‘డెవలప్మెంట్ సైకాలజీ’ గ్రంథ రచయిత?


- మానవ జీవితం ఏక సూక్ష్మ కణంగా ప్రారంభమై, ఎన్నో మార్పులు చెంది వివిధ దశలు మారి వృద్ధాప్యంతో ముగుస్తుంది.
- ప్రతీ వికాస దశ కొన్ని నిర్దిష్టమైన వికాస లక్షణాలు కలిగి ఉంటుంది.
- ఇక్కడ దశ అంటే ‘వ్యక్తి జీవితంలోని నిర్దిష్టకాలంలో కొన్ని ప్రత్యేక లక్షణాలను చూపడం.
- ఎలిజబెత్ హర్లాక్ ‘డెవలప్మెంట్ సైకాలజీ’ అనే గ్రంథంలో వ్యక్తి జీవిత కాలాన్ని పది దశలుగా విభజించారు. అవి..
1) జనన పూర్వదశ- ఫలదీకరణం నుంచి పుట్టుక వరకు
2) నవజాత శిశుదశ- పుట్టుక నుంచి రెండోవారం చివరి వరకు
3) శైశవ దశ- రెండోవారం నుంచి రెండో సంవత్సరం చివరి వరకు
4) పూర్వ బాల్యదశ- 2-6 ఏండ్ల వరకు
5) ఉత్తర బాల్యదశ- 6-పదిన్నర సంవత్సరాల వరకు
6) యవ్వనారంభ దశ- 10/12-13/14 సంవత్సరాల వరకు
7) కౌమార దశ- 13/14-18 సంవత్సరాల వరకు
8) పూర్వ వయోజన దశ- 18-40 సంవత్సరాల వరకు
9) మధ్య వయసు దశ- 40-60 సంవత్సరాల వరకు
10) వృద్ధ్యాప్య దశ- 60 సంవత్సరాల నుంచి మరణించే వరకు
- వ్యక్తులందరూ ఈ దశలను కచ్చితంగా ఒకే వయస్సులో చేరాలనే నియమం లేదు. కాబట్టి పై దశలకు ఎదురుగా సూచించిన వయస్సు దాదాపుగా ఉంటుంది.
- మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తలు విభజించిన వివిధ వికాస దశల్లో సాధారణంగా పేర్కొనదగినవి..
1) జనన పూర్వదశ
2) నవజాత శిశు దశ
3) శైశవ దశ
4) బాల్య దశ: ఎ) పూర్వ బాల్యదశ
బి) ఉత్తర బాల్యదశ
5) యవ్వనారంభ దశ
6) కౌమార దశ
7) వయోజన దశ
- పెరుగుదల, వికాసాల్లో వచ్చే మార్పులను శారీరక, మానసిక, సాంఘిక, ఉద్వేగ, నైతిక, భాషా వికాసాల రూపంలో విభజించి అధ్యయనం చేస్తాం.
జనన పూర్వదశ (ప్రీ నాటల్ స్టేజ్)
- ఈ దశ అండం ఫలదీకరణం చెందిన నాటి నుంచి 9 నెలల (శిశువు జన్మించే) వరకు ఉంటుంది. దీన్ని మళ్లీ 3 దశలుగా విభజించవచ్చు. అవి..
ఎ) బీజ దశ (జైగోట్ స్టేజ్)
బి) పిండ దశ (ఎంబ్రియో స్టేజ్)
సి) భ్రూణ దశ (ఫీటస్ స్టేజ్)
బీజ దశ (ఫలదీకరణం నుంచి 2 వారాల వరకు): ఈ దశలో సంయుక్త బీజానికి (జైగోట్) బాహ్య పోషణ లేని కారణంగా గుండు సూది మొన పరిమాణంలో ఉండే జైగోట్ పరిమాణంలో మార్పు ఉండదు.
- ఈసారి జైగోట్ ఫాలోపియన్ ట్యూబ్ నుంచి గర్భాశయానికి చేరే సమయంలో ఎన్నోసార్లు విభజింపబడి రెండు పొరలుగా ఏర్పడుతుంది. ఈ రెండు పొరల్లో పై పొర జరాయువు, నాభిరుజ్జువు, ఆమ్నియాటిక్ సంచిగా మారి లోపలి పొర పిండంగా మారుతుంది.
పిండ దశ (రెండో వారం నుంచి 2 నెలల వరకు): ఈ దశలో పిండం (ఎంబ్రియో), చిన్న మనిషి ఆకారంలో ఉంటుంది.
- ఎక్కువ మార్పు మొదట తల భాగంలో జరిగి, తర్వాత ఇతర భాగాల్లో జరుగుతుంది.
- శరీరంలోని బయట, లోపల ఉండే అన్ని ముఖ్య భాగాలు ఏర్పడుతాయి.
- జరాయువు, నాభిరుజ్జువు, ఆమ్నియాటిక్ సంచి బాగా అభివృద్ధి చెంది పిండానికి కావల్సిన భద్రత, ఆహారాన్ని అందిస్తాయి.
- ఈ దశ పూర్తయ్యే నాటికి పిండం 1 1/4 ఔన్సుల బరువు, 1 1/2 అంగుళం పొడవు ఉంటుంది.
భ్రూణ దశ (రెండో నెల అంతం నుంచి శిశువు జననం వరకు): ఈ దశలో కొత్త భాగాలేవి ఏర్పడవు.
- ఎంబ్రియో దశలో ఏర్పడిన భాగాలు బాగా అభివృద్ధి చెంది, ఏడో నెల నాటికి పూర్తి పక్వత చెందకుండా జన్మించినప్పటికీ బతికేంత అభివృద్ధి చెందుతుంది.
- 9 నెలల నాటికి పూర్తికాలం పక్వత చెంది నవజాత శిశువుగా జన్మిస్తుంది.
నవజాత శిశు దశ (నియోనేట్ స్టేజ్): శిశువు పుట్టినప్పటి నుంచి 2 వారాల వరకు ఉంటుంది.
- ఈ దశలో ప్రధానంగా శిశువు, జనన పూర్వ, జననాంతర పరిసరాలకు సర్దుబాటు చేసుకుంటాడు.
- శ్వాసించడం, ఆహారం తీసుకోవడం, జీర్ణించుకోవడం, విసర్జించడం, శీతోష్ణస్థితి సర్దుబాటు లాంటివి శిశువు చేసుకొనే మొదటి సర్దుబాటు.
- శిశువులోని మొదటి ఉద్వేగం- ఉత్తేజం
- శిశువులోని మొదటి ప్రతిస్పందన- ఏడుపు
- పుట్టిన నాటికే పూర్తిగా అభివృద్ధిచెందే జ్ఞానేంద్రియం- స్పర్శ (చర్మం)
- అన్ని జ్ఞానేంద్రియాల్లో చివరగా, నెమ్మదిగా జరిగేది- దృష్టి, అత్యధికంగా జరిగేది- రుచి
- వాసనలు గుర్తించడం మొదటి రెండు గంటల్లో వికసిస్తుంది.
శైశవ దశ (ఇన్ఫ్యాన్సీ): ఈ దశ కాలం- 2 వారాలు-2 సంవత్సరాల వరకు
- జీవితానికి పునాదిని ఏర్పర్చే దశ
- మొక్కై వంగనిది మానై వంగునా? అనే సామెతను సమర్థించే దశ.
ఎ) శారీరక వికాసం (ఫిజికల్ డెవలప్మెంట్)
- సాధారణంగా నవజాత శిశువు పొడవు 18-20 అంగుళాలు, బరువు 6-8 పౌండ్లు.
- శిశువు పుట్టినప్పుడు బరువు రెండున్నర కేజీలు. రెండేండ్లకు 10 కేజీలు (నాలుగు రెట్లు)6 నెలలకు మొదటి దంతం, సంవత్సరానికి 4 దంతాలు, రెండేండ్లు నిండేనాటికి 16 దంతాలు (8+8) వస్తాయి.
- ఇవి పాలు తాగే వయస్సులో వస్తాయి. కాబట్టి వీటినే పాలదంతాలు అంటారు.
- పాలదంతాలు మొత్తం- 20 (మిగిలిన 4 దంతాలు తర్వాత వస్తాయి)
- మెదడు పరిమాణం అధికంగా పెరుగుతుంది.
- 4 నుంచి 5 నెలల్లో బోర్లా పడటం ప్రారంభమై, పాకడం, కూర్చోవడం, నిలబడటం, నడవటం లాంటి చలన కౌశలాలు ప్రారంభమవుతాయి.
- ఈ దశ చివరకు తల్లిపాలకు బదులుగా ప్రత్యామ్నాయ ఆహారం తీసుకుంటాడు.
- ఈ దశలో శారీరక పెరుగుదల అత్యంత వేగంగా జరుగుతుంది.
- Tags
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు