ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగం
అంతర్జాతీయం
అమెరికా పాలనలోని గ్వామ్ దీవిని కూడా తాకగల మధ్యశ్రేణి క్షిపణిని విజయవంతంగా ప్రయోగించినట్లు ఉత్తర కొరియా జనవరి 31న ప్రకటించింది. ఈ క్షిపణి అణ్వస్ర్తాన్ని మోసుకుపోగల శక్తి ఉంది. జనవరిలో ఉత్తర కొరియా జరిపిన ఏడో పరీక్ష ఇది. తమపై అమెరికా విధించిన ఆంక్షల నేపథ్యంలో వరుసగా క్షిపణి ప్రయోగాలు చేస్తున్నట్లు ఉత్తర కొరియా వెల్లడించింది.
కెనాల్ లాక్
నెదర్లాండ్స్ అమ్‌స్టర్‌డ్యామ్ పోర్ట్‌లోని ఇజ్ముయ్డెన్ అనే ఓడరేవు నగరం వద్ద ప్రపంచంలోనే అతిపెద్ద కెనాల్ (కాలువ) లాక్‌ను డచ్ రాజు విలెన్ అలెగ్జాండర్ జనవరి 28న ప్రారంభించారు. 500 మీటర్ల (1640 అడుగులు) పొడవు, 70 మీటర్ల వెడల్పు గల తూము ఇది. ఈ తూము ఉత్తర సముద్ర కాలువను, అమ్‌స్టర్‌డ్యామ్ నౌకాశ్రయానికి కలిపే చిన్న ఓడరేవు నగరమైన ఇజ్ముయిడెన్లో దాదాపు 100 ఏండ్ల నాటి నుంచి ఉంది.
మోటారు వంతెన
భారత్-నేపాల్ మధ్య ప్రవహిస్తున్న మహాకాళి నదిపై మోటారు వంతెనను నిర్మించేందుకు ఇరుదేశాల మధ్య ఫిబ్రవరి 1న కఠ్మాండులో ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంపై భారత రాయబారి వినయ్ మోహన్ క్వాత్రా, నేపాల్ ప్రభుత్వ భౌతిక మౌలిక సదుపాయాలు, రవాణా మంత్రిత్వ శాఖ కార్యదర్శి రవీంద్ర నాథ్ శ్రేష్ట సంతకం చేశారు. దీనివల్ల భారత్-నేపాల్ మధ్య సంబంధాలు బలోపేతం అవుతాయని నేపాల్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ రేణు కుమారి అన్నారు.
500 మిలియన్ డాలర్లు
ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ (ఎగ్జిమ్) బ్యాంక్ ఆఫ్ ఇండియా-శ్రీలంకల మధ్య 500 మిలియన్ డాలర్ల లైన్ ఆఫ్ క్రెడిట్ ఒప్పందం ఫిబ్రవరి 2న కుదిరింది. శ్రీలంక ఆర్థిక శాఖ మంత్రి బసిల్ రాజపక్స, శ్రీలంకలోని భారత హైకమిషనర్ గోపాల్ బార్గ్లే సమక్షంలో ఈ ఒప్పందంపై శ్రీలంక ఆర్థిక శాఖ కార్యదర్శి ఎస్ఆర్ అటిగల్లే, ఎగ్జిమ్ బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్ గౌరవ్ సింగ్ భండారీ సంతకాలు చేశారు.
జాతీయం
స్పితుక్ గస్టోర్
లఢక్ సంస్కృతి, సంప్రదాయ, వారసత్వ పండుగ అయిన ‘స్పితుక్ గస్టోర్’ను జనవరి 30, 31 తేదీల్లో నిర్వహించారు. ‘చామ్స్’ అని పిలిచే వివిధ ఆకారాలు గల రంగురంగుల మాస్క్‌లను ధరించి చేసే నృత్యం వీరి సంప్రదాయం. సన్యాసులు మహాకళ (గొంబో), పాల్డాన్ లామో (శ్రీదేవి), వైట్ మహాకళ, రక్షక దేవత వంటి పలు దేవతలను వర్ణిస్తూ వస్త్రధారణ చేస్తారు. ఈ పండుగను లేహ్, లఢక్ యూటీలోని ప్రజలు జరుపుకొంటారు.
కోస్ట్‌గార్డ్ దినోత్సవం
ఇండియన్ కోస్ట్‌గార్డ్ (ఐసీజీ) వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా 46వ రైజింగ్ డేని ఫిబ్రవరి 1న నిర్వహించింది. ఐసీజీ 158 నౌకలు, 70 విమానాలతో బలీయమైన శక్తిగా ఎదిగింది. 1977, ఫిబ్రవరి 1న ఏర్పడిన ఐసీజీ 1978, ఆగస్టు 8న చట్టబద్ధంగా స్థాపించారు. దీని నినాదం‘వయం రక్షమః (మేము రక్షిస్తాం)’.
జియోలాజికల్ పార్క్
దేశంలోనే మొదటి జియోలాజికల్ పార్క్ ఏర్పాటుకు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) ఆమోదం తెలిపిందని మధ్యప్రదేశ్ ఎంపీ రాకేశ్ సింగ్ జనవరి 30న వెల్లడించారు. రూ.35 కోట్ల అంచనా వ్యయంతో దీనిని మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్ జిల్లా నర్మదా నది తీరం వద్ద ఉన్న లమ్హెటా గ్రామంలో ఏర్పాటు చేయనున్నారు.
జలాంతర్గామి
ఇండియన్ నేవీ సరికొత్త జలాంతర్గామి ఫ్రెంచ్ రూపొందించిన ఆరు స్కార్పీన్ జలాంతర్గాముల్లో ఐదవది ఫిబ్రవరి 1న జలప్రవేశం చేసింది. నేవల్ గ్రూప్ ఆఫ్ ఫ్రాన్స్ సహకారంతో మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్ రూపొందించిన దీనికి ‘వాగిర్’ అని పేరుపెట్టారు.
కొత్తగా రెండు రామ్సర్ సైట్లు
ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం సందర్భంగా దేశంలో కొత్తగా రెండు ప్రదేశాలను రామ్సర్ జాబితాలో ఫిబ్రవరి 2న చేర్చారు. గుజరాత్‌లోని ఖిజాడియా వైల్డ్‌లైఫ్ శాంక్చువరి, ఉత్తరప్రదేశ్‌లోని బఖిరా వైల్డ్‌లైఫ్ శాంక్చువరి ఈ జాబితాలో చేరాయి. వీటితో దేశంలోని మొత్తం రామ్సర్ సైట్ల సంఖ్య 49కి చేరింది. ఫిబ్రవరి 2ను ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవంగా 1971 నుంచి నిర్వహిస్తున్నారు.
ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం సందర్భంగా హర్యానాలోన గురుగ్రామ్‌లో ఉన్న ఆరావళి బయోడైవర్సిటీ పార్క్‌ను దేశంలో మొదటిసారిగా ‘ఇతర ప్రభావంతమైన ప్రాంత-ఆధారిత పరిరక్షణ చర్యలు (అదర్ ఎఫెక్టివ్ ఏరియా-బేస్డ్ కన్జర్వేషన్ మెజర్స్-ఓఈసీఎం) సైట్‌గా గుర్తించారు.
హాత్
త్రిపుర-బంగ్లాదేశ్ సరిహద్దులోని కమల్పూర్-కుమార్‌ఘాట్ వద్ద మూడో సరిహద్దు హాత్కు ఫిబ్రవరి 3న శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో త్రిపుర సీఎం బిప్లవ్ కుమార్ దేబ్, బంగ్లాదేశ్ వాణిజ్య మంత్రి టిప్పు మున్షీ, బంగ్లాదేశ్‌లో భారత హైకమిషనర్ విక్రమ్ దొరైస్వామి పాల్గొన్నారు.
వార్తల్లో వ్యక్తులు
ప్రకాశ్ సింగ్ బాదల్
ఎన్నికల్లో పోటీ చేస్తున్న దేశంలో అత్యధిక వయస్కుడిగా ప్రకాశ్ సింగ్ బాదల్ నిలిచారని అధికారులు జనవరి 31న వెల్లడించారు. శిరోమణి అకాలీదల్ వ్యవస్థాపకుడు అయిన ఆయన 94 ఏండ్ల వయస్సులో లాంబి (పంజాబ్) స్థానం నుంచి పోటి చేయనున్నారు. పంజాబ్‌కు ఐదుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 92 ఏండ్ల వయస్సులో ఎన్నికల బరిలో నిలిచిన సీపీఎం నేత, కేరళ మాజీ ముఖ్యమంత్రి అచ్యుతానందన్ రికార్డును అధిగమించారు.
చెస్లీ క్రిస్ట్
2019 మిస్ యూఎస్ఏ కిరీటాన్ని గెలుచుకున్న చెస్లీ క్రిస్ట్ జనవరి 31న న్యూయార్క్‌లోని 60 అంతస్తుల భవనం నుంచి కిందపడి మరణించింది. చెస్లీ 1991లో మిషిగాన్ జాక్సన్లో జన్మించింది.
మనోజ్ పాండే
ఇండియన్ ఆర్మీ కొత్త వైస్ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే ఫిబ్రవరి 1న బాధ్యతలు స్వీకరించారు. ఈయన కోల్‌కతాలోని తూర్పు కమాండ్‌కు నాయకత్వం వహిస్తున్నారు. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం వంటి రాష్ర్టాల్లో తూర్పు సెక్టార్లో చైనా బలగాలను ఎదిరించడం తూర్పు కమాండ్ బాధ్యత.
సురేశ్
అంటార్కిటికా ఖండంలో సైంటిస్టులు చేపట్టిన అధ్యయనంలో దేశం తరఫున తెలంగాణకు చెందిన తాటిపాముల సురేశ్ పాల్గొన్నట్లు అధికారులు ఫిబ్రవరి 1న వెల్లడించారు. ఆ ఖండంలోని భారతి స్టేషన్ వద్ద సీస్మిక్ అండ్ జియోమాగ్నటిక్ అబ్జర్వేటరీ ఆవిష్కరణలో భాగంగా అక్కడి పరిస్థితులపై జనవరి 16 నుంచి అధ్యయనం చేస్తున్నారు. ఈయన జగిత్యాల జిల్లా మల్యాల మండలం పోతారం గ్రామానికి చెందినవారు.
శ్రీనివాసమూర్తి
డీఆర్డీవోకు చెందిన హైదరాబాద్‌లోని డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (డీఆర్డీఎల్)కు నూతన డైరెక్టర్‌గా జీఏ శ్రీనివాసమూర్తి ఫిబ్రవరి 1న బాధ్యతలు స్వీకరించారు. ఇదివరకు డైరెక్టర్‌గా ఉన్న దశరథ్ రామ్ జనవరి 30న పదవీ విరమణ పొందారు. ఈయన ఇప్పటివరకు అడ్వాన్స్డ్ నేవల్ సిస్టమ్స్‌కు ప్రోగ్రామ్ డైరెక్టర్‌గా ఉన్నారు.
రవి మిట్టల్
ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్ప్ట్రసీ బోర్డ్ ఆఫ్ ఇండియా (ఐబీబీఐ)కు చైర్మన్‌గా రవి మిట్టలను నియమిస్తూ కార్పొరేట్ వ్యవహరాల మంత్రిత్వ శాఖ ఫిబ్రవరి 2న నోటీసును జారీచేసింది. 1986 ఐఏఎస్ బీహార్ కేడర్‌కు చెందిన ఆయన క్రీడల శాఖ సెక్రటరీగా పనిచేశారు. ఐబీబీఐ దివాలా చర్యలు, సంస్థలను పర్యవేక్షిస్తుంది. 2016, అక్టోబర్ 1న స్థాపించిన దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది.
జగదీష్
యూజీసీ (యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్) చైర్మన్‌గా మామిడాల జగదీష్ కుమార్‌ను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 4న నిర్ణయం తీసుకుంది. ఈ పదవికి ఎన్నికయిన తొలి తెలుగు వ్యక్తి ఈయనే. నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం మామిడాలకు చెందిన ఆయన ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ వీసీగా పనిచేస్తున్నారు.
క్రీడలు
ఆష్లే బార్టీ
ఆస్ట్రేలియన్ క్రీడాకారిణి ఆష్లే బార్టీ ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నీని గెలుచుకుంది. జనవరి 29న జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో అమెరికాకు చెందిన డానియెల్లె కొలిన్స్‌ను ఓడించింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల డబుల్స్‌లో ఆస్ట్రేలియాకు చెందిన కిర్గియోస్-కొకినాకిన్ జంట ఆస్ట్రేలియాకే చెందిన ఎబ్డెన్-పుర్సెల్ జంటను ఓడించింది.
కార్ల్సన్
టాటా స్టీల్ చెస్ టోర్నమెంట్‌ను ప్రపంచ నంబర్, నార్వేకు చెందిన మాగ్నస్ కార్ల్సన్ గెలుచుకున్నాడు. జనవరి 30న ఫైనల్ మ్యాచ్‌లో చివరిదైన 13వ రౌండ్లో రష్యా ఆటగాడు డానియల్ దుబోవ్ను ఓడించాడు. ఈ టోర్నీలో గెలవడం అతడికి ఇది ఎనిమిదోసారి.
రఫెల్ నాదల్
ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ టోర్నీని స్పెయిన్ ఆటగాడు రఫెల్ నాదల్ గెలుచుకున్నాడు. జనవరి 30న జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో రష్యా ఆటగాడు మెద్వెదెవ్‌ను ఓడించాడు. దీంతో అతడు ఫెదరర్, జకోవిచ్‌లను అధిగమిస్తూ 21వ టైటిల్‌ను సాధించాడు. టెన్నిస్ చరిత్రలో అత్యధిక గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిళ్లు గెలిచిన ఆటగాడిగా చరిత్ర సృష్టించారు.
ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల డబుల్స్‌లో చెక్కు చెందిన బార్బరా క్రెజికోవా-కేథరినా సినియాకోవా జోడీ అనాడానిలినా (కజకిస్థాన్)-బీర్టిజ్ హదద్ మయా (బ్రెజిల్) జోడీపై విజయం సాధించింది.
డరిల్ మిచెల్
న్యూజిలాండ్ బ్యాటర్ డరిల్ మిచెల్‌కు ఐసీసీ ‘స్పిరిట్ ఆఫ్ క్రికెట్-2021’ అవార్డు ఫిబ్రవరి 2న లభించింది. ఇంగ్లండ్‌తో టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్ మ్యాచ్‌లో క్రీడస్ఫూర్తితో వ్యవహరించి తేలిగ్గా వచ్చే సింగిల్‌ను తీయడానికి నిరాకరించినందుకు ఈ పురస్కారానికి ఎంపికయ్యాడు.
-శ్రీసత్యం చాపల ఎడ్యుకేషన్ డెస్క్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు