What is the decoration of the gourd | గోరంతను కొండంతలుగా చేసి చెప్పడం ఏ అలంకారం?
టెట్ ప్రత్యేకం
అలంకారాలు
l అలంకారాలు అంటే సామాన్య వ్యవహారిక భాషలో ఆభరణాలు, నగలు అని అర్థం.
l ప్రాచీన అలంకారికులు కావ్యాలను కాంతలతో (స్త్రీ) పోల్చారు.
l స్త్రీ శరీరానికి ఆభరణాలు, నగలు అందాన్ని, సొగసును ఇస్తాయి.
l కావ్యం అనే శరీరానికి అలంకారాలు అర్థాన్ని, భావుకతను చేరుస్తాయి.
అలంకారాలు-రకాలు
l అలంకారాలు రెండు రకాలు.
1. శబ్దాలంకారాలు
2. అర్థాలంకారాలు
1. శబ్దాలంకారాలు
l శబ్దాన్ని మాత్రమే ఆశ్రయించేవి.
l ఇవి శబ్దాల కూర్పునకు, శైలి సౌందర్యానికి ప్రాధాన్యం ఇస్తాయి.
l వీటిలో మూడు రకాలు. అవి..
ఎ. అనుప్రాసాలంకారం
బి. యమకాలంకారం
సి. ముక్తపదగ్రస్తాలంకారం
అనుప్రాసాలంకారం
l రసానుగుణ్యమైనది అనుప్రాస. ఈ అలంకారాలు నాలుగు రకాలు.
i. వృత్త్యానుప్రాసాలంకారం
ii. ఛేకానుప్రాసాలంకారం
iii. లాటానుప్రాసాలంకారం
iv. అంత్యానుప్రాసాలంకారం
వృత్త్యానుప్రాసాలంకారం (Repeat)
l ఒకటి లేదా అంతకంటే ఎక్కువ హల్లులు పలుమార్లు ఆవృతమైనట్లయితే అది వృత్త్యానుప్రాసాలంకారం.
ఉదా:
1. లచ్చి పుచ్చకాయలను తెచ్చి ఇచ్చింది.
2. కాకి కోకిల కాదు కదా.
3. బాబు జిలేబి పట్టుకుని డాబాపైకి గబగబ ఎక్కాడు.
4. గట్టుమీద చెట్టు కింద కిట్టు తన రొట్టెను లొట్టలేసుకుంటూ తింటున్నాడు.
5. రత్తమ్మ తన అత్తమ్మకు కొత్తదుత్తతో పాలు తెచ్చి ఇచ్చింది.
6. లక్ష భక్షములు తిన్న లక్ష్మయ్యకు ఒక్క భక్ష్యము లక్ష్యమా!
ఛేకానుప్రాసాలంకారం (జంట – Gap)
l అర్థభేదం కలిగిన హల్లులు లేదా పదాల జంట వ్యవధానం (Gap) లేకుండా వెంటవెంటనే ప్రయోగిస్తే అది ఛేకానుప్రాసాలంకారం. ఛేకము అంటే జంట.
ఉదా:
1. అనాథ నాథ నంద నందన నీకు వంద వందనాలు.
2. అరటి తొక్క తొక్కరాదు.
3. అమ్మో! అమ్మోరు.
4. నిప్పులో పెట్టిన కాలు కాలుతుందా.
5. తమ్మునికి చెప్పు చెప్పు తెగకుండా నడవమని
6. నీటిలో పడిన తేలు తేలుతుందా.
7. హారతి హారతికిచ్చిరి.
8. మోహనా మోహనావపై వెళ్లింది.
9. ఇంతియా! ఇంతియాజ్.
10. అబ్బా! అబ్బాసా.
11. వీరు వీరుత్ పరార్థుల్.
లాటానుప్రాసాలంకారం (తాత్పర్యభేదం)
l అర్థభేదం కాకుండా పదాలను తాత్పర్యభేదంతో వెంటవెంటనే ప్రయోగిస్తే అది లాటానుప్రాసాలంకారం. ఇవి సాధారణంగా వాక్యం చివరలో వస్తాయి.
ఉదా:
1. కమలాక్షు నర్చించు కరములు కరములు
2. శ్రీనాథుడు వర్ణించు జిహ్వ జిహ్వ
3. గురుని సేవించెడి సేవ సేవ
4. అబల రక్షణగావించు బలము బలము
5. శ్రీహరి స్మరియించు చిత్తము చిత్తము
6. దీన మానవులకు సేవ సేవ
అంత్యానుప్రాసాలంకారం (చివర్లో ప్రాస)
l పదాంతంలో గాని, పాదాంతంలో గాని, వాక్యాంతంలో గాని ఒక హల్లు మళ్లీ మళ్లీ ప్రయోగిస్తే అది అంత్యానుప్రాసాలంకారం.
1. అశోక వనమున సీత
విలపించెను శోకము చేత
2. కొందరికి రెండు కాళ్లు
రిక్షావాళ్లకి మూడు కాళ్లు
ఉన్నవాళ్లకు నాలుగు కాళ్లు
3. నగారా మోగిందా
నయగారా దూకిందా
4. రాముడు రణభీముడు ఇన వంశ సోముడు
5. భాగవతమున భక్తి
భారతమున ముక్తి
రామ కథయే రక్తి
ఓ కూనలమ్మా! (మకుటం)
6. తలుపు గొళ్లెం
హారతి పళ్లెం
గురపు కళ్లెం
7. నిజం తెలుసుకో గురుడా
ఇజం మార్చుకో నరుడా
8. స్మరిస్తే పద్యం
అరిస్తే వాద్యం
అనిల వేదిక ముందు అస్త్రనైవేద్యం
అంతఃప్రాస: మధ్యలో వచ్చే ప్రాస.
ఉదా: ప్రపంచ పదులు (సినారె)
యమకాలంకారం
l అర్థభేదం కలిగిన జంట పదాలు కొంత వ్యవధానంతో ప్రయోగిస్తే యమకాలంకారం.
ఉదా:
1. గంగా వేగంగా పరిగెడుతుంది.
2. పెరుగు తింటే పెరుగుతాడు.
3. ఆ తోరణము శత్రువులతో రణమునకు దారితీసింది.
4. ప్రతివారికి ఒక ప్రతి ఉచితం.
5. మన సుభద్రకు మనసు భద్రమాయే.
6. హారికా! జోహారికా!
7. రాధికా నీకిక బుద్ధి రాదిక.
l ముక్త పదము అంటే విడిచిన పదం. గ్రస్తం అంటే గ్రహించడం అని అర్థం.
ముక్త పదగ్రస్తాలంకారం
l విడిచిన పదాన్ని గ్రహించి చెబితే అది ముక్తపదగ్రస్తం.
l మొదటి పాదం చివర విడిచిన పదాన్ని రెండో పాదం మొదట, రెండో పాదం చివర విడిచిన పదాన్ని మూడో పాదం మొదట, మూడో పాదం చివర విడిచిన పదాన్ని నాలుగో పాదం మొదట గ్రహించి చెప్పినట్లయితే అది ముక్తపదగ్రస్తాలంకారం.
ఉదా:
1. హిమబిందువు పాదాలకు పెట్టారు పారాణి
రాణి సోయగములు చిందించింది
2. అదిగదిగో మేడ
మేడ లోపల గోడ
గోడ పక్కన దూడ
దూడ వెనుక పేడ
3. సుదతీ నూతన మదనా
మదనాగ తురంగ పూర్ణమణిమయ సదనా
సదనామయ గజరదనా
రదనాగేంద్ర నిభకీర్తి రసనరసింహా!
4. మార సుందర సుందర ధీరమూర్తి
మూర్తి గతలోప పూజితాంగ
అంగా సంగత గంగాతరంగ
విశ్వరక్షక స్వామి శ్రీవేలకోటేశా!
5. జనకుండెడి అనుష్టాన వేదిక చూచు
చూచి గ్రమ్మరబోయి చూడవచ్చు.
అర్థాలంకారాలు.
l అర్థాన్ని ఆశ్రయించి చెప్పేవి అర్థాలంకారాలు.
l ఇవి శబ్దాల అర్థానికి ప్రాధాన్యం ఇస్తాయి.
l ఇందులో ముఖ్యమైనవి ఇవి..
ఎ. ఉపమాలంకారం
బి. ఉత్ప్రేక్షాలంకారం
సి. రూపకాలంకారం
డి. అతిశయోక్తి అలంకారం
ఇ. స్వభావోక్తి అలంకారం
ఎఫ్. అర్థంతరన్యాసాలంకారం
జి. శ్లేషాలంకారం
హెచ్. దృష్టాంతాలంకారం
ఐ. వ్యాజస్తుతాలంకారం
జె. క్రమాలంకారం
ఉపమాలంకారం
l ఉపమేయమును ఉపమానముతో మనోహరంగా చక్కని పోలికతో వర్ణించి చెప్పేది ఉపమాలంకారం. పోలికను సూచించే అలంకారం. ఇది నాలుగు లక్షణాలు కలిగి ఉంటుంది.
ఉపమేయం (విషయం)
l ఏ వస్తువును అయితే వర్ణిస్తున్నామో లేదా పోలుస్తున్నామో ఆ వస్తువు ఉపమేయం.
ఉపమానం (విషయి)
l ఏ వస్తువుతో అయితే వర్ణిస్తున్నామో లేదా పోలుస్తున్నామో అది ఉపమానం.
ఉపమావాచకం
l పోలికను తెలిపే పదాలు.
ఉదా: వలె, వోలె, లాగా, లా, విధంబున, చందంబున, రీతి, కైవడి, భంగి.
సమానధర్మం (సాదృశ్యం)
l ఉపమేయ, ఉపమాన ధర్మాల్లో సమానమైన ధర్మం.
ఉదా: సత్యభామ ముఖం చంద్రబింబం వలె
ఉపమేయం ఉపమానం ఉపమావాచకం
మనోహరంగా ఉన్నది.
సమానధర్మం
l రైతు ముని వలె తెల్లవారుజామునే లేస్తాడు.
ఉపమాలంకారం రెండు రకాలు. అవి..
i. పూర్ణోపమాలంకారం
ii. లుప్తోపమాలంకారం
పూర్ణోపమాలంకారం
l పై నాలుగు లక్షణాలు (ఉపమేయం, ఉపమానం, ఉపమావాచకం, సమానధర్మం) ఉన్న అలంకారం.
ఉదా: 1. తోటలోని పిల్లలు సీతాకోక చిలుకల లాగా అటుఇటు తిరుగుతున్నరు.
2. కిశోర్ లేడిపిల్ల లాగా పరుగెత్తుతున్నాడు.
లుప్తోపమాలంకారం
l ఉపమేయ, ఉపమాన, ఉపవాచక, సమానధర్మ లక్షణాల్లో ఏ ఒక్క లక్షణం లోపించినా అది లుప్తోపమాలంకారం.
ఉదా: 1. ఆమె ముఖం చంద్రుడివలె ఉన్నది. (సమాన ధర్మం లోపించింది)
2. మన్మథుడు సుందరుడు (ఉపమావాచకం, సమాన ధర్మం లోపించింది)
బి. ఉత్ప్రేక్షాలంకారం (ఊహ, అన్నట్లు)
l ఉపమాన ధర్మ సామ్యంతో ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించి చెప్పడమే ఉత్ప్రేక్షాలంకారం.
ఉదా: 1. ఆ చంద్రుడు అద్దపుబిల్లయో
అన్నట్లున్నాడు.
2. ఆ ఏనుగు నడిచే కొండ అన్నట్లున్నది.
3. ఆకాశంలోని మేఘాలు
గున్న ఏనుగుల్లా అన్నట్లున్నాయి.
4. తోటలోని పువ్వులా అన్నట్లు
ఆకాశంలోని నక్షత్రాలున్నాయి.
5. మండే ఎండ నిప్పుల కొలిమా
అన్నట్లున్నది.
సి. రూపకాలంకారం (అభేదం)
l ఉపమాన ధర్మాన్ని ఉపమేయమందు ఆరోపించి ఉపమేయానికి, ఉపమానానికి భేదం లేదని చెప్పడం.
ఉదా:
1. సంసార సాగరాన్ని ఈదుట మిక్కిలి కష్టం.
2. ఉపాధ్యాయుడు జ్ఞానజ్యోతులను
ప్రకాశింపజేస్తాడు.
3. బతుకు ఆటలో గెలుపు ఓటములు సహజం.
4. రుద్రదేవి చండీశ్వరీదేవి జలజలా పారించే శత్రువుల రక్తమ్ము చెడని సెలవేయగా.
డి.అతిశయోక్తి అలంకారం (గోరంత కొండంత)
l ఉన్నదాని కంటే ఎక్కువ చేసి చెప్పడం. గోరంతను కొండంతలుగా చేసి చెప్పడం.
ఉదా:
1. మా పట్టణంలోని భవనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
2. మా ఊరిలో చెరువు సముద్రమంత ఉన్నది.
3. మా ఆయన బంగారం.
4. మా చెల్లెలు తాటి చెట్టంత పొడవు ఉన్నది.
5. మా ఊరిలో కూరగాయల ధరలు మండుతున్నాయి.
ఇ. స్వభావోక్తి అలంకారం (ఉన్నది ఉన్నట్లు)
l జాతి, గుణ, క్రియాది స్వభావాలతో ఉన్నది ఉన్నట్లుగా వర్ణించి చెబితే అది స్వభావోక్తి అలంకారం.
ఉదా:
1. ఆ ఉద్యానవనంలోని జింకలు చెంగుచెంగున ఎగురుతూ చెవులు రిక్కించి బిత్తరచూపులు చూస్తున్నాయి.
2. లంకకు వెళ్లిన హనుమంతుడు మండోదరిని చూసి సీతను చూశానన్న ఆనందంతో స్తంభాలెక్కి దూకాడు. ఆనందంలో తోకను ముద్దుపెట్టుకున్నాడు.
ఎఫ్.అర్థంతరన్యాసాలంకారం: (విశేష
విషయం – సామాన్య విషయం)
l విశేష విషయాన్ని సామాన్య విషయం చేత, సామాన్య విషయాన్ని విశేష విషయంతో సమర్థించి చెప్పడం అర్థంతరన్యాసాలంకారం.
ఉదా:
1. శివాజీ కళ్యాణి దుర్గమును జయించెను (విశేష విషయం)
వీరులకు సాధ్యం కానిదేముంది
(సామాన్య విషయం)
2. హనుమంతుడు సముద్రమును దాటెను
(విశేష విషయం)
మహాత్ములకు సాధ్యం కానిదేముంది
(సామాన్య విషయం)
3. మేఘుడు అంబుదికి పోయి జలాన్ని తెస్తాడు (విశేష విషయం)
లోకోపకర్తతకు ఇది సహజగుణం
(సామాన్య విషయం)
4. గొప్పవారితో కలిసి ఉండటం ద్వారా అల్పులు కూడా గౌరవాన్ని పొందుతారు (సామాన్య విషయం).
5. పుష్పాలతోపాటు దారాన్ని కూడా అలంకరిస్తారు.
(విశేష విషయం)
శివశంకర్
తెలుగు సీనియర్ ఫ్యాకల్టీ
ఏకేఆర్ స్టడీ సర్కిల్
వికారాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?