పదిలం.. పదజాలం
ప్రతి సబ్జెక్ట్‌కు సంబంధిత పదాలు, పదజాలం ఉపయోగింస్తుంటారు. ఈ పదజాలాన్ని పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారు తప్పక గుర్తుపెట్టుకోవాలి. కొన్ని లైన్ల సమాచారాన్ని ఒక పదంలో అమర్చి గుర్తుపెట్టుకోవడం వల్ల సులువుగా అర్థమవడమే కాకుండా.. సమయాన్ని కూడా ఆదా చేసుకోవచ్చు. పోటీపరీక్షల్లో తరచూ ఉపయోగించే ‘ఎకానమీ’ సబ్జెక్ట్‌లోని పదజాలాన్ని నేర్చుకుందాం. పదిలంగా గుర్తుపెట్టుకుందాం.
జాతీయాదాయం
ఒక దేశంలో, నిర్ణీత కాలంలో సాధారణ నివాసితులచేత ఉత్పత్తి చేయబడి అంతిమ వస్తు సేవల మార్కెట్ విలువ (దేశంలోపల కానీ, వెలుపల కానీ ఉత్పత్తి జరగవచ్చు).
స్థూల దేశీయోత్పత్తి (Gross Domestic Product – GDP)
విదేశాల నుంచి ఆర్జించే రాబడిని మినహాయించి దేశంలో ఒక సంవత్సరంలో ఉత్పత్తి అయిన మొత్తం వస్తువులు, సేవల ద్రవ్య విలువను సూచించేది.
స్థూల జాతీయోత్పత్తి (Gross National Product- GNP)
స్థూల దేశీయోత్పత్తి నుంచి పరోక్ష పన్నులను మినహాయించి వచ్చిన మొత్తానికి విదేశాల నుంచి వచ్చిన రాబడిని కలపాలి. [GDP- పరోక్ష పన్నులు+విదేశాల నుంచి రాబడి]
ప్రాథమిక రంగం (Primary Sector)
వ్యవసాయ రంగం, చేపలు, అడవులు, మైనింగ్, క్వారీయింగ్ మొదలైన రంగాలను కలిపి ప్రాథమిక రంగం అంటారు.
ద్వితీయ రంగం (Secondary sector)
ఉత్పత్తిరంగం, నిర్మాణ రంగం, విద్యుత్ రంగం, గ్యాస్, నీటి సరఫరా రంగాలు దీని కిందకు వస్తాయి. ప్రాథమిక రంగం అభివృద్ధి చెందితే, అది ద్వితీయరంగం అభివృద్ధికి కూడా తోడ్పడుతుంది.
సేవా రంగం (Service Sector)
రవాణా, సమాచారం, వాణిజ్యం, బ్యాంకింగ్, బీమా, రక్షణ, ప్రజాపాలన వంటి సర్వీసులు సేవారంగం కిందికి వస్తాయి. ఒక దేశ ఆర్థికాభివృద్ధి, జాతీయాదాయంలో సేవల రంగం శాతాన్ని బట్టి అంచనా వేయవచ్చు.
ప్రైవేటు రంగం (Private Sector)
యాజమాన్యాలు, షేర్‌హోల్డర్ల ఆధీనంలోని సంస్థలను ‘ప్రైవేటు రంగం’ అంటారు.
ప్రభుత్వ రంగం (Public Sector)
ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే సంస్థలు పబ్లిక్ సెక్టార్ కిందకు వస్తాయి. వీటికి నిజమైన సొంతదారులు ప్రజలే. భారతీయ రైల్వేలు, జాతీయం చేసిన బ్యాంకులు మొదలైనవి ఇందుకు ఉదాహరణలు.
ఉమ్మడి రంగం (Joint Sector)
ప్రభుత్వ, ప్రైవేటు, వ్యక్తుల భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన సంస్థలు, కంపెనీలు ఈ రంగం కిందకు వస్తాయి. సాధారణంగా, ఈ సంస్థల్లో ప్రభుత్వ వాటా 51 శాతం కంటే అధికంగా ఉంటుంది.
మిశ్రమ ఆర్థిక వ్యవస్థ (Mixed Economy)
పబ్లిక్, ప్రైవేట్ రంగాలు రెండూ కలిసి ఉండే ఆర్థిక వ్యవస్థ. ఉదాహరణ – భారతదేశ ఆర్థిక వ్యవస్థ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ
ప్రణాళిక (Planning)
అందుబాటులో ఉన్న వనరులను, పరిగణనలోకి తీసుకొని, లక్ష్యాలను ఏర్పరుచుకొని ప్రాధాన్యతలను నిర్ణయించుకొని, లక్ష్యాల సాధనకు యంత్రాంగాన్ని రూపొందించుకొని, ఫలితాలను సమీక్షించుకొనే అంశాలను కలిగియున్న ప్రక్రియ.
పేదరికం
సమాజంలోని కొన్ని వర్గాల ప్రజలు జీవితానికి అవసరమైన కనీస ప్రాథమిక సౌకర్యాలను కూడా పొందలేని స్థితిని ‘పేదరికం’ అంటారు.
నిరుద్యోగిత (Unemployment)
ఏదో ఒక ఉత్పాదక కార్యక్రమంలో లాభదాయకమైన ఉపాధి లభించని పరిస్థితిని అప్పుడున్న వాస్తవ రేటుకు పని లభించని పరిస్థితిని ‘నిరుద్యోగిత’గా పేర్కొంటారు.
ప్రచ్ఛన్న నిరుద్యోగం (Disguised Unemployment)
శ్రామికుని ఉపాంత ఉత్పాదశక్తి సున్నా అయినప్పుడు దాన్ని ప్రచ్ఛన్న నిరుద్యోగం అంటారు. సామాన్య పరిభాషలో చెప్పాలంటే తక్కువమంది సరిపోయే పనిలో ఎక్కువమంది పనిచేయడం.
ఉదాహరణకు- వ్యవసాయ రంగంలో ఎక్కువగా ప్రచ్ఛన్న నిరుద్యోగం కనబడుతుంది.
సాంకేతిక నిరుద్యోగం
సాంకేతిక శిక్షణ పొందిన నిపుణులకు తగిన ఉపాధి లభించకపోవడం. ఉదాహరణకు – వృత్తి విద్యనభ్యసించిన ఇంజనీర్లు, డాక్టర్లు నిరుద్యోగులుగా ఉండే పరిస్థితి.
ద్రవ్యోల్బణం
ధరల నిరంతర పెరుగుదలను ద్రవ్యోల్బణం అంటారు.
డిమాండ్ ఫుల్ ద్రవ్యోల్బణం
ఆర్థిక వ్యవస్థలో వస్తువుల సరఫరా కంటే గిరాకీ ఎక్కువగా ఉన్నప్పుడు ద్రవ్యోల్బణాన్ని డిమాండ్-ఫుల్ ద్రవ్యోల్బణం అంటారు.
కాస్ట్పుష్ ద్రవ్యోల్బణం
వస్తువు ఉత్పత్తి వ్యయం పెరగటం వల్ల వస్తువుల ధరలు పెరిగితే, దాన్ని కాస్ట్పుష్ ద్రవ్యోల్బణం అంటారు.
కార్టెల్
ఉత్పత్తిదారులు వస్తువుల ధరలను పెంచేందుకు ఒక నిర్ణయానికి వచ్చి వస్తువుల ఉత్పత్తి తగ్గించటాన్ని కార్టెల్ అంటారు.
కనీస మద్దతు ధర
రైతులు పంట వేయడానికి ముందే ప్రభుత్వం నిర్ణీత ధరను నిర్ణయించి, రైతులకు కనీస రాబడికి సంబంధించిన హామీ ఇస్తుంది. అటువంటి నిర్ణీత ధరనే కనీస మద్దతు ధర అంటారు.
సేకరణ ధర
ప్రజా పంపిణీ వ్యవస్థ నిర్వహణకుగాను అవసరమైన వస్తువులను సమకూర్చుకొనేందుకు ప్రభుత్వం చెల్లించే ధరను సేకరణ ధర అంటారు. ఇది కనీస మద్దతు ధర కంటే అధికంగా ఉంటుంది.
జారీ ధర
ప్రజా పంపిణీ వ్యవస్థకు ప్రభుత్వం వస్తువులకు సరఫరా చేసే ధరను జారీ ధర అంటారు.
ప్రాథమిక మార్కెట్లు
గ్రామాల్లో నిర్వహించే సంతల వంటి వాటిని ప్రాథమిక లేదా స్థానిక మార్కెట్లు అంటారు.
సెకండరీ మార్కెట్
హోల్‌సేల్ లేదా టోకు మార్కెట్‌ను సెకండరీ మార్కెట్ అంటారు.
రెగ్యులేటెడ్ మార్కెట్
రైతులను రక్షించడం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసే మార్కెట్
వాటర్ షెడ్ పథకం
నిర్దిష్ట ప్రాంతంలో ఉన్న అన్ని జలవనరులను ఒక ఉమ్మడి కేంద్రంలో జమచేసి, వాటిని నిల్వచేసి, సద్వినియోగం చేస్తారు. ఈ నిర్దిష్ట ప్రాంతాన్నే వాటర్ షెడ్ అంటారు.
ఎగ్జిట్ విధానం
ఖాయిలా పరిశ్రమలు తమ సంస్థను మూసేసి, రంగం నుంచి వైదొలగడానికి అవకాశం కల్పించే విధానం.
విత్త విధానం
పన్నుల ద్వారాను, ప్రజల నుంచి రుణాలను సేకరించటం ద్వారాను, లోటు విధానం ద్వారాను, ప్రభుత్వం ఆదాయం పెంచడాన్ని, వ్యయ పరిమాణాన్ని, తీరును నిర్దేశించడాన్ని విత్త విధానం అంటారు.
లోటు ఆర్థిక విధానం
ప్రభుత్వానికి వచ్చే ఆదాయానికి, వ్యయానికి మధ్యగల తేడాను, రిజర్వుబ్యాంకు నుంచి రుణ సేకరణ ద్వారా భర్తీచేయడాన్ని ‘లోటు’ ఆర్థిక విధానం (Dificit Financing) అంటారు.
షెడ్యూల్డ్ బ్యాంకులు
రిజర్వు బ్యాంకు దగ్గర తమ రుణగ్రస్తతకు సంబంధించి కనిష్ట శాతాన్ని నిర్వహించడంతో పాటు రూ.5 లక్షలు చెల్లించిన మూలధనం గల బ్యాంకులను షెడ్యూల్డ్ బ్యాంకులు అంటారు.
బ్యాంకు రేటు
ఒక దేశంలోని కేంద్ర బ్యాంకు మారకపు బిల్లులను రీ డిస్కౌంట్ చేసే రేటును బ్యాంకు రేటు అంటారు.
స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో (SLR)
షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు తమ వద్ద ఉంచుకోవలసిన ప్రభుత్వ సెక్యూరిటీలను, నగదును నిర్దేశించే నిష్పత్తిని ఎస్ఎల్ఆర్ అంటారు.
క్యాష్ రిజర్వ్ రేషియో
వాణిజ్య బ్యాంకులన్నీ తమ డిపాజిట్లుతో కొంత భాగాన్ని నగదు రూపంలో రిజర్వ్ బ్యాంకు వద్ద ఉంచవలసిన ఉంటుంది. దీన్నే నగదు నిల్వల నిష్పత్తి అంటారు. దీన్ని 3 నుంచి 15 శాతం మధ్య రిజర్వ్‌బ్యాంకు మారుస్తూ ఉంటుంది.
కాల్ మనీ
బ్యాంకులు తమ ఎస్ఎల్ఆర్ అవసరాలను తీర్చుకునేందుకు స్వల్పకాలానికి ఇతర బ్యాంకుల నుంచి తీసుకునే నిధులు.
బేర్
షేర్ల ధరలు పడిపోతాయన్న అంచనాతో షేర్లను విక్రయించే వ్యక్తి. ఇతడు అధిక ధరకు షేర్లను అమ్మి, తర్వాత తక్కువ ధరకు కొనుగోలు చెయ్యాలని ఆశించే వ్యక్తి.
ప్రాక్టీస్ బిట్స్
1. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల ప్రైవేటు బ్యాంకులో ప్రమోటర్ల పరిమితి వాటాపై బ్యాంకు పెయిడ్-అప్ ఓటింగ్ ఈక్విటీ షేర్ మూలధనంలో ఎంత
శాతానికి పెంచింది?
1) 26 శాతం 2) 15 శాతం
3) 21 శాతం 4) 18 శాతం
2. నీతి ఆయోగ్ విడుదల చేసిన ప్రారంభ నేషనల్ మల్టీ-డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్‌లో భారతదేశంలో అన్ని కోణాల్లో పేద రాష్ట్రంగా ఆవిర్భవించింది?
1) ఆంధ్రప్రదేశ్ 2) ఉత్తరప్రదేశ్
3) బీహార్ 4) పంజాబ్
3. పాలస్తీనా ప్రజలతో అంతర్జాతీయ సంఘీభావం దినోత్సవం అనేది ప్రతి
సంవత్సరం ఏ రోజున జరుపుకోవాలని ఐక్యరాజ్యసమితి నిర్ణయించింది?
1) నవంబర్ 29 2) నవంబర్ 26
3) నవంబర్ 27 4) నవంబర్ 28
4. ఇండియన్ మౌంటెనీరింగ్ ఫౌండేషన్ తొలి మహిళా అధ్యక్షురాలిగా ఎవరు ఎన్నికయ్యారు?
1) అరుణిమా సిన్హా 2) బచేంద్రి పాల్
3) ప్రేమ్‌లత అగర్వాల్ 4) హర్షవంతి బిష్త్
5. చెక్ రిపబ్లిక్ నూతన ప్రధానిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు?
1) వాక్లావ్ క్లౌస్ 2) మిలోస్ జెమెన్
3) ఆండ్రేజ్ బాబిస్ 4) పెట్ ఫియాలా
6. మణిపూర్‌లో ప్రపంచంలోనే ఎత్తయిన ఫైర్ రైల్వే వంతెనను భారతీయ రైల్వే నిర్మిస్తుంది. అయితే ఈ బ్రిడ్జ్ ఎత్తు ఎంత?
1) 151 మీటర్లు 2) 141 మీటర్లు
3) 131 మీటర్లు 4) 121 మీటర్లు
7. దేశంలో చెర్రీబ్లొసమ్ ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో జరుపుకొంటారు?
1) మేఘాలయ 2) తెలంగాణ
3) అరుణాచలప్రదేశ్ 4) త్రిపుర
8. నియంత్రణపరమైన నిబంధనలు పాటించనందుకు ఏ బ్యాంక్‌పై కోటి రూపాయల జరిమానా విధించినట్లు రిజర్వు బ్యాంక్ 2021 నవంబర్ చివరి వారంలో వెల్లడించింది?
1) పంజాబ్ నేషనల్ బ్యాంక్
2) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
3) కెనరా బ్యాంక్
4) సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
9. 2031 ఐసీసీ పురుషుల వన్ డే ప్రపంచకప్‌నకు ఏ దేశం ఆతిథ్యం ఇస్తుంది?
1) భారతదేశం 2) ఆస్ట్రేలియా
3) శ్రీలంక 4) ఇంగ్లాండ్
10. వియన్నా టెన్నిస్ ఓపెన్ లేదా ఎర్స్టే బ్యాంక్ ఓపెన్ 2021ను ఎవరు
గెలుచుకున్నారు?
1) రోజర్ ఫెడరర్ 2) రఫెల్ నాదల్
3) నొవాక్ జోకోవిచ్
4) అలెగ్జాండర్ జ్వెరెవ్
11. ఉత్తరప్రదేశ్‌లోని మొట్టమొదటి ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్ టవర్ ఏ నగరంలో ఏర్పాటు చేశారు?
1) మీరట్ 2) మథుర
3) లక్నో 4) నోయిడా
12. ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ టాయిలెట్ డే ను ఏ రోజున జరుపుకొంటారు?
1) నవంబర్ 19 2) నవంబర్ 20
3) నవంబర్ 21 4) నవంబర్ 22
13. వరల్డ్ యాంటీమైక్రోబియల్ అవేర్నెస్ వీక్ 2021 థీమ్ ఏంటి?
1) ది ఫ్యూచర్ ఆఫ్ యాంటీబయోటిక్స్ డిపెండ్స్ ఆన్ ఆల్ ఆఫ్ అజ్
2) సీక్ అడ్వైస్ ఫ్రం క్వాలిఫైడ్ హెల్త్‌కేర్ ప్రొఫెషనల్ బిఫోర్ టేకింగ్ యాంటీబయోటిక్స్
3) యునైటెడ్ టు ప్రిసెర్వ్ యాంటీమైక్రోబయల్స్
4) స్ప్రెడ్ అవేర్నెస్, స్టాప్ రెసిస్టెన్స్
14. భారతదేశంలో ప్రతి సంవత్సరం
నేషనల్ న్యూబార్న్ వీక్‌ను ఎప్పుడు
జరుపుకొంటారు?
1) నవంబర్ 15 నుంచి 21 వరకు
2) నవంబర్ 16 నుంచి 22 వరకు
3) నవంబర్ 17 నుంచి 23 వరకు
4) నవంబర్ 18 నుంచి 24 వరకు
15. ది సిడ్నీ డైలాగ్ 2021 థీమ్ ఏంటి?
1) యాక్షన్ అండ్ ఫైనాన్స్ మొబిలైజేషన్ డైలాగ్
2) ఐడెంటిటీ అండ్ అథెంటికేషన్
3) ఇంప్రువైజ్, అడాప్ట్ అండ్ ఓవర్‌కమ్
4) ఇండియన్ టెక్నాలజీ ఎవల్యూషన్ అండ్ రెవల్యూషన్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు