బ్రహ్మోస్ క్షిపణి తొలి ప్రయోగ పరీక్షకు 20 ఏండ్లు
జాతీయం
బ్రహ్మోస్‌కు 20 ఏండ్లు
భారత్ అమ్ములపొదిలోని కీలకమైన బ్రహ్మోస్ క్షిపణి తొలి ప్రయోగ పరీక్ష చేపట్టి జూన్ 12 నాటికి 20 ఏండ్లు పూర్తయ్యింది. ఇది ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన క్రూయిజ్ క్షిపణిగా గుర్తింపు పొందింది. భారత్‌లోని బ్రహ్మపుత్ర, రష్యాలోని మోస్క్యా నదుల పేర్లలోని మొదటి అక్షరాలను తీసుకుని ఈ క్షిపణికి బ్రహ్మోస్గా పేరుపెట్టారు. భూమిపై 5 మీటర్ల ఎత్తులో ప్రయాణించి, చుట్టుపక్కల ఎలాంటి నష్టం చేయకుండా నిర్దేశించిన లక్ష్యంపై సర్జికల్ దాడులకు వినియోగిస్తారు.
అతిపెద్ద నియోజకవర్గంగా మల్కాజిగిరి
2019 సార్వత్రిక ఎన్నికల విశేషాలతో అట్లాస్‌ను కేంద్ర ఎన్నికల సంఘం జూన్ 16న విడుదల చేసింది. దీని ప్రకారం 31,50,313 మంది ఓటర్లతో తెలంగాణలోని మల్కాజిగిరి దేశంలోనే అతిపెద్ద లోక్‌సభ నియోజకవర్గంగా నిలిచింది. అదేవిధంగా 16,38,054 మంది పురుషులు, 15,11,910 మంది మహిళా ఓటర్లతో అత్యధిక పురుష, మహిళా ఓటర్లు ఉన్న నియోజకవర్గంగానూ ఖ్యాతిగాంచింది. నిజామాబాద్‌లో దేశంలోనే అత్యధిక (185 మంది) అభ్యర్థులు పోటీపడ్డారు. ఇక్కడ స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన సరకన్ల రాజారెడ్డి 84 ఓట్లు సాధించి దేశంలోనే అత్యల్పంగా ఓట్లు పొందిన అభ్యర్థిగా రికార్డులకెక్కారు.
ఐదో వివాటెక్
ఫ్రాన్స్ జూన్ 16న నిర్వహించిన ఐదో వివాటెక్ సదస్సులో వర్చువల్‌గా ప్రధాని మోదీ పాల్గొన్నారు. కరోనా వల్ల నష్టపోయిన రంగాలను అవసరమైన మరమ్మతులతో తిరిగి సంసిద్ధం చేయాలని మోదీ పిలుపునిచ్చారు. భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనే రీతిలో రిపేర్ (పునరుద్ధరిద్దాం), ప్రిపేర్ (సంసిద్ధమవుదాం) అనే రెండు అంశాలపై దృష్టిపెట్టాలన్నారు.
అంతర్జాతీయం
పులిట్జర్ అవార్డు
భారత సంతతికి చెందిన మేఘా రాజగోపాలన్, నీల్ బేడీలకు ప్రతిష్ఠాత్మక పులిట్జర్ అవార్డు జూన్ 12న లభించింది. ‘బజ్‌ఫీడ్ న్యూస్’ జర్నలిస్టు అయిన మేఘాకు అంతర్జాతీయ రిపోర్టింగ్ విభాగంలో ఈ అవార్డు దక్కింది. ఆమె చైనాలోని షిన్జియాంగ్ ప్రావిన్స్‌లో లక్షల మంది ముస్లింలను నిర్బంధించడానికి భారీగా నిర్మించిన రహస్య కారాగారాలను ఆమె తన పరిశోధనాత్మక కథనాలతో వెల్లడించారు. ‘తంపా బే టైమ్స్’ రిపోర్టర్ నీల్ బేడీ.. భవిష్యత్తులో నేరాలకు పాల్పడే అవకాశం ఉన్న వ్యక్తులను గుర్తించడానికి అమెరికాలోని ప్యాస్కో కౌంటీలో స్థానిక భద్రత అధికారులు తెచ్చిన ఒక కంప్యూటర్ మోడలింగ్‌లోని లోపాలపై రాసిన కథనాలకు క్యాథలీన్ మెక్ గ్రోరీతో కలిసి ఆయన ఈ అవార్డును పంచుకోనున్నారు. జార్జి ఫ్లాయిడ్ హత్యను వివరిస్తూ రాసిన కథనాలకు గాను అమెరికా పత్రిక ‘స్టార్ ట్రిబ్యూన్’కు కూడా ఈ అవార్డు లభించింది.
సిప్రి నివేదిక
ప్రపంచవ్యాప్తంగా అణ్వాయుధాల సంఖ్యపై స్టాక్‌హోం ఇంటర్నేషనల్ పీస్ రిసెర్చ్ (సిప్రి) ఓ నివేదికను జూన్ 14న విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం.. 2020లో భారత్ వద్ద 150గా ఉన్న అణ్వాయుధాల సంఖ్య 2021 జనవరి నాటికి 156కు పెరిగింది. చైనా 320 నుంచి 350కు, పాకిస్థాన్ 160 నుంచి 165కు పెంచుకున్నాయి. వాడుకకు సిద్ధంగా ఉన్న న్యూక్లియర్ ఆయుధాల సంఖ్య 3,720 నుంచి 3,825కు పెరిగింది. దీనిలో అధిక వాటా అమెరికా (1800), రష్యా (1625) దేశాలవే కావడం గమనార్హం.
సస్టెయినబుల్ డెవలప్మెంట్ సూచీ
సస్టెయినబుల్ డెవలప్మెంట్ సూచీ జూన్ 14న విడుదలైంది. ఈ జాబితాలో ఫిన్లాండ్ మొదటిస్థానంలో నిలిచింది. స్వీడన్ 2, డెన్మార్క్ 3, జర్మనీ 4, బెల్జియం 5, ఆస్ట్రియా 6, నార్వే 7వ స్థానాల్లో నిలిచాయి.
ప్రపంచ పోటీతత్వ సూచీ
ప్రపంచ పోటీతత్వ సూచీని ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ (ఐఎండీ) జూన్ 17న విడుదల చేసింది. ఈ సూచీలో స్విట్జర్లాండ్ మొదటిస్థానంలో నిలవగా.. స్వీడన్ 2, డెన్మార్క్ 3, నెదర్లాండ్స్ 4, సింగపూర్ 5వ స్థానాల్లో నిలిచాయి. భారత్ 43వ స్థానంలో ఉంది.
గ్లోబల్ పీస్ ఇండెక్స్
ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకానిమక్స్ అండ్ పీస్ (ఐఈపీ) సంస్థ 15వ ఎడిషన్ గ్లోబల్ పీస్ ఇండెక్స్‌ను జూన్ 17న విడుదల చేసింది. 163 దేశాలతో విడుదలైన ఈ జాబితాలో ఐస్లాండ్ (2008 నుంచి) అగ్రస్థానంలో నిలిచింది. న్యూజిలాండ్ 2, డెన్మార్క్ 3, పోర్చుగల్ 4, స్లొవేనియా 5వ స్థానాల్లో నిలిచాయి. భారత్ 135వ స్థానంలో నిలువగా.. ఆఫ్ఘనిస్థాన్ చివరిస్థానంలో ఉంది.
షెంఝౌ-12
షెంఝౌ-12 వ్యోమనౌక నుంచి రాకెట్ ద్వారా ముగ్గురు వ్యోమగాములను చైనా జూన్ 17న అంతరిక్షంలోకి పంపింది. దీనిలో లీయు బోమింగ్, తాంగ్ హాంగ్బో, నియి హైషెంగ్ అనే వ్యోమగాములు ఉన్నారు. వచ్చే నెలలో చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడి వందేండ్ల సందర్భంగా వీరిని అంతరిక్షంలోకి పంపించారు.
నాటో సమావేశం
నాటో ప్రధాన కార్యాలయం బ్రస్సెల్స్‌లో జూన్ 14న నాటో కూటమి సమావేశం నిర్వహించారు. ఇందులో 30 దేశాధినేతలు పాల్గొన్నారు. అణుక్షిపణుల తయారీలో చైనా కనబరుస్తున్న వేగంపై, చైనాతో ప్రపంచ భద్రతకు ముప్పు పొంచి ఉందని నాటో తీర్మానంలో చైనా పేరును ప్రస్తావించడం ఇదే తొలిసారి. నాటో సెక్రటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్.
వార్తల్లో వ్యక్తులు
అక్షయ్ కుమార్
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ బయోటెక్నాలజీ సంస్థ అయిన మైల్యాబ్ డిస్కవరీ సొల్యూషన్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా జూన్ 12న నియమితులయ్యారు. పుణెకు చెందిన దేశీ కొవిడ్-19 స్వీయ పరీక్ష కిట్ కొవిసెల్ఫ్ తదితర ఉత్పత్తులపై ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం అక్షయ్‌ను నియమించారు.
నఫ్తాలీ బెన్నెట్
ఇజ్రాయెల్ 13వ ప్రధానిగా నఫ్తాలీ బెన్నెట్ జూన్ 13న బాధ్యతలు చేపట్టారు. ఎనిమిది పార్టీలు కూటమిగా ఏర్పడి ఆయనను ప్రధానిగా ఎన్నుకున్నాయి. రెండు సంవత్సరాల్లో పార్లమెంటుకు నాలుగుసార్లు ఎన్నికలు జరిగాయి. లీకుడ్ పార్టీ అతిపెద్ద పార్టీగా ఏర్పడింది. మొత్తం పార్లమెంట్ స్థానాలు 120. బెంజమిన్ నెతన్యాహు 12 సంవత్సరాల పాటు ప్రధానిగా కొనసాగారు.
జియోన చనా
ప్రపంచంలో అతిపెద్ద కుటుంబానికి కుటుంబ పెద్ద అయిన 76 ఏండ్ల జియోన చనా జూన్ 13న మరణించారు. ఆయనకు 38 మంది భార్యలు, 89 మంది పిల్లలు, 33 మంది మనవలు, మనవరాళ్లు ఉన్నారు. 1945లో మిజోరంలోని బక్తావంగ్ త్లాంగ్నామ్లో ఈయన జన్మించారు. ఈ ఊరిలోని చనాస్ వర్గానికి ఈయనే పెద్ద.
సత్య నాదెళ్ల
అంతర్జాతీయ దిగ్గజ సంస్థ అయిన మైక్రోసాఫ్ట్ చైర్మన్‌గా సత్య నాదెళ్లను నియమిస్తూ మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ బోర్డు జూన్ 17న నిర్ణయం తీసుకుంది. ఈ సంస్థలో ఇంతటి స్థానానికి ఎదిగిన తొలి భారతీయుడిగా ఆయన ఘనత సాధించారు. 2014లో ఆయన మైక్రోసాఫ్ట్ సీఈవోగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన ‘హిట్ రిఫ్రెష్’ పేరుతో తన ఆత్మకథ రాశారు. ఆయనది ఏపీలోని అనంతపురం జిల్లా బుక్కరాయపురం గ్రామం.
కెన్నెత్ కౌండా
జాంబియా దేశ జాతిపిత, ఆ దేశ తొలి అధ్యక్షుడు కెన్నెత్ కౌండా జూన్ 17న మరణించారు. 1961-94 వరకు జాంబియా అధ్యక్షుడిగా పనిచేశారు. న్యుమోనియా వ్యాధితో మరణించారు. గతంలో జాంబియాను ఉత్తర రొడీషియా అని పిలిచేవారు. రాజధాని లుసాకా
క్రీడలు
క్రెజికోవా
టెన్నిస్ ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను బార్బరా క్రెజికోవా (చెక్ రిపబ్లిక్) గెలుచుకుంది. జూన్ 12న నిర్వహించిన ఫైనల్ మ్యాచ్‌లో బార్బరా అనస్తేసియా పవ్లిచెంకోవా (రష్యా)ను ఓడించింది. బార్బరాకు ఇదే తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్. 1981 తర్వాత ఫ్రెంచ్ ఓపెన్‌లో మహిళల సింగిల్స్ చాంపియన్‌గా నిలిచిన తొలి చెక్ రిపబ్లిక్ అమ్మాయి బార్బరానే.
నిర్మల్ మిల్కాసింగ్ మృతి
భారత వాలీబాల్ మాజీ కెప్టెన్ నిర్మల్ మిల్కాసింగ్ కరోనాతో జూన్ 13న మరణించారు. అర్జున అవార్డు గ్రహీత. పంజాబ్ ప్రభుత్వంలో స్పోర్ట్స్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఈమె మిల్కాసింగ్ భార్య.
ఐసీసీ హాల్ ఆఫ్ ఫేం
తొలి ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌ను పురస్కరించుకుని ఐదు దేశాలకు చెందిన 10 మందికి ఐసీసీ జూన్ 13న హాల్ ఆఫ్ ఫేంలో చోటు కల్పించింది. వీరిలో వినూ మాంకడ్ (భారత్), ఫాల్క్‌నర్ (దక్షిణాఫ్రికా), మాంటీ నోబుల్ (ఆస్ట్రేలియా), కాన్స్టంటైన్ (వెస్టిండీస్), స్టాన్ మెక్‌కేబ్ (ఆస్ట్రేలియా), టెడ్ డెక్స్టర్ (ఇంగ్లండ్), డెస్మండ్ హేన్స్ (వెస్టిండీస్), బాబ్ విలిస్ (ఇంగ్లండ్), ఆండీ ఫ్లవర్ (జింబాబ్వే), కుమార సంగక్కర (శ్రీలంక) ఉన్నారు. వీరి చేరికతో హాల్ ఆఫ్ ఫేం ఆటగాళ్ల సంఖ్య 103కు చేరింది.
నొవాక్ జకోవిచ్
ఫ్రెంచ్ ఓపెన్ సింగిల్స్ టైటిల్ విజేతగా నొవాక్ జకోవిచ్ నిలిచాడు. జూన్ 13న నిర్వహించిన ఫైనల్ మ్యాచ్‌లో జకోవిచ్ స్టెఫానోస్ సిట్సిపాస్‌ను ఓడించాడు. మహిళల డబుల్స్‌లో బార్బరా క్రెజికోవా-సినియాకోవా (చెక్ రిపబ్లిక్) జంట స్వైటెక్ (పోలెండ్)-బెథానీ మాటెక్ సాండ్స్ (అమెరికా) జోడీని ఓడించి టైటిల్ గెలుచుకుంది.
మిల్కాసింగ్ మృతి
భారత లెజండరీ స్ప్రింటర్, 91 ఏండ్ల మిల్కాసింగ్ కరోనాతో జూన్ 18న మరణించారు. ‘ఫ్లయింగ్ సిఖ్’గా ఆయన పేరుగాంచారు. 1958 కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణంతో పాటు ఆసియా క్రీడల్లో నాలుగు బంగారు పతకాలు సాధించారు.
వేముల సైదులు
జీకే, కరెంట్ అఫైర్స్ నిపుణులు
ఆర్సీ రెడ్డి స్టడీ సర్కిల్ హైదరాబాద్
- Tags
- Education News
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు