ద్రవ్యోల్బణ నివారణ చర్యలు
ద్రవ్యోల్బణం-కారణాలు- ప్రభావం-చర్యలు
సాధారణంగా ధరల పెరుగుదలను ద్రవ్యోల్బణం అంటారు.
ఒకేసారి ధరలు అధికంగా పెరిగితే దానిని ద్రవ్యోల్బణం అనకూడదు.
నిదానంగా క్రమక్రమంగా నిర్విరామంగా, నిరంతరంగా ధరలు పెరుగుతూ ఉంటే దానిని ద్రవ్యోల్బణం అంటారు.
ద్రవ్యోల్బణం ఏర్పడటానికి ప్రధానంగా మూడు ముఖ్య కారణాలు సూచించవచ్చు.
అధిక డిమాండ్, అల్ప సప్లయ్, ఉత్పత్తి వ్యయం పెరుగుదల వల్ల ధరలు పెరిగి ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది.
ద్రవ్యోల్బణం కారణాలను రెండు విధాలుగా వివరించవచ్చు.
డిమాండ్ వైపు కారణాలు
అధిక జనాభా పెరుగుదల వల్ల వస్తుసేవలకు డిమాండ్ పెరిగి తద్వారా ధరలు పెరిగి ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది.
ద్రవ్య సప్లయి పెరుగుదల వల్ల ద్రవ్య చలామణి పెరిగి వస్తుసేవలకు డిమాండ్ పెరిగి ఫలితంగా ధరలు పెరిగి ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది.
ప్రభుత్వ వ్యయం పెరుగుదల వల్ల అంటే ప్రభుత్వం అభివృద్ధేతర, అనుత్పాదక వివిధ సంక్షేమ కార్యక్రమాలపై ప్రభుత్వ వ్యయం పెరుగుదల వల్ల ప్రజల కొనుగోలు శక్తి పెరిగి ధరలు పెరుగుతున్నాయి.
లోటు బడ్జెట్ విధానం అంటే ప్రభుత్వం వ్యయానికి రాబడికి అంతరం పెరుగుతూ లోటు బడ్జెట్ ప్రభావం వల్ల వస్తుసేవలకు డిమాండ్ పెరిగి ధరలు పెరుగుతాయి.
నల్లధనం వల్ల, ధనవంతులు విలాస వంతంగా ఖర్చు చేయడం వల్ల ధరలు పెరుగుతాయి.
విచక్షణ రహిత హేతుబద్ధం కాని సబ్సిడీల వల్ల కూడా వస్తుసేవలకు డిమాండ్ పెరిగి ధరలు పెరుగుతాయి.
ఆర్థిక శక్తి కేంద్రీకరణ వల్ల వస్తుసేవలకు కృత్రిమ కొరత ఏర్పడి డిమాండ్ పెరుగుతుంది.
దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందటం వల్ల ప్రజల ఆదాయం పెరిగి వస్తు సేవలకు డిమాండ్ పెరిగి ధరలు పెరుగుతాయి.
సప్లయ్ వైపు కారణాలు
ఉత్పత్తి కారకాల సప్లయ్ కొరత వల్ల ఉత్పత్తి తగ్గి సప్లయ్ తగ్గి తద్వారా ధరలు పెరగవచ్చు.
పెట్టుబడులు సకాలంలో పెట్టక పోవడం
ముడి పదార్థాల సప్లయ్ లేకపోవడం
కొన్ని పరిశ్రమల్లో దీర్ఘ ఫలన కాలం
ఉన్న ఉత్పాదక వనరులను పూర్తిస్థాయిలో వినియోగించుకోకపోవడం నల్లబజారు వల్ల వస్తువుల కృత్రిమ కొరత ఏర్పడటం
దేశీయ ఉత్పత్తులను ఎగుమతులకు మళ్లించడం
అధిక వేతన రేట్లు
అధిక పన్ను రేట్లు
ఉత్పత్తిదారుల అధికలాభాలు
ఇతర కారణాలు
భారతదేశంలో ద్రవ్యోల్బణం ఏర్పడటానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా గాని కింది అంశాలను కారణాలుగా చెప్పవచ్చు.
మూలధనం కొరత
అవస్థాపన సౌకర్యాల కొరత
వ్యవస్థాపక నైపుణ్యత లేమి
శ్రామిక నైపుణ్యత కొరత
విదేశీ మారక ద్రవ్య కొరత
ఆహారభద్రత కొరత
శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన లభ్యత కొరత
పై కారణాలే కాకుండా ఆర్థిక స్థిరీకరణ, ఆర్థికాభివృద్ధి సాధించాలనే చిత్తశుద్ధి ప్రభుత్వ యంత్రాంగానికి, పాలకులకు కూడా లేకపోవడం వల్ల ధరలు పెరిగి ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది.
ద్రవ్యోల్బణ ప్రభావం ఆర్థిక వ్యవస్థలోని వివిధ రంగాల మీద వివిధ రకాలుగా ఉంటుంది.
ఉత్పత్తిపై ద్రవ్యోల్బణ ప్రభావం
ఉత్పత్తిపై ద్రవ్యోల్బణ ప్రభావం దాని స్థాయిపై ఆధారపడి ఉంటుంది. ద్రవ్యోల్బణ పరిమిత స్థాయిలో ఉంటే ఉత్పత్తిపై అనుకూల ప్రభావం ఉంటుంది.
ఉదా: ధరలు నిదానంగా పెరిగితే లాభాలు పెరిగి పెట్టుబడి పెరుగుతుంది. ఫలితంగా ఉత్పత్తి, ఉద్యోగిత, ఆదాయాలు పెరిగి ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది.
ద్రవ్యోల్బణం తీవ్రస్థాయిలో ఉంటే ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావం ఉంటుంది.
ఉదా: అధిక ధరల పెరుగుదల వల్ల సమష్ఠి డిమాండ్ పడిపోయి, లాభాలు తగ్గుతాయి. ఫలితంగా ఉత్పత్తి, ఉద్యోగిత ఆదాయాలు తగ్గి ఆర్థిక వ్యవస్థలో సాంఘిక ఆర్థిక రాజకీయ అస్థిరత ఏర్పడుతుంది.
ద్రవ్యోల్బణం పొదుపును నిరుత్సాహపరిచి మూలధన సంచయనాన్ని దెబ్బతీస్తుంది. దాని వల్ల ఉత్పత్తి తగ్గుతుంది.
పంపిణీపై ద్రవ్యోల్బణ ప్రభావం
ద్రవ్యోల్బణ ప్రభావం అన్ని వర్గాల ప్రజలమీద ఒకే విధంగా ఉండదు. కొన్ని వర్గాలపై అనుకూలంగాను, మరికొన్ని వర్గాలపై ప్రతికూలంగాను ప్రభావం చూపుతుంది.
స్థిర ఆదాయ వర్గాల మీద ద్రవ్యోల్బణం ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.
ఉదా: పింఛనుదారులు, నెల వేతనం పొందేవారు, ఇంటి అద్దెమీద ఆధారపడేవారు.
సంఘటిత, అసంఘటిత రంగంలో పనిచేసే శ్రామికులు ద్రవ్యోల్బణం వల్ల ఇబ్బంది పడతారు.
ద్రవ్యోల్బణ కాలంలో రుణదాత నష్టాలకు గురవుతారు. రుణ గ్రహీత లాభాలు పొందుతారు.
ద్రవ్యోల్బణం వల్ల వినియోగదారుడు నష్టపోతాడు. కానీ ఉద్యమదారుడు లాభాలను పొందుతాడు.
ద్రవ్యోల్బణం వల్ల వ్యవసాయ దారుల్లో పెద్దరైతులు లాభం పొందుతారు. చిన్న సన్నకారురైతులు నష్టపోతారు.
ద్రవ్యోల్బణ ప్రభావం ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. విదేశీ చెల్లింపుల శేషంపై ద్రవ్యోల్బణ ప్రభావం ప్రతికూలంగా ఉంటుంది.
ద్రవ్యోల్బణ ప్రభావం రాజకీయ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఎందుకంటే ద్రవ్యోల్బణం వల్ల ఆర్థిక అసమానతలు, అసాంఘిక కార్యకలాపాలు పెరిగి అభివృద్ధి వ్యయం మళ్లింపు జరుగుతుంది.
ద్రవ్యోల్బణం వల్ల ఉద్యమాలు, పోరాటాలకు దారితీసి, కొన్ని సందర్భాల్లో ప్రభుత్వ అస్థిరతను దెబ్బతీస్తాయి.
ఉదా: ఫ్రెంచి విప్లవం, భారత స్వాతంత్య్ర సమరం.
పై అన్ని అంశాలను బట్టి ద్రవ్యోల్బణం వల్ల అనుకూలత కంటే ప్రతికూల ప్రభావమే ఎక్కువగా ఉంటుంది. కావున ద్రవ్యోల్బణాన్ని ప్రభుత్వం అదుపు చేయడానికి కృషి చేయాలి.
ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి, నియంత్రించ డానికి ప్రభుత్వం తీసుకునే చర్యలు ప్రధానంగా ద్రవ్య విధానం, కోశ విధానం, పునఃపంపిణీ విధానం, ధరల విధానం ఉత్పత్తి విధానం, ఆదాయ విధానం ద్వారా చర్యలు తీసుకుంటుంది.
ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ఆర్బీఐ తన ద్రవ్యవిధానంలో భాగంగా కింది ద్రవ్య పరమైన చర్యలు తీసుకుంటుంది. ద్రవ్య సప్లయ్‌ని తగ్గించడం.
బ్యాంకురేటును నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్)ఎస్ఎల్ఆర్, రెపోరేటును రివర్స్ రెపోరేటును మార్జిన్లను పెంచుతుంది.
హార్డ్ కరెన్సీ చలామణిని తగ్గిస్తుంది.
బహిరంగ మార్కెట్ చర్యలు/ ప్రభుత్వ బాండ్లను సెక్యూరిటీలను ఆర్బీఐ అమ్మడం. నల్లధనాన్ని నియంత్రించడం.
వినియోగదారుని పరపతిపై గరిష్ఠ పరిమితి విధించడం.
ప్రభుత్వ రాబడి, వ్యయవిధానాలను కోశ విధానం అంటారు. ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించడం
లోటు బడ్జెట్ తగ్గించి, మిగులు బడ్జెట్‌ను అనుసరించడం
ప్రత్యక్ష పన్నులను పెంచటం
పొదుపును ప్రోత్సహించడం.
ప్రజల నుంచి రుణాలు తీసుకోవటం
ప్రజల వినియోగ వ్యయాన్ని తగ్గించటం.
ఎగుమతిని తగ్గించి ఎగుమతి సుంకాన్ని విధించటం
ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా నిత్యావసర వస్తువులను అందించి ధరలను నియంత్రించవచ్చు.
ధరల విధానం ద్వారా ధరలపై గరిష్ఠ పరిమితిని విధించవచ్చు.
హేతుబద్ధమైన వేతనాలు, జీతాలు పింఛన్లు నిర్ధారించుట మొదలైన ఆదాయ విధానాన్ని అనుసరించడం
దీర్ఘకాలంలో పెరిగే డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తిని పెంచాలి.
బ్యాంకు రేటు : ఆర్బీఐ నుంచి వాణిజ్య బ్యాంకులు తీసుకున్న రుణాల మీద కేంద్రబ్యాంకు వసూలు చేసే వడ్డీరేటును ‘బ్యాంకురేటు’ అని వడ్డీరేటు అని కూడా అంటారు.
నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్) వాణిజ్య బ్యాంకులు తమ వద్ద ఉన్న డిపాజిట్లలో కొంత భాగాన్ని నగదు రూపంలో ఆర్బీఐ వద్ద (హామీ రూపంలో) ఉంచ
వలసిన నగదు నిష్పత్తిని నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్-క్యాష్ రిజర్వు రేషియో) అంటారు. 1934 యాక్ట్ ప్రకారం సీ ఆర్ఆర్ను ఆర్బీఐ నిర్ణయిస్తుంది. ఇది 3-15 శాతం ఉంటుంది.
చట్టద్రవ్యత్వ నిష్పత్తి (ఎస్ఎల్ఆర్)
వాణిజ్య బ్యాంకులు తమ వద్ద నిల్వ ఉంచుకునే నగదు శాతాన్ని చట్టబద్ధ ద్రవ్యత్వ నిష్పత్తి (ఎస్ఎల్ఆర్- స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో) అంటారు.
రెపోరేటు
రెపోరేటు భావనను ఆర్బీఐ 1992లో ప్రవేశ పెట్టింది. ఆర్బీఐ నుంచి వాణిజ్య బ్యాంకులు తీసుకునే స్వల్పకాలిక రుణాలపై విధించే వడ్డీరేటును రెపోరేటు అని
రీపర్చేజింగ్ రేటు అని కూడా అంటారు.
రివర్స్ రెపోరేటు
రివర్స్ రెపోరేటు భావనను ఆర్బీఐ 1996 సంవత్సరంలో ప్రవేశ పెట్టింది. వాణిజ్య బ్యాంకులు కేంద్ర బ్యాంకుకు ఇచ్చే స్వల్ప కాలిక రుణాలపై ఆర్బీఐ ఇచ్చే వడ్డీరేటును రివర్స్ రెపోరేటు అంటారు.
మార్జిన్
వాణిజ్య బ్యాంకులు రుణాలు ఇచ్చేటప్పుడు విలువైన వస్తువులను హామీగా ఉంచుకుంటారు. వాటి వాస్తవిక విలువ కంటే తక్కువ ద్రవ్యాన్ని రుణంగా ఇస్తారు. అంటే హామీ వస్తువు విలువ ఇచ్చిన రుణం వాటి మధ్య తేడానే మార్జిన్ అంటారు.
కఠిన ద్రవ్యం
విదేశీమారక ద్రవ్య మార్కెట్లో డిమాండ్ అధికంగా ఉంటే కరెన్సీని హార్డ్ కరెన్సీ అంటారు.
ఉదా: డాలర్, యూరో
మాదిరి ప్రశ్నలు
1. ద్రవ్యోల్బణం అంటే ?
ఎ) అధిక ధరలు
బి) సాధారణ ధరల పెరుగుదల
సి) నిదానంగా ధరల పెరుగుదల
డి) బి, సి
2. కింది వాటిలో ద్రవ్యోల్బణానికి కారణం ఏది?
ఎ) అధిక జనాభా పెరుగుదల
బి) ద్రవ్య సప్లయ్ పెరుగుదల
సి) ప్రభుత్వ వ్యయం పెరుగుదల
డి) పైవన్నీ
3. వివిధ సంక్షేమ పథకాలపై ప్రభుత్వ వ్యయం పెరగడం వల్ల
ఎ) వస్తుసేవల డిమాండ్ పెరుగుతుంది
బి) ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది
సి) ధరలు పెరుగుతాయి డి) పైవన్నీ
4. కింది వాటిలో ద్రవ్యోల్బణానికి కారణాలు ఏవి?
ఎ) లోటు బడ్జెట్ విధానం
బి) నల్లధనం
సి) ఆర్థిక శక్తి కేంద్రీకరణ డి) పైవన్నీ
5. ద్రవ్య చలామణి పెరిగితే
ఎ) వస్తుసేవల ధరలు పెరుగుతాయి
బి) వస్తుసేవల ధరలు తగ్గుతాయి
సి) వస్తుసేవల డిమాండ్ పెరుగుతుంది
డి) ఎ, సి
6. ఉత్పత్తి కారకాల సప్లయ్ కొరత వల్ల?
ఎ) ఉత్పత్తి తగ్గుతుంది
బి) ధరలు పెరుగుతాయి
సి) ఎ, బి
డి) ధరలు తగ్గుతాయి
7. కింది వాటిలో ద్రవ్యోల్బణానికి కారణాలు ఏవి?
ఎ) అధిక వేతన రేట్లు
బి) అధిక పన్ను రేట్లు
సి) ఉత్పత్తి దారుల అధిక లాభాలు
డి) పైవన్నీ
8. ఒక దేశం అభివృద్ధి చెందితే?
ఎ) ప్రజల ఆదాయం పెరుగుతుంది
బి) వస్తుసేవల డిమాండ్ పెరుగుతుంది
సి) ఎ, బి
డి) వస్తుసేవల ధరలు తగ్గుతాయి
9. ద్రవ్యోల్బణం వల్ల నష్టపోయేవారు ఎవరు?
ఎ) ఉత్పత్తిదారులు
బి) వినియోగదారులు
సి) శ్రామికులు డి) బి, సి
10. ద్రవ్యోల్బణం వల్ల లాభం పొందే రైతులు ఎవరు?
ఎ) పెద్ద రైతులు
బి) చిన్న, సన్నకారురైతులు
సి) కౌలు రైతులు డి) పై అందరూ
11. ద్రవ్యోల్బణం వల్ల
ఎ) అనుకూలత కంటే ప్రతికూలత ఎక్కువ
బి) ప్రతికూలత కంటే అనుకూలత ఎక్కువ
సి) అనుకూలత, ప్రతికూలత సమానం
డి) పైవన్నీ
12. కింది వాటిలో ద్రవ్యోల్బణ నియంత్రణ చర్యలు ఏవి?
ఎ) ద్రవ్య విధానం బి) కోశ విధానం
సి) ధరల విధానం డి) పైవన్నీ
సమాధానాలు
1-సి , 2-డి , 3-డి , 4-డి , 5-డి , 6-సి ,7-డి, 8-సి ,9-డి , 10-ఎ ,11-ఎ ,12-డి
పానుగంటి కేశవ రెడ్డి
రచయిత వైష్ణవి పబ్లికేషన్స్, గోదావరిఖని, 9949562008
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు