జమ్ముకశ్మీర్ ప్రత్యేకతలు ఇవీ..!
దేశానికి స్వాతంత్య్రం వచ్చే నాటికి రాజా హరిసింగ్ పాలనలో జమ్ముకశ్మీర్ ఉంది. దేశ విభజన కాలంనాటి పరిస్థితులు పాకిస్థాన్ గిరిజన మూకల దాడిని దృష్టిలో ఉంచుకొని 1947, అక్టోబర్ 26న కశ్మీర్‌ను భారతదేశంలో విలీనం చేస్తూ రాజా హరిసింగ్ విలీన పత్రంపై సంతకాలు చేశారు.
-భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చే నాటికి కశ్మీర్ పార్ట్-బి రాష్ర్టాల జాబితాలో ఉండేది. 1956 రాష్ర్టాల పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా మన దేశంలోని ఇతర రాష్ర్టాల మాదిరిగానే కశ్మీర్‌ను రాజ్యాంగంలోని 1వ షెడ్యూల్లో చేర్చారు.
-దేశ విభజన కాలంనాటి పరిస్థితులు, కశ్మీర్ భారత్‌లో విలీనమైనప్పుడు ఒప్పంద పత్రంలోని అంశాలను ఆధారం చేసుకొని రాజ్యాంగ నిర్మాతలు జమ్ముకశ్మీర్‌కు 370 అధికరణ ద్వారా ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించారు.
– 1951లో ఏర్పడిన జమ్ముకశ్మీర్ రాజ్యాంగసభ 1957, జనవరి 26 నాటికి సొంత రాజ్యాంగాన్ని రూపొందించి అమల్లోకి తీసుకువచ్చింది. రాజ్యాంగం 21వ భాగంలోని 370వ అధికరణ ద్వారా కశ్మీర్‌కు కల్పించిన ప్రత్యేక సదుపాయాలు కేవలం తాత్కాలికమైనవిగా పేర్కొన్నారు. అయితే, 1975లో ఇందిరాగాంధీకి… షేక్ అబ్దుల్లాకు మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తిని కల్పించడానికి ప్రజానిర్ణయ సేకరణ జరుపాలనే డిమాండ్‌ను షేక్ అబ్దుల్లా వదులుకున్నారు. రాజ్యాంగం ద్వారా కశ్మీర్‌కు కల్పించిన ప్రత్యేక సదుపాయాలు కొనసాగడానికి ఇందిరాగాంధీ అంగీకరించారు.
– 1954లో రాష్ట్రపతి ఉత్తర్వులను రాజ్యాంగ ప్రవేశిక, మొదటి, రెండు, మూడు భాగాల్లోని అంశాలు కొన్ని మార్పులతో జమ్ముకశ్మీర్‌కు వర్తించేటట్లు జారీ చేశారు. 1958లో రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా కాగ్ అధికారాలు 12వ, 13వ, 14వ భాగాలు వర్తించే విధంగా మార్పులు చేశారు.
భారత యూనియన్- జమ్ముకశ్మీర్ సంబంధాలు
– జమ్ముకశ్మీర్ సొంత రాజ్యాంగాన్ని కలిగి ఉంటుంది. అంటే మన దేశంలో ప్రత్యేకంగా సొంత రాజ్యాంగాన్ని కలిగి ఉన్న ఏకైక రాష్ట్రం జమ్ముకశ్మీర్. అలాగే రెండు రాజ్యాంగాలు కలిగి ఉన్న ఏకైక రాష్ట్రం జమ్ముకశ్మీర్.
– జమ్ముకశ్మీర్ భూభాగాల మార్పిడులు, దాని పేరు మార్పు విషయంలో రాష్ట్ర శాసనసభ ఆమోదం లేకుండా పార్లమెంట్ ఎలాంటి శాసనం చేయరాదు.
– జమ్ముకశ్మీర్ భూభాగంపై సరిహద్దుల మార్పులను ప్రభావితం చేసే విధంగా పార్లమెంట్ ఆ రాష్ట్ర శాసనసభ అనుమతి లేకుండా ఎలాంటి అంతర్జాతీయ ఒప్పందాలు చేయరాదు.
– అవశిష్ట అధికారాలు ఆ రాష్ట్ర శాసనసభకే చెందుతాయి. అంటే రాష్ట్ర శాసనసభ చట్టాలను రూపొందిస్తుంది.
– 1947 ఒప్పందం తర్వాత నుంచి 1954 వరకు పాకిస్థాన్‌కు వలస వెళ్లి తిరిగి వచ్చి కశ్మీర్లో స్థిరపడ్డ వారికి పౌరసత్వాన్ని కల్పించడంలో కశ్మీర్ శాసనసభ చేసే చట్టాలు చెల్లుబాటు అవుతాయి.
– 352 అధికరణను అనుసరించి అంతరంగిక జాతీయ అత్యవసర పరిస్థితిని వర్తింజేయాలంటే ఆ రాష్ట్ర శాసనసభ ఆమోదం తప్పనిసరి.
– 365 అధికరణను అనుసరించి కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను పాటించలేదనే నెపంతో ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసే అవకాశం లేదు.
– 1964లో సవరణలను అనుసరించి 356, 357 అధికరణలను జమ్ముకశ్మీర్‌కు వర్తింపజేశారు. 356 అధికరణను అనుసరించి ఆ రాష్ట్రంలో 1986లో మొదటిసారి రాష్ట్రపతి పాలనను విధించారు.
– 1986లో రాజ్యాంగ సవరణ ప్రకారం 249 అధికరణను అనుసరించి రాజ్యసభ చేసే తీర్మానం వల్ల రాష్ట్ర జాబితాకు సంబంధించిన అంశంపై తాత్కాలికంగా శాసనం చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి బదిలీ అయ్యే అంశాన్ని జమ్ముకశ్మీర్‌కు కూడా వర్తింపజేశారు. జమ్ముకశ్మీర్‌లో ఆర్థిక అంశాలపై అత్యవసర పరిస్థితిని విధించే అవకాశం కేంద్ర ప్రభుత్వానికి లేదు.
జమ్ముకశ్మీర్ ప్రత్యేకతలు
– భారత రాజ్యాంగంలో పొందుపరిచిన IVవ భాగంలోని నిర్దేశిక నియమాలు కశ్మీర్‌కు వర్తించవు.
– రాజ్యాంగాన్ని సవరించి ఆస్తిహక్కును 1978లో చట్టబద్ధమైన హక్కుగా మార్చినా జమ్ముకశ్మీర్‌లో ఆస్తిహక్కు ప్రాథమిక హక్కుగానే కొనసాగుతున్నది.
– జమ్ముకశ్మీర్ రాజ్యాంగంలోని 92వ అధికరణ ప్రకారం ఆ రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం విఫలమైతే గవర్నర్ పరిపాలనను విధించవచ్చు.
– జమ్ముకశ్మీర్ రాజ్యాంగాన్ని సవరించాలంటే ఆ రాష్ట్ర శాసనసభలో 2/3 వంతు మెజారిటీతో ప్రత్యేక తీర్మానం ఆమోదించాలి.
– జమ్ముకశ్మీర్ రాష్ట్ర ప్రజలకు కల్పించిన ప్రత్యేక పౌరసత్వ హక్కుల ప్రకారం ఆ రాష్ట్రంలో ద్వంద్వ పౌరసత్వం అమల్లో ఉంది.
– రాష్ట్ర శాసనసభ తీర్మానాన్ని అనుసరించి భారత రాష్ట్రపతి 370(3) అధికరణ ప్రకారం జమ్ముకశ్మీర్‌కు కల్పించిన ప్రత్యేక అధికారాలను రద్దు చేయవచ్చు.
పత్యేక ప్రతిపత్తి (370 అధికరణ)
– 152వ అధికరణలో ఇతర రాష్ర్టాలతోపాటు జమ్ముకశ్మీర్ పేరును ప్రస్తావించలేదు.
– 370వ అధికరణ కశ్మీర్ ప్రత్యేక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు.
– 1951లో జమ్ముకశ్మీర్ రాజ్యాంగ పరిషత్ సార్వత్రిక వయోజన ఓటు హక్కు ప్రాతిపాదికగా ఎన్నుకోవడం ద్వారా ఏర్పడింది.
– 1957 జనవరి 26న జమ్ముకశ్మీర్ రాజ్యాంగం అమల్లోకి వచ్చింది.
– జమ్ముకశ్మీర్ రాజ్యాంగంలో 138 అధికరణలు 8 భాగాలు ఉన్నాయి.
– జమ్ముకశ్మీర్ రాజ్యాంగాన్ని ఆ రాష్ట్ర శాసనసభ 2/3వంతు ప్రత్యేక మెజార్టీతో సవరిస్తుంది. ఈ అధికారం పార్లమెంట్‌కు లేదు.
– 123 అధికరణ ప్రకారం ఆ రాష్ర్టానికి వర్తించే ఆర్డినెన్సులను జారీ చేసే అధికారం రాష్ట్రపతికి ఉన్నది.
– ఆ రాష్ట్ర శాసనసభ ప్రత్యేక తీర్మానాన్ని అనుసరించి 370 అధికరణ ప్రకారం ఆ రాజ్యాంగాన్ని రద్దు చేసే అధికారం రాష్ట్రపతికి ఉంది.
– రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక విధులు జమ్ముకశ్మీర్‌లో వర్తించవు.
– దేశ పౌరసత్వంతోపాటు రాష్ట్ర పౌరసత్వం కూడా అమలులో ఉండడం వల్ల జమ్ముకశ్మీర్‌లో ద్వంద్వ పౌరసత్వం ఉంది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు