చేతివృత్తుల గురించి తెలుపుతున్న శాసనం?
గతవారం తరువాయి..
ఇక్ష్వాకులు – మతపరిస్థితులు శైవ, వైష్ణవ మతాలు
శాసనాల ప్రకారం లభిస్తున్న నలుగురు ఇక్ష్వాక రాజుల్లో ఒక్క వీరపురుషదత్తుడు తప్ప మిగిలిన ముగ్గురు రాజులు వైదిక మతావలంబికులు. ఇక్ష్వాక రాజ్య స్థాపకుడైన శ్రీశాంతమూలుడు అశ్వమేధ, వాజపేయ, అగ్నిష్టోమ, అగ్నిహోత్ర మొదలైన క్రతువులు నిర్వహించాడు. ఇతడు విరూపాక్షపతి, మహాసేన, కార్తికేయుల పాద భక్తుడనని చెప్పుకొన్నాడు. ఇతడి మనుమడైన ఎహూవల శాంతమూలుడిని దక్షిణ భారతదేశంలో మొదటి హిందూ దేవాలయాల నిర్మాతగా చెప్పవచ్చు.
ఇతడు పుష్పభద్రస్వామి పేరుతో ఒక శివాలయాన్ని నాగార్జునకొండలో నిర్మించాడు. ఇతడి సేనాని ఎలిశ్రీ సర్వదేవ అనే పేరుతో శివాలయాన్ని నిర్మించినట్లు శాసనాల ద్వారా తెలుస్తుంది. ఎహూవల శాంతమూలుడి కాలంలోనే నాగార్జునకొండలో ‘నొడగేశ్వర’ అనే ఆలయం ఉన్నట్లు, ఈ ఆలయానికి రతవశ్య అనే వర్తకుని కూతురు, మరికొందరు కలిసి దానధర్మాలు చేసినట్లు తెలుస్తుంది. ఇక్ష్వాకుల కాలంలో మాతృదేవతారాధన కూడా ఉండేది.
నాగార్జునకొండలో హరీతి దేవాలయం ఉండేదని తెలుస్తుంది. ఆ రోజుల్లో స్త్రీలు సంతానం కోసం హరీతి దేవాలయంలోని సప్తమాత్రికల వద్ద గాజులను సమర్పించేవారని శాసనాల ద్వారా తెలుస్తుంది. ఈ విధంగా ఇక్ష్వాకుల కాలంలో పౌరాణిక శైవ, వైష్ణవ మతాలు ఆదరించబడ్డాయి.
బౌద్ధమతం
ఇక్ష్వాక రాజైన వీరపురుషదత్తుడి కాలం ఆంధ్రదేశంలో బౌద్ధమతానికి స్వర్ణయుగమని చెప్పవచ్చు. బౌద్ధమతానికి చేసిన సేవలకుగాను ఇతడు దక్షిణాది అశోకుడుగా ప్రసిద్ధిచెందాడు. ఇక్ష్వాక రాణులు కూడా బౌద్ధమతాన్ని ఆదరించి అనేక దానాలు చేశారు. క్రీ.శ. 2వ శతాబ్దం నాటికి నాగార్జునకొండ భారతదేశంలో ప్రసిద్ధ బౌద్ధ ఆరామంగా విలసిల్లింది.
నాగార్జునకొండ శాసనాలు అనేక బౌద్ధమత శాఖలను పేర్కొంటున్నాయి. రాజగిరికులు, మహీశాసకులు, సిద్ధాంతికులు వంటి శాఖలు నాగార్జునకొండలో ఉండేవి. అమరావతి పూర్వశైలీయులకు, నాగార్జునకొండ అవరశైలీయులకు ప్రధాన కేంద్రాలుగా ఉండేవి.
వీరపురుష దత్తుడి మేనత్త శాంతిశ్రీ అతడి ఆరో పాలనా సంవత్సరంలో బుద్ధుడి ధాతువును నిక్షిప్తం చేసిన మహాచైత్యాన్ని నాగార్జునకొండలో నిర్మించి తొమ్మిది ఆయక స్తంభాలను నెలకొల్పింది. ఆయక స్తంభంపై ప్రాకృతంలో ‘సమ్మసంభుధన ధాతు వరపరిగ్రహిత’ అని ఉంది. అంటే బుద్ధుడి శ్రేష్ఠమైన అస్తికను పరిగ్రహించినది అని అర్థం.
వీరపురుష దత్తుడి కుమార్తె కొడబలిశ్రీ, మహిశాసికుల కోసం ఒక విహారాన్ని నిర్మించినట్లు శాసనంలో ఉంది. ఎహూవల శాంతమూలుడి కాలంలో అతడి తల్లి మహాదేవి భట్టిదేవ బహుశృతీయుల కోసం ఒక విహారాన్ని, చైత్యాన్ని నిర్మించింది. రాజ కుటుంబానికి చెందినవారే గాక సామాన్య స్త్రీలు కూడా బౌద్ధ విహారాలకు దానాలు చేసి, శాసనాలు వేయించారు. వీరిలో రాజ భాండాగారికుడైన బోధిశర్మ మేనకోడలు ఉపాసిక బోధిశ్రీ చెప్పుకోతగ్గది. ఈమె విజయపురిలో చుళదమ్మగిరి వద్ద ఒక ఆరామాన్ని నిర్మించింది. ఇది సింహళ విహారంగా ప్రసిద్ధికెక్కింది. ఆ రోజుల్లో సింహళం, నాగార్జునకొండ మధ్య బౌద్ధమత సంబంధాలుండేవి. శ్రీలంక నుంచి బౌద్ధ బిక్షువులు నాగార్జునకొండను సందర్శించడానికి వచ్చేవారు. ఈ విధంగా ఇక్ష్వాకుల కాలంలో రాజాదరణ, ప్రజాదరణ పొందిన బౌద్ధమతం తర్వాతి కాలంలో క్షీణించడం ప్రారంభమైంది.
సాహిత్యం
ఇక్ష్వాకుల కాలంలో ప్రాకృతమే రాజభాష అయినప్పటికీ తర్వాత కాలంలో శాసనాల్లో, సాహిత్యంలో ప్రాకృత భాష స్థానాన్ని సంస్కృతం ఆక్రమించింది. ఎహూవల శాంతమూలుడి పదకొండో పరిపాలనా సంవత్సరం తర్వాత నుంచి శాసనాలు సంస్కృతంలో ఉన్నాయి. అయితే మహాయాన బౌద్ధమతం అంతరించడం బౌద్ధమతం స్థానంలో వైదిక మతం బలపడటం ఇందుకు కారణంగా చెప్పవచ్చు.
ఇక్ష్వాకుల కాలంలో ధాన్యకటకం, నాగార్జునకొండల్లో ప్రఖ్యాతిగాంచిన విశ్వవిద్యాలయాలు వర్థిల్లాయి. ఇక్కడికి విద్యార్జన కోసం శ్రీలంక, టిబెట్, నేపాల్ నుంచే కాక భారత్లోని అన్ని ప్రాంతాల నుంచి బౌద్ధ బిక్షువులు వచ్చేవారని 8వ శతాబ్దానికి చెందిన ఉద్యోతనుడు తన ‘కువలయమాల’ అనే గ్రంథంలో పేర్కొన్నాడు.
ఇక్ష్వాకుల కాలంలో ఆచార్య నాగార్జుని శిష్యుడు ఆర్యదేవుడు ‘చిత్తశుద్ధి ప్రకరణం’ అనే గ్రంథాన్ని రాశాడు. ఇక్ష్వాకుల శాసనాల్లో ఖగోళ శాస్త్రం, వైద్య, గణితం మొదలైన వాటి గురించి ప్రసక్తి ఉంది.
వాస్తు-శిల్ప కళ
ఇక్ష్వాకుల కాలం నాటి ముఖ్యమైన నిర్మాణాలు నాగార్జునకొండ వద్ద జరిపిన తవ్వకాల్లో లభించాయి. ఇక్కడ లభించిన నిర్మాణాల్లో శతృదుర్భేద్యమైన కోట, కందకం, కోటలోపలి భవనాలు, బహిరంగ ప్రదర్శన శాల (స్టేడియం), శాంతమూలుని అశ్వమేధ వేదిక, బౌద్ధస్థూపాలు, విహారాలు, చైత్యాలు, ఆరామాలు, దేవాలయాలు, స్నానఘట్టాలు మొదలైనవి ఎన్నో బయల్పడ్డాయి. ఇక్కడ లభించిన స్టేడియం వివిధ అంతస్తుల్లో నిర్మితమైంది. దీని ప్రత్యేకత ఏమిటంటే భారతదేశంలో ఎక్కడా ఇటువంటి నిర్మాణం బయల్పడకపోవడం. దీన్ని రోమన్ నిపుణుల సహాయంతో నిర్మించి ఉంటారని కొందరు పండితుల అభిప్రాయం.
నాగార్జునకొండలో సుమారు 30 బౌద్ధ ఆరామాలు ఉండేవి. బౌద్ధంలో వివిధ శాఖలకు చెందినవారు వీటిని నిర్మించారు. బుద్ధుడిని మానవరూపంలో చూపడం ఇంతకు పూర్వ నిషేధం కానీ అవరమహావిన శైలీయ శాఖ నుంచి వచ్చిన ఆదరణ వల్ల బుద్ధుని విగ్రహాలను చెక్కారు.
ఇక్ష్వాకుల కాలంలో నాగార్జునకొండ అమరావతి శిల్పకళకు కేంద్రమయ్యింది. వీరి కాలంలో నిర్మించిన బౌద్ధస్థూపాలు, విహారాలు తెలంగాణలో నేలకొండపల్లి, గాజులబండ, తుమ్మలగూడెం, నందికొండ, ఆంధ్రప్రదేశ్లో గోలి, చందవరం, దూపాడు, నంబూరు, ఉప్పుగుండూరు, రెంటాల మొదలైనచోట్ల ఉన్నాయి. ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లిలో ఒక మహాస్థూపం, విహారాలు, అనేక నిలువెత్తు బుద్ధుని విగ్రహాలు, బుద్ధుని కంచు విగ్రహం, పాలరాయిపై చెక్కిన తొమ్మిది విగ్రహాలు తవ్వకాల్లో బయల్పడ్డాయి. క్రీ.శ. 3వ శతాబ్దం నుంచి 6వ శతాబ్దం వరకు ఈ నిర్మాణాలు జరిగాయి. ఈ విగ్రహాలు లభించిన చోటుకు సమీపంలోనే పాలరాతి ముక్కలు, నీటితొట్టెలు బయల్పడటంతో అది బుద్ధ విగ్రహాలను తయారుచేసే శిల్ప కర్మాగారమని వీవీ కృష్ణశాస్త్రి పేర్కొన్నారు.
ఈ నేలకొండపల్లి వద్ద విగ్రహాలు అమరావతి శిల్పకళకు అద్దం పడుతున్నాయి. ఈ విధంగా శాతవాహనుల సామంతులుగా అధికారాన్ని ప్రారంభించిన ఇక్ష్వాకులు, వారి పతనానంతరం స్వతంత్రులై సామాజిక, సాంస్కృతిక, విద్య, మత పరిస్థితుల్లో ఆంధ్రదేశంలో గణనీయ ప్రగతిని సాధించారని తెలుస్తుంది.
ఆర్థిక పరిస్థితులు
రాజ్యానికి భూమిశిస్తే ప్రధాన ఆదాయ వనరు. దీనిని ‘భాగ’ అనేవారు. సాధారణంగా పంటలో 1/6వ వంతు భూమి శిస్తుగా వసూలు చేసేవారు. ‘భోగ’ అనే మరో రకమైన భూమిశిస్తును స్థానిక పాలకులు వసూలు చేసుకొని అనుభవించేవారు. శిస్తును ధన రూపంలో కాని, ధాన్య రూపంలో కాని చెల్లించే అవకాశం ప్రజలకుండేది. ధన రూపంలో వసూలు చేసే శిస్తును ‘హిరణ్యం లేదా దేయం’ అని, ధాన్య రూపంలోని శిస్తును ‘మేయం’ అని అనేవారు.
పరిశ్రమలు, వృత్తులు, వ్యాపారాలపై వసూలు చేసే పన్నును ‘కర’ అనేవారు. ఇవేకాకుండా ఉప్పు, పంచదార, రహదారులపై, నీటితీరువాపై కూడా సుంకాలను వసూలు చేసేవారు. వ్యవసాయదారులు తమ పశువులు ఈనిన మొదటి దూడను ప్రభుత్వానికి సుంకంగా సమర్పించేవారు.
ఇక్ష్వాకులు రాజ్యాదాయాన్ని నాలుగు భాగాలుగా ఖర్చుచేసేవారని తెలుస్తుంది. అందులో ఒక భాగం ప్రభుత్వ నిర్వహణకు, సైన్యపోషణకు, పెద్ద ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలకు, రెండో భాగం దేవాలయ నిర్మాణానికి, దైవారాధనకు, ఉత్సవ నిర్వహణకు, మూడో భాగం కవులు, పండితులు, మహామేధావుల పోషణకు, నాలుగో భాగం వివిధ మతాలకు బహుమతులుగా ఇచ్చేందుకు అవసరమైన చెరువులు, కాలువల నిర్మాణం కోసం కొంత ఆదాయాన్ని ఖర్చుపెట్టడం జరిగింది.
వ్యవసాయం
నాడు వ్యవసాయం ప్రజల ప్రధానమైన జీవ నాధారం. వరి, గోధుమ, చెరకు, జొన్న, సజ్జ, రాగులు, కందులు, నువ్వులు, ఆముదాలు, జనుము, పత్తి ఆనాటి ముఖ్యమైన పంటలు. రవాణా సౌకర్యాలు, నౌకాయానం అంతగా అభివృద్ధి కాని నాడు పంటల ఉత్పత్తులకు స్థానిక మార్కెట్లే వ్యాపార కేంద్రాలుగా ఉన్నాయి.
చేతివృత్తులు
నాగార్జునకొండ వద్ద జరిపిన తవ్వకాల్లో ఇక్ష్వాకుల కాలం నాటి వృత్తిపనివారి ఇండ్లు బయటపడ్డాయి. ఒక ఇంట్లో స్వర్ణకారుల వృత్తి సామగ్రి దొరికింది. అనేక రకాలైన బంగారు, వెండి కళాత్మక వస్తువులు దొరికాయి. ఇక్ష్వాకుల శాసనాల్లో పర్లిక శ్రేణి (తమలపాకుల శ్రేణి), పూసిక శ్రేణి (మిఠాయి తయారీదారులు), మరో శాసనంలో కులిక ప్రముఖ (శ్రేణి నాయకుడు) అనే పదాలు కన్పిస్తున్నాయి. అంతేకాకుండా కొంతమంది వృత్తిపనివారు ఒక దేవాలయాన్ని, మంటపాన్ని కట్టించి, దాని నిర్వహణ కోసం అక్షయ నిధిని ఏర్పాటు చేసినట్లు తెలిపే ఒక శాసనం దొరికింది. గ్రామాల్లో చేతి పరిశ్రమలు కొనసాగుతున్నట్లు విళపట్టి శాసనం ద్వారా తెలుస్తుంది.
వర్తక వ్యాపారాలు
శాతవాహనుల కాలంలో మాదిరిగానే వీరి కాలంలో కూడా రోమ్ దేశంతో వాణిజ్యం కొనసాగింది. నాగార్జునకొండలో రోమన్ నాణేలు లభ్యమవడమేగాక వీరి రాజధాని విజయపురిలో రోమన్ కేంద్రం ఉండేదని తెలస్తుంది. దేశీయ విదేశీయ వాణిజ్యం వైశ్యుల ఆధీనంలో ఉండేది.
క్రీ.శ. 3వ శతాబ్దం నాటికే రోమ్ దేశంతో వాణిజ్యం క్రమంగా క్షీణించడం ప్రారంభమైంది. దేశంలో బలమైన కేంద్రీకృతాధికారం లేనందువల్ల చిన్న చిన్న రాజ్యాలేర్పడి తరచుగా యుద్ధాలు చేయడంవల్ల దేశీయ వాణిజ్యానికి, కుటీర పరిశ్రమలకు నష్టం వాటిల్లి నగరాలు, గ్రామాల పతనం ప్రారంభమైంది. దీనికి నిదర్శనం అత్యధిక సంఖ్యలో దొరికిన శాతవాహనుల నాణేలతో పోల్చినప్పుడు శాతవాహనానంతరం రాజవంశాల నాణేలు అత్యల్పం. అంతేగాకుండా మొదటి నుంచి రోమ్తో వాణిజ్యం భారతదేశానికి అనుకూలంగా ఉండేది. అందువల్ల రోమన్ సామ్రాజ్యం భారతదేశ వ్యాపారం మీద నిషేధాన్ని విధించడంతో చేతివృత్తులు, పట్టణాలు పతనమయ్యాయి.
ప్రాక్టీస్ బిట్స్
- దక్షిణ భారతదేశంలో మొదటి హిందూ దేవాలయాల నిర్మాతగా భావిస్తున్న రాజు?
1) ఎహూవల శాంతమూలుడు
2) వీరపురుష దత్తుడు
3) శ్రీశాంతమూలుడు
4) రుద్రపురుష దత్తుడు - బుద్ధుడి ధాతువును నిక్షిప్తం చేసిన మహాచైత్యాన్ని నాగార్జునకొండలో నిర్మించింది?
1) వీరపురుష దత్తుడు 2) శాంతిశ్రీ
3) హర్మ్యశ్రీ 4) రుద్రపురుష దత్తుడు - ఇక్ష్వాకుల కాలంలో బుద్ధుని విగ్రహాలను తయారుచేసే శిల్పకర్మాగారమని భావిస్తున్న ప్రాంతం?
1) అమరావతి 2) ఉప్పుగుండూరు 3) నేలకొండపల్లి 4) తుమ్మలగూడెం - ఇక్ష్వాకుల కాలంలో భూమి శిస్తు?
1) 1/4వ వంతు 2) 1/6వ వంతు
3) 1/3వ వంతు 4) 1/10వ వంతు - గ్రామాల్లో చేతివృత్తుల పరిశ్రమలు ఉండేవని తెలుపుతున్న శాసనం?
1) విళపట్టి శాసనం
2) నాగార్జుకొండ శాసనం
3) అమరావతి శాసనం
4) ఏదీకాదు
Ans:
1-1, 2-2, 3-3, 4-2, 5-1
సాసాల మల్లికార్జున్
అసిస్టెంట్ ప్రొఫెసర్
ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, కోరుట్ల
9492 575 006
- Tags
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు