సైబర్ సంగిని దేనికి సంబంధించింది?
1. వరల్డ్ పాపులేషన్ రివ్యూ విడుదల చేసిన నివేదిక ప్రకారం వ్యవస్థీకృత ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకున్న ప్రాచీన దేశాల జాబితాలో భారత్ ఎన్నో స్థానంలో ఉంది? (3)
1) 5 2) 6 3) 7 4) 8
వివరణ: వ్యవస్థీకృత ప్రభుత్వ నిర్మాణం ఏర్పాటు చేసుకున్న దేశాల జాబితాలో భారత్ ఏడో స్థానంలో ఉంది. దేశంలో క్రీ.పూ. 2000లో ఈ తరహా వ్యవస్థ ఏర్పడిందని ప్రపంచ జనాభా సమీక్ష నివేదిక పేర్కొంది. అతి ప్రాచీనమైన వ్యవస్థీకృత ప్రభుత్వ వ్యవస్థ ఇరాన్ దేశంలో క్రీ.పూ. 3200లో అందుబాటులోకి వచ్చింది. అలాగే స్వయం సార్వభౌమ అధికారాన్ని ప్రకటించుకున్న దేశాల జాబితాలో అతి ప్రాచీనమైంది జపాన్. క్రీ.పూ.660లో ఈ తరహా వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది. అదేవిధంగా స్వతంత్ర దేశాలుగా ఇటీవల అవతరించినవి- దక్షిణ సూడాన్ (2011), కొసొవో (2008), సెర్బియా (2006).
2. మత్స్యరంగానికి సంబంధించి ప్రపంచ వాణిజ్య సంస్థ ఒప్పందాన్ని అంగీకరించిన తొలి దేశం ఏది? (4)
1) రష్యా 2) అమెరికా
3) యూకే 4) స్విట్జర్లాండ్
వివరణ: 12వ మంత్రుల స్థాయి ప్రపంచ వాణిజ్య సంస్థలో తీసుకున్న నిర్ణయం మేరకు మత్య్స రంగానికి సంబంధించిన ఒప్పందాన్ని ఆమోదించిన తొలి దేశం యూరప్‌లోని స్విట్జర్లాండ్. జెనీవాలో 2022 జూన్‌లో 12 నుంచి 17 వరకు 12వ మంత్రుల స్థాయి సమావేశం నిర్వహించారు. దీని ప్రకారం అక్రమ, అనియంత్రితంగా చేపలను పట్టే విధానాలకు రాయితీలు లభించవు. హైసీస్ ప్రాంతాల్లో అనియంత్రితంగా చేపలు పట్టడాన్ని కూడా నిషేధిస్తుంది. పర్యావరణ మెరుగుకు ఈ ఒప్పందం మేలు చేస్తుంది. పర్యావరణ కోణంలో ప్రపంచ వాణిజ్య సంస్థ తీసుకొచ్చిన తొలి ఒప్పందం ఇదే.
3. ప్రపంచ లింగ భేద సూచీ (గ్లోబల్ జెండర్ గ్యాప్) తయారీలో కొత్తగా దేన్ని చేర్చనున్నారు? (3)
1) లోక్‌సభలో మహిళల పాత్ర
2) కేంద్ర ప్రభుత్వంలో మహిళా మంత్రులు
3) పంచాయతీలో మహిళల పాత్ర
4) శాసనసభల్లో మహిళల పాత్ర
వివరణ: ప్రపంచ ఆర్థిక ఫోరమ్ గ్లోబల్ జెండర్ గ్యాప్ నివేదికను రూపొందించి ఏటా ర్యాంకులను విడుదల చేస్తుంది. ఇందుకు ఆర్థిక వ్యవస్థలో మహిళల పాత్ర-అవకాశాలు, విద్యలో సాధించిన విజయాలు, రాజకీయ సాధికారత, ఆరోగ్యం తదితర అంశాలను పరిశీలిస్తుంది. ఫలితాల ఆధారంగా ర్యాంకులను విడుదల చేస్తుంది. అయితే ఈ సూచీ పట్ల భారత్ పలు అభ్యంతరాలను వ్యక్తం చేయడంతో రాజకీయ సాధికారతలో కొత్తగా మరో అంశాన్ని చేర్చింది. గతంలో సూచీలో కేవలం కేంద్ర క్యాబినెట్, పార్లమెంట్‌లోని ఉభయసభల్లో మహిళా సాధికారతను మాత్రమే పరిశీలించేది. పంచాయతీల్లోనూ వీరి పాత్రను పరిగణించాలని భారత్ చేసిన విన్నపాన్ని అంగీకరించింది. దేశంలో దాదాపు 1.4 మిలియన్ల మంది మహిళలు పంచాయతీ వ్యవస్థల్లో ఉన్నారు.
4. 2025 నాటికి హరిత విద్యుత్ రాష్ట్రంగా అవతరించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్న రాష్ట్రం? (2)
1) కేరళ 2) హిమాచల్ ప్రదేశ్
3) పశ్చిమబెంగాల్ 4) తమిళనాడు
వివరణ: 2025 నాటికి హరిత విద్యుత్ రాష్ట్రంగా అవతరించాలని హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం లక్ష్యంగా నిర్ణయించుకుంది. సౌర, హైడ్రోజన్ శక్తులను వినియోగించుకోవడం ద్వారా దీన్ని సాధించాలని ఆ రాష్ట్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు రాష్ట్రంలో ఉన్న పూర్తి స్థాయి సామర్థ్యాలను వినియోగించుకోనుంది. ఇటీవల చాలా రాష్ర్టాలు పర్యావరణ మెరుగుకు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. దేశంలో తొలిసారి ైక్ల్లెమేట్ చేంజ్ మిషన్‌ను తమిళనాడు రాష్ట్రం ఏర్పాటు చేసుకుంది. అలాగే తొలి కార్బన్ తటస్థ వ్యవసాయాన్ని కేరళ ప్రారంభించింది.
5. ఈ ఏడాది నిర్వహించిన గణతంత్ర వేడుకలకు ఏ దేశ అధ్యక్షుడు ముఖ్య అతిథిగా
హాజయ్యారు? (1)
1) ఈజిప్ట్ 2) ఇండోనేషియా
3) నేపాల్ 4) భూటాన్
వివరణ: భారత 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఈజిప్ట్‌కు చెందిన అబ్దెల్ ఫతా ఎల్-సిసి హాజరయ్యారు. ఆయన జనవరి 24 నుంచి 26 వరకు భారత్‌లో దౌత్య పర్యటన చేశారు. ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలు 2022 నాటికే 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాయి. రెండు దేశాల మధ్య 2021-22 సంవత్సరంలో వాణిజ్యం 7.26 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరింది. ఏటా గణతంత్ర దినోత్సవానికి ఒక ముఖ్య అతిథిని భారత్ ఆహ్వానిస్తుంది. 1950లో నిర్వహించిన గణతంత్ర దినోత్సవాలకు నాటి ఇండోనేషియా అధ్యక్షుడు సుకార్తో హాజరయ్యారు.
6. కెన్, బెట్వా ఏ నదికి ఉపనదులు? (3)
1) బ్రహ్మపుత్ర 2) మహానది
3) యమున 4) దామోదర్
వివరణ: కెన్, బెట్వా రెండు కూడా యమునా నదికి ఉపనదులే. నేషనల్ పర్స్పెక్టివ్ ప్లాన్‌లో భాగంగా ఈ రెండు నదులను అనుసంధానం చేస్తున్నారు. కెన్ నదిలోని నీటిని బెట్వా నదిలోకి తీసుకెళ్లడం ద్వారా బుందేల్‌ఖండ్ ప్రాంతంతో పాటు స్థానికంగా నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల సమస్య తీరుతుంది. 10.62 లక్షల హెక్టార్ల సాగునీటితో పాటు 62 లక్షల మందికి మంచినీరు అందనుంది. 103 మెగావాట్ల జల విద్యుత్‌తో పాటు 27 మెగావాట్ల సౌరశక్తి కూడా ఈ ప్రాజెక్ట్ ద్వారా అందనుంది. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లలో విస్తరించి ఉన్న బుందేల్‌ఖండ్ ప్రాంత వాసులకు ఇది ప్రయోజనాన్ని కలిగిస్తుంది.
7. సైబర్ సంగిని ఇటీవల వార్తల్లో ఉంది. ఇది దేనికి సంబంధించింది? (2)
1) కొత్తగా వచ్చిన సైబర్ వైరస్
2) మహిళలకు సైబర్ సెక్యూరిటీ శిక్షణ
3) విద్యార్థులకు కంప్యూటర్లు ఇచ్చే పథకం
4) పైవేవీ కాదు
వివరణ: సైబర్ సెక్యూరిటీలో 10,000 మంది మహిళలకు శిక్షణ ఇచ్చేందుకు ఒప్పో ఇండియా, గవర్నమెంట్ కామన్ సర్వీస్ సెంటర్ అకాడమీ సంయుక్తంగా ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. సైబర్ సంగిని పేరుతో శిక్షణను ఇవ్వనున్నాయి. గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లోని మహిళలకు ఈ తరగతులు అందుబాటులో ఉంటాయి. దీనికి ఎలక్ట్రానిక్స్-ఐటీ మంత్రిత్వ శాఖ సహకరించనుంది. 45 రోజుల పాటు శిక్షణ ఉంటుంది. అనంతరం సర్టిఫికెట్ కూడా ఇస్తారు. ప్రైవేట్‌గానూ ఉద్యోగం పొందేందుకు వీలుంటుంది.
8. ఇటీవల యూ-విన్ యాప్‌ను ప్రారంభించారు. ఇది దేనికి సంబంధించింది? (1)
1) వ్యాక్సినేషన్
2) భారత్ సాధించిన విజయాలు
3) అంతర్జాతీయ స్థాయిలో భారత్‌తో స్నేహంగా ఉండే దేశాల జాబితా
4) భారత క్రీడా విజయాలు
వివరణ: మహిళలు, చిన్నారులకు వ్యాక్సినేషన్‌కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని డిజిటల్ రూపంలో నిక్షిప్తం చేయనున్నారు. ఇందుకు కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ యూ-విన్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించింది. ప్రతి రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతంలో కనీసం రెండు జిల్లాల్లో ప్రయోగాత్మకంగా దీన్ని చేపట్టనుంది. ప్రతి గర్భిణి వివరాలను ఈ యాప్‌లో పేరు నమోదు చేయనున్నారు. కొవిడ్ వ్యాక్సినేషన్ సందర్భంగా భారత్ తీసుకొచ్చిన కొ-విన్ లాగానే ఇది పనిచేస్తుంది. అలాగే పూర్తి స్థాయిలో అన్ని రకాల వ్యాక్సినేషన్లు పూర్తయ్యాక, సంబంధిత వ్యక్తులకు డిజిటల్ సర్టిఫికెట్లు కూడా ఇస్తారు.
9. BharOS అంటే ఏంటి? (3)
1) భారత వెబ్సైట్లను చదివేందుకు బార్కోడ్
2) భారత అంతరిక్ష పరిశోధనకు
ఆపరేటింగ్ సిస్టమ్
3) మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్
4) పైవేవీ కాదు
వివరణ: దేశంలో స్వదేశీ పరిజ్ఞానంతో తయారయ్యిందే BharOS అనే మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్. దీన్ని జాండ్కే ఆపరేషన్స్ అనే ప్రైవేట్ సంస్థ తయారు చేసింది. ఇది లాభాపేక్షలేని సంస్థ. ఐఐటీ మద్రాస్ అంకుర వ్యవస్థకు సంబంధించింది. దీన్ని రూపొందించేందుకు శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ ఆర్థిక సహకారం అందించింది. ఆండ్రాయిడ్, ఐవోఎస్ ఏ విధంగా ఉంటుందో BharOS కూడా అదేవిధంగా ఉంటుంది. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ గూగుల్ యాప్స్ లేదా సేవలను వినియోగించదు. వివిధ యాప్‌ల సురక్షితకు సంబంధించి ప్రైవేట్ యాప్ స్టోర్ సర్వీసెస్‌ను ఇది కలిగి ఉంది.
10. హరిప్రసాద్ చౌరాసియా జీవిత కాల సాఫల్య పురస్కారాన్ని గెలుచుకుంది ఎవరు? (4)
1) కౌశిక్ రామ్ 2) రామ్ సెహ్వారి
3) ప్రణతి 4) ప్రభా ఆత్రే
వివరణ: ప్రముఖ హిందుస్థాని గాయని, డాక్టర్ ప్రభా ఆత్రే హరిప్రసాద్ చౌరాసియా అవార్డును పొందారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే అవార్డును ఆమెకు బహూకరించారు. 2022లో ఆమె పద్మ విభూషణ్ అవార్డును అందుకున్నారు. హరిప్రసాద్ చౌరాసియా ప్రముఖ సంగీత దర్శకుడు. హిందుస్థాని శాస్త్రీయ సంగీత విద్వాంసుడు. ఆయన ప్రయాగ్‌రాజ్‌లో జన్మించారు.
11. ఇటీవల మరణించిన బాలకృష్ణ జోషి ఏ రంగంతో ముడిపడి ఉన్నారు? (2)
1) సాహిత్యం 2) ఆర్కిటెక్చర్
3) క్రీడలు 3) న్యాయవాద వృత్తి
వివరణ: ఆర్కిటెక్చర్లో ఎంతో పేరు దక్కించుకున్న బాల్కృష్ణ విఠల్దాస్ జోషి మరణించారు. ఈ రంగంలో ప్రతిష్ఠాత్మకమైన రిట్జ్‌కర్ ప్రైజ్‌తో సహా పద్మశ్రీ, పద్మ విభూషణ్ అవార్డులను కూడా ఆయన పొందారు. ప్రతిష్ఠాత్మక బ్రిటిష్ ఆర్కిటెక్ట్ సంస్థ రాయల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్రిటిష్ ఆర్కిటెక్ట్స్ 2022లో రాయల్ గోల్డ్‌మెడల్‌ను బాల్కృష్ణ విఠల్దాస్కు ప్రకటించింది. అహ్మదాబాద్‌లోని సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్ అండ్ ప్లానింగ్ టెక్నాలజీ, మహాత్మాగాంధీ లేబర్ ఇన్స్టిట్యూట్ తదితర భవనాలకు రూపకల్పన చేసింది ఆయనే.
12. కింది వాటిలో తెలంగాణ నుంచి 2023లో పద్మ భూషణ్ అవార్డును పొందినది ఎవరు? (3)
ఎ. చినజీయర్ స్వామి బి. కమ్లేష్ డి పటేల్
1) ఎ 2) బి
3) ఎ, బి సరైనవి 4) రెండూ సరికావు
వివరణ: 2023లో మొత్తం 106 మందికి పద్మ అవార్డులు దక్కాయి. ఇందులో ఆరుగురికి పద్మ విభూషణ్, 9 మందికి పద్మ భూషణ్ అవార్డులను ప్రకటించారు. 91 మంది పద్మశ్రీ పురస్కారాన్ని పొందారు. పద్మ భూషణ్ పొందిన వారిలో తెలంగాణ నుంచి చిన్నజీయర్ స్వామి, కమ్లేష్ డి పటేల్ ఉన్నారు. ఇద్దరూ ఆధ్యాత్మిక విభాగం నుంచి అవార్డులను పొందారు. చిన్నజీయర్ స్వామి సమతామూర్తి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అలాగే హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ గైడ్‌గా, హార్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్, హార్ట్ఫుల్నెస్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ వ్యవస్థాపకుడిగా, సహజ్‌మార్గ్ స్పిరిచ్యువాలిటీ ఫౌండేషన్ మిషన్ అధ్యక్షుడు కమ్లేష్ డి పటేల్ కూడా అవార్డును పొందారు.
13. జనవరి 24ను ఏ రోజుగా నిర్వహిస్తారు? (4)
ఎ. జాతీయ ఓటర్ దినోత్సవం
బి. జాతీయ బాలిక దినోత్సవం
సి. అంతర్జాతీయ విద్యా దినోత్సవం
డి. జాతీయ పర్యాటక దినోత్సవం
1) ఎ, బి 2) బి, డి
3) సి, డి 4) బి, సి
వివరణ: ఏటా జనవరి 24న జాతీయ బాలిక దినోత్సవం అలాగే అంతర్జాతీయ విద్యా దినోత్సవంగా నిర్వహిస్తారు. జనవరి 25న జాతీయ ఓటరు రోజుతో పాటు జాతీయ పర్యాటక రోజుగా కూడా జరుపుతారు. ఈ ఏడాది విద్యా దినోత్సవాన్ని అఫ్గాన్ బాలికలు, మహిళలకు అంకితమిస్తూ యునెస్కో నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఆ దేశంలో తాబిబన్ ప్రభుత్వం ఉంది. మహిళలకు యూనివర్సిటీ విద్యను నిలిపివేశారు. అలాగే ప్రైవేట్ సంస్థల్లో మహిళలు చదువుకోకుండా నిషేధం విధించారు.
14. ఏ దేశానికి క్రిస్ హిప్కిన్స్ ప్రధాని అయ్యారు? (2)
1) ఆస్ట్రేలియా 2) న్యూజిలాండ్
3) ఇజ్రాయెల్ 4) చిలీ
వివరణ: న్యూజిలాండ్ కొత్త ప్రధానిగా క్రిస్ హిప్కిన్స్ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఆ దేశప్రధానిగా ఉన్న జసిండా ఆర్డెర్న్ రాజీనామా చేశారు. కరోనా సమయంలో సమర్థంగా పనిచేసిన ప్రధానిగా ఆమె పేరుతెచ్చుకున్నారు.
15. భారత్‌లో అతిలోతులో మెట్రోస్టేషన్‌ను ఏ నగరంలో నిర్మించనున్నారు? (3)
1) నాగ్‌పూర్ 2) కోల్‌కతా
3) పుణె 4) పైవేవీ కాదు
వివరణ: దేశంలో అత్యంత లోతులో మెట్రోస్టేషన్ ఏర్పాటు కానుంది. పుణెలో దీన్ని నిర్మించనున్నారు. స్థానికంగా ఉన్న సివిల్ కోర్ట్ వద్ద ఇంటర్చేంజ్ స్టేషన్‌ను 108.59 అడుగుల లోతులో నిర్మించనున్నారు. ఫిబ్రవరి 2023 నాటికి పూర్తి చేసి, మార్చి నెలలో అందుబాటులోకి తేనున్నారు. స్టేషన్ ఫ్లోర్లో సూర్యకాంతి నేరుగా వచ్చేలా నిర్మిస్తున్నారు. అలాగే పుణె మెట్రోలో అల్యూమినియం కోచ్‌లను వినియోగించారు. దేశంలో ఇవి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసినవి. ఈ తరహా కోచ్‌లు కలిగిన ఏకైక భారత నగరం పుణె. ప్రస్తుతం దేశంలో 15 నగరాల్లో మెట్రో అందుబాటులో ఉంది. భారత్‌లో తొలి సారి నీటిలోపల మెట్రో సౌకర్యాన్ని కోల్‌కతాలో అందుబాటులో తేనున్నారు.
-వి. రాజేంద్ర శర్మ ఫ్యాకల్టీ
9849212411
- Tags
- nipuna news
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు