‘పది’లమైన భవిష్యత్తుకు అడుగులేద్దాం!
పదో తరగతి వరకు జీవితం చీకూచింత లేకుండా గడిచిపోతుంది. ఎందుకంటే ఏ పాఠశాలలో చదివించాలన్నది తల్లిదండ్రులు తీసుకునే నిర్ణయం. అంతకు మించి పెద్దగా ఆలోచించాల్సింది ఎక్కువగా ఉండదు. అన్ని సబ్జెక్టులు చదవాల్సిందే. కానీ ఇంటర్లో అలా కాదు. మీరు తీసుకునే నిర్ణయం మీ భవిష్యత్తుకు మార్గాన్ని నిర్ణయించే మొదటి అవకాశం. చిన్నతనంలో ఆడుకునే బొమ్మలు బట్టి లేదా ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లో వేసుకునే వేషధారణ బట్టి మీకు ఇష్టమైన కార్టూన్ లేదా హీరో క్యారెక్టర్ని బట్టి చాలాసార్లు పెద్దయ్యాక ఇది అవుతారు లేదా అదవుతారు అన్న సంభాషణలు సాధారణంగా ప్రతి ఇంట్లో ఉండేవే.
పదో తరగతి తర్వాత ఏంటి? మీ నిర్ణయం ఏంటి? అని మీ భవిష్యత్తు గురించి ఆలోచించారా?
ఒకరు మెడిసిన్ చెయ్యి డాక్టర్లకు సమాజంలో ఎంతో గౌరవం ఉంది అంటారు. ఇంకొకరు అందులో స్థిర పడటానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి ఇంజినీరింగ్ చెయ్యి ఇందులో చాలా సీట్లు ఉన్నాయి అంటారు. ఒకరు సీఏ అని, ఇంకొకరు ఐఏఎస్, మరికొందరు నాన్ సైన్స్ అయిన కామర్స్, మేనేజ్మెంట్ అని సలహా ఇస్తారు. ఆర్థిక అవకాశాలు కలవారు విదేశీ విద్య శాట్ అని కూడా ఆలోచిస్తారు. ఇంజినీరింగ్ చదవాలంటే ఎంపీసీలో చేరాలి, మెడిసిన్‌కి బైపీసీ.. ఇలా భవిష్యత్తులో మనం ఏ కెరీర్‌ని ఎంచుకుంటే దానికి అనుగుణంగా ఇంటర్లో సబ్జెక్టులు తీసుకోవాలి. ఏ రంగం ఎంచుకున్నా ఎన్నో అవకాశాలు ఉన్నాయి. కానీ ఇక్కడ రంగాలు, పరీక్షలు, అవకాశాలు అన్నది కాకుండా మీరేం చేయాలనేది ఆలోచించాలి.
మీరు ఏ కెరీర్ ఎంచుకోవాలన్నది ఎలా ఆలోచిస్తున్నారు? ఎంత ఆలోచిస్తున్నారు? కెరీర్‌ని ఎలా ఎంచుకోవాలి?
కెరీర్‌ని ఎలా నిర్ణయించుకోవాలని ఎవరినైనా అడిగితే మొదట వచ్చే జవాబు అవకాశాలు, మార్కెట్లో ఆ కెరీర్‌కి ఉన్న విలువ అని, ఆ తర్వాత కొందరు ఉద్యోగంలో స్థిరత్వం, ఉద్యోగం పట్ల తృప్తి గా ఉండటం అని అంటారు.దేశంలో క్రికెట్ అంటే ఎంతో మోజు ఉంది. కానీ 1983లో భారత్ క్రికెట్ జట్టు ప్రపంచ కప్ సాధించిన సంవత్సరం క్రికెటర్ వేతనం ఎంత ఉందో తెలుసా? మ్యాచ్ ఫీజు రూ.1500, 5 రోజులు జరగాల్సిన టెస్ట్ మ్యాచ్ మూడు రోజుల్లో పూర్తయితే ప్రతి రోజు వేతనం రూ.200 చొప్పున మూడు రోజులకు మాత్రమే వేతనం ఇచ్చారు. అప్పట్లో ఇప్పటివలే ఇన్ని మ్యాచ్‌లు ఉండేవి కూడా కావు. సచిన్ టెండూల్కర్ క్రికెట్ ఆడటం మొదలు పెట్టినప్పుడు క్రికెట్ మార్కెట్ వాల్యూ అందులో ఉన్న డబ్బుని చూసి మొదలు పెట్టాడా? ఇప్పుడు ఉన్నంత డబ్బు అప్పుడు అందులో లేదు. కానీ తన ఇష్టం, తన సామర్థ్యాన్ని బట్టి అతను ఆ ఆటను ఎంచుకున్నాడు.
ఎప్పుడైనా ఎంచుకునే కెరీర్‌ని ఈ మూడు విషయాలను దృష్టిలో ఉంచుకొని ఆలోచించాలి.. ఇంట్రస్ట్ (ఆసక్తి), క్యాపబిలిటీ (సామర్థ్యం), మార్కెట్ వాల్యూ (మార్కెట్లో విలువ). మార్కెట్లు మారుతూ ఉంటాయి. కాబట్టి ఒక మార్కెట్ వాల్యూ ఆధారంగా మాత్రమే నిర్ణయం తీసుకుంటే కష్టం.
ఆసక్తి, సామర్థ్యం, మార్కెట్ వాల్యూ ఈ మూడు ఎంతో కొంత సమతుల్యత ఉండటం అవసరం. దీనిని బట్టి ఎంచుకునే కెరీర్ ఉండాలి.
ఇంట్రస్ట్
నేను ఆస్ట్రోనాట్ అవ్వాలనుకోవడం ఆసక్తా? అవును, కాదు? ఒకానొక సందర్భంలో ఒక విద్యార్థి ‘నేను పురావస్తు శాస్త్రవేత్త అవ్వాలనుకుంటున్నాను? కానీ మా తల్లిదండ్రులు నాకు అభ్యంతరం చెబుతున్నారని నిరాశగా అన్నాడు? ఇది కొందరు ఎదుర్కొనే సమస్య కూడా.
మన చుట్టూ ఉన్నవారు చదివిన చదువు పట్ల మనకు ఒక అవగాహన ఉంటుంది. అది సరైనది అనుకుంటాం. అందులో తప్పులేదు. తల్లిదండ్రులు సంకోచించడంలో తప్పులేదు. కానీ మీరు ఆ కెరీర్ కోసం ఎలా చదవాలి? ఏం చదవాలి? ఎక్కడ చదవాలి? ఎలాంటి అవకాశాలు ఉన్నాయి? అన్న విషయాలపై పూర్తి అవగాహన తెచ్చు కొని, క్రమశిక్షణతో చదువుతాను అని దృఢ సంకల్పంతో వారికి చెబితే వారు తప్పక అంగీకరిస్తారు. ఆసక్తి అనేది కేవలం ఆ కోర్సు పేరు తెలిసి ఉండటం కాదు, దాని గురించి లోతైన అవగాహన కలిగి ఉండటం.
నాకు గణిత శాస్త్రం అంటే భయం. కాబట్టి బైపీసీ చదువుతానని కొందరంటారు? నాకు కప్ప కోయడం ఇష్టం లేదు. కాబట్టి ఇంజినీరింగ్ చేస్తానని ఇంకొందరంటారు. భయాలు, కప్పలు మీ కెరీర్‌ని నిర్ణయిస్తే ఎలా? మీ సమస్య నిజంగా పెద్దదయితే దాన్ని బట్టి ఆలోచించండి. మనకి ఇష్టమైన దాని కోసం ఎంతైనా కష్టపడటంలో ఇబ్బందిపడం. అదే ఇష్టం లేనిదైతే చిన్న ఆటంకాన్ని కూడా పెద్ద అవరోధంలా చూస్తాం. మీ ఇష్టాలు, అయిష్టాలు సరైనవేనా అని ఆలోచించి ఆ తర్వాత నిర్ణయం తీసుకోండి.
క్యాపబిలిటీ
తెలుగు సినిమా జెర్సీ లో నానికి క్రికెట్ పట్ల ఆసక్తి ఉంది. అతడికి ఆట ఆడే సామర్థ్యం ఉంది. కానీ తన ఆరోగ్యం కూడా సహకరించి ఉంటే అతని క్రికెట్ ప్రొఫెషన్ పరిపూర్ణంగా ఉండేది.
మీకు మీ సామర్థ్యం పట్ల అవగాహన ఉండాలి. ఉదాహరణకి మీకు డిజైనర్ కెరీర్ పట్ల మక్కువ ఉంది. ఇందులో రాణించాలంటే మీకు క్రియేటివిటీ లేదా స్కెచింగ్ లాంటివి అవసరం. ప్రస్తుతం మీకు ఆ స్కిల్స్ లేకపోయినా మీరు కృషితో, సాధనతో నేర్చుకోగలరా? లేదా? అన్న దానిపై మీరు తీసుకోవాల్సిన నిర్ణయం ఆధారపడి ఉంటుంది. ఏ చదువులో అయినా, ఆ చదువుకు తగ్గ సబ్జెక్ట్సుని నేర్చుకోగలగాలి. ఆ కెరీర్‌కి కావాల్సిన స్కిల్స్‌ని పెంపొందించుకోవాలి. ఆ సబ్జెక్ట్ ఎలా చదవాలి? అది మీరు చదవగలరా? లేదా? అని బేరీజు వేసుకుని నిర్ణయించుకోండి. ఒక పదానికి అర్థం తెలియకపోతే డిక్షనరీలో చూస్తాం. అదే ఒక డాక్టర్ మన ముందు మెడికల్ డిక్షనరీ తీస్తే? ఆమ్మో? డాక్టర్లకి జ్ఞాపక శక్తి ఎక్కువ అవసరం, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, సమయస్ఫూర్తి అవసరం. యుద్ధం చేసే సోల్జర్‌కి ధైర్యంతో పాటు డెసిషన్ మేకింగ్ అవసరం. అడ్వకేట్‌కి వాక్చాతుర్యం అవసరం. సాధించే సామర్థ్యం లేకపోతే అనుకున్నది సాధించడం కష్టం.
మార్కెట్ వాల్యూ
చాలా సందర్భాల్లో మీరు వార్తాపత్రికల్లో ఆర్థికమాంద్యం వల్ల సాఫ్ట్వేర్ అవకాశాలు తగ్గుముఖం అని వార్తలు రాగానే అమెరికా అల్లుడు వద్దు, సాఫ్ట్వేర్ వాళ్లు వద్దు అన్న కార్టూన్ చూసి ఉంటారు. ఎవరైనా చదువు పూర్తయ్యింది అనగానే ఉద్యోగం వచ్చిందా, జీతం ఎంత అని మొదట అడుగుతారు. వారికి తెలిసిన పెద్ద కంపెనీ అయితే వెరీగుడ్ అంటారు. అదే వారికి తెలియని పెద్ద కంపెనీ అయితే అంత ఉత్సాహం ఉండదు.
40 ఏళ్ల ఉద్యోగ కాలంలో పదిసార్లయినా మార్కెట్ మారుతుంది. 2000లో డాట్ కామ్ బబుల్, 2008 ఆర్థిక మాంద్యం ఇంకా 2020-21 కొవిడ్ పాండమిక్ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపాయి. కాబట్టి మార్కెట్ వాల్యూపై మాత్రం ఆధారపడకండి ఎందుకంటే ఒక సమాజంలో అన్ని వృత్తులవారు అవసరం. మీరు ఎంచుకున్న కెరీర్లో నిష్ణాతులై ఉంటే ఎటువంటి పరిస్థితుల్లోనైనా నెగ్గుకు రాగలరు.
మీరు ఒక నిర్ణయం తీసుకుని, దానికి తగిన పరీక్షలు రాసి, 12వ తరగతి తరువాత ఆ కెరీర్‌కి సంబంధించిన కోర్సుల్లో చేరుతారు తర్వాత ఏంటి? గ్రాడ్యుయేషన్ పూర్తిచేసే వరకు ఇంకేం ఆలోచించాల్సిన పనిలేదని మాత్రం అనుకోకండి. మీ కెరీర్‌కి కావాల్సిన స్కిల్స్, నాలెడ్జ్‌ను సమకూర్చుకోండి.12వ తరగతి తర్వాత మీరు చేరే కాలేజీ మీ ప్రొఫెషనల్ కెరీర్లో చేరుకోవాల్సిన గమ్యంలో ఉన్న మొదటి మైలురాయి మాత్రమే. అసలైన ప్రయాణం ఇంకా ముందుంటుంది. కాబట్టి జాగ్రత్తగా అడుగులు వేయండి. అనుకున్నది సాధించండి.మీ ఐసీఎం ఎలా ఉందో ఆసక్తి గల హైస్కూల్ విద్యార్థులు ఈ సైకోమెట్రిక్ అనాలిసిస్ని ప్రయత్నించవచ్చు. ఈ QR కోడ్‌ని స్కాన్ చేసి చెక్ చేసుకోండి.
Sirisha Reddy
Director – Academics
Gyanville Academy
+91 76759 62248
www.gyanville.in
IITJEE | CLAT | IIM IPM
- Tags
- Education News
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు