ఈ వారం.. జాతీయం-అంతర్జాతీయం
PMGKAY మరో ఆరు నెలలు పొడిగింపు
ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్నయోజన పథకాన్ని మరో ఆరు నెలలు పొడిగించాలన్న ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్ మార్చి 29న ఆమోదం తెలిపింది. దాంతో ఈ ఏడాది సెప్టెంబర్ వరకు ఈ పథకం అమల్లో ఉండనుంది. ఈ పథకం ద్వారా జాతీయ ఆహార భద్రతా చట్టం-2013 కింద ఇచ్చే బియ్యం కోటాకు అదనంగా ప్రతి లబ్ధిదారుడికి ఐదు కిలోల చొప్పున ఉచిత రేషన్ ఇస్తారు. ఇప్పటికే ఐదు దశల్లో ఈ పథకాన్ని వర్తింపజేశారు. ఐదోదశ 2022, మార్చితో ముగిసినందున ఇప్పుడు ఆరో దశ కింద మరో ఆరు నెలలు పొడిగించారు.
గోవా సీఎంగా సావంత్ ప్రమాణం
గోవా ముఖ్యమంత్రిగా ప్రమోద్‌కుమార్ సావంత్ వరుసగా రెండోసారి ప్రమాణస్వీకారం చేశారు. ఇటీవల జరిగిన గోవా అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ విజయం సాధించింది. దాంతో మళ్లీ సావంత్‌కే ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టారు. మార్చి 28న పనాజీ సమీపంలో బాంబోలిన్ వద్ద డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జి స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో సావంత్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ పీఎస్ శ్రీధరన్ పిైళ్లె ఆయన చేత ప్రమాణం చేయించారు. సావంత్‌తోపాటు 8 మంది గోవా బీజేపీ ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు.
ఒడిశాలో ఘనంగా ఉత్కల్ దివస్
ఒడిశాలో ఏప్రిల్ 1న ఘనంగా ఉత్కల్ దివస్ (ఒడిశా డే)ను నిర్వహించారు. ఒడిశా రాష్ట్ర అవతరణ దినోత్సవానికి గుర్తుగా ప్రతి ఏడాది ఏప్రిల్ 1న ఒడిశా డే (ఉత్కల్ దివస్) జరుపుకుంటారు. ముందుగా ఒడిశాను ఒరిస్సా అని పిలిచేవారు. అయితే 2011లో లోక్‌సభలో పాసైన 113వ రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా ఒరిస్సాను ఒడిశాగా మార్చారు. 1936 ఏప్రిల్ 1న ఒరిస్సా రాష్ట్రం అవతరించింది.
94వ ఆస్కార్ అవార్డులు
ఈ ఏడాది మార్చి 27న 94వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. కోడా (CODA) సినిమాకు ఉత్తమ చిత్రం అవార్డు దక్కింది. జెస్సికా చాస్టెయిన్కు ఉత్తమ నటి అవార్డు వచ్చింది. ది ఐస్ ఆఫ్ టామీ ఫయే చిత్రంలో నటనకు ఆమెను ఈ అవార్డు వరించింది. ఉత్తమ నటుడు అవార్డుకు విల్ స్మిత్ ఎంపికయ్యాడు. కింగ్ రిచర్డ్ చిత్రంలో నటనకు ఆయనకు ఈ అవార్డు దక్కింది. జానీ కాంపియన్కు ది పవర్ ఆఫ్ డాగ్ చిత్రానికిగాను బెస్ట్ డైరెక్టర్ అవార్డు వచ్చింది. డ్రైవ్ మై కార్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్‌గా నిలిచింది. ఉత్తమ సహాయ నటుడు అవార్డు ట్రాయ్ కోట్సర్కు, ఉత్తమ సహాయనటి అవార్డు అరియానా డీబోస్కు వచ్చాయి. బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్‌గా ది విండ్‌షీల్డ్ వైపర్, బెస్ట్ షార్ట్ డాక్యుమెంటరీగా ద క్వీన్ ఆఫ్ బాస్కెట్‌బాల్ నిలిచాయి.
శ్రీలంకలో బిమ్స్టెక్ సదస్సు
బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ (BIMSTEC) దేశాధినేతల 5వ సదస్సు మార్చి 30న శ్రీలంక రాజధాని కొలంబోలో జరిగింది. ఈ సదస్సు థీమ్.. టూవర్డ్స్ ఎ రెసిలియంట్ రీజియన్, ప్రాస్పరస్ ఎకానమీస్, హెల్తీ పీపుల్. ఈ సదస్సులో రవాణా కనెక్టివిటీ కోసం మాస్టర్ ప్లాన్‌ను స్వీకరించారు. అదేవిధంగా రష్యా, ఉక్రెయిన్ పరిణామాలపై చర్చించారు. భారత్ తరఫున ప్రధాని మోదీ వర్చువల్ విధానంలో ఈ సదస్సుకు హాజరయ్యారు. బిమ్స్టెక్లో సభ్యదేశాల సంఖ్య మొత్తం ఏడు. అవి భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్, మయన్మార్, భూటాన్, నేపాల్, థాయ్‌లాండ్. బిమ్స్టెక్ను 1997 జూన్ 6న స్థాపించారు.
ISS నుంచి భూమికి ముగ్గురు వ్యోమగాములు
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్-ISS) నుంచి మార్చి 30న ముగ్గురు వ్యోమగాములు సురక్షితంగా భూమికి చేరుకున్నారు. వారిలో ఒకరు అమెరికాకు చెందిన మార్క్ వాండే హీ కాగా, మరో ఇద్దరు రష్యాకు చెందిన ఆంటోన్ ష్కప్లెరోవ్, ప్యోటర్ డుబ్రోవ్ ఉన్నారు. వీరిని నాసాకు చెందిన స్పేస్ షిప్ ది సోయుజ్ ఎంఎస్-19 భూమి మీదకు తీసుకొచ్చింది. కజకిస్థాన్‌లో వీరు ల్యాండయ్యారు. అమెరికా వ్యోమగామి మార్క్ వాండే హీ మొదటిసారి వెళ్లి 340 రోజులు, రెండోసారి వెళ్లి 355 రోజులు అంతరిక్షంలో గడుపడం ద్వారా రికార్డు సృష్టించాడు.
అమెరికా, ఫిలిప్పైన్స్ సైనిక విన్యాసాలు
దక్షిణ చైనా సముద్రంలో తాజా ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అమెరికా, ఫిలిప్పైన్స్ సంయుక్త సైనిక విన్యాసాలను నిర్వహిస్తున్నాయి. అమెరికా, ఫిలిప్పైన్స్ మధ్య సంబంధాలు బలంగా ఉన్నాయనే దానికి సంకేతంగా ఆర్చిపెలాగో దీవుల్లో మార్చి 28న ఈ సంయుక్త సైనిక విన్యాసాలు ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 8 వరకు ఈ మిలిటరీ ఆపరేషన్స్ కొనసాగుతాయి. ఈ సంయుక్త సైనిక విన్యాసాల్లో అమెరికా, ఫిలిప్పైన్స్ దేశాలకు చెందిన దాదాపు 8,900 మంది సైనికులు పాల్గొన్నారు.
సింధూకు స్విస్ ఓపెన్ టైటిల్
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఖాతాలో మరో టైటిల్ చేరింది. స్విట్జర్లాండ్ ఓపెన్ సింగిల్స్ టైటిల్‌ను ఆమె సొంతం చేసుకుంది. మార్చి 26న జరిగిన సింగిల్స్ ఫైనల్ మ్యాచ్‌లో రెండో సీడ్ సింధు 21-16, 21-8 తేడాతో థాయ్‌లాండ్‌కు చెందిన నాలుగో సీడ్ బుసానన్ ఒన్గ్బారున్ఫాన్ను చిత్తుచేసి ట్రోఫీ అందుకుంది. గత స్విస్ ఓపెన్ ఫైనల్లో ఓడి రన్నరప్‌గా నిలిచిన సింధు.. ఈ ఏడాది టైటిల్‌ను కైవసం చేసుకుంది.
మీరాబాయి ఛానుకు BBC అవార్డు
భారత వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి ఛానుకు 2021 ఏడాదికిగాను BBC ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కింది. మార్చి 31న BBC ప్రకటించిన మూడో ఎడిషన్ అవార్డులలో మీరాబాయి ఛానుకు ఈ అవార్డు లభించింది. మీరాబాయి ఛాను 2017లో జరిగిన వరల్డ్ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించింది. 2018లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో కూడా మీరాబాయి ఛాను స్వర్ణం గెలుచుకుంది. ఆ తర్వాత 2021లో జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది.
సౌదీఅరేబియా గ్రాండ్ ప్రి విజేత వెర్స్టాపెన్
సౌదీఅరేబియా గ్రాండ్ ప్రి టైటిల్‌ను రెడ్‌బుల్ డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ గెలుచుకున్నాడు. మార్చి 28న జెడ్డాలో ఈ గ్రాండ్ ప్రి ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ టైటిల్ గెలువడం ద్వారా వెర్స్టాపెన్ తన కెరీర్లో 21 విజయాలు సాధించినట్లయ్యింది.
భారత మహిళా జట్టుకు ఫుట్‌బాల్ టైటిల్
SAFF అండర్-18 మహిళల అంతర్జాతీయ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్ 3వ ఎడిషన్ టైటిల్‌ను భారత జట్టు గెలిచింది. జార్ఖండ్ రాష్ట్రం జంషెడ్‌పూర్‌లోని జేఆర్డీ టాటా కాంప్లెక్సులో ఈ టోర్నీని నిర్వహించారు. ఈ టోర్నీలో అత్యధికంగా ఐదు గోల్స్ చేసిన లిండా కోమ్ ది వ్యాల్యుబుల్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచింది.
హిమాంత బిశ్వశర్మ
బ్యాడ్మింటన్ అసోషియేషన్ ఆఫ్ ఇండియా (BAI) అధ్యక్షుడిగా అసోం ముఖ్యమంత్రి హిమాంత బిశ్వశర్మ మరోసారి ఎంపికయ్యారు. మార్చి 25న ఆయనను రెండోసారి BAI అధ్యక్షుడిగా ఎంపికచేశారు. బిశ్వశర్మ 2026 వరకు ఈ పదవిలో కొనసాగుతారు. ఈయన 2017లో తొలిసారిగా BAI చీఫ్‌గా ఎన్నికయ్యారు. తాజాగా ఆ పదవీకాలం ముగియడంతో మరోసారి ఆయననే BAI చీఫ్‌ను చేశారు.
డాక్టర్ పీ రఘురాం
ఉషా లక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు డాక్టర్ పీ రఘురాంకు బ్రిటన్ రెండో అత్యున్నత పురస్కారం ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ దక్కింది. మార్చి 30న ఆయన ఈ అవార్డును స్వీకరించారు. డాక్టర్ రఘురాంను 2015లో భారత నాలుగో అత్యున్నత పురస్కారమైన పద్మశ్రీ లభించింది. 2016లో బీసీ రాయ్ అవార్డును స్వీకరించారు.
విల్ఫ్రైడ్ బ్రూట్సర్ట్
అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ విల్ఫ్రైడ్ బ్రూట్సర్ట్ను స్టాక్‌హోం వాటర్ ప్రైజ్ లారియట్ 2022 వరించింది. మార్చి 30న ఆయన ఈ అవార్డును స్వీకరించారు. 1991 నుంచి ఈ అవార్డును ప్రదానం చేస్తున్నారు.
గిల్బర్ట్ ఎఫ్ హౌన్బో
అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్-ILO)కు డైరెక్టర్ జనరల్‌గా టోగో దేశ మాజీ ప్రధాని గిల్బర్ట్ ఎఫ్ హౌన్బో ఎన్నికయ్యారు. మార్చి 25న ILO గవర్నింగ్ బాడీ ఆయనను ఎన్నుకున్నది. గిల్బర్ట్ హౌన్బో ప్రస్తుతం ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చరల్ డెవలప్మెంట్ (IFAD) అధ్యక్షుడిగా ఉన్నారు. ఐక్యరాజ్యసమితి కంటే ముందే ఐఎల్వో ఏర్పడింది. దీని ప్రధాన కార్యాలయం జెనీవాలో ఉంది. ఐఎల్‌వోకు 1969లో నోబెల్ శాంతి బహుమతి లభించింది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు