి నిజమైన నేలయుత మొక్కలు.
- ఈ మొక్కలు నిజమైన వేర్లు, కాండం, పత్రాలను కలిగి ఉంటాయి.
- ఉదా: సైలోటం, లైకోపోడియం, సెలాజినెల్లా, ఈక్విజిటం (Horse tail), డ్రయోప్టెరిస్, టెరిస్, ఎడియాంటం (Walking fern), మార్సీలియా, సాల్వీనియా, అజొల్లా.
- అజొల్లా మొక్కను వరిపొలాల్లో జీవ ఎరువుగా ఉపయోగిస్తారు.
శైవలం సాధారణ నామం
కారా ఆక్వాటిక్ హార్స్టేల్
అల్వా సముద్ర ఆకుకూర
క్లోరెల్లా అంతరిక్ష శైవలం/సీవరేజ్ ట్రీట్మెంట్
స్పైరులినా నీటిపట్టు
ఫిచోయ్ చైనీస్ వెజిటెబుల్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు