భారత న్యాయవ్యవస్థ తీరు తెన్ను..
జాతీయ న్యాయ నియామక సంఘం ఏర్పాటు
-న్యాయమూర్తులే న్యాయమూర్తులను నియమిస్తున్న కొలీజియం వ్యవస్థను మొదటిసారిగా 1993లో ప్రారంభించారు.
-రాజ్యాంగంలోని 124వ ప్రకరణ సవరణ ద్వారా కొలీజియం వ్యవస్థను ఏర్పాటుచేశారు.
-దీని ప్రకారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో సుప్రీంకోర్టులకు చెందిన ఐదుగురు న్యాయమూర్తుల సంఘం న్యాయమూర్తులను నియమిస్తుంది.
-అయితే ఈ విధానాన్ని రద్దుచేయాలని 2003లో ఎన్డీయే ప్రభుత్వం ప్రయత్నించింది. కానీ సఫలం కాలేకపోయింది.
-ఆ తరువాత యూపీఏ-II ప్రభుత్వం కొలీజియం వ్యవస్థను రద్దుచేస్తూ న్యాయనియామకాల కమిషన్‌ను తీసుకువచ్చే ఉద్దేశంతో 2013, సెప్టెంబర్ 5న రాజ్యసభలో 120వ రాజ్యాంగ సవరణ బిల్లు-2013ను అప్పటి న్యాయశాఖామంత్రి కపిల్ సిబల్ ప్రవేశపెట్టారు. అదేరోజు రాజ్యసభ ఆమోదించింది.
న్యాయ నియామకాల కమిషన్ నిర్మాణం
-సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి – చైర్మన్
-కేంద్ర న్యాయశాఖమంత్రి – సభ్యుడు (ప్రభుత్వ ప్రతినిధి)
-ప్రముఖ వ్యక్తులు – ఇద్దరు (ప్రధానమంత్రి అధ్యక్షతన ఉండే కమిటీ సూచన మేరకు రాష్ట్రపతి నామినేట్ చేస్తారు)
న్యాయశాఖ కార్యదర్శి – కన్వీనర్
-15వ లోక్‌సభ రద్దుతో ఈ బిల్లు వీగిపోయింది.
న్యాయమూర్తుల అర్హతలు
-124(2A) ప్రకరణ ప్రకారం పార్లమెంటు శాసనం ద్వారా ఏర్పాటైన అథారిటీ ఆ శాసనంలో నిర్ణయించిన విధానం ప్రకారం సుప్రీంకోర్టు న్యాయమూర్తి నియామక అర్హత వయస్సును నిర్ధారిస్తుంది.
-124(3) ప్రకరణ ప్రకారం సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియామకమయ్యేందుకు కింది అర్హతలు ఉండాలి.
-భారత పౌరుడై ఉండాలి.
-ఏదైనా హైకోర్టులో న్యాయమూర్తిగా ఐదేండ్ల అనుభవం కలిగి ఉండాలి. లేదా
ఏదైనా హైకోర్టులో 10 ఏండ్లు న్యాయవాదిగా పనిచేసిన అనుభవం ఉండాలి.
-న్యాయశాస్త్రంలో నిష్ణాతుడై ఉండాలి.
-సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించేందుకు కనిష్ట వయస్సును రాజ్యాంగంలో పేర్కొనలేదు. దాన్ని నిర్ణయించేందుకు పార్లమెంటు తగిన శాసనాన్ని రూపొందిస్తుందని, దానిలోని విధానాల ప్రకారం వయస్సు నిర్ణయమవుతుందని 124 (2A)లో పేర్కొని ఉంది. 124(2A) ప్రకరణను 15వ రాజ్యాంగ సవరణ-1963 ద్వారా రాజ్యాంగంలో చేర్చారు.
పదవీ ప్రమాణస్వీకారం (124(6))
-సుప్రీంకోర్టు న్యాయమూర్తులు పదవిని చేపట్టేముందు రాష్ట్రపతి లేదా అతను సూచించిన ప్రతినిధి (ప్రధాన న్యాయమూర్తి) ఎదుట రాజ్యాంగంలోని IIIవ షెడ్యూల్లో తెలిపిన విధంగా పదవీ ప్రమాణ స్వీకారం చేస్తారు.
పదవీకాలం
-న్యాయమూర్తులకు నిర్ణీత పదవీకాలం ఉండదు. 65 ఏండ్లు వచ్చేవరకు పదవిలో ఉంటారు. న్యాయమూర్తుల వయస్సుకు సంబంధించిన వివాదాలను పార్లమెంటు నియమించిన ఒక అథారిటీ పరిష్కరిస్తుంది.
-ఇంతవరకు ఎలాంటి అథారిటీని ఏర్పర్చలేదు. ప్రస్తుతం ఇలాంటి వివాదాలను సుప్రీంకోర్టే పరిష్కరిస్తుంది.
-124(2)(a) ప్రకారం సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులు తమ రాజీనామాపత్రాన్ని రాష్ట్రపతికి సమర్పిస్తారు.
-124(7) ప్రకారం సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసినవారు తరువాతకాలంలో భారతదేశంలోని ఏ ప్రాంతంలోను, ఏ న్యాయస్థానం లేదా అథారిటీ ఎదుట న్యాయవాదిగా పనిచేయరాదు.
తొలగింపు
-124(4) ప్రకరణ ప్రకారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులను తొలగించే విధానాన్ని తొలగింపు తీర్మానం అంటారు (దీన్ని అమెరికా నుంచి గ్రహించారు). న్యాయమూర్తులను తొలగించడానికి రెండు కారణాలను పేర్కొన్నారు. అవి..
1) అసమర్థత, 2) దుష్ప్రవర్తన
-న్యాయమూర్తులను తొలగించే తీర్మానాన్ని ఉభయసభల్లో ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. అయితే న్యాయమూర్తుల విచారణ చట్టం 1968 ప్రకారం కింది నిబంధనలను పాటించాలి.
-తొలగించే తీర్మాన నోటీస్‌పై లోక్‌సభలో 100 మంది, రాజ్యసభలో 50 మంది సభ్యులు సంతకాలు చేసి స్పీకర్ లేదా చైర్మన్‌కు ఇవ్వాలి. వారు దీన్ని అనుమతించవచ్చు లేదా తిరస్కరించవచ్చు.
-న్యాయమూర్తులపై వచ్చిన అభియోగాలను విచారణ చేయడానికి సభాధ్యక్షులు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని నియమిస్తారు. ఇందులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఒక హైకోర్టు ప్రధానన్యాయమూర్తి, ఒక సుప్రసిద్ధ న్యాయశాస్త్రజ్ఞుడు సభ్యులుగా ఉంటారు.
-న్యాయమూర్తిపై వచ్చిన అభియోగాలు విచారణలో రుజువైనట్లు తేలితే తొలగించే తీర్మానాన్ని ఉభయసభలు, హాజరైన మొత్తం సభ్యుల్లో మూడింట రెండొంతుల (2/3) మెజారిటీతో ఓటి ంగ్ ద్వారా ఆమోదించాలి. ఇలా ఆమోదించినవారి సంఖ్య ఒక్కొక్క సభలోని మొత్తం సభ్యుల సంఖ్యలో సగం కంటే ఎక్కువగా ఉండాలి. ఆ తరువాత ఈ తీర్మానాన్ని రాష్ట్రపతికి పంపాలి.
-ఈ తీర్మానం మేరకు న్యాయమూర్తులను తొలగిస్తూ రాష్ట్రపతి ఆదేశాన్ని జారీచేస్తారు.
-124(5) ప్రకరణ ప్రకారం సుప్రీంకోర్టు న్యాయమూర్తుల తొలగింపు ప్రక్రియకు సంబంధించిన విధివిధానాలను పార్లమెంటు రూపొందించవచ్చు. ఈ తొలగింపు ప్రక్రియ మహాభియోగం పేరుతో వాడుకలో ఉంది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు