దోపిడి – ప్రతిఘటన
ప్రభుత్వ అధికారుల పర్యటనప్పుడు జరిగే వెట్టి ఎప్పుడో ఓసారి జరిగేది. కానీ గ్రామాల్లో ఆధిపత్య శక్తులుగా ఉన్న దేశ్‌ముఖ్, దేశ్‌పాండేలు, భూస్వాములు, పటేళ్లు నిత్యం ఈ వెట్టి లూటీ సాగించేవారు. ఇంటి పనులు, ఇతర గ్రామాలకు వెళ్లి చేసుకురావాల్సిన పనులు, వ్యవసాయ పనుల్లో కూడా వెట్టి అమలయ్యేది.
-గ్రామాల్లోని రైతులు ముందుగా భూస్వాముల భూములు ఉచితంగా దున్నిపెట్టిన తర్వాతనే తమ వ్యవసాయ పనులు చేసుకోవాలి. స్త్రీలు వరినాట్లు ఉచితంగా వేయాలి. గ్రామాల్లోని చాకలి, మంగళి, కుమ్మరి, కమ్మరి కులాలవాళ్లు భూస్వాముల పనులు ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా ఉచితంగా చేయాలి. గొల్లలు భూస్వాములకు పండుగలకు పబ్బాలకు గొర్రెపిల్లల్ని ఉచితంగా ఇచ్చేవారు. భూస్వాముల ఇండ్లల్లో గ్రామాల్లోని వివిధ కుటుంబాలవారు వంతులవారీగా పనిచేసేవారు. భూస్వామి బండి ముందు, బండి వెనుక పరుగెత్తడానికి వెట్టి మనుషులు సిద్ధంగా ఉండాలి.
-తెలంగాణ గ్రామాల్లో ప్రస్ఫుటంగా కనిపించే ప్రధాన అంశం భూకేంద్రీకరణ. వందలు, వేలాది ఎకరాల భూమి భూస్వాముల చేతుల్లో కేంద్రీకృతమై పేద రైతులకు నామమాత్రపు భూమి ఉండేది. గ్రామాల్లోని భూస్వాములు కిరీటంలేని రాజులుగా చెలామణి అయి వారి సాంఘిక, రాజకీయ అధికారానికి తిరుగులేకుండా పోయింది. గ్రామాల్లో వారి దౌర్జన్యాలకు హద్దూఅదుపు లేదు.
-భూస్వాములు ప్రభుత్వ భూములైన బంచరాయి, శిఖం, పోరంబోకు భూములను అక్రమంగా తమ భూమిలో కలుపుకొని, అక్రమ పద్ధతుల ద్వారా ప్రభుత్వ అధికారులతో తమ పేరిట పట్టాలు చేయించుకుని తమ సొంత పట్టాభూములుగా వాటిని మార్చి రైతులకు కౌలుకిచ్చేవారు.
-చాలా సందర్భాల్లో భూస్వాములు ప్రభుత్వ, ప్రైవేట్ భూములను ముందుగా స్వాధీనపరచుకుని వాటిని తమ పేరిట ప్రభుత్వ అధికారులతో కుమ్మక్కై పట్టాలు చేయించుకుని వాటిని తమ సొంత పట్టా భూముల్లా ఎక్కువ ధరలకు అమ్ముకునేవారు.
-అటవీ ప్రాంతాలకు దగ్గర్లో ఉండే భూస్వాములు కలపనుకొట్టి డబ్బు చేసుకోవండంతో పాటు అటవీ భూములను అక్రమంగా ఆక్రమించి వాటిని తమ పేరిట దొంగ పట్టాలు చేయించుకునేవారు.
-తెలంగాణలోని నల్లగొండ, వరంగల్, ఖమ్మంజిల్లాల్లో 1944-46లోనే భూస్వాములను ఎదిరిస్తూ వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించారు. ఈ ప్రాంతాల్లో వ్యాపించిన సాయుధ రైతాంగ పోరాటాలతో అక్కడ వెట్టిచాకిరి అంతమైంది.
-కానీ కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో అలాంటి పోరాటాలు ఆశించిన స్థాయిలో జరుగకపోవడంతో 1977-78 వరకు కూడా భూస్వాముల ఆధిపత్యం దౌర్జన్యాలు కొనసాగాయి. వివిధ కులాల వృత్తుల వాల్లు నిజాం పాలనలో వలే వెట్టి చాకిరి చేసేవారు. అనేక శతాబ్దాలుగా ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా తమ సొంత పనులను పక్కకు పెట్టి భూస్వాములకు చాకిరీ చేయడం ప్రజలకు అనివార్యంగా మారింది.
-1977లో సీఓసీ తెలంగాణ ప్రాంతీయ సదస్సు జరిగింది. నక్సల్బరి ఉద్యమ నిర్మాతలు భవిష్యత్తు విప్లవోద్యమ నిర్మాణానికి రోడ్ టు రెవల్యూషన్ పేరిట ఒక సైద్ధాంతిక డాక్యుమెంట్‌ను విడుదల చేశారు. ఇందులో భాగంగానే దేశంలో ఒక శక్తిమంతమైన ప్రజా ఉద్యమాన్ని నిర్మించాలని సంకల్పించి రైతు కూలీ సంఘం నిర్మాణానికి పావులు కదిపారు.
-1978 ఫిబ్రవరిలో వరంగల్‌లో జరిగిన రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ గ్రామాలకు తరలండి అనే కార్యక్రమానికి పిలుపునిచ్చింది. 1978-85 మధ్య కాలంలో పీపుల్స్‌వార్ సీపీఐ (ఎంఎల్) పార్టీ విస్తరణకు అత్యంత కీలకమైన కాలం. ఈ కాలంలో నక్సలైట్ రాజకీయాల ప్రభావం పడని వర్గాలు, శ్రేణులు లేవని చెప్పవచ్చు.
-ఒక అంచనా ప్రకారం 1984లో 1100 మంది విద్యార్థులు, యువజనులతో కూడిన 150 బృందాలు 2419 గ్రామాలకు వెళ్లి 50 లక్షల మంది ప్రజలను చైతన్యం చేశాయి. చాలా గ్రామాల్లో రాడికల్ యూత్ లీగ్ శాఖలను ఏర్పరిచారు. రాడికల్ విద్యార్థి సంఘం వ్యవసాయ విప్లవ రాజకీయాలను ప్రచారం చేస్తూ గ్రామాల్లో ఉండే వ్యవసాయ కూలీలతో రైతాంగంతో మమేకమవుతూ ప్రజలను రైతు కూలీ సంఘాలుగా సంఘటితం చేసింది.
-ఈ ప్రచారం ఎక్కువగా కరీంనగర్ జిల్లా జగిత్యాల, మంథని తాలూకాల్లో ఆదిలాబాద్ జిల్లా లక్సెట్టిపేట, ఆసిఫాబాద్ తాలుకాల్లో జరిగింది. ఈ పోరాట స్ఫూర్తితో 1978 సెప్టెంబర్ 7న జగిత్యాల పట్టణంలో చరిత్రాత్మకమైన రైతు కూలీల ప్రదర్శన జరిగింది. దాదాపు 180 గ్రామాల నుంచి ప్రజలు 35 వేలకు పైగా ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు.
-జగిత్యాలలో జరిగిన ఈ సభ చుట్టుపక్కల ప్రాంతాలను చాలా ప్రభావితం చేసింది. 1978 సెప్టెంబర్ చివరి కల్లా కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లోని చాలామంది భూస్వాములు ఊళ్లను వదిలి పట్టణాలకు పారిపోయారు. కొంతమంది భూస్వాములు తమ పెత్తనాన్ని వదులుకొని సడీ చప్పుడు లేకుండా ఊళ్లలోనే ఉండిపోయారు.
-జగిత్యాల, సిరిసిల్ల, చిన్నమెట్పల్లి, లొత్తునూరు, బోర్నపల్లి, కోరుట్ల పరిసర ప్రాంతాలకు చెందిన భూస్వాములు నాటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డికి మొరపెట్టుకోగా 1978, అక్టోబర్ 20న సిరిసిల్ల, జగిత్యాల తాలూకాలను కల్లోలిత ప్రాంతాలుగా ప్రకటించారు. ఇది 1978, నవంబర్ 4 నుంచి అమల్లోకి వచ్చింది.
-నక్సల్స్ ఉద్యమంపై, దాని అనుబంధ సంస్థల కార్యకర్తలపై, సానుభూతిపరులపై, పౌరహక్కుల నాయకులపై పోలీసులు తీవ్ర నిర్బంధాన్ని అమలుపరుస్తూ ఒక విధమైన అప్రకటిత నిషేధాన్ని కొనసాగించారు.
-1989 ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ అధికారాన్ని కోల్పోయి చెన్నారెడ్డి రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత నక్సలైట్లు వారి అనుబంధ సంస్థలు సభలు, సమావేశాలు ప్రజాస్వామ్య పద్ధతిలో ఇతర రాజకీయ పార్టీ మాదిరిగా బహిరంగంగా నిర్వహించుకోవచ్చునని ప్రకటించడంతో వారికి స్వేచ్ఛ లభించింది.
-ప్రభుత్వం ఇచ్చిన స్వేచ్ఛను నక్సలైట్లు దుర్వినియోగం చేస్తున్నారని గ్రామాల్లో వాళ్ల దౌర్జన్యాలకు అడ్డూ అదుపు లేకుండా పోయిందని, అమాయకులను భూస్వాములు, ఇన్ఫార్మర్ల పేరిట చంపుతున్నారని, 1991లో నక్సల్స్ చేతిలో చనిపోయినవారి సంఖ్య 227 అని, ఇందులో 165 వెనుకబడిన తరగతులకు చెందినవారు, 26 మంది గిరిజనులు, 14 మంది దళితులు, 56 మంది ఓసీ కులాలకు చెందిన వారని, ఇతరులు ఏడుగురని పోలీసులు వెల్లడించారు.
-1990లో నక్సల్స్ చేతిలో మరణించిన వారి సంఖ్య 145 కాగా అది 1992లో 212కు చేరుకుందని పోలీసులు వెల్లడించి నక్సల్స్‌పై నిషేధాన్ని కొనసాగించాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారు. నాటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి 1992, మే 21న నక్సల్స్‌ను వారి అనుబంధ సంఘాలను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. దాంతో నక్సల్స్పైన, వారి సానుభూతిపరులపైన, పౌరహక్కుల నాయకులపైన తీవ్ర నిర్బంధకాండను పోలీసులు అమలుపరచి భూటకపు ఎన్కౌంటర్లను తీవ్రతరం చేశారు.
-జగిత్యాల, సిరిసిల్ల భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు ప్రారంభమయ్యే నాటికి ఆ ప్రాంతాల్లో నెలకొనివున్న పరిస్థితులు..
1. భూస్వాములు నజరానాలు, దండుగలు, పాయమాలు కట్నాల రూపంలో తరచుగా పేద ప్రజలపై బలవంతపు వసూళ్లకు పాల్పడేవారు.
2. అటవీ సంపద, అటవీ భూముల్ని అక్రమంగా భూస్వాములు ఆక్రమించుకోవడమే కాకుండ పేద ప్రజల భూముల్ని సైతం అక్రమంగా ఆక్రమించుకునేవారు.
3. వెట్టి పేరుతో భూస్వాములు అన్ని రకాల సేవలను బలవంతంగా పేద ప్రజల నుండి పొందడం. తమను వ్యతిరేకించే వారిని సాంఘిక బహిష్కరణ, గ్రామ బహిష్కరణకు గురి చేయడం.
4. అటవీ ఉత్పత్తుల దోపిడీతో పాటు దళారీ వ్యవస్థ ద్వారా భూ క్రయ, విక్రయాల్లో పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేయడం.
5. తమ ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు ఆయుధాలతో ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని ప్రజలపై దాడులు చేసేవారు.
6. సామాజిక, వివాదాల పరిష్కారం పేరిట బెదిరింపులు, వివాదాల పరిష్కారం పేరిట డబ్బుల వసూళ్లు మొదలైనవాటికి పాల్పడేవారు.
-రైతు కూలీ సంఘం తమ ప్రథమ మహాసభలో వివిధ ప్రజా సమస్యలపై పలు తీర్మానాలు ఆమోదించి 16 డిమాండ్లతో కూడిన పత్రాన్ని విడుదల జేసింది. అవి..
-భూస్వామ్య దోపిడీ విధానాల వల్ల దేశంలో పెద్ద మొత్తంలో భూస్వాముల చేతుల్లో భూమి కేంద్రీకరించబడింది. వ్యవసాయ ఉత్పత్తి పెరగాలి, ఉత్పత్తి పంపకాల్లో అసమానతలు తగ్గాలంటే దున్నేవానికే భూమి అనే సూత్రం ప్రాతిపదికన తిరిగి భూములను పంచాలి.
-ఏ విధమైన నష్టపరిహారం ఇవ్వకుండా పెట్టుబడి దారులు, దేశీయ గుత్త పెట్టుబడిదారుల కీలక పరిశ్రమలను స్వాధీనం చేసుకోవాలి.
-ఆబ్సెంటీ ల్యాండ్ లార్డిజంను సంపూర్ణంగా నిర్మూలించాలి.
-రైతులు పండించే పంటకు గిట్టుబాటు ధర చెల్లించాలి.
-భూమిపై శిస్తు వసూళ్లను రద్దు చేయాలి.
-రైతుల వ్యవసాయ రుణాలను రద్దు చేయాలి.
-ప్రైవేట్ వడ్డీ వ్యాపారాన్ని నియంత్రించాలి.
-రైతులకు అవసరమైన ఎరువులను సకాలంలో చౌకగా సరఫరా చేయాలి.
-పరపతి సౌకర్యాలను రైతుకూలీలకు అందుబాటులో ఉండే విధంగా విస్తరింప చేయాలి.
-కౌలుదార్లు పండించే పంటలో రెండు భాగాలు కౌలుదార్లకు ఒక భాగం భూస్వామికి చెందే విధంగా కౌలు రేట్లు నిర్ణయించాలి.
-కౌలుదార్లను బే దాఖలు చేయరాదు. దేవాదాయ భూములను ఆయా గ్రామాల రైతు కూలీలకు మాత్రమే కౌలుకివ్వాలి.
-వెట్టి చాకిరీని సంపూర్ణంగా నిషేధించాలి.
-రైతులు, రైతుకూలీలు ఆక్రమించుకున్న భూములకు, ఇండ్ల స్థలాలకు వెంటనే పట్టాలివ్వాలి.
-గిరిజనులు సాగుచేసుకుంటున్న అటవీ భూములకు పట్టాలివ్వాలి.
-అటవీ అధికారుల అక్రమ వసూళ్లను కట్టడి చేయాలి.
-పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస కూలీ రేట్లు పెంచి అవి అమలయ్యే విధంగా వాటికి చట్టబద్దత కల్పించాలి.
-ఈ నినాదాలతో గ్రామాల్లోని ప్రజలు రైతు కూలీ సంఘాలుగా సంఘటితమవుతూ భూస్వాముల పునాదులను పెకలిస్తూ వెట్టిచాకిరీ దండుగలు చెల్లించే పద్ధతికి వ్యతిరేకంగా కదిలారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు