కరెంట్ అఫైర్స్
జాతీయం
జర్నలిస్టుల కోసం బీమా
జర్నలిస్టుల కోసం ఒడిశా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘గోపబంధు సంబదిక స్వాస్థ్య బీమా యోజన’ కార్యక్రమాన్ని మే 2న సీఎం నవీన్ పట్నాయక్ ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని 6500 మందికి పైగా జర్నలిస్టుకు లబ్ధి చేకూరనుంది. దీని ద్వారా రూ.2 లక్షల ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించనున్నారు. ఈ పథకం కింద విధ నిర్వహణలో ఉన్నప్పుడు కొవిడ్-19తో మరణించిన జర్నలిస్టుల కుటుంబాకు రూ.15 లక్షల ఆర్థిక సహాయం అందించనున్నారు.
రిజర్వేషన్లు చెల్లవు
యాభై శాతానికి మించి రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగరీత్యా చెల్లుబాటు కాదని మరాఠాల రిజర్వేషన్ల కేసులో సుప్రీంకోర్టు మే 5న తీర్పు ఇచ్చింది. 1992లో ఇచ్చిన ‘మండల్ తీర్పు’నకు ఇది విరుద్ధమని పేర్కొంది. ఫడ్నవీస్ ప్రభుత్వం 2018లో మరాఠాలను బీసీలుగా గుర్తించి 16 శాతం రిజర్వేషన్లు కల్పించింది. దీంతో మొత్తం రిజర్వేషన్లు 52 శాతం నుంచి 68 శాతానికి పెరగడంతో కొందరు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. విద్యారంగంలో 13 శాతం, ఉద్యోగాల్లో 12 శాతానికి పరిమితం చేస్తూ తీర్పు వెలువరించింది. దీన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించగా మొత్తం రిజర్వేషన్లనే కొట్టివేసింది.
బెంగాల్ సీఎంగా మమత
పశ్చిమ బెంగాల్ సీఎంగా 3వ సారి మమతా బెనర్జీ మే 5న ప్రమాణం చేశారు. గవర్నర్ జగ్దీప్ ధన్కడ్ ఆమెచేత ప్రమాణం చేయించారు. మొత్తం 294 సీట్లకుగాను 292 సీట్లకు జరిగిన ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) 213 సీట్లు గెలుచుకుంది. బీజేపీ 77 స్థానాల్లో గెలిచింది.
తమిళనాడు సీఎంగా స్టాలిన్
తమిళనాడు 14వ సీఎంగా డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ గిండీలోని రాజ్‌భవన్‌లో మే 7న ప్రమాణం చేశారు. గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ ప్రమాణం చేయించారు. ఆయన సీఎంగా ఎన్నికవడం ఇదే తొలిసారి. మొత్తం 234 శాసనసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో మిత్రపక్షాలతో కలిసి డీఎంకే 159 స్థానాల్లో గెలుపొందింది. అన్నాడీఎంకే కూటమి 75 స్థానాల్లో గెలిచింది.
పుదుచ్చేరి సీఎంగా రంగసామి
పుదుచ్చేరి సీఎంగా నాలుగోసారి ఎన్నార్ కాంగ్రెస్ అధ్యక్షుడు రంగసామితో మే 7న ఇన్చార్జి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణం చేయించారు. 30 సీట్లకుగాను ఎన్నార్ కాంగ్రెస్-బీజేపీ కూటమి 16 స్థానాలు సాధించింది.
అంతర్జాతీయం
భారత్-బ్రిటన్ సమావేశం
భారత ప్రధాని మోదీతో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ వర్చువల్ విధానంలో మే 4న భేటీ అయ్యారు. 2030 మార్గసూచీకి సంబంధించిన ఆరోగ్యం, వాతావరణ మార్పులు, వాణిజ్యం, విద్య, శాస్త్ర-సాంకేతిక, రక్షణ రంగాల్లో బంధాలను బలోపేతం చేసే విషయాలపై చర్చించారు. ‘సమగ్ర వ్యూహాత్మక భాగస్వామి’ హోదాను బ్రిటన్‌కు ఇవ్వాలని భారత్ నిర్ణయించింది.
నెతన్యాహు విఫలం
ఇజ్రాయెల్ ప్రస్తుత దేశాధ్యక్షుడు రూవెన్ రివ్లిన్ విధించిన గడువులోగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మే 5న విఫలమయ్యారు. 120 సీట్లు ఉన్న ఇజ్రాయెల్ పార్లమెంటుకు మార్చిలో జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు. నెతన్యాహు నాయకత్వంలోని లికుడ్ పార్టీ 30 సీట్లు, ప్రతిపక్ష నేత లపిడ్ నేతృత్వంలోని యెష్ అటిడ్ పార్టీ 17 సీట్లు గెలుచుకున్నాయి.
భూమికి వ్యోమగాములు
స్పేస్ ఎక్స్‌కు చెందిన డ్రాగన్ క్యాప్సూల్ 167 రోజులుగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ఐఎస్ఎస్)లో ఉన్న నలుగురు వ్యోమగాములను మే 2న భూమి మీదకు తీసుకువచ్చింది. మెక్సిలో గల్ఫ్‌లో పనామా సిటీకి సమీపంలో సముద్రంలో అది పడిపోయింది. వ్యోమగాముల్లో ముగ్గురు అమెరికా, ఒకరు జపాన్‌కు చెందినవారు.
తొలి 2 నానోమీటర్ చిప్
ప్రపంచంలోనే తొలిసారిగా 2 నానోమీటర్ (ఎన్ఎమ్) నానోషీట్ టెక్నాలజీతో చిప్‌ను అభివృద్ధి చేశామని ఐబీఎం మే 6న వెల్లడించింది. దీనివల్ల ఇంటర్నెట్ యాక్సెస్ వేగం, బ్యాటరీ జీవితకాలం పెరుగుతుందని, ప్రాసెసింగ్ సమయం బాగా తగ్గుతుందని తెలిపింది. దీంతో ల్యాప్‌టాప్‌లో వినియోగదారులు చేసే ఫంక్షన్లు చాలా వేగంగా పూర్తవుతాయి.
సైనోఫార్మ్ టీకాకు అనుమతి
చైనా సంస్థ ‘సైనోఫార్మ’ తయారు చేసిన కొవిడ్-19 వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) మే 7న అనుమతి ఇచ్చింది. ఐక్యరాజ్యసమితి నిర్వహిస్తున్న ‘కొవాక్స్’ కార్యక్రమం ద్వారా పెద్ద సంఖ్యలో ఈ టీకాలను అందించనున్నది. చైనాకు చెందిన మరో టీకా ‘సైనోవాక్’పై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. సైనోఫార్మ్ టీకా 18 నుంచి 59 ఏండ్ల వయస్సున్నవారిపై సమర్థవంతంగా పనిచేస్తుందని డబ్ల్యూహెచ్‌వో సలహాలిచ్చే మరో బృందం విశ్వాసం వ్యక్తం చేసింది.
వార్తల్లో వ్యక్తులు
రవి శంకర్
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నాలుగో డిప్యూటీ గవర్నర్‌గా టీ రవిశంకర్‌ను ప్రభుత్వం మే 2న నియమించింది. ఆయన ప్రస్తుతం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఏప్రిల్ 2న పదవీ విరమణ చేసిన బీపీ కనుంగో స్థానంలో ఆయన బాధ్యతలు నిర్వర్తిస్తారు.
అఖిల్ గొగొయి
అసోం ఎన్నికల్లో ప్రచారం లేకుండానే గెలుపొందిన తొలి అస్సామీగా అఖిల్ గొగొయి మే 3న రికార్డులకెక్కారు. పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా ఉద్యమించి జైలులో ఉండటంతో ఆయన ప్రచారం చేయలేదు. 1997లో జైలు నుంచే లోక్‌సభకు పోటీ చేసిన జార్జి ఫెర్నాండెజ్ గెలుపొందారు. ఆ తర్వాత అలాంటి ఘనత సాధించిన రాజకీయ ఖైదీగా అఖిల్ నిలిచారు.
మారియా రెసా
మే 3న అంతర్జాతీయ పత్రికా స్వేచ్ఛ రోజు సందర్భంగా యునెస్కో ప్రెస్ ఫ్రీడం అవార్డును మారియా రెసాకు అందించారు. ఫిలిప్పీన్స్‌కు చెందిన ఆమె 30 ఏండ్లుగా జర్నలిస్టుగా పనిచేస్తుంది. ఈ అవార్డు కింద 25 వేల అమెరికన్ డాలర్లు ఇస్తారు. ఈ బహుమతిని కొలంబియన్ జర్నలిస్ట్ గిలెర్మో కానో ఇసాజా పేరుమీద ప్రదానం చేస్తున్నారు.
శంకర్ ఘోష్
అమెరికాలోని ప్రతిష్ఠాత్మక ‘నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్’కు భారత సంతతికి చెందిన శంకర్ ఘోష్ మే 6న ఎంపికయ్యారు. దీనికి కొత్తగా ఎంపికయిన 120 మంది సభ్యుల్లో ఆయన కూడా ఉన్నారు. ఆయన కొలంబియా యూనివర్సిటీలోని వాగెలాన్ కాలేజ్ ఆఫ్ ఫిజీషియన్స్ అండ్ సర్జన్స్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.
అజిత్ సింగ్ మృతి
రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్ఎల్డీ) అధినేత, కేంద్ర మాజీ మంత్రి ప్రముఖ రైతు నాయకుడు అజిత్ సింగ్ కరోనాతో మే 6న మరణించారు. మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ కుమారుడైన అజిత్ సింగ్ 1939, ఫిబ్రవరి 12న జన్మించారు. 1980లో క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించి 1986లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు.
కామి రితా
ప్రపంచంలోనే ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరాన్ని నేపాల్‌కు చెందిన కామీ రీతా 25వ సారి మే 7న అధిరోహించి తన రికార్డును తాను బద్దలుగొట్టారు. 11 మంది బృందంతో కలిసి ఆయన శిఖరాన్ని చేరుకున్నారు. కామీ 1994లో తొలిసారి, 2019లో 24వ సారి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు.
మానస్ వర్మ మృతి
ప్రముఖ ఏరోనాటికల్ సైంటిస్ట్ మానస్ బిహారీ వర్మ మే 4న మరణించారు. తేలికపాటి యుద్ధ విమానం తేజస్ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించారు. ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఏడీఏ) డైరెక్టర్‌గా పనిచేశారు. పద్మశ్రీ పురస్కారాన్ని కూడా అందుకున్నారు.
పావులూరి మృతి
ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు 98 ఏండ్ల పావులూరి శివరామకృష్ణయ్య మే 4న మరణించారు. గుంటూరు జిల్లాకు చెందిన ఆయన సహాయ నిరాకరణ, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్‌తో కలిసి వారం రోజులు ఒకే సెల్లో ఉన్నారు.
జగ్మోహన్ మృతి
కేంద్ర మాజీ మంత్రి, జమ్ముకశ్మీర్‌కు గవర్నర్‌గా పనిచేసిన జగ్మోహన్ మల్హోత్రా మే 4న మరణించారు. 1970ల్లో ఢిల్లీ అభివృద్ధి అథారిటీ వైస్ చైర్‌పర్సన్‌గా, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌గా పనిచేశారు. ఆయనకు పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ లభించాయి.
క్రీడలు
పోర్చుగీస్ విజేత హామిల్టన్
ఫార్ములావన్ చాంపియన్ లూయీస్ హామిల్టన్ మే 2న జరగిన పోర్చుగీస్ గ్రాండ్‌ప్రిలో విజేతగా నిలిచాడు. ఇది అతడికి 97వ గ్రాండ్‌ప్రి టైటిల్. ఈ పోటీలో మాక్స్ వెర్స్టాపన్ రెండో స్థానంలో, వాల్టెరి బొటాస్ మూడో స్థానంలో నిలిచారు.
పెరీరా రిటైర్
శ్రీలంక మాజీ కెప్టెన్ తిసారా పెరీరా ఇంటర్నేషనల్ క్రికెట్‌కు మే 3న రిటైర్మెంట్ ప్రకటించాడు. పెరీరా 6 టెస్టులు, 166 వన్డేలు, 84 టీ20లు ఆడాడు.
స్నూకర్ విజేతగా మార్క్ సెల్బీ
స్నూకర్‌లో మార్క్ సెల్బీ నాలుగోసారి ప్రపంచ చాంపియన్‌గా నిలిచాడు. మే 4న షెఫీల్డ్‌లోని క్రూసిబుల్ థియేటర్లో జరిగిన చాంపియన్‌షిప్‌లో షాన్ మర్ఫీని ఓడించాడు. విజేతకు 5 లక్షల పౌండ్ల నగదును అందజేస్తారు.
బార్బరా స్ట్రికోవా రిటైర్
మహిళల టెన్నిస్ డబుల్స్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్ బార్బరా స్ట్రికోవా (చెక్ రిపబ్లిక్) టెన్నిస్‌కు మే 5న రిటైర్మెంట్ ప్రకటించింది. ఆమె మొత్తం 31 టైటిల్స్ సొంతం చేసుకుంది. 2016 రియో ఒలింపిక్స్‌లో లూసీ సఫరోవా (చెక్ రిపబ్లిక్)తో కలిసి మహిళల డబుల్స్‌లో కాంస్య పతకాన్ని సాధించింది.
వేముల సైదులు
జీకే, కరెంట్ అఫైర్స్ నిపుణులు
ఆర్సీ రెడ్డి స్టడీ సర్కిల్ హైదరాబాద్
- Tags
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు