హైదరాబాద్‌లో ఏర్పాటు కానున్న పీఠం?
1. కింది వాటిలో ‘చిరు ధాన్యాల సంవత్సరం’ ఏది? (సి)
ఎ) 2021 బి) 2022
సి) 2023 డి) 2024
వివరణ: 2023ను చిరుధాన్యాల సంవత్సరంగా ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం ప్రకటించింది. భారత్ ఈ తీర్మానాన్ని ప్రతిపాదించగా 70 దేశాలు మద్దతు పలికాయి. వీటి వల్ల ఆరోగ్యానికి జరిగే మేలుపై అవగాహన కల్పిస్తారు. దీనిని సర్వసభ్య సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది. 2016-25 మధ్య కాలాన్ని పోషణ దశాబ్దంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. ఆకలిని రూపుమాపడంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా పోషకాహా ర లోపం జరగకుండా చూడాలన్నది లక్ష్యం.
2. దేశంలో తొలిసారిగా ‘ఒక జిల్లా ఒక ఉత్పత్తి’ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? (డి)
ఎ) కేరళ బి) మధ్యప్రదేశ్
సి) పంజాబ్ డి) ఉత్తరప్రదేశ్
వివరణ: దేశంలో తొలిసారిగా ‘ఒక జిల్లా ఒక ఉత్పత్తి’ కార్యక్రమాన్ని ఉత్తరప్రదేశ్‌లో ప్రారంభించారు. జపాన్ స్ఫూర్తితో దీనిని అందుబాటులోకి తెచ్చారు. ఆ దేశంలో ‘ఒక గ్రామం ఒక ఉత్పత్తి’ కార్యక్రమాన్ని 1980 దశకంలో అమలు చేశారు. ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్‌లో ప్రారంభించిన పథకాన్ని దేశ వ్యాప్తంగా అమలు చేయనున్నారు. తెలంగాణలో కూడా కొన్ని జిల్లాలు ఈ పథకంలో భాగంగా చేరాయి. ఉత్పత్తులు, జిల్లాల వారీగా జాబితా.. నిజామాబాద్-పసుపు, ఆదిలాబాద్, కామారెడ్డి-సోయాబీన్ ఆధారిత ఉత్పత్తులు, వరంగల్, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం-మిర్చి, మహబూబ్‌నగర్-జొన్నలు, నారాయణపేట-వనపర్తి, జోగుళాంబగద్వాల-వేరుశనగ, నల్లగొండ-బత్తాయి, పెద్దపల్లి-బియ్యం, రాజన్న సిరిసిల్ల-చేపలు, రంగారెడ్డి, సిద్దిపేట-కూరగాయలు, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి-పాలు, జగిత్యాల, మంచిర్యాల-మామిడి
3. ఏ దేశాన్ని గ్రే లిస్ట్‌లో కొనసాగించాలని ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్ నిర్ణయించింది? (సి)
ఎ) ఇరాన్ బి) ఉత్తరకొరియా
సి) పాకిస్థాన్ డి) యెమెన్
వివరణ: పాకిస్థాన్‌ను గ్రే లిస్ట్‌లో కొనసాగించాలని ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్ నిర్ణయించింది. 39 దేశాలతో ఏర్పాటైన సంస్థ. భారత్ కూడా ఇందులో సభ్యత్వాన్ని కలిగి ఉంది. మనీలాండరింగ్, ఉగ్రవాదులకు ఆర్థిక సాయం జరగకుండా చేయడమే ఈ వ్యవస్థ ముఖ్య ఉద్దేశం. పారిస్‌లో ఓఈసీడీ ప్రాంగణం కేంద్రంగా ఇది పనిచేస్తుంది. మనీలాండరింగ్, ఉగ్రవాదులకు ఆర్థిక సాయం చేస్తున్నందున జూన్ 2018లో పాకిస్థాన్‌ను గ్రే లిస్ట్‌లో చేర్చారు. 27 అంశాలతో కూడిన ఒక కార్యాచరణ ప్రణాళిక ఇచ్చారు. ఇందులో ఆరు మినహా మిగతా వాటిపై పాకిస్థాన్ చర్యలు తీసుకుంది. కొవిడ్ నేపథ్యంలో ఆ దేశానికి మరింత సమయం ఇచ్చారు.
4. యునెస్కో పీఠాన్ని భారత్‌లో ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? (బి)
ఎ) పుణే బి) హైదరాబాద్
సి) ప్రయాగ్ రాజ్ డి) గాంధీనగర్
వివరణ: యునెస్కో పీఠం తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోని మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ విద్యామండలికి మంజూరైంది. ఎక్స్పీరియన్సియల్ లెర్నింగ్ వర్క్ నేర్చుకొనే విద్యపై అవగాహన కలిగించి వాటిని ప్రణాళికలో చేర్చేలా ప్రోత్సహించేందుకు దేశ వ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో ఆచార్యులకు శిక్షణ ఇవ్వనున్నారు. యునెస్కో ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ. దీనిని 1945 నవంబర్ 16న ఏర్పాటు చేశారు. ప్రధాన కేంద్రం ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో ఉంది.
5. ఏ రాజు మృతికి చెందిన శాసనం ఇటీవల లభ్యమయ్యింది? (ఎ)
ఎ) శ్రీకృష్ణ దేవరాయలు బి) అశోకుడు
సి) చంద్రగుప్త-2 డి) సముద్ర గుప్తుడు
వివరణ: విజయనగర రాజు శ్రీకృష్ణ దేవరాయల మృతికి సంబంధించిన వివరాలతో కూడిన ఒక శాసనం లభించింది. కర్నాటకలోని తుమకూరులో హోనెన్హాలీలో దీనిని గుర్తించారు. దీని ప్రకారం శ్రీకృష్ణ దేవరాయలు అక్టోబర్ 17, 1529లో మరణించారు. శ్రీకృష్ణ దేవరాయలు తుళువ వంశస్థుడు. నాగలాపుర నిర్మాత ఆయనే. తెలుగులో ఆముక్త మాల్యద అనే పుస్తకాన్ని కూడా రచించారు. తాజాగా లభించిన శాసనం కృష్ణుడి గుడిలో ఒక పైకప్పున చెక్కి ఉంది.
6. భారత అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఇటీవల ఏ దేశం అవతరించింది? (సి)
ఎ) అమెరికా బి) సింగపూర్
సి) చైనా డి) జపాన్
వివరణ: వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం భారత్, చైనాల మధ్య సరిహద్దు వెంట 2020లో ఉద్రిక్తతలు అత్యధికంగా ఉన్నా, భారత అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా చైనానే ఉంది. ఇరు దేశాల మధ్య వాణిజ్యం 2020లో 77.7 బిలియన్ అమెరికన్ డాలర్లు. చైనా నుంచి దిగుమతులు 58.7 బిలియన్ డాలర్ల మేర ఉన్నాయి. అలాగే ఆ దేశానికి భారత ఎగుమతులు 2019తో పోలిస్తే 11 శాతం మేర పెరిగాయి. ఇరు దేశాల మధ్య వాణిజ్యంలో భారత్ 40 బిలియన్ డాలర్ల మేర 2020లో వాణిజ్య లోటును ఎదుర్కొంది. వైద్యానికి సంబంధించి దిగుమతులు చైనా నుంచి పెరిగాయి. అలాగే ఆ దేశపు మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలకు కూడా భారత్‌లో అధిక డిమాండ్ ఉంది. అలాగే టెలికం రంగ పరికరాలు, గృహ వినియోగ వస్తువులకు చైనా పైనే భారత్ అధికంగా ఆధారపడింది.
7. కింది వాటిలో ఏ రాష్ట్రంలో శాసనసభ స్థానాలు అధికంగా ఉన్నాయి? (బి)
ఎ) తమిళనాడు బి) పశ్చిమబెంగాల్
సి) కేరళ డి) అసోం
వివరణ: నాలుగు రాష్ర్టాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతం అయిన పుదుచ్చేరిలో ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఆ రాష్ర్టాలు అన్నింటిలోకెల్లా పశ్చిమబెంగాల్లో గరిష్టంగా 294 శాసనసభ స్థానాలు ఉన్నాయి. అన్నింటికి కలిపి 824 స్థానాలకుగాను వివిధ దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. 18.68 కోట్ల మంది ఓటర్లు తమ తీర్పును వెలువరించనున్నారు. పశ్చిమబెంగాల్లో ఎనిమిది దశల్లో పోలింగ్ జరగనుంది
8. ప్రతిపాదన (ఏ): పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణ స్వామి తన పదవికి రాజీనామా చేశారు (బి)
కారణం (ఆర్): 33 శాసనసభ స్థానాలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ను వెలువరించింది
ఎ) ఏ, ఆర్ సరైనవే. ఏను ఆర్ సరిగ్గా
వివరిస్తుంది
బి) ఏ, ఆర్ సరైనవే. ఏకు ఆర్ సరికాదు
సి) ఏ సరైనది, ఆర్ సరికాదు
డి) ఏ తప్పు, ఆర్ సరైనది
వివరణ: పుదుచ్చేరిలో నారాయణ స్వామి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మెజార్టీని కోల్పోయింది. దీంతో ఆయన తన రాజీనామాను లెఫ్టినెంట్ గవర్నర్‌కు సమర్పించారు. ఆ రాష్ట్ర శాసనసభలో 33 స్థానాలు ఉన్నాయి. 2016లో నిర్వహించిన ఎన్నికల తర్వాత కాంగ్రెస్, డీఎంకేలు కలిసి సంయుక్తంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. కాంగ్రెస్‌కు 14 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇటీవల నలుగురు ఆ పార్టీకి రాజీనామా చేయడంతో ప్రభుత్వం మైనార్టీలో పడిపోయింది. దీంతో అక్కడ రాష్ట్రపతి పాలనను విధించారు.
9. భారత తొలి డిజిటల్ విశ్వవిద్యాలయం ఏ రాష్ట్రంలో ఏర్పాటు కానుంది? (సి)
ఎ) మహారాష్ట్ర బి) గుజరాత్
సి) కేరళ డి) కర్నాటక
వివరణ: భారత తొలి డిజిటల్ విశ్వవిద్యాలయం కేరళలో ఏర్పాటు కానుంది. ఆ రాష్ట్రంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ను ఆధునికీరించి కేరళ యూనివర్సిటీ ఆఫ్ డిజిటల్ సైన్సెస్, ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీని ఏర్పాటు చేస్తారు.
10. కింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి? (డి)
1. ఈ ఏడాది ఇస్రో తొలి ప్రయోగాన్ని పీఎస్ఎల్వీ సీ-51 ద్వారా ఫిబ్రవరి 28న చేపట్టింది
2. ఇస్రో తొలిసారిగా ప్రైవేట్ సంస్థల ఉపగ్రహాలను నింగిలోకి పంపింది
ఎ) 1 బి) 2
సి) 1, 2 సరికావు డి) 1, 2 సరైనవి
వివరణ: ఫిబ్రవరి 28న ఇస్రో చేపట్టిన పీఎస్ఎల్వీ సీ-51 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట నుంచి దీనిని ప్రయోగించారు. ఈ ఏడాది ఇస్రో చేపట్టిన తొలి ప్రయోగం ఇదే. దేశీయ, ప్రైవేట్ సంస్థలకు చెందిన పలు ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. 50 ఏండ్ల ఇస్రో చరిత్రలో తొలిసారిగా దేశీయ ప్రైవేట్ సంస్థల ఉపగ్రహాలను నింగిలోకి పంపింది ఇస్రో. భారత్‌కు సంబంధించిన అయిదు ఉపగ్రహాలు ఇందులో ఉన్నాయి. వీటిలో స్పేస్ కిడ్జ్ ఇండియా రూపకల్పన చేసిన సతీష్ ధావన్ శాట్ రేడియేషన్ స్థాయి, అంతరిక్ష వాతావరణ అధ్యయనంతో పాటు సుదూర కమ్యూనికేషన్ టెక్నాలజీకి ఉపయోగపడుతుంది. మూడు కళాశాలల విద్యార్థులు రూపొందించిన మూడు ఉపగ్రహాల కలయిక యూనిటీ శాట్ రేడియో రిలే సేవలు అందిస్తుంది.
11. కార్బన్ ఫుట్‌ప్రింట్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చిన తొలి రాష్ట్రం/కేంద్ర పాలిత ప్రాంతం ఏది? (డి)
ఎ) ఢిల్లీ బి) కర్నాటక
సి) కేరళ డి) చండీగఢ్
వివరణ: వ్యక్తుల కార్బన్ ఫుట్‌ప్రింట్‌ను గణించేందుకు కార్బన్ వాచ్ మొబైల్ అనువర్తనాన్ని చండీగఢ్ అందుబాటులోకి తెచ్చింది. ఈ ఘనత సాధించిన భారత తొలి రాష్ట్రం/కేంద్ర పాలిత ప్రాంతం ఇదే. ఒక వ్యక్తి లేదా ఉత్సవం లేదా ఒక వ్యవస్థ లేదా ఒక ఏవు…. లేదా ఒక ఉత్పత్తి ఎంత మేర హరిత వాయు ఉద్గారాలకు కారణమవుతున్నదనే అంశాన్నే కార్బన్ ఫుట్‌ప్రింట్ అంటారు. వ్యక్తి జీవన విధానం, చర్యల వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంత మేర హరిత వాయువుల ఉద్గారాలకు కారణమయ్యాయో ఇందులో గణిస్తారు.
12. మెడ్‌ట్రానిక్ సంస్థ ప్రపంచ స్థాయి వైద్య పరికరాల కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేయనుంది? (సి)
ఎ) బెంగళూర్ బి) పుణే
సి) హైదరాబాద్ డి) విశాఖపట్నం
వివరణ: వైద్య పరికరాల తయారీలో పేరున్న అమెరికా సంస్థ మెడ్‌ట్రానిక్ హైదరాబాద్‌లో రూ.1200 కోట్ల పెట్టుబడితో ప్రపంచ స్థాయి వైద్య పరికరాల కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా తెలంగాణలో ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. ఫిబ్రవరి 23, 24 తేదీల్లో 18వ బయో ఆసియా సదస్సు నిర్వహించారు. 72 దేశాల నుంచి 31,450 మంది ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. అలాగే తెలంగాణలో సుల్తాన్‌పూర్‌లో తెలంగాణ ప్రభుత్వం వైద్య పరికరాల పార్క్‌ను ఏర్పాటు చేసింది. ఇది ఆసియాలోనే అతిపెద్దది.
13. తెలంగాణలోని ఏ జిల్లాలో ‘నవం’ ఆవిష్కరణల కేంద్రం ఏర్పాటు కానుంది? (ఎ)
ఎ) కామారెడ్ది బి) రంగారెడ్డి
సి) వరంగల్ డి) మేడ్చల్ మల్కాజ్గిరి
వివరణ: కామారెడ్డి జిల్లా కేంద్రంలో 15 ఎకరాల్లో నవం ఆవిష్కరణల కేంద్రం ఏర్పాటు కానుంది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వ ఆవిష్కరణల విభాగం, అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్, ప్రవాహ ఫౌండేషన్ల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ప్రాంగణం మూడేండ్లలో ప్రారంభమవుతుంది. రూ.3000 కోట్ల పెట్టుబడితో దీనిని అభివృద్ధి చేస్తారు.
14. స్వచ్ఛ పర్యాటక ప్రదేశాలుగా మార్చేందుకు తెలంగాణలో కింది వాటిలో దేనిని ఎంపిక చేశారు? (బి)
ఎ) వేయిస్తంభాల గుడి
బి) గోల్కొండ కోట
సి) భువనగిరి కోట
డి) యాదాద్రి దేవాలయం
వివరణ: దేశంలోని 12 ప్రదేశాలను స్వచ్ఛ పర్యాటక స్థలాలుగా మార్చాలని కేంద్రం నిర్ణయించింది. స్వచ్ఛ ఐకానిక్ ప్లేసెస్‌గా వీటిని గుర్తిస్తారు. తెలంగాణ నుంచి గోల్కొండ ఎంపికయ్యింది. 12 ప్రదేశాలు-అజంతా గుహలు (మహారాష్ట్ర), సాంచీ స్థూపం (మధ్యప్రదేశ్), కుంభల్కోట, జైసల్మేర్ కోట, రామ్‌దేవ్రా (రాజస్థాన్), సూర్య దేవాలయం (ఒడిశా), రాక్‌గార్డెన్ (చండీగఢ్), దాల్ సరస్సు (శ్రీనగర్), బాంకే బిహారీ ఆలయం-మధుర ఆగ్రాకోట (ఉత్తర ప్రదేశ్), కాళీఘాట్ ఆలయం (పశ్చిమబెంగాల్).
15.కింది వాక్యాల్లో సరైనది ఏదీ? (సి)
1. వీరగల్లు శిల్పం తాజాగా సిద్దిపేట నంగునూరు మండలం నర్మెట్టలో గుర్తించారు
2. హన్మకొండలోని అగ్గలయ్య గుట్టపై ప్రాచీన ఆయుర్వేద వైద్యం ఆధారాలను గుర్తించారు
ఎ) 1 బి) 2
సి) 1, 2 సరైనవి డి) 1, 2 సరికావు
వివరణ: సిద్దిపేట నంగునూర్ మండలం నర్మెట్టలో అరుదైన వీరగల్లు శిల్పాన్ని ఇటీవల గుర్తించారు. ఈ శిల్పంలోని మహిళల ఆహార్యం ఆధారంగా ఇది 11, 12వ శతాబ్దాల నాటిదిగా భావిస్తున్నారు. అడవి పందులతో పాటు పులులు, సింహాల బెడద ఉండేది. వాటిని వేటాడే వారినే వీరులుగా గుర్తించేవారు. ఈ వీరుల చిత్రాలను శిలలపై చెక్కించేవాళ్లు. ఈ వీరులనే వీరగల్లులు అంటారు. అలాగే హన్మకొండలోని అగ్గలయ్య గుట్టపై ఒకప్పుడు ప్రాచీన ఆయుర్వేద వైద్యం అందినట్టుగా చారిత్రక ఆధారాలు బయటపడ్డాయి. జైన పర్యాటక ప్రాంతంగా ప్రాచుర్యం పొందింది అగ్గలయ్య గుట్ట. ఆయుర్వేద వైద్యంలో ఉపయోగించే రోళ్లు, గోకర్ణం వంటి రాతి పరికరాలను సుమారు 256 మీటర్ల ఎత్తు ఉన్న ఈ గుట్టపై ఉన్న ఒక పడగరాయి కింద గుర్తించారు.
వి.రాజేంద్ర శర్మ
ఫ్యాకల్టీ , వ్యోమా.నెట్
9849212411
- Tags
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు