రిషి సునాక్ గెలిచిన నియోజకవర్గం ఏది?
1. అక్టోబర్ 24వ తేదీని ఏ రోజుగా నిర్వహిస్తారు? (4)
1) ఐక్యరాజ్య సమితి రోజు
2) అంతర్జాతీయ పోలియో రోజు
3) జాతీయ ఆహార దినోత్సవం
4) పైవన్నీ
వివరణ: 1945 అక్టోబర్ 24న ఐక్యరాజ్య సమితి ఆవిర్భవించింది. మొదటి ప్రపంచ యుద్ధం ఫలితంగా ఏర్పాటైన నానాజాతి సమితి, ప్రపంచ శాంతిని తీసుకురావడంలో విఫలం కావడం వల్ల రెండో ప్రపంచ యుద్ధాన్ని చూడాల్సి వచ్చింది. భవిష్యత్తులో మరో యుద్ధం రాకుండా ఉండేందుకు 1945లో నాటి బ్రిటిష్ ప్రధాని విన్స్టన్ చర్చిల్, అమెరికా అధ్యక్షుడు రూజ్వెల్ట్ ఐక్యరాజ్య సమితి ఏర్పాటుకు కారణమయ్యారు. అలాగే ఏటా అక్టోబర్ 24న ప్రపంచ పోలియో రోజుగా కూడా నిర్వహిస్తారు. 2011 నుంచి జాతీయ ఆహార దినోత్సవాన్ని కూడా ఈ రోజునే జరుపుకొంటున్నారు.
2. 91వ ఇంటర్‌పోల్ సమావేశాలు ఎక్కడజరుగనున్నాయి?
1) మెల్బోర్న్ 2) జెనీవా
3) బుడాపెస్ట్ 4) వియన్నా
వివరణ: 91వ ఇంటర్‌పోల్ సమావేశాలు వచ్చే ఏడాది ఆస్ట్రియాలోని వియన్నాలో నిర్వహించనున్నారు. ఈ సంస్థ ఫ్రాన్స్‌లోని లియాన్ కేంద్రంగా పనిచేస్తుంది. సంస్థను 1923లో అధికారికంగా ఏర్పాటు చేసింది వియన్నాలోనే. ఈ సంస్థ 90వ సమావేశం భారతదేశ రాజధాని న్యూఢిల్లీలో అక్టోబర్ 18 నుంచి 21 వరకు నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ సమావేశంలో ప్రసంగించారు. సీమాంతర ఉగ్రవాదాన్ని కట్టడి చేసేందుకు మరింత సమన్వయంతో, వేగంగా పనిచేయాలని సూచించారు. 90వ సమావేశానికి కోణార్క్ సూర్య దేవాలయం లోగోగా ఉంది. గతంలో 1997లో భారత్‌లో ఇంటర్‌పోల్ సమావేశాన్ని నిర్వహించారు. అది 66వది. అది కూడా న్యూఢిల్లీలోనే జరిగింది.
3. టైగర్ ట్రయంఫ్ పేరుతో ఏ దేశంతో భారత్ సైనిక విన్యాసాలను నిర్వహించింది?
1) శ్రీలంక 2) ఫ్రాన్స్
3) అమెరికా 4) స్పెయిన్
వివరణ: టైగర్ ట్రయంఫ్ పేరుతో భారత్, అమెరికా అక్టోబర్ 18 నుంచి 20 వరకు సైనిక విన్యాసాలను ఆంధప్రదేశ్‌లోని విశాఖపట్నంలో నిర్వహించాయి. ఈ విన్యాసాల నిర్వహణ రెండోది. మొదటిసారిగా 2019లో తొమ్మిదిరోజుల పాటు జరిగింది.
4. వనం వెలుపల వృక్షం అనే విధానాన్ని ఏ రాష్ట్రంతో కలిసి ఇటీవల యూఎస్ఎయిడ్ అనే అమెరికా సంస్థ చేపట్టింది?
1) హిమాచల్ ప్రదేశ్ 2) అస్సాం
3) మధ్యప్రదేశ్ 4) ఉత్తరాఖండ్
వివరణ: యూఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్, అస్సాం రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా వనం వెలుపల వృక్షం కార్యక్రమాన్ని చేపట్టాయి. ఈశాన్య రాష్ర్టాల్లో, వనాలు మాత్రమే కాకుండా, వాటి వెలుపల చెట్లను పెంచి పర్యావరణహితానికి కృషి చేయడమే దీని ప్రధాన లక్ష్యం. ఈ తరహా కార్యక్రమాన్ని మరికొన్ని రాష్ర్టాల్లోనూ యూఎస్ఎయిడ్ సాయంతో అమలు చేస్తున్నారు. అవి ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, రాజస్థాన్, హర్యానా, ఉత్తరప్రదేశ్. యూఎస్ఎయిడ్ అనేది అమెరికా సమాఖ్య ప్రభుత్వానికి చెందిన సంస్థ. ప్రపంచ వ్యాప్తంగా పౌర సహకారాన్ని అందించేందుకు దీన్ని ఏర్పాటు చేశారు.
5. ఐదో ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌ను ఏ రాష్ట్రంలో నిర్వహించనున్నారు?
1) తమిళనాడు 2) గుజరాత్
3) పంజాబ్ 4) మధ్యప్రదేశ్
వివరణ: 2023 జనవరి 31 నుంచి ఫిబ్రవరి 11 వరకు అయిదో ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌ను మధ్యప్రదేశ్‌లోని ఎనిమిది నగరాల్లో నిర్వహించనున్నారు. అవి- భోపాల్, ఇండోర్, ఉజ్జయిని, గ్వాలియర్, జబల్పూర్, మాండ్ల, ఖర్గోన్, బాలాఘాట్. దాదాపు 8500 మంది క్రీడాకారులు ఇందులో పాల్గొంటారని అంచనా. ఈ క్రీడలను నిర్వహించనున్న ఐదో రాష్ట్రం మధ్యప్రదేశ్. మొదట న్యూఢిల్లీ, ఆ తర్వాత మహారాష్ట్ర, అస్సాం, హర్యానా రాష్ర్టాల్లో ఈ క్రీడలను నిర్వహించారు. 2021లో క్రీడలు కరోనా మూలంగా వాయిదా పడటంతో, ఇవి 2022లో హర్యానాలో జరిగాయి. తొలిసారిగా 2018లో క్రీడలను నిర్వహించారు.
6. జాతి వివక్ష, దాని మూలంగా పెరుగుతున్న అసహనాన్ని అడ్డుకొనే ఉద్దేశంతో మానవ హక్కుల మండలి ఇటీవల ఎవరిని స్వతంత్ర స్థాయిలో నియమించింది?
1) అపరాజిత శర్మ 2) రుచిరా కాంబోజ్
3) అశ్విని 4) వోల్కర్ టర్క్
వివరణ: జాతి వివక్ష, అలాగే దాని ప్రభావంతో పెరుగుతున్న అసహనానికి అడ్డుకట్ట వేసేందుకు ఒక స్వతంత్ర నిపుణురాలు అయిన కేపీ అశ్వినిని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి నియమించింది. సంస్థ సమావేశాలు జెనీవాలోని ప్రధాన కార్యాలయంలో నిర్వహించారు. ఈ బాధ్యతను చేపట్టనున్న తొలి ఆసియా వాసి అశ్వినినే. ఇదే జెనీవా కేంద్రంగా పనిచేసే ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్‌లో నిర్వహణ, పరిపాలన కమిటీకి వైస్ చైర్మన్‌గా భారత్‌కు చెందిన అపరాజిత శర్మ నియమితులు కాగా, ఐక్యరాజ్య సమితిలో భారత్ తరఫున శాశ్వత ప్రతినిధిగా రుచిరా కాంబోజ్ ఉన్నారు.
7. అమన్ సెహ్రావత్ ఏ క్రీడతో ముడిపడి ఉన్నాడు?
1) క్రికెట్ 2) రెజ్లింగ్
3) టెన్నిస్ 4) బాక్సింగ్
వివరణ: హర్యానా రాష్ట్రం జాజ్జర్ జిల్లాలోని బిరోహర్ గ్రామానికి చెందిన రెజ్లర్ అమన్ సెహ్రావత్. స్పెయిన్‌లో నిర్వహించిన అండర్-23 ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో బంగారు పతకాన్ని సాధించాడు. అతడు ఈ ఘనతను దక్కించుకున్న తొలి భారతీయుడు. టర్కీకి చెందిన అహ్మద్ దమన్‌ను ఓడించడం ద్వారా బంగారు పతకాన్ని సెహ్రావత్ సొంతం చేసుకున్నాడు. గతంలో రవికుమార్ దహియా, బజ్రంగ్ పునియా తుదిపోరుకు వెళ్లినా వెండి పతకంతో సరిపెట్టుకున్నారు. ప్రస్తుతం నిర్వహించిన రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్ మొత్తం ఆరు పతకాలను గెలుచుకుంది. ఈ క్రీడలు అక్టోబర్ 17 నుంచి 23 వరకు స్పెయిన్‌లోని పొంటెవెద్రాలో నిర్వహించారు.
8. ఎల్ఈటీ, జేఈఎంలకు చెందిన కొందరిని అంతర్జాతీయ ఉగ్రవాదులుగా ప్రకటించాలంటూ భద్రతా మండలిలో ఈ ఏడాది ప్రవేశపెట్టిన ఎన్ని తీర్మానాలను చైనా అడ్డుకుంది (అక్టోబర్ 27 నాటికి)?
1) 2 2) 3 3) 4 4) 5
వివరణ: లష్కరే తాయిబా, జైషే మహ్మద్‌లకు చెందిన పలువురిని అంతర్జాతీయ ఉగ్రవాదులుగా ప్రకటించాలంటూ భారత్, అమెరికా భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానాలను చైనా అడ్డుకుంది. సాంకేతికంగా నిలుపుదల చేయడం లేదా వీటో అధికారాన్ని వినియోగించింది. అబ్దుల్ రెహ్మాన్ మఖి, అబ్దుల్ రవూఫ్ అజర్, సాజిద్ మిర్, సాహిద్ మహ్మద్, తల్హా సయిద్‌లను అంతర్జాతీయ ఉగ్రవాదులుగా ప్రకటించాలంటూ వేర్వేరు సందర్భాల్లో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. సరైన సాక్ష్యాలు లేవు అనడంతో పాటు పలు సాంకేతిక అంశాలను లేవనెత్తిన చైనా ఈ తీర్మానాలను అడ్డుకుంది.
9. ఇటీవల ఏ దేశాన్ని గ్రే లిస్ట్ నుంచి ఎఫ్ఏటీఎఫ్ తొలగించింది?
1) రిపబ్లిక్ ఆఫ్ కాంగో 2) మొజాంబిక్
3) పాకిస్థాన్ 4) టాంజానియా
వివరణ: 2018 నుంచి గ్రే లిస్ట్‌లో ఉన్న పాకిస్థాన్ ఎట్టకేలకు బయటపడింది. ఫ్రాన్స్ కేంద్రంగా పనిచేసే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్ గ్రే, బ్లాక్ లిస్ట్‌లను ప్రకటిస్తుంది. ఈ సంస్థలో 39 దేశాలకు సభ్యత్వం ఉంది. భారత్ కూడా ఇందులో భాగమే. మనీలాండరింగ్, ఉగ్రవాదులకు ఆర్థిక సాయం అందకుండా అడ్డుకుంటుంది. అలాగే ఉగ్ర చర్యలకు పాల్పడుతున్న దేశాలను గ్రే లిస్ట్‌లో మొదట చేరుస్తుంది. అప్పటికీ మారకపోతే బ్లాక్ లిస్ట్‌లోకి మారుస్తుంది. ఈ జాబితాలో ఉంటే అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి లేదా ఇతర దేశాల నుంచి రుణాలు అందవు. ఇటీవల గ్రే లిస్ట్‌లోకి వెళ్లిన దేశాలు- రిపబ్లిక్ ఆఫ్ కాంగో, మొజాంబిక్, టాంజానియా. ఈ జాబితా నుంచి బయటకు వచ్చిన దేశాలు- పాకిస్థాన్, నికరాగువా. భారత్‌కు పొరుగున ఉన్న మయన్మార్‌ను బ్లాక్ లిస్ట్‌లో చేర్చారు.
10. రిషి సునాక్ ఏ నియోజకవర్గం నుంచి యూకే పార్లమెంట్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నారు?
1) ఫిన్స్బరి సెంట్రల్ 2) రామ్ఫర్డ్
3) సాలిస్‌బరి 4) రిచ్మండ్
వివరణ: భారత సంతతికి చెందిన రిషి సునాక్ యూకేకు ప్రధాన మంత్రిగా నియమితులయ్యారు. ఆర్థిక నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండటంతో అప్పటి వరకు పదవిలో ఉన్న లిజ్‌ట్రస్ రాజీనామా చేయడంతో రిషి సునాక్ ఆ బాధ్యతను చేపట్టారు. ఈ ఘనత సాధించిన తొలి భారత సంతతికి చెందిన వ్యక్తిగా ఆయన చరిత్ర సృష్టించారు. ప్రస్తుతం ఆయన రిచ్మండ్ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. బ్రిటన్ పార్లమెంట్‌కు ఎన్నికయిన తొలి ఆసియా వాసి మాత్రం దాదాభాయ్ నౌరోజీ. ఆయన అప్పట్లో ఫిన్స్బరి సెంట్రల్ నుంచి ఎన్నికయ్యారు.
11. భారత్‌కు చెందిన షెఫాలీ జునేజా ఇటీవల ఏ అంతర్జాతీయ సంస్థకు అధిపతిగా నియమితులయ్యారు?
1) ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్
2) ప్రపంచ ఆహార సంస్థ
3) ప్రపంచ ఆహార కార్యక్రమం
4. యునెస్కో
వివరణ: కెనడాలోని మాంట్రియల్ కేంద్రంగా పనిచేసే ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్‌లో వాయు రవాణా కమిటీ అధిపతిగా భారత ప్రతినిధి షెఫాలీ జునేజా నియమితులయ్యారు. ఈ మండలిలో 36 దేశాలకు సభ్యత్వం ఉంది. ఎంపికయిన దేశాలు మూడు సంవత్సరాల పాటు మండలిలో కొనసాగుతాయి.
12. భారత్ ఎగుమతులు చేస్తున్న దేశాల జాబితాలో మూడో స్థానంలో చేరిన దేశం?
1) యూఎస్ 2) యూఏఈ
3) నెదర్లాండ్స్ 4) చైనా
వివరణ: భారత్ నుంచి అతి ఎక్కువగా ఎగుమతులు అవుతున్న దేశాల జాబితాలో తాజాగా మూడో స్థానంలోకి నెదర్లాండ్స్ వచ్చింది. చైనా, బంగ్లాదేశ్‌లను అధిగమించి నెదర్లాండ్స్ ఈ ఘనతను దక్కించుకుంది. ప్రథమ స్థానంలో అమెరికా, రెండో స్థానంలో యూఏఈ ఉన్నాయి. నెదర్లాండ్స్‌కు ఎక్కువగా భారత్ నూనె ఉత్పత్తులను ఎగుమతి చేస్తుంది. యూరప్ దేశాలకు చేస్తున్న ఎగుమతులను పరిశీలిస్తే.. నెదర్లాండ్స్ అగ్రస్థానంలో ఉన్నట్లు భావించాలి. అలాగే దక్షిణ అమెరికా ఖండంలోని బ్రెజిల్‌కు కూడా భారత్ నుంచి ఎగుమతులు పెరిగాయి. గతంలో ఆ దేశం 21వ స్థానంలో ఉండగా, తాజాగా ఎనిమిదో స్థానానికి చేరింది.
13. ఆసియా ఖండంలో కాలుష్యం భారిన పడిన నగరాల్లో అగ్రస్థానంలో ఉన్నది ఏది?
1) ఢిల్లీ 2) గురుగ్రామ్
3) ముజఫర్ నగర్ 4) తాలక్బోరా
వివరణ: వాయు నాణ్యత సూచీ ఆధారంగా ఆసియాలో అత్యధికంగా కాలుష్యం ఉన్న పది నగరాల జాబితాను విడుదల చేశారు. ఇందులో ఎనిమిది భారత్‌లోనే ఉన్నాయి. అత్యంత కాలుష్య నగరాల జాబితాలో గురుగ్రామ్ అగ్రస్థానంలో ఉంది. ఇక్కడ ఏక్యూఐ (వాయు నాణ్యత సూచీ) 679గా నమోదయ్యింది. తర్వాత స్థానంలో హర్యానాలోని థారుహేరా ఉంది. వాయు నాణ్యత సూచీ 150 దాటితే ఆరోగ్యానికి చాలా ప్రమాదకరంగా పరిగణిస్తారు. అయితే ఈ జాబితాలో ఢిల్లీ పేరు లేదు.
14. అంతర్జాతీయ టీ-20ల్లో 1000 పరుగులు చేయడంతో పాటు, 50 వికెట్లు తీసిన భారత తొలి క్రికెటర్ ఎవరు?
1) విరాట్ కోహ్లీ 2) రోహిత్ శర్మ
3) రవీంద్ర జడేజా 4) హార్దిక్ పాండ్య
వివరణ: ఆస్ట్రేలియాలో నిర్వహిస్తున్న ప్రపంచ టీ-20 టోర్నీలో, భారత్ తన తొలి మ్యాచ్‌ను పాకిస్థాన్‌తో ఆడింది. ఇందులో పలు రికార్డులు నమోదయ్యాయి. టీ-20ల్లో ప్రపంచంలోనే అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మన్‌గా విరాట్ కోహ్లీ కొత్త రికార్డ్ నెలకొల్పాడు. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్ నాటికి విరాట్ చేసిన పరుగులు 3794. అప్పటి వరకు అత్యధిక పరుగుల రికార్డ్ రోహిత్ శర్మ పేరిట ఉంది. అలాగే ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్య కూడా మంచి ప్రదర్శన చూపాడు. ఈ ఫార్మాట్ క్రికెట్లో 1000 పరుగులు సాధించడంతో పాటు 50 వికెట్లు తీసిన తొలి భారత ఆటగాడిగా రికార్డ్ నమోదు చేశాడు.
15. ఏ రాష్ట్రంలో దుర్గావతి పులుల రిజర్వ్ ఉంది?
1) కర్నాటక 2) ఉత్తరాఖండ్
3) మధ్యప్రదేశ్ 4) ఉత్తరప్రదేశ్
వివరణ: మధ్యప్రదేశ్‌లో 2339 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో దుర్గావతి పులుల రిజర్వ్‌ను కొత్తగా ఏర్పాటు చేశారు. ఇది ఆ రాష్ట్రంలో నర్సింగపూర్, దామో, సాగర్ జిల్లాలలో విస్తరించి ఉంటుంది. కెన్-బెట్వా నదుల అనుసంధానంతో పన్నా టైగర్ రిజర్వ్ కొంత మునిగిపోనుంది. అక్కడ ఉన్న పులుల సంరక్షణకు కొత్తగా దుర్గావతి పులుల రిజర్వ్‌ను ఏర్పాటు చేశారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు