అంతర్జాతీయ సంస్థలు
న్యూయార్క్ కేంద్రంగా పనిచేసేవి
న్యూయార్క్ కేంద్రంగా ఐక్యరాజ్య సమితితో పాటు యూఎన్డీపీ, యునిసెఫ్, యూఎన్ ఉమెన్ సంస్థలు ఉన్నాయి.
ఐక్యరాజ్య సమితిలో ఎన్నికైన ప్రముఖ వ్యక్తులు..
ఆంటోనియో గుటెరస్
ఈయన పోర్చుగల్ దేశానికి చెందిన వ్యక్తి. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్‌గా మరోసారి ఎన్నికయ్యారు. జనవరి 1న బాధ్యతలు స్వీకరించారు. 2026, డిసెంబర్ 31 వరకు కొనసాగుతారు. ఈ ఏడాది అక్టోబర్ 18-20 తేదీల మధ్య ఆయన భారత్‌ను సందర్శించారు. ఐఐటీ ముంబైకి కూడా వెళ్లారు.
అల్కేష్ కుమార్ శర్మ
ఇంటర్నెట్ గవర్నెన్స్‌పై ఒక ప్యానెల్‌ను ఆంటోనియో గుటెరస్ ఏర్పాటు చేశారు. అందులో భారత్ నుంచి సభ్యత్వం పొందింది అల్కేష్ కుమార్ శర్మ.
జయతి ఘోష్
బహుళత్వంపై ఆంటోనియో గుటెరస్ ఒక కమిటీని నియమించారు. అందులో భారత్ తరఫున సభ్యత్వం పొందింది ప్రముఖ ఆర్థిక వేత్త జయతి ఘోష్.
రుచిరా కాంబోజ్
ఐక్యరాజ్య సమితిలో భారత్ తరఫున శాశ్వత ప్రతినిధిగా ఆగస్ట్ 1న బాధ్యతలు స్వీకరించారు. ఈ పదవిని చేపట్టిన భారత తొలి మహిళ.
గిలెర్మో పబ్‌లో రియోజ్
‘యునైటెడ్ నేషన్స్ మిలిటరీ అబ్జర్వర్ గ్రూప్ ఇన్ ఇండియా అండ్ పాకిస్థాన్’ అనే పదవిలో అర్జెంటీనా దేశానికి చెందిన గిలెర్మో పబ్‌లో రియోజ్ను నియమించారు.
డిజిటల్ కరెన్సీ
యూఎన్వో నివేదికలు
7.3% మంది భారతీయులు డిజిటల్ కరెన్సీని వినియోగిస్తున్నట్లు యూఎన్వో పేర్కొంది. ఈ అంశంలో ప్రపంచంలో ఉక్రెయిన్ అగ్రస్థానంలో ఉండగా భారత్ ఏడో స్థానంలో ఉంది.
జనాభా అంచనాలు
2023 నాటికి చైనా జనాభాను భారత్ అధిగమిస్తుందని ఐక్యరాజ్య సమితి తాజా నివేదిక పేర్కొంది. అలాగే నవంబర్ 2022 నాటికి ప్రపంచ జనాభా 800 కోట్లు దాటుతుందని జూలై 11న విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. ఈ ఏడాది నవంబర్ 15 నాటికి ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరుకుంది. 2035 నాటికి భారత పట్టణ జనాభా ప్రపంచంలోనే 675,456,000గా ఉంటుందని అంచనా.
ఐక్యరాజ్య సమితి సాధారణ సభ
ఇందులో 193 దేశాలకు సభ్యత్వం ఉంది. దీనిలో ఈ ఏడాది నాలుగు ముఖ్య తీర్మానాలను ఈ సభలో ప్రవేశపెట్టారు.
పర్యావరణం హక్కు
పరిశుభ్ర, సుస్థిర పర్యావరణాన్ని మానవ హక్కుగా ఒక తీర్మానాన్ని సర్వ ప్రతినిధి సభ జూలై 28న ఆమోదించింది.
వీటో అధికారం
భద్రతా మండలిలో అమెరికా, యూకే, ఫ్రాన్స్, చైనా, రష్యా దేశాలకు వీటో అధికారం ఉన్న సంగతి తెలిసిందే. ఈ అధికారానికి జవాబుదారీతనాన్ని పెంచే ఉద్దేశంతో లీచెన్‌స్టెయిన్ దేశం ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. వీటో అధికారాన్ని వినియోగించిన శాశ్వత సభ్య దేశం పది రోజుల్లో సాధారణ సభలో వివరణ ఇవ్వాలి. ఈ తీర్మానాన్ని ఏప్రిల్ 26న ఆమోదించారు.
బహుళ భాషలు
బహుళ భాషలపై భారత్ ఒక తీర్మానాన్ని సర్వ ప్రతినిధి సభలో ప్రవేశపెట్టగా దాన్ని జూన్ 11న ఆమోదించారు. దీనివల్ల ఐక్యరాజ్య సమితి ముఖ్య అధికార, అనధికార సందేశాలు కూడా అధికారిక భాషలతో పాటు హిందీలో కూడా అందుబాటులోకి వస్తాయి.
ఇస్లామోఫోబియా
మార్చి 15న ఇంటర్నేషనల్ డే టు కంబాట్ ఇస్లామోఫోబియాగా ప్రకటించాలని పాకిస్థాన్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సర్వ ప్రతినిధి సభ ఆమోదించింది.
యూఎన్జీఏ 77వ సమావేశం
దీనికి హంగేరీ దేశానికి చెందిన సభా కొరోసీ నేతృత్వం వహిస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో నిర్వహించిన సమావేశానికి మనదేశం తరఫున విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ హాజరయ్యారు. న్యూయార్క్‌లో వివిధ కూటములను కలిశారు. అవి- జీ4 (భారత్, జపాన్, జర్మనీ, బ్రెజిల్), ఐబీఎస్ఏ (ఇండియా, బ్రెజిల్, సౌతాఫ్రికా), క్వాడ్ (భారత్, యూఎస్ఏ, జపాన్, ఆస్ట్రేలియా) కూటములను కలిసి వివిధ అంతర్జాతీయ పరిణామాలను చర్చించారు. అలాగే ఐక్యరాజ్య సమితిలో మహాత్మాగాంధీ విగ్రహాన్ని డిసెంబర్ 14న ఆవిష్కరించారు.
యూఎన్ఎస్సీ
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో అయిదు శాశ్వత సభ్య దేశాలు, 10 తాత్కాలిక సభ్య దేశాలు ఉంటాయి. భారత్ ఈ సభకు 2021, జనవరి 1న ఎన్నికయ్యింది. 2022, డిసెంబర్ 31న ముగుస్తుంది. అలాగే 2022 డిసెంబర్లో ఈ సభకు భారత్ నేతృత్వం వహిస్తుంది.
న్యూఢిల్లీ డిక్లరేషన్
అక్టోబర్ 28, 29 తేదీల్లో భద్రతా మండలికి చెందిన కౌంటర్ టెర్రరిజం కమిటీ సమావేశం న్యూఢిల్లీలో జరిగింది. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉగ్రవాదులు వినియోగించుకోకుండా చూడాలని ఇందులో పేర్కొన్నారు.
భారత ప్రయోజనాలకు విరుద్ధంగా చైనా
ఈ ఏడాది అమెరికా, భారత్ సంయుక్తంగా ఐదుగురిని అంతర్జాతీయ ఉగ్రవాదులుగా ప్రకటించాలని కోరుతూ భద్రతా మండలిలో తీర్మానాన్ని ప్రవేశపెట్టగా, చైనా వాటిని సాంకేతిక నిలుపుదల చేసింది. అందులో నలుగురు లష్కరే తోయిబాకు చెందిన వారు కాగా, మరొకరు జైషే మహ్మద్ సంస్థకు చెందినవాడు. అబ్దుల్ రెహ్మాన్ మఖి, అబ్దుల్ రౌఫ్ అజర్, సాజిద్‌మిర్, మహమూద్, తల్హ సయిద్‌లకు చైనా అండగా నిలిచింది. ఇందులో అబ్దుల్ రౌఫ్ అజర్ జైషే మహ్మద్‌కు చెందిన వాడు. మిగిలిన వాళ్లు లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన వాళ్లు.
యూఎన్డీపీ
దీని పూర్తి రూపం- ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం. ఈ ఏడాది మానవ అభివృద్ధి నివేదికను సెప్టెంబర్‌లో విడుదల చేసింది. 191 దేశాలకు భారత్ 132వ ర్యాంక్ సాధించింది.
సెక్యూర్ హిమాలయ ప్రాజెక్ట్
ఈ ఏడాది భారత పర్యావరణ మంత్రిత్వ శాఖతో కలిసి యూఎన్డీపీ సెక్యూర్ హిమాలయ ప్రాజెక్ట్‌ను చేపట్టింది. స్నోలెపర్డ్ను పరిరక్షించేందుకు ఉద్దేశించింది ఇది.
ప్రజక్తా కోలి
పర్యావరణం, మహిళల హక్కుల కోసం కృషి చేస్తున్న ప్రజక్తా కోలికి యూఎన్డీపీ యూత్ ైక్లెమేట్ చాంపియన్ అవార్డ్ ఇచ్చింది. ఈ అవార్డు పొందిన తొలి భారతీయురాలు ఆమె.
యునిసెఫ్
లింగ సమానత్వాన్ని పెంపొందించేందుకు ఐసీసీతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
దూర్ సే నమస్తే
అమెరికాకు చెందిన యూఎస్ ఎయిడ్ అనే సంస్థతో కలిసి భారత్‌లో యునిసెఫ్ ‘దూర్ సే నమస్తే’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆరోగ్యకర ప్రవర్తనను పెంపొందించడం ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగా ప్రతి ఆదివారం దూరదర్శన్‌లో ఒక కార్యక్రమాన్ని ప్రసారం చేస్తారు.
యూఎన్ ఉమెన్
ఇరాన్ దేశాన్ని సభ్యత్వం నుంచి బహిష్కరించింది. ఇరాన్ దేశంలో మహిళలు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేయడంతో, దాన్ని అణచివేసేందుకు యత్నించినందుకు 2026 వరకు ఇరాన్‌కు సభ్యత్వం ఉన్నా తొలగించారు.
లింక్డ్ ఇన్‌తో ఒప్పందం
మహిళలకు ఉద్యోగాలను కల్పించేందుకు యూఎన్ ఉమెన్, లింక్డ్ ఇన్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఇందుకు లింక్డ్ ఇన్ 5 లక్షల అమెరికన్ డాలర్లను వ్యయం చేయనుంది. మహిళల ఆర్థిక సాధికారతకు ఉద్దేశించిన ఈ కార్యక్రమాన్ని ముంబైలో ప్రయోగాత్మకంగా ప్రారంభించారు.
వాషింగ్టన్ కేంద్రంగా పనిచేసే సంస్థలు
వాషింగ్టన్ కేంద్రంగా ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) పనిచేస్తున్నాయి.
ప్రపంచ బ్యాంక్
ఎస్‌ఏఎల్‌టీ పథకంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి, రివార్డ్ పథకంలో భాగంగా కర్ణాటక, ఒడిశా రాష్ర్టాలకు, శ్రేష్ట జీ పథకంలో భాగంగా గుజరాత్‌కు రుణాలను ఇచ్చింది. మిషన్ కర్మయోగి పథకానికి కేంద్రం కూడా ప్రపంచ బ్యాంక్ నుంచి అప్పు తెచ్చుకుంది.
నియామకాలు
ప్రపంచ బ్యాంక్ ముఖ్య ఆర్థిక వేత్తగా భారత్‌కు చెందిన ఇందర్మిత్ గిల్ నియమితులయ్యారు. ఈ పదవిని చేపట్టిన రెండో భారతీయుడు ఆయన. తొలి భారతీయుడు కౌశిక్ బసు. ప్రపంచ బ్యాంక్ భారత దేశ డైరెక్టర్‌గా ఆగస్టీ తనో కౌమే నియమితులయ్యారు.
పేదరికం
కరోనా అనంతరం ప్రపంచ వ్యాప్తంగా 71 మిలియన్ల మంది పేదలుగా మారారని, అందులో 56 మిలియన్లు భారత్‌లోనే ఉన్నారని ప్రపంచ బ్యాంక్ తన నివేదికలో పేర్కొంది.
అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ
ఈ సంస్థలో మొదటి డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా భారత సంతతికి చెందిన గీతా గోపినాథ్ నియమితులయ్యారు.
ప్రత్యక్ష నగదు బదిలీకి ప్రశంస
భారత్‌లో అమలవుతున్న ప్రత్యక్ష నగదు బదిలీ పథకాన్ని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ప్రశంసించింది. పారదర్శకత పెరగడంతో పాటు అర్హులకు పథక ఫలాలు అందుతున్నాయని పేర్కొంది.
పారిస్ కేంద్రంగా పనిచేసే సంస్థలు
యునెస్కో
ఇన్‌టాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియాను ప్రోత్సహించడానికి, రక్షించడానికి, ప్రజలకు తెలియజేయడానికి యునెస్కో రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది.
గ్లోబల్ నెట్వర్క్ ఆఫ్ లెర్నింగ్ సిటీస్
ఈ జాబితాను యునెస్కో విడుదల చేసింది. ప్రపంచ వ్యాప్తంగా 44 దేశాలకు చెందిన నగరాలను ఎంపిక చేయగా, భారత్ నుంచి మూడు ఉన్నాయి. అవి- తెలంగాణలోని వరంగల్, కేరళలోని త్రిసూర్, నీలాంబుర్
యునెస్కో-మదర్జిత్ సింగ్ ప్రైజ్
ఈ బహుమతిని ఈ ఏడాది ఫ్రాంకా మ-ఇహ్ సులేం యంగ్ గెలుచుకున్నారు. సహనం, అహింస కోసం పాటుపడేవాళ్లకు ఈ అవార్డును ఇస్తారు.
ఎఫ్ఏటీఎఫ్
దీని పూర్తి రూపం- ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. మనీలాండరింగ్‌ను నియంత్రించడంతో పాటు ఉగ్రవాదులకు ఆర్థిక సాయం అందకుండా చూస్తూ ఉంటుంది. ఆయా దేశాలను గ్రే, బ్లాక్ లిస్ట్‌లలో చేరుస్తూ ఉంటుంది. పాకిస్థాన్, నికరాగువాలను గ్రే లిస్ట్ నుంచి తొలగించింది. డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, మొజాంబిక్, టాంజానియా దేశాలను ఈ గ్రే జాబితాలో చేర్చింది. భవిష్యత్తులో ఎఫ్ఏటీఎఫ్ చేపట్టబోయే ప్రాజెక్టుల నుంచి రష్యాను బహిష్కరించింది.
జెనీవా కేంద్రంగా పనిచేసే సంస్థలు
ప్రపంచ ఆరోగ్య సంస్థ
మంకీ పాక్స్ విస్తరిస్తున్నందున ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది.
జీసీటీఎం
గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ (సంప్రదాయ ఔషధాల ప్రపంచ కేంద్రం)ను గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఏర్పాటు చేసింది. ఈ తరహా కేంద్రం ప్రపంచంలోనే ఇది మొదటిది.
మానవ హక్కుల మండలి
ఈ సంస్థకు హై కమిషనర్‌గా ఈ ఏడాది ఓల్కర్ టర్క్ నియమితులయ్యారు.
ఇయాన్ ఫ్రై
పర్యావరణం-మానవ హక్కుల మధ్య సంబంధాన్ని తెలియజేసేందుకు తొలిసారి మానవ హక్కుల మండలి ఇయాన్ ఫ్రైను ఒక స్వతంత్ర నిపుణుడిగా నియమించింది. ఇతనికి తువాలు, ఆస్ట్రేలియా దేశాల ద్వంద్వ పౌరసత్వం ఉంది.
అశ్విని
జాతి వివక్షకు వ్యతిరేకంగా పోరాడేందుకు స్వతంత్ర హోదాలో అశ్వినిని మానవ హక్కుల మండలి నియమించింది. ఈ ఘనతను దక్కించుకున్న తొలి ఆసియా వాసి ఆమె.
ఇంటర్నేషనల్ టెలి కమ్యూనికేషన్ యూనియన్
ఈ సంస్థ తన దక్షిణాసియా ప్రాంతీయ కార్యాలయాన్ని ఢిల్లీలో ప్రారంభించింది. ఈ సంస్థ గవర్నెన్స్ అండ్ మేనేజ్మెంట్ కౌన్సిల్ వైస్ చైర్మన్‌గా అపరాజిత శర్మ నియమితులయ్యారు.
జీ-20
19 దేశాలతో పాటు యూరోపియన్ యూనియన్‌కు ఇందులో సభ్యత్వం ఉంది. ఈ ఏడాది కూటమి సమావేశం ఇండోనేషియాలోని బాలిలో నవంబర్ 15-16 తేదీల్లో నిర్వహించారు. దీని ఇతివృత్తం రికవర్ టుగెదర్, రికవర్ స్ట్రాంగర్. అంటే అందరం కలిసి, పునరుత్తేజం పొందడం, బలంగా రూపాంతరం చెందడం.
భారత్ నాయకత్వం: ఈ కూటమికి డిసెంబర్ 1న భారత్ నాయకత్వం స్వీకరించింది. 2023 నవంబర్ 30 వరకు ఈ నాయకత్వం కొనసాగుతుంది. భారత్‌లో 2023లో జీ-20 సమావేశం జరుగనుంది. ఇందుకు ఏర్పాటు చేసిన సచివాలయానికి ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వం వహించనున్నారు. ఇందులో సభ్యులుగా- నిర్మలా సీతారామన్, అమిత్ షా, జైశంకర్ ఉండనున్నారు. జీ-20 సమన్వయ కర్తగా హర్ష్ శ్రింగ్లా, జీ-20 షెర్పాగా అమితాబ్ కాంత్, పౌరసమాజం తరఫున ప్రతినిధిగా మాతా అమృతానందమయి, బిజినెస్ 20 తరఫున టాటా సంస్థల చైర్మన్ చంద్రశేఖరన్ నియమితులయ్యారు.
ఉదయ్‌పూర్: రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో షెర్పాల తొలి సమావేశం నిర్వహించారు. జీ-20 సమావేశ ఎజెండా, కుదుర్చుకోవాల్సిన ఇతర ముఖ్య అంశాలపై చర్చించారు.
షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్
ఈ కూటమి సమావేశం ఉజ్బెకిస్థాన్‌లోని సమర్కండ్లో సెప్టెంబర్ 15, 16 తేదీల్లో జరిగింది. కూటమి తరఫున ఒక ఉమ్మడి ఉగ్రవాద జాబితా తయారు చేయాలని నిర్ణయించారు. వచ్చే ఏడాది ఈ కూటమి సమావేశం భారత్‌లో జరుగనుంది. ఈ ప్రాంతంలో శాంతి, భద్రత కోసం కలిసి పని చేయాలని కూడా నిర్ణయించారు. ఈ కూటమిలో కొత్తగా ఇరాన్ దేశం సభ్యత్వం పొందింది. త్వరలో బెలారస్ కూడా చేరనుంది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు