స్థానిక స్వపరిపాలనా సంస్థలు
స్థానిక పరిపాలనా వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు తోడ్పడే సంస్థలను స్థానిక ప్రభుత్వాలు అంటారు. రాజ్యాంగంలోని ప్రకరణ 40 పంచాయతీరాజ్ సంస్థలను ఏర్పాటు చేయాలని పేర్కొంటుంది. IVవ భాగంలో పేర్కొన్న వీటికి రాజ్యాంగబద్ధత లేకపోవడంతో ఆచరణలో సత్ఫలితాలను పొందలేదు. దీంతో కేంద్ర ప్రభుత్వం ఎల్ఎం సింఘ్వీ కమిటీ సూచనల మేరకు పంచాయతీరాజ్, నగరపాలక సంస్థలకు 73, 74 రాజ్యాంగ సవరణల (1992) ద్వారా రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించారు.
చరిత్ర
-ప్రాచీన కాలంలో స్థానిక ప్రభుత్వాలకు విశేషమైన ప్రాధాన్యం ఉంది. రుగ్వేదంలో సభ, సమితి అనే రెండు స్థానిక స్వపరిపాలనా సంస్థల ప్రస్తావన ఉంది. ఇవి గ్రామస్థాయిలో అనేక పరిపాలన, రాజకీయ విధులను నిర్వర్తించాయి.
-కౌటిల్యుడు తన అర్థశాస్త్రంలో గ్రామిక, గ్రామకూట అనే గ్రామాధికారుల గురించి ప్రస్తావించాడు. గ్రామాధికారిని గ్రామణి అని, 10 గ్రామాలకు అధిపతిని దశగ్రామణి అని పిలిచేవారు. మెగస్తనీస్ తన ఇండికా గ్రంథంలో పాటలీపుత్ర నగరంలోని మున్సిపల్ ప్రభుత్వం గురించి వివరించాడు.
-మధ్యయుగ దక్షిణ భారతంలో చోళులు స్థానిక స్వపరిపాలనకు పేరుగాంచారు. చోళులు తాటి ఆకులను బ్యాలెట్ పత్రాలుగాను, కుండలను బ్యాలెట్ బాక్సులుగా ఉపయోగించారని మొదటి పరాంతుకుని ఉత్తర మేరూరు శాసనం తెలుపుతుంది. అంతేగాకుండా పంచాస్ అనే ఐదుగురు సభ్యులతో కూడిన ఒక మండలి గ్రామీణ ప్రాంతాల్లోని సమస్యలను పరిష్కరించేది. ఈ పంచాస్ కాలక్రమేణా పంచాయతీగా మారిందని ఒక ప్రతీతి.
-ఢిల్లీ సుల్తానుల కాలంలో భూమిని కొలిచి దాని ఆధారంగా శిస్తు విధించే విధానాన్ని షేర్షా ప్రారంభించాడు. ఇతని కాలంలో గ్రామస్థాయిలో స్థానిక సంస్థలు పనిచేసేవి. మొఘలుల కాలంలో కొత్వాల్ అనే అధికారి పట్టణ పాలనను చూసుకునేవాడు. ఈ కొత్వాల్‌కు మున్సబ్ సహాయంగా ఉండేవారు.
బ్రిటిష్ కాలంలో..
-మద్రాస్ నగరపాలక కార్పొరేషన్ స్థాపనతో దేశంలో ఆధునిక స్థానిక ప్రభుత్వ చరిత్ర ప్రారంభమైంది. రెండో జేమ్స్ చక్రవర్తి జారీచేసిన చార్టర్ చట్టం-1687 ద్వారా పన్నుల వసూలు కోసం మద్రాస్ మున్సిపల్ కార్పొరేషన్‌ను ఈస్టిండియా కంపెనీ స్థాపించింది. పన్ను విధింపును ప్రజలు వ్యతిరేకించడంతో 1762లో కార్పొరేషన్ స్థానంలో మేయర్ కోర్టులు స్థాపించారు. ఇవి పాలనా వ్యవహారాలకంటే న్యాయసంబంధమైన విధులనే ఎక్కువగా నిర్వహించేవి.
-బ్రిటిష్‌వారు జిల్లాను ఒక పరిపాలనా యూనిట్‌గా తీసుకొని 1772లో కలెక్టర్ అనే పదవిని ప్రవేశపెట్టారు.
-మద్రాస్, కలకత్తా, బొంబాయి పట్టణాల్లో స్థానిక ప్రభుత్వాల ఏర్పాటుకు చార్టర్ చట్టం-1793 చట్టబద్ధత కల్పించింది.
-స్థానిక సంస్థలకు పన్నులు విధించడానికి, అవి చెల్లించాల్సినవారిపై చర్యలు తీసుకునే అధికారాన్ని చార్టర్ చట్టం-1813 కల్పించింది.
-భారత్‌కు 1835-36 వరకు గవర్నర్ జనరల్‌గా పనిచేసిన మెట్కాఫ్ భారత గ్రామీణ సమాజాలను లిటిల్ రిపబ్లిక్స్‌గా అభివర్ణించారు. నేడు అవి స్థానిక ప్రభుత్వాలుగా మార్పు చెందాయి.
-స్థానిక అవసరాలను తీర్చే బాధ్యతను భారత కౌన్సిళ్ల చట్టం-1861 రాష్ర్టాలకు అప్పగించింది.
-వైశ్రాయ్ లార్డ్ మేయో ఆర్థిక వికేంద్రీకరణ తీర్మానం-1870 ద్వారా దేశంలో మొదటిసారిగా స్థానిక ప్రభుత్వాలను ప్రవేశపెట్టాడు.
-వైశ్రాయ్ లార్డ్ రిప్పన్ స్థానిక ప్రభుత్వాలకు ఆర్థిక, పాలనాపరమైన అధికారాలను బదలాయిస్తూ 1882, మే 18న ఒక తీర్మానాన్ని ప్రతిపాదించాడు. దీన్నే స్థానిక ప్రభుత్వాల ఏర్పాటు, వికాసాలకు మాగ్నాకార్టాగా పిలుస్తారు. దీంతో లార్డ్ రిప్పన్ స్థానిక సంస్థల పితామహుడు అయ్యాడు.
-1882 స్థానిక ప్రభుత్వాల చట్టం ద్వారా కింది స్థాయిలో.. గ్రామపంచాయతీలు, మధ్య స్థాయిలో.. తాలూకా బోర్డులు, పై స్థాయిలో.. జిల్లా బోర్డులు ఏర్పాటయ్యాయి.
-బెంగాల్ మున్సిపాలిటీల చట్టం-1884, బెంగాల్ స్థానిక ప్రభుత్వాల చట్టం-1885, బెంగాల్ స్థానిక గ్రామీణ స్వయంపాలనా చట్టం-1919 ద్వారా స్థానిక ప్రభుత్వాలకు క్రమేణా అధికారాలను విస్తృతం చేయడానికి అనేక చర్యలు తీసుకున్నారు.
-దేశంలో స్థానిక ప్రభుత్వాల పనితీరును, అవి విజయవంతం కాకపోవడాన్ని సమీక్షించేందుకు 1907లో సర్ చార్లెస్ హాబ్ హౌస్ అధ్యక్షతన రాయల్ వికేంద్రీకరణ సంఘాన్ని నియమించారు.
-ఈ కమిటీ 1909లో సమర్పించిన తన నివేదికలో దేశంలో ప్రతి గ్రామానికి ఒక గ్రామ పంచాయతీ ఉండాలి, 3 స్థాయిల్లోగల స్థానిక ప్రభుత్వాల సభ్యుల్లో ఎక్కువమందిని ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకోవాలి, ప్రాథమిక విద్య బాధ్యత మున్సిపాలిటీలకే ఉండాలని పేర్కొంది.
-రాయల్ కమిషన్ సూచనల మేరకు మింటోమార్లే సంస్కరణల చట్టం-1909 స్థానిక సంస్థల ప్రతినిధులను ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకొనే పద్ధతిని ప్రవేశపెట్టారు.
-స్థానిక స్వపరిపాలనను మాంటేగ్-చేమ్స్‌ఫర్డ్ సంస్కరణల చట్టం-1919 ద్వారా రాష్ట్ర జాబితాలో చేర్చారు. అందువల్ల ఆయా రాష్ట్ర శాసనసభలు ప్రతి రాష్ట్రంలో స్థానిక పరిపాలన కోరుతూ శాసనాలు చేశాయి. 1919 నాటికి జిల్లాల సంఖ్య 207, తాలూకా బోర్డుల సంఖ్య 548కి చేరింది.
-భారత ప్రభుత్వ చట్టం-1935 ప్రకారం రాష్ర్టాలకు స్వపరిపాలనాధికారం లభించడంతో స్థానిక స్వపరిపాలన మరింత పటిష్టమైంది. అధికారులు నామినేట్ చేసే పద్ధతిని పూర్తిగా రద్దుచేశారు. స్థానిక ప్రభుత్వ పాలన పూర్తిగా మంత్రుల చేతిలోకి వచ్చింది. ఈ చట్టం జిల్లా బోర్డుల్లో రాష్ర్టాలకు పూర్తి స్వాతంత్య్రం కల్పించడంవల్ల స్థానిక సంస్థలను ప్రజాస్వామ్య పద్ధతిలో సంస్కరించడానికి ప్రయత్నాలు జరిగాయి.
సమాజ వికాస ప్రయోగాలు
-దేశంలో సామాజిక, ఆర్థిక అభివృద్ధి కోసం జాతీయోద్యమ సమయంలో అనేక ప్రయోగాలు, ప్రయత్నాలు జరిగాయి. అవి..
గుర్గావ్ ప్రయోగం (1920):
1920లో అప్పటి పంజాబ్ రాష్ట్రంలోని గుర్గావ్ జిల్లాలో డిప్యూటీ కమిషనర్‌గా పనిచేసిన బ్రేయన్ గ్రామీణాభివృద్ధి ఉద్యమాన్ని ప్రారంభించారు. 1933లో ఆయన పంజాబ్‌లో గ్రామీణ పునర్నిర్మాణ కమిషనర్‌గా పదోన్నతి పొందిన తర్వాత గుర్గావ్ గ్రామీణాభివృద్ధి ఉద్యమం ఊపందుకుంది. వ్యవసాయ ఉత్పత్తిని, ప్రజారోగ్యాన్ని పెంపొందించడం అభివృద్ధి పథకాలను వ్యవస్థీకరించడం, ఉత్సవాలు, వివాహాల్లో జరిగే ధన వ్యయాన్ని తగ్గించి సమాజ అభివృద్ధికి తోడ్పడటం వంటివి ఈ ప్రయోగంలోని ముఖ్య లక్ష్యాలు. ఈ ఉద్యమ ప్రాముఖ్యతను గుర్తించిన ప్రభుత్వం 1935-36లో కోటి రూపాయలను ఈ ఉద్యమం కోసం కేటాయించి ప్రోత్సహించింది.
మార్తాండం ప్రయోగం (1921):
తమిళనాడు కన్యాకుమారి జిల్లాలో గల మార్తాండం అనే ప్రాంతంలో అమెరికన్ వ్యవసాయ నిపుణుడు స్పెన్సర్ హాచ్ నేతృత్వంలో 70 గ్రామాలను ఎంపిక చేసుకొని యంగ్ మెన్స్ క్రిస్టియన్ అసోసియేషన్ (వైఎంసీఏ) సహకారంతో గ్రామీణ ప్రజల జీవితాల్లో కీలకపాత్ర పోషించే మౌలికాంశాలపై శిక్షణ ఇస్తూ తద్వారా ప్రజల్లో అభివృద్ధిపై చైతన్యం కలిగించడానికి ఈ ప్రయోగం చేశారు.
శ్రీనికేతన్ ప్రయోగం (1921):
విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ కలకత్తాలోని శాంతినికేతన్లో విద్యాబోధనలో భాగంగా సమాజ వికాసానికి కృషి చేశారు. 1921లో ఆత్మగౌరవంతో స్వయంసమృద్ధిని సాధించడం గురించి ఒక ప్రయోగాన్ని చేశారు. చిన్నతరహా కుటుంబ పరిశ్రమల నిర్వహణకు అవసరమైన పరిజ్ఞానాన్ని అందింస్తూ వయోజన విద్య, ఆరోగ్య సంరక్షణ మొదలైన అంశాలపైన ప్రత్యేక శిక్షణ ఇచ్చారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు