భారత్‌కు పామాయిల్‌ను ఎగుమతి చేస్తున్న దేశం?
- జూన్ 23వ తేదీకి సంబంధించి కింది వాటిలో సరైనది? (డి)
ఎ) వరల్డ్ ఒలింపిక్ డే
బి) యునైటెడ్ నేషన్స్ పబ్లిక్ సర్వీస్ డే
సి) అంటార్కిటికా ఒప్పందం అమలులోకి
వచ్చి 2021 నాటికి 60 సంవత్సరాలు
డి) పైవన్నీ
వివరణ: ఏటా జూన్ 23న వరల్డ్ ఒలింపిక్ డే, యునైటెడ్ నేషన్స్ పబ్లిక్ సర్వీస్ డే గా నిర్వహిస్తారు. 1894లో జూన్ 23న ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఏర్పడింది. 2021 జూన్ 23 నాటికి అంటార్కిటికా ఒప్పందం అమలులోకి వచ్చి 60 సంవత్సరాలు పూర్తయింది. అంటార్కిటికా ఖండాన్ని కేవలం శాస్త్ర పరిశోధనలకే వినియోగించడం, ఈ మొత్తం ప్రాంతాన్ని మిలిటరీ రహిత ప్రాంతంగా ప్రకటించడం ఈ ఒప్పందంలో కీలకాంశం. ప్రస్తుతం ఈ ఒప్పందంలో 54 దేశాలు భాగస్వామ్యంగా ఉన్నాయి. 1983లో భారత్ ఇందులో చేరింది. - సవరించిన ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఫ్రేమ్‌వర్క్‌పై సంతకం చేసిన తొలి దేశం? (బి)
ఎ) నార్వే బి) డెన్మార్క్
సి) ఫ్రాన్స్ డి) స్వీడన్
వివరణ: సవరించిన ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఫ్రేమ్‌వర్క్ జనవరి 8, 2021లో అమలులోకి వచ్చింది. దీనిపై సంతకం చేసిన తొలి దేశం యూరప్‌లోని డెన్మార్క్. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ భారత్‌లోని గురుగ్రామ్ కేంద్రంగా పనిచేస్తుంది. సౌరశక్తిని వినియోగిస్తూ పర్యావరణ పరిరక్షణకు ఉద్దేశించిన సంస్థ ఇది. భారత్, ఫ్రాన్స్ దేశాలు సంయుక్తంగా దీనిని ప్రారంభించాయి. కర్కాటక, మకర రేఖల మధ్య ఉండే దేశాలు ఇందులో సభ్యత్వం, ఓటు హక్కు కలిగి ఉంటాయి. ఆ వెలుపలి దేశాలు సభ్యత్వాన్ని పొందినా ఓటు హక్కు ఉండదు. - ఏ చట్టం ఉల్లంఘించారని కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఖాతాను గంట పాటు ట్విట్టర్ నిలిపివేసింది? (సి)
ఎ) భారత కాపీ రైట్ చట్టం
బి) డిజిటల్ కాపీరైట్ అవేర్నెస్ చట్టం
సి) డిజిటల్ మిలీనియం కాపీరైట్ చట్టం
డి) ఇంటర్నెట్ అండ్ డిజిటల్ సోషల్ మీడియా యాక్ట్
వివరణ: కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఖాతాను గంటపాటు ట్విట్టర్ నిలిపివేసింది. ఆయన అమెరికా డిజిటల్ మిలీనియం కాపీరైట్ చట్టం-1998ని ఉల్లంఘించారని ఆరోపిస్తూ ఈ చర్యకు పాల్పడింది. రెహమాన్ స్వరపరచిన ‘మా తుజే సలాం’ అనే పాటను ఆయన షేర్ చేశారు. డిజిటల్ మిలీనియం కాపీరైట్ చట్టాన్ని ఆమెరికా శాసన వ్యవస్థ తీసుకొచ్చింది. ఇంటర్నెట్పై తొలి మేథో హక్కును కల్పించే చట్టం ఇది. జెనీవా కేంద్రంగా పనిచేసే వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్‌లోని సభ్య దేశాల్లో కొన్ని 1996లో ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఆయా దేశాల్లో డిజిటల్ మిలీనియం కాపీ రైట్ చట్టం అమలును పర్యవేక్షిస్తారు. ఒక వ్యక్తి రచనను, అతని అనుమతి లేకుండా ఎవరైనా సామాజిక ప్లాట్‌ఫాంల వేదికగా పంచుకుంటే అతనిపై ఈ చట్టం ప్రకారం ఫిర్యాదు చేస్తే చర్య తీసుకుంటారు. - భారత్‌కు అధికంగా పామాయిల్‌ను ఎగుమతి చేస్తున్న దేశం ప్రస్తుతం ఏది? (ఎ)
ఎ) మలేషియా బి) ఇండోనేషియా
సి) థాయిలాండ్ డి) కాంబోడియా
వివరణ: 2020-21లో భారత్ పామాయిల్‌ను అధికంగా మలేషియా నుంచి దిగుమతి చేసుకుంది. గతంలో అధికంగా ఇండోనేషియా నుంచి దిగుమతి చేసుకునేది. ఇప్పుడు ఆ స్థానంలో మలేషియా చేరింది. పామాయిల్ దిగుమతిలో ప్రపంచంలో అగ్రస్థానంలో ఉన్న దేశం భారత్. వంటనూనె దిగుమతుల్లో 2/3వ వంతు పామాయిల్ ఉంటుంది. ఇందులో అధికంగా బీటా కెరోటిన్ ఉంటుంది. - ‘సెంట్రల్ గవర్నమెంట్’ అనే వ్యక్తీకరణ స్థానంలో ‘యూనియన్ గవర్నమెంట్’ అనే పదాన్ని ఉపయోగించాలని నిర్ణయించిన రాష్ట్రం? (డి)
ఎ) కేరళ బి) పశ్చిమబెంగాల్
సి) రాజస్థాన్ డి) తమిళనాడు
వివరణ: అధికారిక సంప్రదింపుల్లో సెంట్రల్ గవర్నమెంట్ స్థానంలోనే యూనియన్ గవర్నమెంట్ అనే పదాన్ని ఉపయోగించాలని తమిళనాడు రాష్ట్రం నిర్ణయించింది. మొత్తం రాజ్యాంగంలో ఎక్కడ కూడా సెంట్రల్ గవర్నమెంట్ అని లేదని ఆ రాష్ట్రం పేర్కొంది. అధికరణం 1లో ఇండియా అంటే.. భారత్, రాష్ర్టాల కలయిక అని మాత్రమే ఉందని వాదన. - దేశంలో రేబీస్ రహిత రాష్ట్రంగా ఘనత సాధించిన తొలి రాష్ట్రం? (సి)
ఎ) ఒడిశా బి) బీహార్
సి) గోవా డి) పంజాబ్
వివరణ: దేశంలో రేబీస్ రహిత తొలి రాష్ట్రంగా గోవా నిలిచింది. గడిచిన మూడు సంవత్సరాల్లో ఒక్క కేసు కూడా ఆ రాష్ట్రంలో నమోదు కాలేదు. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన మిషన్ రేబీస్‌ను సమర్థంగా అమలు చేయడం ద్వారా గోవా ఈ ఘనతను దక్కించుకుంది. - అగ్రిస్టాక్ అనే పదం ఇటీవల వార్తల్లో నిలిచింది. ఇది ఏంటి? (బి)
ఎ) వ్యవసాయ ఉత్పత్తులకు నిలువ సామర్థ్యం తెలిపేందుకు ఉపయోగించే పదం
బి) వ్యవసాయ రంగంలో సాంకేతిక ప్రయోజనాల నమోదు
సి) వ్యవసాయ సీజన్‌కు ముందు ఎరువులు, విత్తనాల వివరాలు
డి) ఏదీకాదు
వివరణ: రైతులు, వ్యవసాయ రంగానికి సంబంధించిన సమాచార డిజిటలీకరణే అగ్రిస్టాక్ అంటారు. ఈ అగ్రిస్టాక్ అమలుకుగాను వ్యవసాయ మంత్రిత్వ శాఖ, బహుళ దేశాల సంస్థ మైక్రోసాఫ్ట్ సంస్థలు ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. దీనిని 100 గ్రామాల్లో అమలు చేయనున్నారు. రైతులకు రుణం, వ్యవసాయ ఫలాలు వృథా కాకుండా చూసేందుకు వీలుంటుంది. రైతులకు రాయితీలు, సేవలు కచ్చితంగా అందించేందుకు ఉపయోగపడుతుంది. ప్రతి రైతుకు ఎఫ్ఐడీ అందుతుంది. దీనిని ఫార్మర్స్ ఐడెంటిటీ కార్డ్‌గా చెప్పొచ్చు. ప్రతి రైతు అతనికి ఉన్న భూమితో అనుసంధానం చేస్తూ దీనిని రూపొందిస్తారు. ఎంపిక చేసిన 100 గ్రామాలు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, హర్యానా, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో ఉన్నాయి. - గత ఆర్థిక సంవత్సరంలో దేశంలోకి వచ్చిన మొత్తం ఎఫ్‌డీఐల్లో తెలంగాణకు వచ్చినవి ఎంత శాతం మేర ఉన్నాయి? (ఎ)
ఎ) 1.4% బి) 2% సి) 3.8% డి) 6.2%
వివరణ: గత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణకు రూ.8617.71 కోట్ల మేర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయి. మొత్తం భారత దేశంలో రూ.6,14,127 కోట్ల మేర ఎఫ్‌డీఐలు రాగా, అందులో తెలంగాణకు వచ్చిన వాటా 1.40%. ఈ మేరకు డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ గణాంకాలను విడుదల చేసింది. - ప్రాజెక్ట్ సీ బర్డ్‌కు సంబంధించి కింది వాటిలో సరైనది? (సి)
ఎ) నాటో దేశాలు చేపట్టిన ప్రాజెక్ట్ ఇది
బి) ఆసియా ఖండంలో అన్ని దేశాలు నిర్వహించే నౌకా విన్యాసాలు
సి) భారత్‌లో అతిపెద్ద నౌకా మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్
డి) హిందూ మహా సముద్రంలో భారత్-ఏషియాన్ దేశాల నౌకా విన్యాసాలు
వివరణ: భారత దేశంలో అతిపెద్ద నౌకా మౌలిక సదుపాయాల ప్రాజెక్టును పశ్చిమ తీరంలో కర్నాటకలో ఏర్పాటు చేస్తున్నారు. రెండు దశల్లో దీనిని నిర్మిస్తున్నారు. తొలి దశ 2005 నాటికే పూర్తయింది. ఈ తొలిదశకే ప్రాజెక్ట్ సీ బర్డ్ అని పేరు. మొత్తం ప్రాజెక్ట్ పేరు ఐఎన్ఎస్ కదంబ. రెండు దశలు పూర్తయితే ఇది కేవలం భారత దేశంలోనే కాకుండా తూర్పు అర్ధగోళంలో అతిపెద్ద నౌకా స్థావరంగా మారనుంది. - అగ్ని-1తో పోలిస్తే, అగ్ని-ప్రైమ్ బరువు తక్కువగా ఉండటానికి కారణం? (ఎ)
ఎ) అగ్ని ప్రైమ్‌లో మిశ్రమ లోహాలు వాడటం
బి) అగ్ని-1లో మిశ్రమ లోహాలు వాడటం
సి) అగ్ని ప్రైమ్‌లో అసలు లోహాలు వినియోగించకపోవడం
డి) ఏదీకాదు
వివరణ: అణ్వస్త్ర సామర్థ్యం ఉన్న కొత్త తరం క్షిపణి అగ్ని ప్రైమ్‌ను జూన్ 28న విజయవంతంగా ప్రయోగించారు. ఈ క్షిపణిలో అధునాతన పరిజ్ఞానాలను ఉపయోగించారు. చోదక, దిక్సూచి, నియంత్రణ వ్యవస్థల్లో ఆధునికతను చేర్చారు. మిశ్రమ లోహాలను ఉపయోగించడం వల్ల అగ్ని-1తో పోలిస్తే ఇది బరువు బాగా తక్కువగా ఉంటుంది. దీంతో దీనిని రహదారి మార్గం గుండా కూడా ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. అగ్ని-1 బరువు ఎక్కువగా ఉండటం వల్ల రైల్లోనే తీసుకెళ్లాలి. అగ్ని-ప్రైమ్ వెయ్యి నుంచి 2 వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. దాదాపు ఇది టన్ను పేలోడ్‌ను మోసుకెళుతుంది. - ఇటీవల ఏ రాష్ట్రంలో శాంక్చువరీని టైగర్ రిజర్వ్‌గా ప్రకటించారు? (డి)
ఎ) మధ్య ప్రదేశ్ బి) ఉత్తరాఖండ్
సి) పశ్చిమబెంగాల్ డి) రాజస్థాన్
వివరణ: రామ్‌ఘర్ విషధారి వైల్డ్‌లైఫ్ శాంక్చువరీని టైగర్ రిజర్వ్‌గా గుర్తించేందుకు జాతీయ పులుల పరిరక్షణ ప్రాధికార సంస్థ (నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ) అనుమతి ఇచ్చింది. ఈ ప్రాధికార సంస్థను 2005లో ఏర్పాటు చేశారు. ఇది రాజస్థాన్‌లో ఉంది. దీంతో దేశంలో టైగర్ రిజర్వ్‌ల సంఖ్య 52కు చేరింది. రాజస్థాన్‌లో ఇప్పటికే రణతంబోర్, సర్సికా, ముకుంద్రా హిల్స్ టైగర్ రిజర్వ్‌లు ఉన్నాయి. దేశంలో ప్రాజెక్ట్ టైగర్‌ను 1973లో ప్రారంభించారు. ఇది కేంద్ర ప్రాయోజిత పథకం, ప్రస్తుతం దేశంలో 18 రాష్ర్టాల్లో టైగర్ రిజర్వ్‌లు ఉన్నాయి. అతిపెద్దది నాగార్జునసాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వ్. ఏటా జూలై 29న ప్రపంచ పులుల దినోత్సవంగా నిర్వహిస్తారు. - తెలంగాణ రాష్ట్రం ఏ ప్రాంతంలో ట్రైటాన్ సంస్థ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ పరిశ్రమను ఏర్పాటు చేయనుంది? (సి)
ఎ) రంగారెడ్డి బి) చేవెళ్ల
సి) జహీరాబాద్ డి) మహేశ్వరం
వివరణ: తెలంగాణ రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ పరిశ్రమ ఏర్పాటు కానుంది. అమెరికాకు చెందిన ట్రైటాన్ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ రూ.2100 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. దీనివల్ల 25 వేల మందికి ఉపాధి లభించనుంది. తొలి అయిదు సంవత్సరాల్లో 50 వేలకుపైగా సెడాన్లు, లగ్జరీ కార్లు, ఇతర ఎలక్ట్రిక్ వాహనాలను తయారుచేయనున్నారు. జహీరాబాద్‌లోని జాతీయ పెట్టుబడులు, తయారీ మండలిలో దీనిని ఏర్పాటు చేయనున్నారు. - తెలుగు రాష్ర్టాల్లో తొలి చర్మ నిధి కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? (డి)
ఎ) విశాఖపట్నం బి) కర్నూలు
సి) ఖమ్మం డి) హైదరాబాద్
వివరణ: తెలుగు రాష్ర్టాల్లో తొలి చర్మనిధి కేంద్రం హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రిలో ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు హెటిరో డ్రగ్స్, రోటరీ క్లబ్‌లు సాయం చేయనున్నాయి. కాలిన గాయాలు, చేతికి, కాళ్లకు శరీరంపై ఇతర భాగాల్లో తీవ్ర గాయాలు, తెగిన చేతులు ఇతర చికిత్సలకు చర్మం అవసరం అవుతుంది. ఇందుకుగాను ఈ చర్మ బ్యాంక్ ఉపయోగపడుతుంది. అలాగే గుండె జబ్బులకు చికిత్స అందించే అత్యాధునిక క్యాథ్ ల్యాబ్ సౌకర్యాన్ని ఖమ్మం జిల్లా ఆస్పత్రిలో తొలిసారిగా అందుబాటులోకి తేనున్నారు. ఇప్పటివరకు నిమ్స్, ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లో మాత్రమే ఈ క్యాథ్‌ల్యాబ్ సౌకర్యం ఉంది. - ‘మీమాంగ్ చెటోన్’ ఇటీవల వార్తల్లో నిలిచింది. ఇది ఏంటి? (బి)
ఎ) కొత్త కరోనా వేరియంట్
బి) చైనా సైన్యంలో కొత్తయూనిట్
సి) కరోనాకు కొత్త టీకా డి) ఏదీకాదు
వివరణ: అధిక ఎత్తులో యుద్ధం చేసేందుకు టిబెట్ యువతతో కలిసి సైన్యంలో కొత్త యూనిట్లను చైనా ప్రారంభించింది. దీని పేరు మీమాంగ్ చెటోన్. భారత్, చైనాల మధ్య సరిహద్దులో భాగం అయిన తూర్పు, పశ్చిమ సెక్టార్లలో ఈ సైన్యం ఎత్తయిన ప్రదేశాల్లో పహారా కాస్తుంది. డ్రోన్లతో పాటు ఇతర సాంకేతిక పరమైన ఆయుధాల వాడకంలో కూడా వారికి శిక్షణ ఇస్తున్నారు. - పీవీ నరసింహారావుకు సంబంధించి కింది వాటిలో సరైనది? (సి)
- దక్షిణాది నుంచి ప్రధాని అయిన తొలి వ్యక్తి
- ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రధాని అయిన నాలుగో వ్యక్తి
- ఆయన ప్రధాని అయినప్పుడు గెలిచిన నియోజకవర్గం హన్మకొండ
ఎ) 1, 3 బి) 2, 3 సి) 1, 2 డి) 1, 2, 3
వివరణ: దక్షిణ భారత దేశం నుంచి ప్రధాని అయిన తొలి వ్యక్తి పీవీ నరసింహారావు. అలాగే మైనార్టీ ప్రభుత్వాన్ని అయిదేళ్లు విజయవంతంగా నిర్వహించగలిగిన తొలి, ఏకైక ప్రభుత్వాధినేత ఆయన. ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రధాని అయిన నాలుగో వ్యక్తి. అలాగే కేంద్ర మంత్రిగా పనిచేసి ప్రధాని అయిన ఏడో వ్యక్తి కూడా పీవీనే. ఆయన శతజయంతి ఉత్సవాలను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్డుకు పీవీ మార్గ్‌గా పేరు పెట్టడంతో పాటు 26 అడుగుల ఎత్తయిన విగ్రహాన్ని కూడా ఆవిష్కరించారు.
వి. రాజేంద్ర శర్మ
ఫ్యాకల్టీ ,9849212411
- Tags
- Education News
Previous article
బైహెతెన్ జలవిద్యుత్ కేంద్రంలోని రెండు యూనిట్లను ప్రారంభించిన చైనా
Next article
ఒండలి నేలలు ఎందుకు సారవంతంగా ఉంటాయి?
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు