మనోనేత్రానికి బాహ్య ప్రపంచాన్ని చూపించేది?
భాష – నిర్వచనాలు
- మానవజాతి పెంపొందించుకున్న ఒక శక్తిమంతమైన సాధనం- భాష
- మానవుడి తరతరాల వారసత్వ సంపద, సాంస్కృతిక వస్తు విశేషం- భాష
- వ్యక్తి ఆలోచనలు వాగ్యంత్రం ద్వారా వెలువడే ధ్వనుల సాయంతో అభివ్యక్తం చేయడంతో ప్రారంభమై,
- వ్యక్తి వ్యక్తిత్వాన్ని మహోన్నత లక్ష్యాల వైపు కొనసాగించడానికి సహకరిస్తూ అతడిని సమగ్రంగా రూపొందించడానికి శ్రమించేది భాష.
- మనోగతమైన ఆలోచనాధోరణులను మౌఖికంగా ప్రకటిస్తూ భాషించడానికి సహకరించే సాధనం భాష.
- భావగర్భితమైన ధ్వని- భాష
- భాష అనే పదం భాష్ అనే సంస్కృత ధాతువు నుంచి పుట్టింది.
- భాషించబడేది అనే అర్థం కలిగినది భాష (భాష్యతేతి భాష)
- భాష మొదట ఆంగికాభినయాలతో, హావభావ ప్రకటనలతో ఆరంభమైంది. క్రమానుగతంగా విచిత్ర ధ్వనులతో పరిణామం చెందుతూ భాషగా రూపొందింది.
బెంజిమన్ వార్ఫ్: భాష వ్యక్తి ఆలోచనలు, ఉద్వేగాలకు ఒక రూపు కల్పించి వాస్తవిక జ్ఞానాన్ని కలిగిస్తుంది.
జాన్ స్టువర్ట్ మిల్: భాష మేధస్సును ప్రసరించే కాంతి.
ఎడ్వర్డ్ సపిర్
ఎ. భాష ఒక సమాజపు ఆలోచనలను, జ్ఞానాన్ని, విలువలను తెలియజేసే వాహకం. సమాజపు గుర్తింపునకు భాష ప్రాథమిక వ్యక్తీకరణ.
బి. భావ వినిమయంలో తమ భావాలు, ఉద్వేగాలు, కోరికలను (ఆకాంక్షలను) స్వతహాగా వెలువడిన సంకేతాల ద్వారా వ్యక్తం చేయడానికి రూపొందించుకున్న సాధనం భాష. ఈ నిర్వచనం ప్రకారం భాష అంటే ప్రత్యేక సంకేతాలకు ప్రత్యేక అర్థాలను ఆపాదించే సూత్రాలు కలిగిన నిర్మితేయ వ్యవస్థ.
సి. అలవోకగా ఉత్పన్నమయ్యే కంఠధ్వనుల సాధనాలతో కేవలం మానవ సంబంధమై సహజేతర పద్ధతి ద్వారా మానవోద్రేకాలు, ఆలోచనలు, వాంఛలను తెలియజేసేది భాష.
ప్రొఫెసర్ విట్నీ: భాష అభివృద్ధి చెందుతున్న సమాజ అవసరాల కోసం ఏర్పడిన అలిఖిత చట్టాల వ్యవస్థ.
స్టర్ట్ వర్ట్ (లింగ్విస్టిక్ చేంజ్)
ఎ. యాదృచ్ఛికమైన నిర్మాణ సౌష్ఠవంతో మానవ సమాజంలో భావ వినిమయానికి, పరస్పర సహకారానికి, సంస్కృతి పరివ్యాప్తికి ఉపకరించే వాగ్రూప ధ్వని సంకేత సముదాయం భాష.
బి. ఒక సమాజంలోని సభ్యులు వ్యవహరించడానికి ఉపయోగించే స్వచ్ఛంద వాచిక సంకేతాల వ్యవస్థయే భాష.
కాంత్-డెస్క్రేట్స్: మానవులకు భాషాపరమైన ప్రవర్తనను (భాషాభ్యసన శిక్షణలు, భాషించడం, అవగాహన చేసుకోవడం) అలవర్చుకోవడానికి సహకరించే మేధాశక్తే భాష.
ఈ నిర్వచనం ప్రకారం భాష సార్వజనీనమైనది. మానవుడికే పరిమితమైనది. విశిష్టత కలిగినది. ఒక సహజమైన మేధాసంపత్తిగా గుర్తింపు పొందినది.
ఎస్కే వర్మ & ఎన్ కృష్ణస్వామి (మోడరన్ లింగ్విస్టిక్స్): భాష ఒకే ఒక అంశం లేదా లక్షణం గల వస్తువు కాదు. సమాజంలో మానవ సంబంధాలు ఎంత క్లిష్టమైనవో అంతే సంక్లిష్టమైన మానవీయ ప్రక్రియ భాష.
రామచంద్ర వర్మ (ప్రఖ్యాత హిందీ భాషావేత్త): మనస్సులోని భావ పరంపరను ఎదుటివారికి ఏ పదాల ద్వారా, ఏ వాక్యాల ద్వారా అందిస్తామో ఆ పదాలు, వాక్యాలే భాష.
జాన్ పీ హ్యూగ్స్ (ద సైన్స్ ఆఫ్ లాంగ్వేజ్)
ఎ. ఒక వ్యక్తి తన ఆలోచనలను ఇంకో వ్యక్తికి యాదృచ్ఛికమైన వాగ్రూప సంకేతాల ద్వారా వ్యక్తం చేసే విధానమే భాష.
బి. మానవుడు పరస్పరం తమ ఆలోచనలను యాదృచ్ఛికమైన వాగ్రూప సంకేతాల ద్వారా వ్యక్తంచేసే విధానమే భాష.
నోమ్ ఛామ్స్కీ: భాష అనేది ప్రత్యేక నియమాల ఆధారంగా నిర్మించిన ప్రత్యేక వాక్యాల సముదాయం. ఛామ్స్కీ దృష్టిలో ఈ నియమాలు మానవ మేధస్సులో సహజమైన అంశంగా ఉండి భాష తత్తాన్ని తెలియజేస్తాయి.
హాకెట్ (ఏ కోర్స్ ఇన్ మోడరన్ లింగ్విస్టిక్స్): వివిధ భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ భాష.
లాంగ్వేజ్ ఇన్ ద మోడరన్ వరల్డ్: ఉన్నత సంక్లిష్ట సూత్రజాలావలయం భాష.
ఇజ్లర్ (Isler): బుద్ధి జీవుల అనుభవాల అభివ్యక్తే భాష.
హెగెల్: సైద్ధాంతికతకు సంబంధించిన కళయే భాష. భాష నిజంగా దాని బాహ్య వ్యక్తీకరణమే.
ఎమ్మన్ బాక్ (Emman Bach): అనంతమైన వాక్యాల సముదాయం భాష. బాక్ అభిప్రాయం ప్రకారం భావ వ్యక్తీకరణలో వాక్యం ప్రధాన అంశం.
సైమన్ పాటర్ (మోడరన్ లింగ్విస్టిక్స్):
ఎ. మానవులు ఒకరికొకరు తమ అభిప్రాయాలను తెలియజేసుకోవడానికి, పరస్పరం సహకరించుకోవడానికి ఉపయోగించే అర్థవంతమైన యాదృచ్ఛిక ధ్వనుల సమూహమే భాష.
బి. మానవులు తమ అభిప్రాయాలను ఎదుటివారికి తెలుపుతూ పరస్పరం సహకరించుకోవడానికి తోడ్పడే మౌఖిక ధ్వనుల స్వతంత్ర వ్యవస్థ భాష.
సి. వక్తకు, శ్రోతకు మధ్య నాడీమండలంతో, మేధతో పెక్కు సర్దుబాట్లు గావించుకుంటూ కొనసాగే ఉన్నత సంక్లిష్ట మాయాజాలం భాష.
డి. ధ్వనిని ఉత్పత్తిచేసే తన అవయవాల సాయంతో వ్యక్తంచేసే ధ్వనుల పరంపరే భాష.
వ్యాకరణకారులు: ప్రకృతి, ప్రత్యయ పదనిరూపణమే భాష.
ప్రకృతి అంటే పదమూలం లేదా ప్రాతిపదిక. ప్రాతిపదిక మీద చేరేరూపం ప్రత్యయం. ఇవి రెండూ కలిసి పదం ఏర్పడుతుంది.
నిఘంటువుకారులు: భాష అంటే పదాలు, వాటి అర్థాలు. అంటే అర్థవంతమైన పదాల సమూహమే భాష.
సామాన్య మానవుడు (జనసామాన్యం): భావ ప్రకటనకు ఉద్దేశించిన సాధనం.
నిత్య వ్యవహారంలో భాషను వైయక్తిక అవసరాలకు అనుగుణమైన పరికరంగా ఉపయోగించుకుంటాడు.
భాషోపాధ్యాయుడు: భావ వినిమయంలో మానవులకు అవరోధాలు లేకుండా చేసే సాధనం. తాను విద్యార్థులకు బోధించాల్సిన విషయం.
విద్యార్థులకు సాహిత్యాభిరుచిని పెంపొందించే ప్రయత్నం చేస్తాడు. ఈ ప్రయత్నంలో విద్యార్థులు తను చెప్పే విషయంపట్ల ఆకర్షితులు కావడానికి కొత్త పద ప్రయోగాలు చేస్తాడు.
సాహిత్యవేత్త: కవితాసౌందర్యాన్ని దర్శించడానికి, అవగాహన చేసుకోవడానికి ఉపయోగపడే సాధనం.
సూటిగా, సరళంగా, స్పష్టంగా తన భావోద్వేగాలను పాఠకులకు అందించే ప్రయత్నం చేస్తాడు.
మనస్తత్వ శాస్త్రజ్ఞుడు: మానవుల ప్రవర్తనను పశుపక్ష్యాదుల ప్రవర్తన నుంచి వేరుచేసి చూపడానికి ఉపయోగపడే సాధనం.
ఎవరికీ అర్థంకాని మానవుల ప్రవర్తనను విశ్లేషిస్తాడు. అంతరంగంలోని ఆలోచనలను, అలజడులను విశ్లేషిస్తాడు.
మానవ శాస్త్రజ్ఞుడు: మానవ సంస్కృతి అధ్యయనానికి ఉపకరించే సాధనం.
మానవ సంస్కృతిలో భాషకున్న ప్రాధాన్యం గుర్తిస్తాడు. సంస్కృతి గొప్పతనాన్ని నిర్వచించే ప్రయత్నంలో భాషను సాధనంగా మలచుకుంటాడు.
భాషాశాస్త్రజ్ఞుడు
ఎ. భాషాచరిత్ర నిర్మాణానికి, భాషాకుటుంబాల పరిశీలనకు, నిర్ధారణకు, కాలానుగుణంగా భాషాగతి, పోకడల పరిశీలనకు సహకరించే సాధనం.
బి. భాషలోని అంతర్గత, బహిర నిర్మాణ సూత్రాలను పరిశీలిస్తూ కొత్త ప్రతిపాదనలను సిద్ధం చేస్తాడు.
సి. భాష విషయ వివేచనానికి ఉపకరించే సాధనం. భాష కేవలం సాధనమే కాకుండా సాధ్యం కూడా. కొందరికి ఇది సాధనం. కొందరికి ఇది సాధ్యం. మరికొందరికి రెండూ.
విద్యార్థి: ఎదుటివారికి తన ఆలోచనలను, అభిప్రాయాలను చెప్పడానికి చేష్టలతోపాటు ఉపయోగపడే ధ్వని రూపం.
తరగతి గదిలోనూ, విద్యనభ్యసించే పరిసరాల్లోనూ, ఉపాధ్యాయులతోనూ తన జ్ఞానాన్ని, సంస్కారాన్ని, భావాలను వ్యక్తం చేయడానికి తాపత్రయపడుతాడు.
మత ప్రచారకుడు: ఉపదేశమివ్వడానికి ఉపకరించే సాధనం.
మన చుట్టూ ఆధ్యాత్మికత వాతావరణాన్ని నింపి మనసును దైవం వైపు మళ్లించడానికి కృష్టి చేస్తాడు.
చరిత్రకారుడు: శాసనాలు, రచనలు, అభిలేఖల సాయంతో చరిత్రను నిర్మించడానికి ఉపకరించే సాధనం.
అనేక రకాల ఆధారాలతో చరిత్రను యదార్థంగా నిర్మించి వ్యాఖ్యానించే పరిశోధనలో మునిగి ఉంటాడు.
వేదాంతి: తాత్తిక చర్చకు ఉపకరించే సాధనం.
సంక్లిష్టమైన, మార్మిక అంశాలను స్పష్టంగా అవగతమవునట్లు ప్రవచనాలు చేస్తాడు.
సాంకేతిక శాస్త్రజ్ఞుడు: వాగ్రూపంగా గాని, లిఖితపూర్వకంగా గాని ఎదుటి వ్యక్తికి భావాన్ని అందించే సాధనం.
మానవ జీవనాన్ని సౌకర్యవంతంగా మలచడానికి అవసరమైన ఆలోచనలు చేస్తాడు. అవి వాస్తవరూపాన్నిచ్చేందుకు ప్రయత్నిస్తాడు.
సామాజిక శాస్త్రజ్ఞుడు: మానవుల మధ్య పరస్పర సంబంధాలను పెంపొందించగల సాధనం.
మానవుల మధ్య భాష నిర్వర్తించే పాత్రను అధ్యయనం చేస్తూ వ్యక్తీకరణ రూపాల్లోని వైవిధ్యాన్ని వెల్లడిస్తాడు.
రిచర్డ్ & ఓగ్డెన్: మానవ జీవితానికి అవసరమైన సాంకేతిక, ఉద్దీపన ప్రయోజనాలను అందించేది భాష.
భాషావేత్తల దృష్టిలో: పరిమిత సాధనాలను అపరిమితంగా వాడుక చేసేది భాష.
వ్యాపారవేత్త: నిరంతరం లాభాలు సంపాదించడానికి అనువైన మార్గాలు, వ్యూహాలు ఆలోచిస్తాడు.
బ్లాచ్ & ట్రాగర్: ఒక సాంఘిక సముదాయం పరస్పరం సహకరించుకోవడానికి తోడ్పడే స్వచ్ఛంద వాచిక సంకేతాల వ్యవస్థయే భాష.
జే వాట్ మౌ: భాష అనేది ఒక మానవీయ సమాచారాన్ని ప్రసాదించే ఒక అద్భుత సాధనం.
ఆధునిక భాషాశాస్త్రం: ప్రజలు మాట్లాడుకునే తీరే భాష.
బులక్ కమిటీ (1975): జీవితం కోసం భాష.
విలియం జేమ్స్: మానవుడు భాషించే మృగం. మృతప్రాయుడైన మానవుడిని జంతువుల నుంచి వేరుచేసేదే భాష.
భద్రిరాజు కృష్ణమూర్తి: మనోనేత్రానికి బాహ్య ప్రపంచాన్ని చూపించేది, బాహ్య ప్రపంచం నుంచి మనోనేత్రాన్ని రక్షించేది భాష. నాగరికతతోపాటు భాష పెరుగుతూ, తనతోపాటు నాగరికతను వృద్ధి చేసుకుంటూ పోతుంది.
వెలమల సిమ్మన్న: మానవుని జంతువు నుంచి వేరుచేసి అతని మేధాశక్తిని పెంపొందించేది భాష. విశ్వసృష్టిలో మాట్లాడగలిగిన ఏకైక ప్రాణి మానవుడు. భావ వ్యక్తీకరణమే భాష ఆశయం. మానవులందరి ఉమ్మడి సొత్తు భాష.
డాక్టర్ రామ్ మనోహర్ లోహియా: భాష అనేది ఒక రథం వంటిది. రథం అందరినీ మోయాలి. అందరికీ సమానరూపంలో సేవలు అందించేదే మంచి రథం.
భాష భౌతిక, రసాయనిక, శారీరక, సాంస్కృతిక, భాషాశాస్ర్తాలకు సంబంధించిన అంశం.
భౌతిక అంటే శబ్ద తరంగాలు. రసాయనిక అంటే శారీరక రసాయనాలు. శారీరక అంటే శరీర వాగింద్రియాలు, కండరాలు. సాంస్కృతిక అంటే సమాజం ద్వారా సంస్కరింపబడినవి. భాషాశాస్త్రం అంటే మానవ సమాజ పరిణామ క్రమంలో భాషల్లో వచ్చిన మార్పుల అధ్యయనం.
- Tags
- competitive exams
- nipuna
- TET
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు