కరెంట్ అఫైర్స్
జాతీయం
తెలుగులో ఈ-కోర్ట్స్ యాప్
‘ఈ-కోర్ట్స్ సర్వీసెస్ మొబైల్ యాప్’ సేవలను తెలుగు సహా దేశంలోని 14 ప్రధాన భాషల్లోకి అందుబాటులోకి తెచ్చినట్టు సుప్రీంకోర్టు మే 23న ప్రకటించింది. దీనివల్ల కక్షిదారులు, సాధారణ ప్రజలు, న్యాయవాదులు, పోలీసులు, ప్రభుత్వ సంస్థలు కోర్టుల్లో నడుస్తున్న కేసుల స్థితిగతులను తెలుసుకోవడానికి వీలవుతుంది. యాప్‌లో కేసు, సీఎన్ఆర్, ఫైలింగ్ నంబర్లు, పార్టీ పేర్లు, ఎఫ్ఐఆర్ నంబర్, న్యాయవాది వివరాల ఆధారంగా తెలుసుకోవచ్చు.
మాల్దీవుల్లో భారత కాన్సులేట్
మాల్దీవ్స్ దేశంలోని అడ్డూ నగరంలో కాన్సులేట్‌ను ఏర్పాటు చేయడానికి కేంద్ర మంత్రివర్గం మే 25న ఆమోదం తెలిపింది. మాల్దీవులతో దౌత్య సంబంధాల మెరుగుకు ఇది దోహదపడుతుంది. ఆ దేశంపై ప్రభావాన్ని పెంచడానికి చైనా ప్రయత్నిస్తున్న నేపథ్యంలో భారత్ కాన్సులేట్ జనరల్ కార్యాలయాన్ని ప్రారంభించనుంది.
అరుదైన జాతి మొసళ్లు
ఒడిశాలోని సతకోషియా అభయారణ్యం పరిధి మహానదిలో అరుదైన ‘ఘరియల్’ జాతికి చెందిన మొసలి పిల్లలను అధికారులు మే 24న గుర్తించారు. దాదాపు 30 ఏండ్ల తర్వాత ఈ జాతి మొసలి పిల్లలు కనిపించాయి. పొడవైన ముక్కు కలిగి ఉండటం వీటి ప్రత్యేకత.
మిస్సింగ్ బాయ్ విన్యాసం
పంజాబ్‌లో కూలిపోయిన మిగ్-21 యుద్ధవిమానంలో మరణించిన స్కాడ్రన్ లీడర్ అభినవ్ చౌధరికి నివాళిగా ‘మిస్సింగ్ బాయ్’ విన్యాసాలను మే 27న నిర్వహించారు. వీటిని రాజస్థాన్‌లోని సూరత్‌గఢ్ వైమానిక స్థావరంలో మిగ్-21 బైసన్ యుద్ధవిమానాలతో చేపట్టారు. ఈ గగనతల విన్యాసంలో వైమానిక దళాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కే భదౌరియా ఓ విమానాన్ని నడిపారు.
ఆకలి రోజు
మే 28ను ప్రపంచ ఆకలి రోజుగా యూఎన్వో 2011 నుంచి నిర్వహిస్తుంది. దీర్ఘకాలికంగా ఆకలితో 820 మిలియన్లకుపైగా ప్రజలు జీవిస్తున్నారు. 2020కుగాను గ్లోబల్ హంగర్ ఇండెక్స్‌లో భారత్ 94వ స్థానంలో ఉంది.
43వ జీఎస్టీ సమావేశం
43వ జీఎస్టీ వీడియో కాన్ఫరెన్స్ సమావేశాన్ని మే 28న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రారంభించారు. కరోనా సెకండ్ వేవ్, రాష్ర్టాలకు పరిహారం, మందులు, వైద్యపరికరాలు, ఆరోగ్య సేవలపై పన్ను మినహాయింపు తదితర కీలక అంశాలపై చర్చించారు. ద్విచక్ర వాహనాలపై జీఎస్టీ తగ్గించడం, పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీలోకి తీసుకురావడం అంశాలను పరిశీలించారు.
అంతర్జాతీయం
అంతరిక్ష విమాన ప్రయోగం
సాధారణ పౌరులు అంతరిక్ష యాత్ర చేసేలా అమెరికాలోని వర్జిన్ గెలాక్టిక్ సంస్థ మే 23న చేపట్టిన ప్రయోగం విజయవంతమైంది. ‘వీఎస్ఎస్ యూనిటీ’ అనే విమానం ద్వారా ఇద్దరు పైలట్లు అంతరిక్షానికి చేరుకున్నారు. ఈ ప్రయోగంలో ఈ విమానాన్ని ‘వీఎంఎస్ ఈవ్’ అనే వాహకనౌకకు అనుసంధానించారు. దీన్ని న్యూమెక్సికో నుంచి నింగిలోకి పంపారు.
ఎంజీఎం-అమెజాన్
అమెరికాకు చెందిన మీడియా కంపెనీ ఎంజీఎం (మెట్రో గోల్డ్విన్ మేయర్)ను 8.45 బిలియన్ డాలర్ల (సుమారు రూ.63,300 కోట్లు)తో కొనుగోలు ఒప్పందం కుదిరిందని అమెజాన్ స్టూడియోస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మైక్ హాప్కిన్స్ మే 26న ప్రకటించారు. సినిమా రంగంలో వందేండ్ల అనుభవం ఉన్న ఎంజీఎం వద్ద 4000కు పైగా సినిమా టైటిళ్లు, 17,000కు పైగా టీవీ షోలు ఉన్నాయని హాప్కిన్స్ వెల్లడించారు.
60 బ్రాడ్‌బ్యాండ్ ఉపగ్రహాలు
స్పేస్ ఎక్స్ సంస్థ ఫాల్కన్-9 రాకెట్ ద్వారా 60 స్టార్‌లింక్ బ్రాడ్‌బ్యాండ్ ఉపగ్రహాలను ఫ్లోరిడా కేంద్రం నుంచి మే 28న అంతరిక్షంలోకి పంపించారు. స్పేస్ ఎక్స్ కోసం 2021లో 13 సార్లు ఫాల్కన్-9 రాకెట్ ద్వారా విజయవంతంగా ఉపగ్రహాలను నింగిలోకి చేరవేశారు.
యాస్ తుఫాన్
బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్‌కు ‘యాస్’ అని ఒమన్ దేశం మే 25న పేరుపెట్టింది. యాస్ అంటే పర్షియన్ భాషలో జాస్మిన్ అని అర్థం. 2020 మేలో భారతదేశం ఎదుర్కొన్న రెండు తుఫానుల్లో అంఫాన్ ఒకటి. దీనికి ఆకాశం అని అర్థం. ఈ పేరును థాయిలాండ్ పెట్టింది. అరేబియా సముద్రంలో నిసర్గా తుఫాన్ ఏర్పడింది. నిసర్గా అంటే ప్రకృతి అని అర్థం. ఈ పేరును బంగ్లాదేశ్ పెట్టింది.
వార్తల్లో వ్యక్తులు
చంద్ర కన్నెగంటి
బ్రిటన్‌లోని స్టోక్-ఆన్-ట్రెంట్ నగర మేయర్‌గా భారత సంతతికి చెందిన డాక్టర్ చంద్ర కన్నెగంటి ఎన్నికయ్యారని ఆ దేశ వార్తాసంస్థలు మే 22న వెల్లడించాయి. ఆయన తెలంగాణలోని నిజామాబాద్‌కు చెందినవారు.
డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి
ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ (ఏఐజీ) చైర్మన్ డాక్టర్ జీ నాగేశ్వర్‌రెడ్డికి ప్రతిష్ఠాత్మక ‘అమెరికన్ సొసైటీ ఫర్ గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ఎండోస్కోపీ (ఏఎస్‌జీఈ)’ సంస్థ అత్యున్నత పురస్కారాన్ని మే 24న అందజేసింది. ఈ అవార్డుకు ఎంపికైన తొలి భారతీయ వైద్యుడు ఆయనే. ‘అమెరికన్ గ్యాస్ట్రోస్కోపిక్ క్లబ్’ వ్యవస్థాపకులు, ఫాదర్ ఆఫ్ గ్యాస్ట్రోస్కోపీ’గా పిలిచే డాక్టర్ రుడాల్ఫ్ వీ షిండ్లర్ పేరిట ఈ అవార్డును జీర్ణకోశ వ్యాధుల చికిత్సల్లో విశిష్ట సేవలందించిన డాక్టర్లకు అందజేస్తారు.
అమర్త్యసేన్
భారత ఆర్థికవేత్త, నోబెల్ గ్రహీత అమర్త్యసేన్ స్పెయిన్ ప్రతిష్ఠాత్మక అవార్డు ‘ప్రిన్సెస్ ఆఫ్ ఆస్టురియస్’ అవార్డుకు మే 26న ఎంపికయ్యారు. సోషల్ సైన్సెస్ విభాగంలో 20 దేశాలకు చెందిన 41 మంది ప్రముఖుల జాబితా నుంచి ఆయనను ఎంపిక చేశారు. ‘ది ఐడియా ఆఫ్ జస్టిస్, ది డెవలప్మెంట్ యాజ్ ఫ్రీడం, ది చాయిస్ ఆఫ్ టెక్నిక్స్’ వంటి నవలలు రాశారు.
ఎరిక్ కార్లే
ప్రముఖ చిన్నపిల్లల రచయిత ఎరిక్ కార్లే మే 26న మరణించారు. ఈయన అమెరికాకు చెందినవారు. ‘ది వెరీ హంగ్రీ కాటర్‌పిల్లర్ (ఆకలిగొన్న గొంగళి పురుగు)’ నవల ద్వారా పేరు సంపాదించారు. ఇతను ప్రముఖ డిజైనర్.
అరుణ్ వెంకటరామన్
జో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ గ్రూప్‌లో భారత సంతతి వ్యక్తి అరుణ్ వెంకటరామన్ డైరెక్టర్ జనరల్ అండ్ ఫారిన్ కమర్షియల్ సర్ఫేస్, గ్లోబల్ మార్కెట్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ అసిస్టెంట్ సెక్రటరీగా మే 27న నియమితులయ్యారు.
నగేష్ రామచంద్రారావు
చింతామణి నగేష్ రామచంద్రారావుకు ‘ఎనర్జీ ఫ్రాంటియర్’ అవార్డు మే 27న లభించింది. కార్బన్ నానో ట్యూబ్‌లు, మెటల్ ఆక్సైడ్లు, ఇతర పదార్థాలు, రెండు డైమెన్షనల్ సిస్టమ్‌లపై చేసిన కృషికి ఆయనకు ఈ అవార్డు దక్కింది. ఇతనికి 2014లో ‘భారత రత్న’ అవార్డు లభించింది.
క్రిస్టీన్ వోర్ముత్
అమెరికా సైన్యంలో తొలిసారి మహిళా కార్యదర్శిగా క్రిస్టీన్ వోర్ముత్ నియామకాన్ని సెనేట్ మే 27న ఏకగ్రీవంగా ఆమోదించింది. అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ఎన్నికైన అనంతరం అధికార మార్పిడి బృందానికి ఆమె నాయకత్వం వహించారు.
ఎరిక్ గార్సెట్టి
భారత్‌లో అమెరికా రాయబారిగా లాస్ ఏంజెల్స్ మేయర్ ఎరిక్ గార్సెట్టిని నియమించనున్నట్టు జో బైడెన్ మే 27న వెల్లడించారు. ఎరిక్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ ప్రచార బృందానికి కో చైర్మన్‌గా వ్యవహరించారు.
గిలెర్మో లాసో
ఈక్వెడార్ అధ్యక్షుడిగా గిలెర్మో లాసో మే 27న బాధ్యతలు చేపట్టారు. 14 ఏండ్లలో తొలి మితవాద నాయకుడు ఇతడు. బ్యాంక్ అధికారిగా పనిచేశారు. ఇతను ఎన్నికల్లో వామపక్ష ఆర్థికవేత్త ఆండ్రెస్ ఆరెజ్ను ఓడించారు.
క్రీడలు
ఎఫ్ఐహెచ్ అధ్యక్షుడిగా నరిందర్
భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సభ్యుడు నరిందర్ బత్రా అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) అధ్యక్షుడిగా మరోసారి మే 22న ఎన్నికయ్యాడు. బెల్జియం హాకీ సమాఖ్య అధ్యక్షుడితో పోటీపడిన బత్రాకు రెండు ఓట్ల ఆధిక్యంతో ఈ పదవి దక్కింది.
ఫిల్కు గోల్ఫ్ టైటిల్
మే 24న నిర్వహించిన యూఎస్ పీజీఏ గోల్ఫ్ చాంపియన్‌షిప్ విజేతగా ఫిల్ మికెల్సన్ నిలిచాడు. ఇతడికి ఇది ఆరో టైటిల్. 50 ఏండ్ల వయస్సులో ఈ టైటిల్ సాధించిన పెద్ద వయస్కుడిగా రికార్డు సృష్టించాడు.
క్రిస్టియానో రొనాల్డో
ఇటలీ ఫుట్‌బాల్ లీగ్ చాంపియన్‌షిప్ ‘సిరీ ఏ’లో ఈ సీజన్ (2020-21)లో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా క్రిస్టియానో రొనాల్డో నిలిచాడని క్రీడల అధికారులు మే 24న వెల్లడించారు. దీంతో ఈ లీగ్‌తో పాటు ప్రీమియర్ లీగ్, లా లిగా లీగ్‌ల్లోనూ ఓ సీజన్లో టాప్‌స్కోరర్‌గా నిలిచిన ఏకైక ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. సిరీ ఏ లీగ్ తాజా సీజన్లో 29 గోల్స్ చేశాడు.
యూరోప్ లీగ్ ఫుట్‌బాల్
యూరోప్ ఆఫ్ లీగ్ ఫుట్‌బాల్ టైటిల్‌ను విల్లారియల్ జట్టు 1 గోల్ తేడాతో గెలుచుకుంది. మే 26న పోలెండ్‌లో నిర్వహించిన ఈ పోటీలో మాంచెస్టర్ జట్టును ఓడించింది. 98 ఏండ్ల చరిత్రలో విల్లారియల్కు ఇదే అతిపెద్ద టైటిల్.
ఫిఫా ర్యాంకింగ్
అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య ఫిఫా ర్యాంకింగ్‌ను మే 27న విడుదల చేసింది. దీనిలో బెల్జియం జట్టు మొదటి స్థానంలో నిలిచింది. ఫ్రాన్స్ 2, బ్రెజిల్ 3, ఇంగ్లండ్ 4, పోర్చుగల్ 5, భారత్ 105వ స్థానంలో ఉన్నాయి. భారత మహిళల ఫుట్‌బాల్ జట్టు 57వ స్థానంలో ఉంది.
వేముల సైదులు
జీకే, కరెంట్ అఫైర్స్ నిపుణులు
ఆర్సీ రెడ్డి స్టడీ సర్కిల్ హైదరాబాద్
- Tags
- Current Affairs
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు