తెలుగు భాషా ప్రస్తావనలు ఉన్న గ్రంథం?


గతవారం తరువాయి..
మతపరిస్థితులు
విష్ణుకుండినులు వైదిక మతావలంబికులు. శ్రీపర్వతస్వామి వారి కులదైవం. ‘పరమ మహేశ్వర, పరమ బ్రహ్మణ్య’ వంటి వారి బిరుదులు వారు శివభక్తులని, బ్రాహ్మణ్య మతావలంబికులని తెలియజేస్తున్నాయి. వీరు కట్టించిన ఆలయాలు ఎక్కువగా వారి తొలి రాజధాని అమ్రాబాద్ మండలం నల్లమల అడవుల్లోని లోయల్లో, జలపాతాల కింద గుహల్లో ఉన్నాయి.
nమనం గమనించాల్సిన విచిత్రమైన విషయమేమంటే అక్కన్న-మాదన్న గుహలు, అక్కన్న-మాదన్నలు కట్టించినట్లుగా చెబుతున్న దేవాలయాలన్నీ విష్ణుకుండిన రాజు రెండో మాధవ వర్మ కట్టించినవే. ఇలాంటి వాటిల్లో బెజవాడ (ఇంద్రకీలాద్రి) కనకదుర్గ ఆలయ సముదాయంలోని అక్కన్న-మాదన్న గుహలను, కీసర గుట్టలోని అక్కన్న-మాదన్నలు కట్టించినట్లుగా చెబుతున్న మందిరాలు, హైదరాబాద్ శివార్లలోని మహేశ్వరం ఆలయాన్ని ఉదాహరణలుగా చూపించవచ్చు.
రెండో మాధవ వర్మ ఎక్కువగా రామలింగేశ్వరాలయాలను కట్టించాడు. ఆయన యుద్ధంలో విజయం సాధించినప్పుడల్లా, విజయం సాధించిన చోటల్లా వాటిని కట్టించాడు. అంతేకాకుండా తను సాధించిన అనేక విజయాలకు గుర్తులుగా, ఒక్కొక్క విజయానికి ఒకటి చొప్పున, కీసరగుట్టపైన రామేశ్వర లింగ ప్రతిష్టలు చేశాడు. విష్ణుకుండినులు వైష్ణువులు కాబట్టి శివలింగాలను రామలింగాలన్నారు. రెండో మాధవ వర్మ ‘స్నానపుణ్యోదక పవిత్రీకృత శీర్షః (పుణ్యస్నానాలతో పవిత్రమైన శిరస్సు కలవాడు)’ అని వర్ణించబడ్డాడు. విష్ణుకుండినులు అనేక యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించారు. వీరు చేసిన యజ్ఞాలకు గుర్తుగా, మున్ననూరు కోటలో వారి కాలపు అవబృధ స్నానవాటిక కనిపిస్తుంది.
బౌద్ధమతం
విష్ణుకుండిన రాజులు వైదిక మతస్తులైనప్పటికి బౌద్ధమతాన్ని పోషించారు. గోవిందవర్మ తన 37వ రాజ్య సంవత్సర వైశాఖపూర్ణిమ నాడు పద్దెనిమిది శాఖల బౌద్ధ ధర్మాలు తెలిసిన ‘దశబలబలికి’ 14వ ఆర్య సంఘాన్ని ఉద్దేశించి, తన రాణి ఇంద్రపాలనగరంలో కట్టించిన పరమభట్టారికాదేవి మహావిహారానికి పేణ్కపణ, ఎన్మదల గ్రామాలను దానం చేశాడు. అదే విహారానికి తర్వాత వచ్చిన విక్రమేంద్ర వర్మ ఇఱుణ్డెరో గ్రామాన్ని దానం చేశాడు. అంతేకాకుండా విక్రమేంద్ర వర్మ అశనపుర ఆర్యసంఘానికి ‘త్రిలోకాశ్రయ గ్రంథాన్ని సంస్కృతంలో రాశాడు. యోగాచార పంథాను బోధించాడు. తెలుగు ప్రాంతానికి చెందిన బౌద్ధ మహాపండితుల్లో ఇతడిని ఆఖరివాడిగా చెప్పవచ్చు.
క్రీ.శ 5వ శతాబ్దంలో మరొక ప్రధాన శాఖ అయిన వజ్రయానం రూపుదిద్దుకొంది. ఈ శాఖలోని బౌద్ధ సంఘంలోకి స్త్రీలు, మద్యమాంసాలు, మాయమంత్రాలు ప్రవేశించి క్రమక్రమంగా పవిత్రతను తద్వారా ప్రజాభిప్రాయాన్ని కోల్పోయి, చివరికి అటువంటి స్థలాలు బొంకుల దిబ్బలుగా, లంజల దిబ్బలుగా పేరుబడ్డాయి. పెద్దపల్లి జిల్లాలో ఉన్న బొంకూరు, చిన్న బొంకూరు, పెద్ద బొంకూరు, లంజమడుగు, కృష్ణాజిల్లాలోని లంజలదిబ్బ కొన్ని ఉదాహరణలుగా చెప్పవచ్చు.
సారస్వతాభివృద్ధి
విష్ణుకుండినులు ఘటికాస్థానాలను ఏర్పాటు చేసి, వాటిల్లో వేద విద్యలను పోషించారు. వేదాభ్యసన అధ్యయనాలు చేసే బ్రాహ్మణులకు విష్ణుకుండినులు అగ్రహారాలు ఇచ్చారు. ఈ అగ్రహారాల్లో వ్యవసాయాభివృద్ధి కూడా జరిగింది. హైదరాబాద్ శివార్లలోని ఘట్కేసరి విష్ణుకుండినుల నాటి ఘటికాస్థానమే అనడానికి నిదర్శనంగా దానికి దగ్గరలోని కీసరగుట్టపై వీరి కాలంనాటి కట్టడాలు బయల్పడ్డాయి. అగ్రహారాలు, దానధర్మాలు పొందినవారు అనేక విద్యాసారస్వతాల్లో నిష్ణాతులు, బౌద్ధమత గురువు దశబలబలి నాలుగు వేదాల్లో విశారదుడు, సర్వ శాస్ర్తాల్లో పారంగతుడు. పద్దెనిమిది బౌద్ధ ధర్మాలు తెలిసినవాడు. సకల జ్ఞాని అని శాసన సాక్ష్యం చెబుతుంది. విష్ణుకుండిన రాజులు కూడా మేధావులై ఇహ పరములందు సాటిలేని దృష్టి కలిగినవారు.
గోవింద వర్మ ‘షడభిజ్ఞ’ అని వర్ణించబడ్డారు. విక్రమేంద్ర వర్మకు ‘మహాకవి, పరమ సోగతస్య (బుద్ధుని అంతటి జ్ఞాని)’ అనే బిరుదులు ఉన్నాయి. ఇంద్రభట్టారక వర్మకు ‘ఘటికావాపు పుణ్య సంచయ’ అనే బిరుదు ఉంది. రెండో మాధవ వర్మ ‘విద్వద్విజగురు విప్రావృద్ధ తపస్వి జనాశ్రయః’ అని కీర్తించబడ్డాడు. ఈ బిరుదులన్నీ విష్ణుకుండిన రాజులందరూ స్వయంగా కవి పండితులని, కవి పండిత పోషకులని తెలియజేస్తున్నాయి.
వీరి కాలం ప్రత్యేకత ఏమిటంటే వీరి కాలం నాటికి ప్రాకృతం తెరమరుగై దాని స్థానంలో సంస్కృతం రాజభాష అయింది. బౌద్ధ మతం కనుమరుగవడంతో పాటు బౌద్ధ భాష ప్రాకృతం కూడా కనుమరుగైంది. సామాన్య ప్రజల భాష మాత్రం తెలుగు. విక్రమేంద్ర వర్మ చిక్కుళ్ల శాసనంలో (సంస్కృతం) ‘విజయ రాజ్య సంవత్సరంబుళ్’ అనే మాట ఉంది. అందులో ‘ంబుళ’ అనేది తెలుగు పదభాగం. అలాగే కీసరగుట్టపై ఉన్న ఒక గుండుకు ‘తొలుచు వాండ్లు’ అనే అచ్చ తెలుగు పదం చెక్కబడింది.
అంతేకాకుండా విష్ణుకుండినుల శాసనాల్లో పేర్కొన్న గ్రామాల పేర్లన్నీ తెలుగువే. ఉదాహరణకు కుడవాడ, వెలిమ్బలి, మరొరకి, కళిక, పెరువాటిక, పెణ్కపణ, తుండి, నేత్రపాటి విషయం. ‘జనాశ్రయ ఛందోవిచ్ఛిత్తి’ అనే సంస్కృత ఛందో గ్రంథంలో కూడా తెలుగు భాషా ప్రస్తావనలు చాలా ఉన్నాయి.
వాస్తు, శిల్ప కళాభివృద్ధి
వీరి కాలంలో వాస్తు నిర్మాణాలు కొత్త శైలిని సంతరించుకున్నాయి. తెలంగాణలో విష్ణుకుండినుల రాజధానులైన అమ్రాబాద్, ఇంద్రపాలనగరం, కీసరగుట్టల్లో వీరి కోటలున్నాయి. కీసరగుట్ట కింద చెరువుని ఆనుకొని విశాల భవనాలు, అంతఃపురాలు, శివాలయాలు, శక్తి ఆలయాలెన్నో ఇటుకలతో నిర్మితమై ఇప్పటికే వెలుగుచూస్తూనే ఉన్నాయి. భువనగిరి కోటను కూడా మొదట వీరే కట్టించినట్లు తెలిపే వారి రాజ చిహ్నం, లంఘిస్తున్న సింహం శిల్పాలు ఆ కోటగోడల మీద కనిపిస్తాయి.
విష్ణుకుండినుల కాలంలో రాజులు, రాజబంధువులు, ఇతర ధనికులు కట్టించి అభివృద్ధి చేసిన బౌద్ధ విహారాలు, ఆరామాలు ప్రధానంగా హైదరాబాద్‌లోని చైతన్యపురి, నల్లగొండ జిల్లాలోని ఇంద్రపాల నగరం, ఫణిగిరి, తిరుమలగిరి, గాజులబండ, నేలకొండపల్లి ప్రాంతాల్లో వెలుగుచూశాయి. చైతన్యపురిలో గోవింద వర్మ ‘రాజ విహారాన్ని’ కట్టించగా అతడి పట్టపు రాణి ఇంద్రపాలనగరంలో తన పేరు మీదనే ‘పరమభట్టారికా మహాదేవి’ విహారాన్ని కట్టించింది. అలాగే మంథని పట్టణం చుట్టుపక్కలున్న L (ఎల్) మడుగుపై ఉన్న గుహలు, గౌరీగుండం జలపాతంపై ఉన్న గుహల్లో కనిపించే మంటప స్తంభాలపై వీరి కాలపు చైత్యాలంకరణలు కనిపిస్తున్నాయి.
వీరి కాలంలో ఉమామహేశ్వరం, సలేశ్వర గుహలు, అలంపురం శైవ శక్తి ఆలయాలుగా వెలుగొందాయి. ఉమామహేశ్వరం తర్వాతి కాలంలో శ్రీశైల క్షేత్రానికి ఉత్తర ద్వార క్షేత్రంగా ప్రసిద్ధిగాంచింది ఉమామహేశ్వరంలో పల్లవులు చెక్కించిన శివలింగం, విష్ణుకుండినులు వేయించిన నగారా భేరి ఇప్పటికీ ఉన్నాయి. అయితే అలంపురం విష్ణుకుండినుల కాలం కంటే ముందువారైన ఇక్ష్వాకుల కాలం నుంచే మనుగడలో ఉండేదనే శాసనాధారం దొరికింది. ప్రకాశం, నెల్లూరు జిల్లాల సరిహద్దులో ఉన్న భైవర కోనలో విష్ణుకుండినుల కాలపు గుహాలయాలున్నాయి. అంతేకాకుండా వీరు ఉండవల్లి, మొగల్రాజపురం, ఇంద్రకీలాద్రి అనే గుట్టల్లో కూడా అంతస్థులుగా చెక్కి బౌద్ధ ఆరామ విహారాలను నిర్మించారు. వీటి గోడలు లేదా స్తంభాల అడుగుభాగంలో ‘శ్రీఉత్పత్తి పిడుగు’ అని రాసి ఉంది.
ఈ విధంగా విష్ణుకుండినులు కృష్ణానదికి ఎగువనున్న యావత్ తెలుగుదేశాన్ని రెండు శతాబ్దాలకు పైగా పాలించి, అంతకుముందు మనుగడలో ఉన్న మిశ్రమ సంస్కృతి స్థానంలో హైందవ ప్రధాన సంస్కృతిని ప్రవేశపెట్టి ఆ తర్వాతి కాలపు రాజులకు మార్గదర్శకులయ్యారు. వీరి వాస్తు శిల్పకళారీతులను పల్లవులు, చాళుక్యులు అనుసరించడం వీరి గొప్పతనంగా చెప్పవచ్చు. విష్ణుకుండిన మాధవ వర్మ పేరును కాకతీయులు వంటి అత్యంత ప్రజాదరణ కలిగిన రాజులు కూడా తమ మూలపురుషుడిగా చెప్పుకోవడంలో వీరి సంక్షేమ పాలనావైభవం తెలుస్తుంది.
వీరు పరమత సహనంతో పాటు ముఖ్య ప్రదేశాల్లో ఘటికలను ఏర్పాటు చేసి, కవి పండిత పోషణ చేయడం వీరి జనరంజక పాలనకు నిదర్శనం. ఈ విధంగా విష్ణుకుండినులు తెలంగాణలోనే తమ రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన రాజవంశంగా తమ పాలనావైభవంతో ఈ ప్రాంతానికి విశిష్టతను, ప్రజలకు సుఖశాంతులను అందజేసిన ఘనత వీరికి దక్కుతుంది.
రాజమహా విహారాన్ని కట్టించి దాని ప్రతినిధి సంఘదాసునికి రెండు గ్రామాలను, వాటి తోటలతో సహా దానం చేశాడు. ఆ నాటి బౌద్ధమతంలో చోటు చేసుకున్న ముఖ్య పరిణామమేమంటే ఆ మత సంఘాలు, ఆరామ-విహారాల్లో బ్రాహ్మణాధిక్యం చోటుచేసుకోవడం. గోవింద వర్మ శాసనంలో ‘అనన్త బ్రాహ్మణ సంభారస్య’ అని విహార ప్రతిష్టాపన సందర్భంలో చెప్పబడటం ఇందుకొక నిదర్శనం. ఈ బ్రాహ్మణులు క్రమంగా బుద్ధుడిని విష్ణువు తొమ్మిదో అవతారంగా చిత్రించారు. కాబట్టి కొన్ని బౌద్ధ క్షేత్రాలు వైష్ణవక్షేత్రాలుగా మారాయి.
బౌద్ధమతాన్ని పోషించిన చివరి తెలుగు రాజులు విష్ణుకుండినులు. బౌద్ధమతానికి సంబంధించిన చివరి గొప్ప తత్వవేత్తలు విష్ణుకుండినుల రాజ్యంలో నివసించారు. క్రీ.శ. 5వ శతాబ్దానికి చెందిన తర్క పండితుడు దిజ్ఞాగుడు కొంతకాలం వేంగిలో నివసించాడు. అక్కడ ఆయన సాంఖ్యాకారికా రచయిత అయిన ఈశ్వర కృష్ణునితో వాగ్వాదాలు జరిపాడు. మరికొంత కాలం ఆయన పెద్దపల్లి జిల్లాలోని రామగిరి, జగిత్యాల జిల్లాలోని మునులగుట్ట ప్రాంతంలో జీవించినట్లు కాళిదాసు రచన మేఘసందేశం వల్ల తెలుస్తుంది. దిజ్ఞాగుడు వందకుపైగా రచనలు చేశాడు. ‘ప్రమాణ సముచ్ఛయం’ అనే ప్రసిద్ధ గ్రంథం రాశాడు.
సాసాల మల్లికార్జున్
అసిస్టెంట్ ప్రొఫెసర్
ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, కోరుట్ల
9492 575 006
- Tags
- Education News
RELATED ARTICLES
-
Scholarships | Scholarships for 2023
-
NIMS Admissions 2023 | నిమ్స్‌లో ఎంపీటీ కోర్సు ప్రవేశాలు
-
JNTUH Admissions 2023 | జేఎన్టీయూహెచ్లో ఎంటెక్, ఎంఫార్మసీ ప్రవేశాలు
-
SBI PO Preparation Plan | బ్యాంక్ కొలువు.. సాధించడం సులువు
-
Society QNS & ANSWERS | తెలంగాణలో పారిశ్రామిక పార్కుల అభివృద్ధికి నోడల్ ఏజెన్సీ ఏది?
-
Scholarships 2023 | Scholarships for Students
Latest Updates
Groups / DSC Special – Social Studies | స్వయం మట్టి మార్పిడి విధానాన్నిఅనుసరించే నేలలు?
Indian Polity | సభ ఆమోదిస్తేనే అత్యవసరం.. లేదంటే రద్దు
Israel – Hamas war | రావణకాష్టం.. ఇజ్రాయోల్ – పాలస్తీనా వివాదం
Geography | సౌర కుటుంబంలో అత్యంత సాంద్రత గల గ్రహం?
General Studies – Groups Special | ఇనుము తుప్పు పట్టినప్పుడు బరువు పెరగడానికి కారణం?
Biology | First Genetic Material.. Reactive Catalyst
Current Affairs | ఆది మహోత్సవ్ దేనికి సంబంధించింది?
Telangana Movement | ‘తెలంగాణ జాగో హైదరాబాద్‌కో బచావో’ సభ నిర్వహించిన పార్టీ?
Economy- Groups Special | భారతదేశంలో ప్రత్యేక ఆర్థిక మండళ్ల ప్రధాన విధి?
UCEED & CEED 2024 | యూసీడ్ & సీడ్-2024 ఐఐటీలో ప్రవేశాలు !